కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 35

ఓర్పు చూపిస్తూ ఉండండి

ఓర్పు చూపిస్తూ ఉండండి

“ఓర్పును అలవర్చుకోండి.”కొలొ. 3:12.

పాట 114 ఓర్పు చూపించండి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. ఓర్పు చూపించేవాళ్లంటే మీకు ఎందుకు ఇష్టం?

 సాధారణంగా ఓర్పు చూపించేవాళ్లను మనం ఇష్టపడుతుంటాం. దేనిగురించైనా చిరాకుపడకుండా ఎదురుచూసేవాళ్లను మనం గౌరవిస్తాం. మనం చేసే తప్పుల్ని ఓర్పుగా భరించేవాళ్లను మనం ఇష్టపడతాం. మనం సత్యం నేర్చుకోవడానికి, దాన్ని అంగీకరించడానికి లేదా ఒక బైబిలు బోధను పాటించడానికి కష్టపడుతున్నప్పుడు, మనకు బైబిలు స్టడీ ఇచ్చినవాళ్లు ఓర్పు చూపించినందుకు కృతజ్ఞతతో ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా, మన విషయంలో ఓర్పు చూపిస్తున్నందుకు యెహోవాకు మనం ఎంత రుణపడి ఉన్నామో కదా!—రోమా. 2:4.

2. ఓర్పు చూపించడం మనకు ఎప్పుడు కష్టంగా ఉండొచ్చు?

2 అయితే వేరేవాళ్లు ఓర్పు చూపించడం మనకు ఇష్టం. కానీ కొన్నిసార్లు మనం ఓర్పు చూపించడం కష్టం. ఉదాహరణకు, మనం ఎక్కడికైనా వెళ్లడం లేటౌతున్నప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు. వేరేవాళ్లు చిరాకు పెట్టినప్పుడు మన కోపం కట్టలు తెంచుకోవచ్చు. అంతేకాదు కొన్నిసార్లు దేవుడు మాటిచ్చిన కొత్తలోకం కోసం ఎదురుచూడడం మనకు కష్టంగా ఉండొచ్చు. అయితే మీరు ఎక్కువ ఓర్పు చూపించాలని అనుకుంటున్నారా? ఈ ఆర్టికల్‌లో ఓర్పు చూపించడం అంటే ఏంటో, అది ఎందుకు ప్రాముఖ్యమో చూస్తాం. అలాగే మనం ఇంకా ఎక్కువ ఓర్పును పెంచుకోవడానికి ఏది సహాయం చేస్తుందో కూడా పరిశీలిస్తాం.

ఓర్పు చూపించడం అంటే ఏంటి?

3. ఎవరైనా కోపం తెప్పించినప్పుడు ఓర్పు చూపించే వ్యక్తి ఏం చేస్తాడు?

3 ఓర్పు చూపించే వ్యక్తి చేసే నాలుగు పనుల్ని గమనించండి. మొదటిది, ఓర్పు చూపించే వ్యక్తి త్వరగా కోపం తెచ్చుకోడు. ఎవరైనా అతనికి కోపం తెప్పించినప్పుడు తిరిగి కోపపడడు. అలాగే అతను ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. “త్వరగా కోపం తెచ్చుకోకపోవడం” అనే అర్థం వచ్చే ఈ మాట బైబిల్లో మొట్టమొదటిసారి యెహోవా గురించి వర్ణిస్తున్నప్పుడు ఉపయోగించబడింది. అక్కడ మనం ఇలా చదువుతాం: “ఆయన కరుణ, కనికరం గల దేవుడు; కోప్పడే విషయంలో నిదానించే, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు.”—నిర్గ. 34:6, అధస్సూచి.

4. దేనికోసమైనా వేచి చూస్తున్నప్పుడు ఓర్పు చూపించే వ్యక్తి ఏం చేస్తాడు?

4 రెండోది, ఓర్పు చూపించే వ్యక్తి ప్రశాంతంగా వేచి చూస్తాడు. అతను ఎదురుచూసేది ఏదైనా లేట్‌ అవుతున్నప్పుడు విసుక్కోడు లేదా చిరాకుపడడు. (మత్త. 18:26, 27) అయితే మన జీవితంలో ప్రశాంతంగా వేచి చూడాల్సిన ఎన్నో సందర్భాలు రావచ్చు. ఉదాహరణకు, ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం కలగజేసుకోకుండా ఓపిగ్గా వినాల్సి రావచ్చు. (యోబు 36:2) అలాగే మన బైబిలు విద్యార్థి ఒక బైబిలు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా ఒక చెడు అలవాటును మానుకోవడానికి కష్టపడుతున్నప్పుడు మనం ఓర్పు చూపించాల్సి రావచ్చు.

5. ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వచ్చినప్పుడు ఓర్పు చూపించే వ్యక్తి ఏం చేస్తాడు?

5 మూడోది, ఓర్పు చూపించే వ్యక్తి తొందరపడడు. అవును, కొన్ని పనులు త్వరగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. కానీ ఓర్పు చూపించే వ్యక్తి ముఖ్యమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని మొదలుపెట్టడానికి తొందరపడడు, ఆ పని ఇట్టే అయిపోవాలని ఆదరబాదరగా పని చేయడు. బదులుగా ఆ పని గురించి ప్లాన్‌ చేయడానికి, ఆ పనిని పూర్తి చేయడానికి తగిన సమయం తీసుకుంటాడు.

6. కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పు చూపించే వ్యక్తి ఏం చేస్తాడు?

6 నాలుగోది, ఓర్పు చూపించే వ్యక్తి సణగకుండా కష్టాల్ని భరిస్తాడు. ఈ సందర్భంలో ఓర్పు, సహనం ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. నిజమే, కష్టాల్లో ఉన్నప్పుడు మన ఫీలింగ్స్‌ని ఒక ఫ్రెండ్‌కి చెప్పడంలో తప్పులేదు. కానీ ఓర్పు చూపించే వ్యక్తి కష్టాలు పడుతున్నప్పుడు తన జీవితంలో ఉన్న మంచి విషయాల మీద మనసుపెడతాడు. యెహోవా సేవలో ఆనందాన్ని కోల్పోడు. (కొలొ. 1:11) ఓర్పులో ఉన్న ఈ కోణాలన్నిటినీ క్రైస్తవులు చూపించాలి. ఎందుకో కొన్ని కారణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

ఓర్పు చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

ఒక రైతు తన పంట సరైన సమయంలో చేతికొస్తుందనే నమ్మకంతో ఓపిగ్గా ఎదురుచూసినట్టే, మనం కూడా యెహోవా మాటిచ్చినవన్నీ సరైన సమయంలో నిజమౌతాయనే నమ్మకంతో ఓపిగ్గా ఎదురుచూడవచ్చు (7వ పేరా చూడండి)

7. యాకోబు 5:7, 8 ప్రకారం, ఓర్పు చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? (చిత్రం కూడా చూడండి.)

7 ఓర్పు చూపించడం వల్ల మనం రక్షించబడతాం. గతంలో ఉన్న నమ్మకమైన దేవుని సేవకుల్లాగే దేవుడిచ్చిన మాట నెరవేరే వరకు మనం ఓపిగ్గా వేచి చూడాలి. (హెబ్రీ. 6:11, 12) మన పరిస్థితిని బైబిలు ఒక రైతుతో పోలుస్తుంది. (యాకోబు 5:7, 8 చదవండి.) రైతు కష్టపడి విత్తనాలు నాటి, నీళ్లు పోస్తాడు. కానీ ఆ పంట ఎప్పుడు చేతికొస్తుందో అతనికి తెలీదు. కానీ ఏదోక రోజు ఆ పంట చేతికొస్తుందనే నమ్మకంతో అతను ఓపిగ్గా వేచి చూస్తాడు. అదేవిధంగా “[మన] ప్రభువు ఏ రోజు వస్తున్నాడో” మనకు తెలీకపోయినా ఆధ్యాత్మిక పనుల్లో మనం బిజీగా ఉండాలి. (మత్త. 24:42) యెహోవా మాటిచ్చినవన్నీ తాను అనుకున్న సమయంలో నిజమౌతాయనే నమ్మకంతో మనం ఓపిగ్గా వేచి చూస్తాం. ఒకవేళ మన ఓపిక నశిస్తే, ఇక మనం ఏమాత్రం వేచి చూడలేం అనుకుని సత్యం నుండి పక్కదారి పట్టే అవకాశం ఉంది. అంతేకాదు, క్షణికానందం ఇచ్చే వాటి వెనకాల పరుగెత్తే అవకాశం ఉంది. కానీ మనం ఓర్పుగా ఉంటే చివరివరకు సహిస్తాం, రక్షించబడతాం.—మీకా 7:7; మత్త. 24:13.

8. ఓర్పు చూపిస్తే ఎలా ఇతరులతో మంచి బంధాలు ఉంటాయి? (కొలొస్సయులు 3:12, 13)

8 ఓర్పు చూపిస్తే వేరేవాళ్లతో మంచి బంధాలు ఉంటాయి. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటాం. (యాకో. 1:19) వాళ్లతో శాంతిగా ఉంటాం. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరుల్ని నొప్పించే ఏదోక మాట అనకుండా ఉంటాం. ఎవరైనా మన మనసును బాధపెట్టినప్పుడు త్వరగా కోపం తెచ్చుకొని, వాళ్లను తిట్టే బదులు “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ” ఉంటాం.—కొలొస్సయులు 3:12, 13 చదవండి.

9. ఓర్పు ఉంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? (సామెతలు 21:5)

9 ఓర్పు చూపించడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. తొందరపడి లేదా అప్పటికప్పుడు అనిపించిన దాన్నిబట్టి నిర్ణయాలు తీసుకోం గానీ మన ముందున్న వాటన్నిటి గురించి పరిశోధన చేయడానికి సమయం తీసుకుంటాం. అన్ని కోణాల నుండి ఆలోచిస్తాం. (సామెతలు 21:5 చదవండి.) ఉదాహరణకు, మనం ఉద్యోగం కోసం వెదుకుతుంటే దొరక్క దొరక్క దొరికిన ఉద్యోగానికి మనం మొగ్గు చూపవచ్చు. ఆ ఉద్యోగం వల్ల కొన్ని మీటింగ్స్‌కి వెళ్లకపోయినా పర్వాలేదని అనిపించవచ్చు. కానీ ఓర్పు ఉంటే చెడ్డ నిర్ణయం తీసుకోం. బదులుగా, ఈ ప్రశ్నల గురించి సమయం తీసుకొని ఆలోచిస్తాం: ఆ ఉద్యోగం ఏ ప్రాంతంలో ఉంది? ఎన్ని గంటలు పని చేయాలి? ఆ ఉద్యోగం నా కుటుంబానికి, మీటింగ్‌కి, ప్రీచింగ్‌కి ఏమైనా అడ్డుగా ఉంటుందా?

ఓర్పును ఇంకా ఎక్కువ ఎలా పెంచుకోవచ్చు?

10. మనం ఓర్పును పెంచుకుని, చూపిస్తూ ఉండడానికి ఏం చేయాలి?

10 యెహోవాకు ప్రార్థించండి. ఓర్పు పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. (గల. 5:22, 23) కాబట్టి పవిత్రశక్తి కోసం ప్రార్థించి, అది పుట్టించే ఆ లక్షణాన్ని పెంచుకునేలా సహాయం చేయమని మనం యెహోవాను అడగొచ్చు. ఓర్పు చూపించడం కష్టంగా అనిపిస్తే పవిత్రశక్తి కోసం “అడుగుతూ ఉండండి.” (లూకా 11:9, 13) విషయాల్ని యెహోవా వైపు నుండి ఆలోచించడానికి సహాయం చేయమని కూడా మనం అడగొచ్చు. అలా ప్రార్థించిన తర్వాత, ప్రతీరోజు ఓర్పు చూపించడానికి మనవంతు మనం చేయగలిగినదంతా చేయాలి. అలా మనం ఓర్పు చూపించడానికి సహాయం చేయమని ఎంతెక్కువ ప్రార్థిస్తామో, ఆ లక్షణాన్ని చూపించడానికి ఎంతెక్కువ ప్రయత్నిస్తామో, అంతెక్కువగా ఆ లక్షణం మన హృదయంలో మొలకెత్తి మన వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. గతంలో మనం ఆ లక్షణాన్ని చూపించలేకపోయినా ఇప్పుడు మనం ఓర్పు చూపించే వ్యక్తిగా తయారౌతాం.

11-12. యెహోవా ఎలా ఓర్పు చూపిస్తూనే ఉన్నాడు?

11 బైబిలు ఉదాహరణల గురించి లోతుగా ఆలోచించండి. బైబిల్లో ఓర్పు చూపించిన ఎంతోమంది గురించి ఉంది. వాళ్ల ఉదాహరణల గురించి లోతుగా ఆలోచించినప్పుడు, మనం వేర్వేరు విధాలుగా ఓర్పు చూపించడం నేర్చుకుంటాం. అయితే ఆ ఉదాహరణల్ని పరిశీలించడానికి ముందు, ఓర్పు చూపించడంలో అత్యుత్తమ ఆదర్శం ఉంచిన యెహోవా గురించి చూద్దాం.

12 ఏదెను తోటలో సాతాను యెహోవా పేరు మీద బురద చల్లాడు. న్యాయంగా, ప్రేమగా చేసే తన పరిపాలన మీద హవ్వలో అనుమాన బీజాలు నాటాడు. అయితే యెహోవా వెంటనే సాతానును నామరూపాల్లేకుండా తుడిచిపెట్టలేదు. బదులుగా ఓర్పు, ఆత్మనిగ్రహం చూపించాడు. ఎందుకంటే తన పరిపాలనే సరైనదని నిరూపించడానికి సమయం పడుతుందని యెహోవాకు తెలుసు. అలా వేచి చూస్తూనే తన పేరు మీదున్న అభాండాలన్నిటినీ ఆయన భరించాడు. అంతేకాదు, ఆయన ఓర్పు చూపించడం వల్ల లక్షలమందికి ఆయన గురించి తెలుసుకునే, శాశ్వత జీవితాన్ని సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. (2 పేతు. 3:9, 15) యెహోవా ఓర్పు వల్ల వచ్చే ప్రయోజనాల మీద మనసుపెడితే, ఆయన సాతాను కథను ముగించే సమయం కోసం మనం ఎదురుచూడడం తేలికౌతుంది.

ఓర్పు ఉంటే, ఎవరైనా చిరాకు పెట్టినప్పుడు త్వరగా కోపం తెచ్చుకోం (13వ పేరా చూడండి)

13. యేసు తన తండ్రిలాగే ఎలా ఓర్పు చూపించాడు? (చిత్రం కూడా చూడండి.)

13 యేసు భూమ్మీద ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో తన తండ్రిలానే ఓర్పు చూపించాడు. అలా చూపించడం ఆయనకు అంత తేలికేమీ అవ్వలేదు. ముఖ్యంగా శాస్త్రుల, పరిసయ్యుల వేషధారణ ఆయన ఓపికకు ఓ పరీక్షలా మారింది. (యోహా. 8:25-27) అయినా, యేసు తన తండ్రిలాగే త్వరగా కోపం తెచ్చుకోలేదు. ఆయన్ని అవమానించినప్పుడు, దూషించినప్పుడు మాటకు మాట అనలేదు. (1 పేతు. 2:23) బదులుగా తనకు వచ్చే కష్టాల్ని సణుగుకోకుండా ఓర్పుగా తట్టుకున్నాడు. అందుకే బైబిలు మనకు ఇలా చెప్తుంది: “పాపుల దూషణకరమైన మాటల్ని సహించిన ఆయన్ని శ్రద్ధగా గమనించండి.” (హెబ్రీ. 12:2, 3) అవును, యెహోవా సహాయంతో మనం కూడా మన జీవితంలో వచ్చే కష్టాల్ని ఓర్పుగా తట్టుకోగలుగుతాం.

అబ్రాహాములాగే ఓర్పు చూపిస్తే యెహోవా ఇప్పుడు మనల్ని దీవిస్తాడని, కొత్తలోకంలో పట్టలేనన్ని దీవెనల్ని కుమ్మరిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు (14వ పేరా చూడండి)

14. అబ్రాహాము చూపించిన ఓర్పు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (హెబ్రీయులు 6:15) (చిత్రం కూడా చూడండి.)

14 మనం ఎదురుచూసిన కొత్తలోకం ఇంకా రాకపోతే? బహుశా ఎప్పుడో వస్తుందని మనం అనుకొని ఉండొచ్చు. అలాగే మనం బ్రతికుండగా కొత్తలోకం వస్తుందో లేదో అని కూడా ఆలోచిస్తుండవచ్చు. కానీ ఓపిగ్గా ఎదురుచూడడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? అబ్రాహాము ఉదాహరణను గమనించండి. అబ్రాహాము పిల్లలు లేని 75 ఏళ్ల ముసలివాడు. అప్పుడు యెహోవా ఆయనకు ఇలా మాటిచ్చాడు: “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.” (ఆది. 12:1-4) అయితే అబ్రాహాము ఆ మాట నిజమవ్వడం చూశాడా? పూర్తిగా కాదు. ఆయన యూఫ్రటీసు నది దాటి, 25 సంవత్సరాలు వేచివున్న తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఆ తర్వాత మరో 60 ఏళ్లకి తన మనవళ్లు ఏశావు, యాకోబులు పుట్టారు. (హెబ్రీయులు 6:15 చదవండి.) అయితే తన పిల్లలు గొప్ప జనంగా అవ్వడం, వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అబ్రాహాము ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయన తన జీవితం మొత్తంలో నమ్మకంగా ఉంటూ తన సృష్టికర్తతో మంచి స్నేహాన్ని ఆనందించాడు. (యాకో. 2:23) అబ్రాహాము పునరుత్థానమైన తర్వాత తను చూపించిన విశ్వాసం వల్ల, ఓర్పు వల్ల భూమ్మీదున్న అన్నీ జనాంగాలు దీవించబడడం చూసి ఎంత పులకరించిపోతాడో కదా! (ఆది. 22:18) మనకేంటి పాఠం? బహుశా యెహోవా మాటిచ్చినవన్నీ ఇప్పటికిప్పుడు మనం కళ్లారా చూడలేకపోవచ్చు. కానీ అబ్రాహాములాగే ఓర్పు చూపిస్తే యెహోవా ఇప్పుడు మనల్ని దీవిస్తాడని, కొత్తలోకంలో పట్టలేనన్ని దీవెనలు కుమ్మరిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—మార్కు 10:29, 30.

15. మన వ్యక్తిగత అధ్యయనంలో ఏం చేయవచ్చు?

15 బైబిల్లో ఓర్పు చూపించిన ఇంకా ఎంతోమంది గురించి ఉంది. (యాకో. 5:10) వాళ్లందరి గురించి మీరెందుకు ఒక స్టడీ ప్రాజెక్ట్‌ చేయకూడదు? b ఉదాహరణకు, దావీదు చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ సింహాసనం మీద కూర్చుని పరిపాలించడానికి చాలా సంవత్సరాలు ఓపిగ్గా ఎదురుచూడాల్సి వచ్చింది. అంతేకాదు, సుమెయోను అలాగే అన్న అనే ఒక ప్రవక్త్రి మెస్సీయ కోసం ఓపిగ్గా ఎదురుచూడాల్సి వచ్చింది. ఈలోపు వాళ్లు యెహోవాకు నమ్మకంగా సేవచేశారు. (లూకా 2:25, 36-38) అలాంటి వాళ్ల గురించి మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోండి: వీళ్లు ఎలా ఓర్పు చూపించగలిగారు? ఓర్పు చూపించడం వల్ల వాళ్లు ఎలా ప్రయోజనం పొందారు? వాళ్లలా నేను ఎలా ఓర్పు చూపించవచ్చు? అలాగే ఓర్పు చూపించని వాళ్లనుండి కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు. (1 సమూ. 13:8-14) వాళ్ల గురించి చదువుతున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి: ‘వాళ్లు ఎందుకు ఓర్పు చూపించలేకపోయారు? ఓర్పు చూపించకపోవడం వల్ల వాళ్లకు ఎలాంటి నష్టం వచ్చింది?’

16. ఓర్పు చూపించడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏంటి?

16 ఓర్పు చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించండి. ఓర్పు మన సంతోషాన్ని, ప్రశాంతతను రెట్టింపు చేస్తుంది. అంతేకాదు ఓర్పు చూపించినప్పుడు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. మనం ఇతరులతో ఓర్పుగా ఉన్నప్పుడు వాళ్లతో మంచి బంధాలు ఉంటాయి. సంఘం కూడా ఇంకా ఐక్యంగా తయారౌతుంది. ఎవరైనా మనకు చిరాకు తెప్పించినప్పుడు త్వరగా కోపం తెచ్చుకోకుండా ఉంటే పరిస్థితి చేయి దాటిపోకుండా చూసుకోగలుగుతాం. (కీర్త. 37:8, అధస్సూచి; సామె. 14:29) అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఓర్పుగా ఉంటే మన పరలోక తండ్రిని అనుకరించిన వాళ్లమౌతాం, ఆయనకు ఇంకా దగ్గరౌతాం.

17. మనం ఏం చేయాలని తీర్మానించుకోవాలి?

17 ఓర్పు ఆకట్టుకునే ఒక అందమైన లక్షణం. దానివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఓర్పు చూపించడం చేదుగా ఉండొచ్చు కానీ, యెహోవా సహాయంతో ఓర్పు చూపిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి కొత్తలోకం కోసం మనం ఓపిగ్గా ఎదురుచూస్తుండగా మనం ఈ నమ్మకంతో ఉండొచ్చు: “యెహోవా కళ్లు తన పట్ల భయభక్తులుగల వాళ్లను, తన విశ్వసనీయ ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను గమనిస్తాయి.” (కీర్త. 33:18) కాబట్టి మనందరం ఓర్పును అలవర్చుకుంటూ ఉండాలని తీర్మానించుకుందాం.

పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు

a సాతాను లోకంలో ఓర్పు కనుమరుగైపోయింది. కానీ బైబిలు ఓర్పును అలవర్చుకోమని సలహా ఇస్తుంది. ఈ లక్షణం ఎందుకు ప్రాముఖ్యమైందో, దాన్ని మనం ఎలా పెంచుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

b బైబిల్లో ఓర్పు చూపించినవాళ్ల ఉదాహరణల కోసం, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో “భావోద్వేగాలు, లక్షణాలు, ప్రవర్తన” అనే శీర్షిక కింద “ఓర్పు” అనే ఉపశీర్షికను చూడండి.