కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 42

మీరు ‘లోబడడానికి సిద్ధమేనా’?

మీరు ‘లోబడడానికి సిద్ధమేనా’?

“పరలోకం నుండి వచ్చే తెలివి . . . లోబడడానికి సిద్ధంగా ఉండేది.”—యాకో. 3:17.

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . a

1. లోబడడం మనకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

 మీకెప్పుడైనా లోబడడానికి మనసు రాలేదా? రాజైన దావీదుకు కూడా అదే జరిగింది. అందుకే అతను దేవునికి ఇలా ప్రార్థించాడు: “నీకు లోబడాలనే కోరికను నాలో రేపు.” (కీర్త. 51:12) దావీదు యెహోవాను ప్రేమించాడు. అయినా, దావీదుకు కొన్నిసార్లు లోబడడం కష్టమైంది. మనకు కూడా అలాగే అనిపించవచ్చు. ఎందుకో కొన్ని కారణాలు చూడండి. ఒకటి, అపరిపూర్ణతవల్ల అవిధేయత చూపించాలనే కోరిక మన నరనరాల్లో పాతుకుపోయింది. రెండు, తనలాగే మనం కూడా ఎదురుతిరగాలని సాతాను మనల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటాడు. (2 కొరిం. 11:3) మూడు, ‘ఒకరు చెప్తే నేనెందుకు వినాలి?’ అనే ఆలోచన లేదా వైఖరి ఉన్నలాంటి ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. ఆ వైఖరి, “అవిధేయత పుత్రుల మీద ప్రభావం చూపిస్తోంది.” (ఎఫె. 2:2, అధస్సూచి) కాబట్టి సాతాను, అతని లోకం ప్రేరేపించే తప్పుడు కోరికలతో అలాగే ఎదురుతిరగాలనే ఆలోచనలతో మనం పోరాడుతూనే ఉండాలి. అంతేకాదు, యెహోవాకు అలాగే ఆయన ఎవరికైతే అధికారం ఇచ్చాడో వాళ్లందరికీ మనం లోబడడానికి చేయగలిగినదంతా చేయాలి.

2. “లోబడడానికి సిద్ధంగా” ఉండడం అంటే ఏంటి? (యాకోబు 3:17)

2 యాకోబు 3:17 చదవండి. తెలివైనవాళ్లు “లోబడడానికి సిద్ధంగా” ఉంటారని యాకోబు రాశాడు. దాని అర్థమేంటో ఒకసారి ఆలోచించండి. యెహోవా ఎవరికైతే ఒకింత అధికారం ఇచ్చాడో వాళ్లకు లోబడడానికి మనం ఇష్టంగా ముందుకు రావాలి. కానీ, తన ఆజ్ఞల్ని మీరమని చెప్పేవాళ్లకు లోబడాలని యెహోవా ఆశించట్లేదు.—అపొ. 4:18-20.

3. మనం అధికారంలో ఉన్నవాళ్లకు లోబడితే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

3 మనం మనుషుల కన్నా యెహోవాకు లోబడడం తేలిక. ఎందుకంటే, యెహోవా చెప్పేది ఎప్పుడూ కరెక్టే! (కీర్త. 19:7) కానీ, అధికారం ఉన్న మనుషులు అలా కాదు. అయినాసరే, యెహోవా అమ్మానాన్నలకు, ప్రభుత్వ అధికారులకు, సంఘపెద్దలకు కొంత అధికారం ఇచ్చాడు. (సామె. 6:20; 1 థెస్స. 5:12; 1 పేతు. 2:13, 14) మనం వాళ్లకు లోబడితే యెహోవాకు లోబడినట్టే. వాళ్లు చెప్పేది కొన్నిసార్లు కరెక్ట్‌ కాదనిపించవచ్చు, పాటించడం కష్టంగా ఉండవచ్చు. అయినాసరే, వాళ్లకు ఎలా లోబడవచ్చో ఇప్పుడు చూద్దాం.

అమ్మానాన్నలకు లోబడండి

4. చాలామంది పిల్లలు ఎందుకు అమ్మానాన్నలకు లోబడట్లేదు?

4 ఈ ప్రపంచంలో పిల్లల చుట్టూ “తల్లిదండ్రులకు లోబడనివాళ్లు” ఉంటున్నారు. (2 తిమో. 3:1, 2) చాలామంది పిల్లలు ఎందుకు వాళ్ల అమ్మానాన్నలకు లోబడట్లేదు? ఎందుకంటే, వాళ్ల అమ్మానాన్నలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని వాళ్లకు అనిపించవచ్చు. ఇంకొంతమందికి, అమ్మానాన్నలు ఇచ్చే సలహాలు పాత చింతకాయ పచ్చడిలాంటివని, పాటించడానికి అసలు పనికిరావని, తుమ్మినా-దగ్గినా తప్పే అంటారని వాళ్లకు అనిపించవచ్చు. ఒకవేళ మీరు పిల్లలైతే, మీకూ అలాగే అనిపిస్తుందా? “ప్రభువు ఇష్టానికి అనుగుణంగా మీ అమ్మానాన్నల మాట వినండి, ఇది దేవుని దృష్టికి సరైనది” అని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను పాటించడం చాలామంది పిల్లలకు కష్టంగా అనిపించవచ్చు. (ఎఫె. 6:1) అయితే, ఈ కష్టాన్ని ఇష్టంగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

5. లూకా 2:46-52 ప్రకారం, యేసు తన అమ్మానాన్నలకు లోబడడం ఎందుకంత గొప్ప విషయం?

5 లోబడే విషయంలో మంచి ఆదర్శంగా ఉన్న యేసు నుండి మీరు నేర్చుకోవచ్చు. (1 పేతు. 2:21-24) ఆయన అపరిపూర్ణులైన అమ్మానాన్నల దగ్గర పెరిగిన ఒక పరిపూర్ణ పిల్లవాడు. బహుశా, తన అమ్మానాన్నలు కొన్నిసార్లు పొరపాట్లు చేసివుండొచ్చు. ఆయన్ని అపార్థం చేసుకుని ఉండవచ్చు. అయినా, యేసు వాళ్లను గౌరవించాడు. (నిర్గ. 20:12) ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి గమనించండి. (లూకా 2:46-52 చదవండి.) తన అమ్మానాన్నలతో కలిసి యేసు యెరూషలేముకు వెళ్లాడు. వాళ్లు తిరిగొస్తున్నప్పుడు యేసు వాళ్లతో లేడనే విషయం యోసేపు, మరియలు గమనించుకోలేదు. నిజానికి, పిల్లలందరూ తమతో ఉన్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అయితే యోసేపు, మరియలు యేసు కోసం కాళ్లు అరిగేలా తిరిగి, చివరికి ఆయన్ని ఆలయంలో చూసినప్పుడు, మరియ ‘ఇలా ఎందుకు చేశావు’ అని యేసును నిలదీసింది. అప్పుడు యేసు, అంతా మీరే చేశారని వేలెత్తి చూపించి, రాద్ధాంతం చేయకుండా ఆమెకు గౌరవంగా జవాబిచ్చాడు. అయితే, యేసు ఇచ్చిన జవాబు “వాళ్లకు అర్థంకాకపోయినా” ఆయన వాళ్లను చులకన చేయకుండా “వాళ్లకు లోబడివున్నాడు.”

6-7. అమ్మానాన్నలకు లోబడడానికి పిల్లలు ఏం చేయవచ్చు?

6 పిల్లలారా, మీ అమ్మానాన్నలు పొరపాటు చేసినప్పుడు లేదా మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు వాళ్లకు లోబడడానికి మీకు మనసు రావట్లేదా? అప్పుడు మీరేం చేయవచ్చు? ముందుగా, యెహోవాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. అమ్మానాన్నలకు లోబడడం “ప్రభువుకు ఇష్టం” అని బైబిలు చెప్తుంది. (కొలొ. 3:20) మీ అమ్మానాన్నలు మిమ్మల్ని అపార్థం చేసుకుంటే లేదా వాళ్లు పెట్టిన రూల్స్‌ కరెక్ట్‌ కాదనిపిస్తే, అవన్నీ యెహోవా చూస్తున్నాడని గుర్తుంచుకోండి. కాబట్టి మీ అమ్మానాన్నలు ఏం చేసినా సరే, మీరు వాళ్లకు లోబడితేనే యెహోవా సంతోషిస్తాడు.

7 రెండోది, మీ అమ్మానాన్నలకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. మీరు వాళ్లకు లోబడితే వాళ్లు చాలా సంతోషిస్తారు. అలాగే మిమ్మల్ని ఇంకా ఎక్కువ నమ్ముతారు. (సామె. 23:22-25) అంతేకాదు, మీరు వాళ్లకు ఇంకా దగ్గరౌతారు. బెల్జియంలో ఉంటున్న అలెగ్జాండర్‌ అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “నేను మా అమ్మానాన్నలకు లోబడేకొద్దీ మా దూరం తరుగుతూ, మా సంతోషం పెరుగుతూ వచ్చింది.” b మూడోది, మీ అమ్మానాన్నలకు ఇప్పుడు లోబడడం, రాబోయే రోజుల్లో ఎలా సహాయం చేస్తుందో ఆలోచించండి. బ్రెజిల్‌లో ఉంటున్న పౌలో అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “నేను మా అమ్మానాన్నలకు లోబడడం నేర్చుకున్నాను కాబట్టి, యెహోవాకు అలాగే అధికారంలో ఉన్నవాళ్లకు లోబడగలిగాను.” అమ్మానాన్నలకు లోబడడానికి బైబిలు మనకొక మంచి కారణం ఇస్తుంది. బైబిలు ఇలా చెప్తుంది: “అప్పుడు నీ జీవితం బాగుంటుంది, నువ్వు భూమ్మీద ఎక్కువకాలం జీవిస్తావు.”—ఎఫె. 6:2, 3.

8. చాలామంది పిల్లలు తమ అమ్మానాన్నల మాట ఎందుకు వినాలనుకున్నారు?

8 అమ్మానాన్నలకు లోబడడం వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుందని చాలామంది పిల్లలు చెప్తున్నారు. ఉదాహరణకు, బ్రెజిల్‌లో ఉంటున్న లీజా అనే టీనేజీ అమ్మాయికి ఆమె అమ్మానాన్నలు కొంతకాలం ఫోన్‌ ఇవ్వలేదు. నిజానికి, తన వయసు వాళ్లందరి దగ్గర ఫోన్లు ఉన్నా, తనకు మాత్రం వాళ్లు ఎందుకు ఫోన్‌ ఇవ్వట్లేదో ఆమెకు అర్థంకాలేదు. అయితే, తన అమ్మానాన్నలు అలా చేయడం వల్ల తనకు మంచి జరిగిందని కొంతకాలానికి ఆమె అర్థంచేసుకుంది. ఇప్పుడామె ఇలా అంటుంది: “మా అమ్మానాన్నలు చెప్పే మాటలు నన్ను బంధించడానికి కట్టిన తాళ్లలా లేవుగానీ నన్ను కాపాడడానికి పెట్టిన సీట్‌ బెల్ట్‌లా ఉన్నాయి.” అమెరికాలో ఉంటున్న ఎలీజబెత్‌ అనే టీనేజీ అమ్మాయికి తన అమ్మానాన్నలకు లోబడడం ఇప్పటికీ కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆమె ఇలా అంటుంది: “మా అమ్మానాన్నలు ఒక రూల్‌ ఎందుకు పెట్టారో నాకు అర్థం కానప్పుడు, వాళ్లు ఇంతకుముందు పెట్టిన రూల్స్‌ నన్ను ఎలా కాపాడాయో ఆలోచించేదాన్ని.” అర్మేనియాలో ఉంటున్న మోనికా అనే అమ్మాయి తన అమ్మానాన్నలకు లోబడనప్పుడు కన్నా, లోబడినప్పుడే మంచి జరిగిందని చెప్తుంది.

పై అధికారులకు లోబడండి

9. ప్రభుత్వానికి లోబడే విషయంలో చాలామంది ప్రజలు ఏమనుకుంటారు?

9 ప్రభుత్వాలు ఉండడం మంచిదని, ఆ ప్రభుత్వాలు పెట్టే నియమాల్లో కొన్నింటినైనా పాటించడం సరైనదని చాలామంది ప్రజలు ఒప్పుకుంటారు. (రోమా. 13:1) కానీ, ప్రభుత్వం పెట్టే నియమాలు నచ్చకపోయినా లేదా అన్యాయంగా అనిపించినా లోబడడానికి చాలామందికి మనసు రాదు. ఉదాహరణకు, ట్యాక్స్‌లు కట్టే విషయమే తీసుకోండి. యూరప్‌లో ఉన్న ఒక దేశంలో చాలామంది అభిప్రాయం ఏంటంటే, “ట్యాక్స్‌లు కట్టడం మీకు అన్యాయం అనిపిస్తే వాటిని ఎగ్గొట్టడం తప్పేమీకాదు.” అందుకే, ఆ దేశంలో చాలామంది ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్‌లో ఎక్కువ మొత్తాన్ని ఎగ్గొట్టేస్తారు.

లోబడే విషయంలో యోసేపు, మరియల నుండి మనమేం నేర్చుకోవచ్చు? (10-12 పేరాలు చూడండి) c

10. మనకు నచ్చని ప్రభుత్వ నియమాలకు కూడా ఎందుకు లోబడతాం?

10 ప్రభుత్వాలు సాతాను చెప్పుచేతల్లో ఉన్నాయని, వాటివల్ల మనకు ఇబ్బందులు ఎదురౌతాయని, ఆ ప్రభుత్వాలు త్వరలోనే నాశనమౌతాయని బైబిలు చెప్తుంది. (కీర్త. 110:5, 6; ప్రసం. 8:9; లూకా 4:5, 6) మరోవైపు, “అధికారాన్ని ఎదిరించే వ్యక్తి దేవుని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాడు” అని కూడా బైబిలు చెప్తుంది. అయితే, ఈ ప్రపంచం గందరగోళంగా తయారవ్వకూడదని యెహోవా ఈ ప్రభుత్వాల్ని ఉండనిస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వాలకు “ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయాలి.” అంటే ట్యాక్స్‌లు కట్టాలి, ప్రభుత్వ అధికారులకు గౌరవమర్యాదలు ఇవ్వాలి, లోబడాలి. (రోమా. 13:1-7) కొన్నిసార్లు, ప్రభుత్వం పెట్టే నియమాలు మనకు ఇబ్బందిగా, అన్యాయంగా, దోచుకున్నట్టుగా అనిపించవచ్చు. అయినా సరే, మనం వాటికి లోబడతాం. ఎందుకంటే వాళ్లకు లోబడితే, మనం యెహోవాకు లోబడినట్టే. కాబట్టి, యెహోవా ఆజ్ఞలకు అడ్డురానంతవరకు మనం ప్రభుత్వాలకు లోబడుతూనే ఉండాలి!—అపొ. 5:29.

11-12. లూకా 2:1-6 ప్రకారం, ప్రభుత్వం చెప్పింది చేయడానికి ఇబ్బందిగా ఉన్నా యోసేపు, మరియలు ఏం చేశారు? దాని ఫలితమేంటి? (చిత్రాలు కూడా చూడండి.)

11 పై అధికారులకు లోబడే విషయంలో యోసేపు, మరియల్ని చూసి మనమెంతో నేర్చుకోవచ్చు. అలా లోబడడం ఇబ్బందిగా ఉన్నాసరే వాళ్లు లోబడ్డారు. అదెలాగో చూడండి. (లూకా 2:1-6 చదవండి.) మరియ తొమ్మిది నెలల గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెకు అలాగే యోసేపుకు లోబడే విషయంలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఔగుస్తు, ప్రజలందరూ తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్లాలని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యోసేపు, మరియలు తమ సొంతూరైన బేత్లెహేముకు వెళ్లాలి. అది వాళ్లుంటున్న ప్రాంతం నుండి 150 కి.మీ. దూరంలో ఉంది పైగా ఆ దారి కూడా తిన్నగా లేదు. అంతా కొండలు-గుట్టలే, రాళ్లు-రప్పలే. ఆ దారిలో మామూలు ప్రజలు వెళ్లడమే కష్టం. అలాంటిది మరియకు ఇంకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. కడుపులో ఉన్న బిడ్డ గురించి, మరియ ఆరోగ్యం గురించి వాళ్లెంత కంగారుపడుంటారో కదా! దారి మధ్యలోనే ఆమెకు పురిటినొప్పులు వస్తే, ఏంటి పరిస్థితి? అసలే కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, కాబోయే మెస్సీయ! వాళ్లు ఇవన్నీ మనసులో పెట్టుకుని, ప్రభుత్వం చెప్పింది చేయడం ‘మా వల్ల కాదు’ అనుకున్నారా?

12 అస్సలు అనుకోలేదు! వాళ్లు ప్రభుత్వానికి లోబడినందుకు యెహోవా మెండుగా దీవించాడు. మరియ సురక్షితంగా బేత్లెహేములో అడుగుపెట్టింది, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే బైబిలు ప్రవచనాన్ని కూడా నెరవేర్చింది!—మీకా 5:2.

13. మనం ప్రభుత్వాలకు లోబడడం వల్ల, ఇతరులకు ఎలా మంచి చేసిన వాళ్లమౌతాం?

13 మనం పై అధికారులకు లోబడితే, మనకే కాదు ఇతరులకు కూడా మంచి చేసిన వాళ్లమౌతాం. ఎలా? ఒకటి, మనం ప్రభుత్వానికి లోబడకపోవడం వల్ల వచ్చే శిక్షల్ని తప్పించుకుంటాం. (రోమా. 13:4) రెండు, మనం ఒక్కరం లోబడితే, అధికారులకు యెహోవాసాక్షులందరి మీద మంచి అభిప్రాయం రావచ్చు. ఉదాహరణకు, చాలా ఏళ్ల క్రితం నైజీరియాలో ట్యాక్స్‌లు కట్టడానికి విరుద్ధంగా ధర్నాలు, నినాదాలు చేస్తున్నవాళ్లను వెతుక్కుంటూ సైనికులు రాజ్యమందిరంలోకి వచ్చారు. కానీ ఆ సైనికుల మీద అధికారిగా ఉన్న ఒక ఆఫీసర్‌, “యెహోవాసాక్షులు ట్యాక్స్‌లు ఎగ్గొట్టేవాళ్లు కాదు. ఇక్కడినుండి వెళ్లిపోదాం!” అని ఆ సైనికులతో అన్నాడు. కాబట్టి మనం ప్రభుత్వానికి లోబడిన ప్రతీసారి, యెహోవాసాక్షులకు ఉన్న మంచి పేరును కాపాడిన వాళ్లమౌతాం. అదే మన బ్రదర్స్‌-సిస్టర్స్‌లో ఎవరో ఒకరికి, ఏదోకరోజు ఖచ్చితంగా సహాయపడుతుంది.—మత్త. 5:16.

14. ప్రభుత్వ అధికారులకు లోబడే మనసు రావడానికి ఒక సిస్టర్‌ ఏం చేసింది?

14 అయినాసరే, కొన్నిసార్లు మనందరికి పై అధికారులకు లోబడడానికి మనసు రాకపోవచ్చు. అమెరికాలో ఉంటున్న జోయన్న అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “అధికారులు నా కుటుంబానికి అన్యాయం చేశారు కాబట్టి వాళ్లకు లోబడడానికి నాకు అస్సలు మనసు రాలేదు.” కానీ జోయన్న తన ఆలోచనను మార్చుకోవడానికి కొన్ని పనులు చేసింది. ఒకటి, అధికారుల మీద కోపం తెప్పించే సోషల్‌ మీడియా పోస్టులను చదవడం ఆపేసింది. (సామె. 20:3) రెండు, ప్రభుత్వం మారాలని అనుకునే బదులు, యెహోవా మీద నమ్మకం పెట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేసింది. (కీర్త. 9:9, 10) మూడు, ఎవ్వరి పక్షం వహించకుండా ఉండేలా సహాయం చేసే ప్రచురణల్ని చదివింది. (యోహా. 17:16) అధికారుల్ని గౌరవిస్తూ వాళ్లకు లోబడడం వల్ల “మాటల్లో వర్ణించలేని మనశ్శాంతిని” పొందానని ఇప్పుడు జోయన్న చెప్తుంది.

యెహోవా సంస్థకు లోబడండి

15. సంస్థ ఇచ్చే నిర్దేశాలు పాటించడం మనకు ఎందుకు కష్టం కావచ్చు?

15 సంఘంలో “నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత” చూపించమని యెహోవా మనకు చెప్తున్నాడు. (హెబ్రీ. 13:17) అయితే, మన నాయకుడైన యేసు పరిపూర్ణుడు. కానీ, భూమ్మీద మనల్ని నడిపించడానికి ఆయన ఎంచుకున్నవాళ్లు అపరిపూర్ణులు. కాబట్టి వాళ్లకు లోబడడం మనకు కష్టంకావచ్చు. ముఖ్యంగా, వాళ్లు చెప్పింది మనకు నచ్చనప్పుడు వాళ్లకు లోబడడం ఇంకా కష్టం కావచ్చు. ఒకసారి అపొస్తలుడైన పేతురుకు కూడా లోబడడం కష్టమైంది. ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన జంతువుల్ని తినమని దేవదూత చెప్పినప్పుడు అతను ఒకటి కాదు, రెండు కాదు, మూడుసార్లు దాన్ని తిరస్కరించాడు. (అపొ. 10:9-16) ఎందుకు? ఎందుకంటే ఆ నిర్దేశం అతనికి కరెక్ట్‌గా అనిపించలేదు. పైగా, జీవితంలో అతను ఎప్పుడూ అలా తినలేదు. ఒక పరిపూర్ణ దేవదూత చెప్పింది చేయడానికే పేతురుకు కష్టంగా అనిపిస్తే, అపరిపూర్ణ మనుషులు చెప్పింది చేయడానికి మనకు ఇంకెంత కష్టంగా ఉంటుందో కదా!

16. అపొస్తలుడైన పౌలుకు ఒక నిర్దేశం కరెక్ట్‌ కాదని అనిపించినా ఏం చేశాడు? (అపొస్తలుల కార్యాలు 21:23, 24, 26)

16 అపొస్తలుడైన పౌలుకు ఒక నిర్దేశం కరెక్ట్‌ కాదని అనిపించినా సరే, “లోబడడానికి సిద్ధపడ్డాడు.” ఒకసారి యూదా క్రైస్తవులు పౌలు గురించి కొన్ని పుకార్లు విన్నారు. అతను “మోషే ధర్మశాస్త్రాన్ని” అగౌరవపరుస్తూ, దాన్ని విడిచిపెట్టమనే మతభ్రష్ట బోధ చెప్తున్నాడని వాళ్లు విన్నారు. (అపొ. 21:21) అప్పుడు యెరూషలేములో ఉన్న పెద్దలు, నలుగురు పురుషుల్ని తీసుకెళ్లి ఆచారబద్ధంగా వాళ్లతోపాటు శుద్ధి చేసుకోమని పౌలుకు చెప్పారు. అప్పుడు, చూసే వాళ్లందరూ పౌలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడని తెలుసుకుంటారు. కానీ, క్రైస్తవులెవ్వరూ ఇక ధర్మశాస్త్రం కింద లేరని పౌలుకు తెలుసు. పైగా అతను ఏ తప్పూ చేయలేదు. అయినాసరే, పౌలు వాళ్లు చెప్పింది చేయడానికి వెనకాడలేదు. అతను “ఆ తర్వాతి రోజు వాళ్లను తీసుకెళ్లి, వాళ్లతోపాటు తాను కూడా ఆచారబద్ధంగా శుద్ధి చేసుకున్నాడు.” (అపొస్తలుల కార్యాలు 21:23, 24, 26 చదవండి.) అలా లోబడడం వల్ల పౌలు సహోదరుల మధ్యున్న ఐక్యతను కాపాడాడు.—రోమా. 14:19, 21.

17. స్టెఫనీ అనే సిస్టర్‌ నుండి మీరేం నేర్చుకున్నారు?

17 స్టెఫనీ అనే సిస్టర్‌ అనుభవాన్ని గమనించండి. బ్రాంచి తీసుకున్న ఒక నిర్ణయానికి లోబడడం ఆమెకు కష్టమైంది. ఆమె తన భర్తతో కలిసి వేరే భాషా గ్రూపులో సంతోషంగా సేవచేస్తోంది. కానీ బ్రాంచి ఆ గ్రూపును తీసేసి, వాళ్లను మాతృభాషా సంఘానికి తిరిగి పంపించాలని నిర్ణయం తీసుకుంది. దాని గురించి స్టెఫనీ ఇలా అంటుంది: “ఆ నిర్ణయం నాకు అస్సలు నచ్చలేదు. మాతృభాషా సంఘంలో మా అవసరం ఏముంటుంది అనుకున్నాను.” అయినాసరే, ఆమె ఆ కొత్త నిర్దేశానికి లోబడింది. ఆమె ఇలా అంటుంది: “కాలం గడిచేకొద్దీ బ్రాంచి తీసుకున్న నిర్ణయం ఎంత తెలివైందో నాకు అర్థమైంది. సత్యంలో ఒంటరిగా ఉన్న ఎంతోమందికి ఇప్పుడు మేము ఆధ్యాత్మిక తల్లిదండ్రులమయ్యాం. ఎంతోకాలంగా నిష్క్రియురాలిగా ఉండి, ఇప్పుడు మళ్లీ తన ఉత్సాహాన్ని పుంజుకున్న ఒక సిస్టర్‌కి స్టడీ కూడా చేస్తున్నాను. అలాగే నాకు వ్యక్తిగత అధ్యయనం చేసుకోవడానికి కూడా చాలా టైం దొరుకుతుంది. బ్రాంచి తీసుకున్న నిర్ణయానికి లోబడడం వల్ల నేను మంచి మనస్సాక్షితో ఉండగలుగుతున్నాను.”

18. లోబడడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి?

18 మనం లోబడి ఉండడం నేర్చుకోగలం. యేసు “తాను పడిన బాధల వల్ల విధేయత నేర్చుకున్నాడు.” (హెబ్రీ. 5:8) యేసులాగే మనం కూడా చాలావరకు కష్టమైన పరిస్థితుల్లోనే లోబడడం నేర్చుకుంటాం. ఉదాహరణకు, కోవిడ్‌ మహమ్మారి మొదలైన కొత్తలో మీటింగ్స్‌ నేరుగా జరుపుకోవడం, ఇంటింటి పరిచర్య చేయడం ఆపేస్తున్నామని చెప్పినప్పుడు, దానికి లోబడడం మీకు కష్టమైందా? అయినాసరే మీరు లోబడడం వల్ల మీ ప్రాణాల్ని కాపాడుకున్నారు, సంఘంతో ఐక్యంగా ఉన్నారు, అలాగే యెహోవాను సంతోషపెట్టారు. అయితే, మనందరం ఇప్పుడు లోబడడం నేర్చుకున్నాం కాబట్టి భవిష్యత్తులో మహాశ్రమ సమయంలో కూడా సంస్థ ఇచ్చే నిర్దేశాలకు లోబడగలుగుతాం. అలా లోబడితేనే మనం ప్రాణాలతో ఉంటాం!—యోబు 36:11.

19. మీరెందుకు లోబడాలని అనుకుంటున్నారు?

19 మనం లోబడడం వల్ల పట్టలేనన్ని దీవెనలు వస్తాయని నేర్చుకున్నాం. మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటాం కాబట్టే ఆయనకు లోబడతాం. (1 యోహా. 5:3) యెహోవా మనకోసం చేసిన వాటన్నిటికీ మనమేం ఇచ్చినా రుణం తీర్చుకోలేం! (కీర్త. 116:12) కానీ మనం ఆయనకు, ఆయన అధికారంలో ఉంచినవాళ్లకు లోబడవచ్చు. అలా లోబడితే మనం తెలివైనవాళ్లమని చూపిస్తాం. తెలివైనవాళ్లు యెహోవా హృదయాన్ని సంతోషపెడతారు.—సామె. 27:11.

పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి

a మనం అపరిపూర్ణులం కాబట్టి, కొన్నిసార్లు లోబడడం మనకు కష్టంగా ఉండవచ్చు. అమ్మానాన్నలు, పై అధికారులు అలాగే సంస్థను ముందుండి నడిపిస్తున్న బ్రదర్స్‌ మాట వినాలని మనకు తెలిసినా, అలా వినడం మనకు కష్టంగా ఉండవచ్చు. అయినా, వాళ్ల మాటకు లోబడడం ఎందుకు మంచిదో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

b మీకు లోబడడానికి కష్టంగా అనిపించిన రూల్స్‌ గురించి మీ మమ్మీడాడీలతో ఎలా మాట్లాడవచ్చో తెలుసుకోవడానికి jw.orgలో, “అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ గురించి వాళ్లతో నేనెలా మాట్లాడాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.

c చిత్రాల వివరణ: యోసేపు, మరియలు బేత్లెహేములో పేర్లు నమోదు చేయించుకోవాలనే కైసరు ఆజ్ఞకు లోబడ్డారు. అదేవిధంగా, నేడు క్రైస్తవులు కూడా పై అధికారులు పెట్టే ట్రాఫిక్‌ రూల్స్‌కి, ట్యాక్స్‌ నియమాలకు, ఆరోగ్య నిర్దేశాలకు లోబడతారు.