కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 45

యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి

యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి

“ఆకాశాన్ని, భూమిని, . . . చేసిన దేవుణ్ణే ఆరాధించండి.”—ప్రకటన 14:7.

పాట 93 దేవా, మా కూటాలను దీవించు

ఈ ఆర్టికల్‌లో . . . a

1. ఒక దేవదూత ఏం చెప్తున్నాడు? అది విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

 ఒక దేవదూత వచ్చి మీతో మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నాడో మీరు వింటారా? నిజమే ఒక దేవదూత “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన” ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? “దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపర్చండి. . . . ఆకాశాన్ని, భూమిని . . . చేసిన దేవుణ్ణే ఆరాధించండి.” (ప్రక. 14:6, 7) మనలో ప్రతీఒక్కరం ఒకేఒక్క సత్యదేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి. గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో ఆయన్ని ఆరాధించే అమూల్యమైన అవకాశం వచ్చినందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!

2. యెహోవా ఆధ్యాత్మిక ఆలయం అంటే ఏంటి? (“ ఆధ్యాత్మిక ఆలయం అంటే ఏది కాదు?” అనే బాక్సు కూడా చూడండి.)

2 ఆధ్యాత్మిక ఆలయం అంటే ఏంటి? దాని గురించిన వివరాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఆధ్యాత్మిక ఆలయం అక్షరార్థంగా ఒక భవనం కాదు. అది, తను అంగీకరించేలా ఆరాధించడానికి యెహోవా యేసు విమోచన క్రయధనం ఆధారంగా చేసిన ఏర్పాటు. యూదయలో ఉంటున్న మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులకు రాసిన ఉత్తరంలో అపొస్తలుడైన పౌలు ఈ ఏర్పాటు గురించి వివరించాడు. b

3-4. యూదయలో ఉంటున్న హెబ్రీ క్రైస్తవులకు పౌలు ఎందుకు ఉత్తరం రాశాడు? ఆయన వాళ్లకు ఎలా సహాయం చేశాడు?

3 యూదయలో ఉంటున్న హెబ్రీ క్రైస్తవులకు పౌలు ఎందుకు ఉత్తరం రాశాడు? బహుశా దానికి రెండు కారణాలు ఉండొచ్చు. మొదటిది, వాళ్లను ప్రోత్సహించడానికి. ఇంతకీ వాళ్లకు ప్రోత్సాహం ఎందుకు అవసరమైంది? ఎందుకంటే వాళ్లలో చాలామంది యూదా మతంలోనే పుట్టి పెరిగారు. క్రైస్తవులుగా మారినందుకు మతనాయకులు వాళ్లను ఎగతాళి చేసివుండొచ్చు. పైగా, క్రైస్తవులకు ఆరాధించడానికి ఆలయం లేదు, బలులు అర్పించడానికి బలిపీఠం లేదు, సేవ చేయడానికి యాజకులు లేరు. వీటి వల్ల క్రీస్తు శిష్యులు డీలాపడిపోయి వాళ్ల విశ్వాసం బలహీనపడే అవకాశం ఉంది. (హెబ్రీ. 2:1; 3:12, 14) అంతేకాదు, వాళ్లలో కొంతమంది తిరిగి ఆ యూదా మతంలోకి వెళ్లిపోవాలని అనుకొనివుండవచ్చు.

4 రెండోది, హెబ్రీ క్రైస్తవులు లేఖనాల్లోని లోతైన విషయాల్ని, అంటే దేవుని వాక్యంలోని బలమైన ఆహారాన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించట్లేదని పౌలు చెప్పాడు. (హెబ్రీ. 5:11-14) అంతేకాదు, కొంతమంది ఇంకా మోషే ధర్మశాస్త్రాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. అయితే, ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించడం వాళ్ల పాపాల్ని పూర్తిగా తుడిచేయలేదు కాబట్టి, “ధర్మశాస్త్రాన్ని దేవుడు రద్దుచేశాడు” అని పౌలు వివరించాడు. ఆ తర్వాత పౌలు ఇంకొన్ని లోతైన సత్యాల్ని వాళ్లకు చెప్పాడు. దానిలో ఒకటి యేసు బలివల్ల ఆ క్రైస్తవులకు “మెరుగైన నిరీక్షణ” ఉందని, అలాగే “దేవుణ్ణి సమీపించగలుగుతున్నాం” అని గుర్తు చేశాడు.—హెబ్రీ. 7:18, 19.

5. హెబ్రీయులు పుస్తకంలో నుండి మనమేం అర్థం చేసుకోవాలి? ఎందుకు?

5 హెబ్రీ క్రైస్తవులు ఒకప్పుడు యూదా మతంలో చేసిన ఆరాధన కన్నా ఇప్పుడు వాళ్లు చేసే ఆరాధన ఎందుకు మెరుగైందో పౌలు చెప్పాడు. యూదామత ఆరాధన “రాబోయేవాటి నీడ మాత్రమే, కానీ నిజం క్రీస్తులో ఉంది.” (కొలొ. 2:17) నీడ అంటే కేవలం ఒక వస్తువు ఆకారమే కానీ నిజంగా ఆ వస్తువు కాదు. కాబట్టి ప్రాచీనకాల యూదామత ఆరాధన విధానం రాబోయే నిజానికి నీడ మాత్రమే. కాబట్టి మన పాపాల్ని క్షమించడానికి యెహోవా చేసిన ఏర్పాటును అర్థం చేసుకున్నప్పుడే ఆయనకు ఇష్టమైన విధంగా ఆలోచించగలుగుతాం. అయితే, ఇప్పుడు హెబ్రీయుల పుస్తకంలో పౌలు వివరించిన ‘నీడని’ (ప్రాచీన యూదామత ఆరాధన విధానాన్ని) ‘నిజంతో’ (క్రైస్తవ ఆరాధన విధానంతో) పోల్చి చూద్దాం. అలా చేసినప్పుడు, ఆధ్యాత్మిక ఆలయం గురించి ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. దానిలో మనం ఎలా ఆరాధించవచ్చో చూస్తాం.

గుడారం

6. గుడారాన్ని ఎలా ఉపయోగించేవాళ్లు?

6 ప్రాచీన యూదామత ఆరాధన విధానం. క్రీ.పూ. 1512లో మోషే స్థాపించిన గుడారం ఆధారంగా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు (“ప్రాచీన యూదామత ఆరాధన విధానం—క్రైస్తవ ఆరాధన విధానం” అనే చార్టును చూడండి.) ఆలయ గుడారం చూడ్డానికి డేరాలా ఉండేది. ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళితే అక్కడికి దాన్ని తీసుకెళ్లేవాళ్లు. వాళ్లు దాన్ని దాదాపు 500 సంవత్సరాలు అంటే యెరూషలేములో ఒక ఆలయం కట్టేంతవరకు ఉపయోగించారు. (నిర్గ. 25:8, 9; సంఖ్యా. 9:22) ఈ ‘గుడారం’ ఇశ్రాయేలీయులు దేవున్ని సమీపించడానికి, బలులు అర్పించడానికి, ఆరాధించడానికి కేంద్రంగా ఉండేది. (నిర్గ. 29:43-46) అయితే క్రైస్తవులకు ఈ గుడారం, రాబోయే మెరుగైనదాన్ని సూచించింది.

7. ఆధ్యాత్మిక ఆలయం ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?

7 క్రైస్తవ ఆరాధన విధానం. ప్రాచీనకాల గుడారం “పరలోక సంబంధమైన విషయాలకు . . . నీడగా ఉంది” అలాగే, అది యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయానికి సూచనగా ఉంది. “ఈ గుడారం ప్రస్తుత కాలానికి ఒక ఉదాహరణగా ఉంది” అని పౌలు చెప్పాడు. (హెబ్రీ. 8:5; 9:9) దీన్నిబట్టి పౌలు హెబ్రీయులకు ఉత్తరం రాసే సమయానికే ఆధ్యాత్మిక ఆలయం ఉంది. అది క్రీ.శ. 29వ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. ఆ సంవత్సరం యేసు బాప్తిస్మం తీసుకుని పవిత్రశక్తితో అభిషేకించబడ్డాడు. అలాగే, ఆధ్యాత్మిక ఆలయంలో ‘గొప్ప ప్రధానయాజకుడిగా’ సేవ చేయడం మొదలుపెట్టాడు. cహెబ్రీ. 4:14; అపొ. 10:37, 38.

ప్రధానయాజకుడు

8-9. హెబ్రీయులు 7:23-27 ప్రకారం, ఇశ్రాయేలీయుల్లోని ప్రధానయాజకులకు, గొప్ప ప్రధానయాజకుడైన యేసుక్రీస్తుకు ఉన్న తేడాలు ఏంటి?

8 ప్రాచీన యూదామత ఆరాధన విధానం. ప్రధానయాజకుడు ప్రజల తరఫున దేవున్ని వేడుకునేవాడు. గుడారం ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేలీయుల మొదటి ప్రధానయాజకుడిగా అహరోనును యెహోవా నియమించాడు. అయితే పౌలు చెప్పినట్టు “మరణం కారణంగా ఆ యాజకులు సేవలో కొనసాగలేకపోయేవాళ్లు, అందుకే ఒకరి తర్వాత ఒకరు అలా చాలామంది ఆ స్థానంలో సేవ చేయాల్సి వచ్చింది.” d (హెబ్రీయులు 7:23-27 చదవండి.) అంతేకాదు, అపరిపూర్ణత కారణంగా ఆ ప్రధానయాజకులు తమ సొంత పాపాల కోసం కూడా బలి అర్పించాల్సి వచ్చేది. ఈ విషయంలో ఇశ్రాయేలు ప్రధానయాజకులకు, గొప్ప ప్రధానయాజకుడైన యేసుక్రీస్తుకు చాలా తేడావుంది.

9 క్రైస్తవ ఆరాధన విధానం. మన ప్రధానయాజకుడైన యేసు “మనుషులు కాకుండా యెహోవాయే స్థాపించిన నిజమైన గుడారంలోని అతి పవిత్ర స్థలానికి ఆయన పరిచారకుడు.” (హెబ్రీ. 8:1, 2) పౌలు యేసు గురించి ఇలా చెప్పాడు: “ఈ యాజకుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు కాబట్టి ఆయన స్థానంలో ఇంకొకరు సేవ చేయాల్సిన అవసరం రాదు.” అలాగే, ఆయన “కళంకం లేనివాడు, పాపులకు భిన్నంగా ఉన్నవాడు.” ఇశ్రాయేలీయుల్లోని మిగతా ప్రధానయాజకుల్లా ఆయన తన సొంత పాపాల కోసం “ప్రతీరోజు బలులు అర్పించాల్సిన అవసరం లేదు.” అయితే ఇప్పుడు, ప్రాచీన యూదామత ఆరాధన విధానంలో ఉన్న బలిపీఠాలకు, బలులకు అలాగే క్రైస్తవ ఆరాధన విధానంలో ఉన్నవాటికి తేడాల్ని పరిశీలిద్దాం.

బలిపీఠాలు, బలులు

10. రాగి బలిపీఠం మీద అర్పించిన బలులు దేనికి సూచనగా ఉన్నాయి?

10 ప్రాచీన యూదామత ఆరాధన విధానం. గుడారపు ప్రవేశ ద్వారం బయట రాగి రేకు తొడిగిన బలిపీఠం ఉండేది. దానిమీద యెహోవాకు జంతు బలులు అర్పించేవాళ్లు. (నిర్గ. 27:1, 2; 40:29) కానీ ఆ బలుల వల్ల మనుషుల పాపాలు పూర్తిగా క్షమించబడేవి కాదు. (హెబ్రీ. 10:1-4) అయితే, గుడారం దగ్గర అర్పిస్తూ ఉండే బలులు, మనుషుల పాపాల్ని పూర్తిగా తీసేయడానికి అర్పించబోయే ఒకే ఒక్క బలికి సూచనగా ఉంది.

11. యేసు తనను తాను ఏ బలిపీఠం మీద అర్పించుకున్నాడు? (హెబ్రీయులు 10:5-7, 10)

11 క్రైస్తవ ఆరాధన విధానం. మనుషుల కోసం విమోచన క్రయధనంగా ప్రాణాన్ని అర్పించడానికి యెహోవా తనను భూమ్మీదకు పంపించాడని యేసుకు తెలుసు. (మత్త. 20:28) అందుకే బాప్తిస్మమప్పుడు యెహోవా ఇష్టాన్ని చేయడానికి తనను తాను సమర్పించుకున్నాడు. (యోహా. 6:38; గల. 1:4) యేసు మనిషిగా తన పరిపూర్ణ ప్రాణాన్ని అర్పించాలన్నదే యెహోవా ఇష్టం. అయితే, యేసు మనుషులు తయారుచేసిన బలిపీఠం మీద కాదుగానీ యెహోవా “ఇష్టాన్ని” సూచిస్తున్న బలిపీఠం మీద తనను తాను అర్పించుకున్నాడు. క్రీస్తు మీద విశ్వాసం ఉంచే ప్రతీఒక్కరి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి, అవి శాశ్వతంగా కప్పబడడానికి యేసు “అన్నికాలాలకు సరిపోయేలా” ఒక్కసారే తన ప్రాణాన్ని అర్పించాడు. (హెబ్రీయులు 10:5-7, 10 చదవండి.) అయితే, ఇప్పుడు మనం గుడారం లోపలికి వెళ్లి దానిలో ఉన్న విషయాల గురించి పరిశీలిద్దాం.

పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలం

12. గుడారంలోని ఆయా గదులకు ఎవరు వెళ్తారు?

12 ప్రాచీన యూదామత ఆరాధన విధానం. గుడారం అలాగే యెరూషలేములో ఆ తర్వాత కట్టిన ఆలయాలు, లోపల నుండి చూడడానికి ఒకేలా ఉండేవి. దానిలో రెండు గదులు ఉండేవి. ఒకటి “పవిత్ర స్థలం,” ఇంకొకటి “అతి పవిత్ర స్థలం.” ఆ రెండిటికీ మధ్య ఒక తెర ఉండేది. (హెబ్రీ. 9:2-5; నిర్గ. 26:31-33) పవిత్ర స్థలంలో బంగారు దీపస్తంభం, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల ఉండేవి. తమకు అప్పగించిన పనులు చేయడానికి “అభిషిక్త యాజకులు” మాత్రమే పవిత్ర స్థలంలోకి వెళ్లాలి. (సంఖ్యా. 3:3, 7, 10) అతి పవిత్ర స్థలంలో దేవుని ప్రత్యక్షతకు సూచనగా ఉన్న ఒప్పంద మందసం ఉండేది. (నిర్గ. 25:21, 22) ఆ తెరను దాటి అతి పవిత్ర స్థలంలోకి ప్రధానయాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి అంటే, ప్రాయశ్చిత్త రోజున వెళ్లాలి. (లేవీ. 16:2, 17) ప్రతీ సంవత్సరం తన పాపాల కోసం, ఇశ్రాయేలీయుల పాపాల ప్రాయశ్చిత్తం కోసం ప్రధానయాజకుడు జంతు రక్తంతో లోపలికి వెళ్లేవాడు. కొంతకాలానికి, గుడారంలో ఉన్న ఇవన్నీ అసలు దేనికి సూచనగా ఉన్నాయో యెహోవా తన పవిత్రశక్తి ద్వారా తెలియజేశాడు.—హెబ్రీ. 9:6-8. e

13. క్రైస్తవ ఆరాధన విధానంలో గుడారంలోని పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలం వేటిని సూచిస్తున్నాయి?

13 క్రైస్తవ ఆరాధన విధానం. క్రీస్తు శిష్యుల్లో కొంతమంది, పవిత్రశక్తి ద్వారా అభిషేకించబడ్డారు. వాళ్లకు యెహోవాతో ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఈ 1,44,000 మంది యేసుతోపాటు పరలోకంలో యాజకులుగా సేవచేస్తారు. (ప్రక. 1:6; 14:1) గుడారంలోని పవిత్ర స్థలం 1,44,000 మంది భూమ్మీద ఉన్నప్పుడే దేవుని కుమారులుగా దత్తత తీసుకోబడడాన్ని సూచిస్తుంది. (రోమా. 8:15-17) అతి పవిత్ర స్థలం, యెహోవా నివసించే పరలోకాన్ని సూచిస్తుంది. పవిత్ర స్థలానికి, అతి పవిత్ర స్థలానికి మధ్య ఉండే “తెర,” యేసు మానవ శరీరాన్ని సూచిస్తుంది. ఆ “తెర,” గొప్ప ప్రధానయాజకుడిగా పరలోకానికి వెళ్లి ఆధ్యాత్మిక ఆలయంలో సేవ చేయకుండా యేసుకు అడ్డుగా ఉండేది. మనుషుల కోసం యేసు తన మానవ శరీరాన్ని బలివ్వడం ద్వారా అభిషిక్త క్రైస్తవులందరూ పరలోకం వెళ్లడానికి మార్గం తెరిచాడు. అభిషిక్త క్రైస్తవులు కూడా పరలోక బహుమానాన్ని పొందాలంటే తమ మానవ శరీరంతో చనిపోవాలి. (హెబ్రీ. 10:19, 20; 1 కొరిం. 15:50) యేసు పునరుత్థానమైన తర్వాత ఆధ్యాత్మిక ఆలయంలోని అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించాడు. చివరికి అభిషిక్త క్రైస్తవులు కూడా అక్కడికి వెళ్తారు.

14. హెబ్రీయులు 9:12, 24-26 ప్రకారం, యెహోవా ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటు ఎందుకు ఉన్నతమైంది?

14 విమోచన క్రయధనం అలాగే యేసుక్రీస్తు యాజకత్వం ఆధారంగా సత్యారాధన కోసం యెహోవా చేసిన ఏర్పాటు చాలా ఉన్నతమైందని స్పష్టంగా అర్థమౌతుంది. ఇశ్రాయేలీయుల ప్రధానయాజకుడు జంతు రక్తంతో మనుషులు చేసిన అతి పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టాడు. కానీ, యేసు యెహోవా ముందు కనబడడానికి, విశ్వంలోనే అత్యంత పవిత్ర స్థలమైన “పరలోకంలోనే అడుగుపెట్టాడు.” మన “పాపాన్ని తీసేయడానికి” ‘తనను తాను అర్పించుకొని’ మన తరఫున తన పరిపూర్ణ మానవ జీవితానికి ఉన్న విలువను యెహోవాకు ఇచ్చాడు. (హెబ్రీయులు 9:12, 24-26 చదవండి.) యేసు చేసిన త్యాగం తిరుగులేనిది. ఎందుకంటే, అది మన పాపాల్ని పూర్తిగా తుడిచేస్తుంది. అయితే, మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మనందరం యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆయన్ని ఆరాధించవచ్చు. దీనిగురించి ఇప్పుడు చూద్దాం.

ప్రాంగణాలు

15. గుడారపు ప్రాంగణంలో ఎవరు సేవ చేసేవాళ్లు?

15 ప్రాచీన యూదామత ఆరాధన విధానం. గుడారానికి ఒక ప్రాంగణం ఉంది. దాని చుట్టూ కంచె ఉండేది. యాజకులు చేయాల్సిన పనులు ఆ ప్రాంగణం లోపల చేసేవాళ్లు. దహనబలులు అర్పించడానికి రాగి రేకు తొడిగిన పెద్ద బలిపీఠం ఉండేది. దాంతోపాటు యాజకులు తమకు అప్పగించిన పనులు చేసే ముందు కాళ్లుచేతులు కడుక్కోవాలి. దాని కోసం నీళ్లున్న ఒక పెద్ద రాగి గంగాళం కూడా ఆ ప్రాంగణంలో ఉండేది. (నిర్గ. 30:17-20; 40:6-8) ఆ తర్వాత కట్టిన ఆలయాల్లో బయటి ప్రాంగణం కూడా ఉండేది. యాజకులు కానివాళ్లు అక్కడ నిలబడి దేవున్ని ఆరాధించేవాళ్లు.

16. ఆధ్యాత్మిక ఆలయంలోని ప్రాంగణాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ సేవచేస్తారు?

16 క్రైస్తవ ఆరాధన విధానం. పరలోకానికి వెళ్లి యేసుతోపాటు యాజకులుగా సేవచేయడానికి ముందు, భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవులు ఆధ్యాత్మిక ఆలయంలోని లోపలి ప్రాంగణంలో నమ్మకంగా సేవచేస్తారు. వాళ్లు నైతికంగా, ఆధ్యాత్మికంగా శుభ్రంగా ఉండాలని గుడారంలో, ఆ తర్వాత కట్టిన ఆలయాల్లో ఉన్న ఆ పెద్ద రాగి గంగాళం గుర్తుచేస్తుంది. నిజానికి, క్రైస్తవులందరూ అలా పవిత్రంగా ఉండాలి. మరి క్రీస్తు అభిషిక్త సహోదరులకు నమ్మకంగా మద్దతిస్తున్న “గొప్పసమూహం” ఎక్కడ ఆరాధిస్తారు? వాళ్లు “సింహాసనం ముందు” నిలబడడాన్ని అంటే, వాళ్లు దేవుని ఆధ్యాత్మిక ఆలయంలోని బయటి ప్రాంగణంలో “రాత్రింబగళ్లు ఆయనకు పవిత్రసేవ” చేయడం అపొస్తలుడైన యోహాను చూశాడు. (ప్రక. 7:9, 13-15) గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో యెహోవాను ఆరాధించే అవకాశం దొరికినందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!

యెహోవాను ఆరాధించే గొప్ప అవకాశం

17. మనం యెహోవాకు ఏ బలులు అర్పించవచ్చు?

17 మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని ఉపయోగించి యెహోవాను ఆరాధించే గొప్ప అవకాశం మనందరికీ ఉంది. హెబ్రీ క్రైస్తవులకు, అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు మనం “ఎల్లప్పుడూ దేవునికి స్తుతి బలిని అర్పిద్దాం, అంటే మన పెదాలతో దేవుని పేరును అందరికీ చాటుదాం.” (హెబ్రీ. 13:15) యెహోవా సేవలో మనం చేయగలిగినదంతా చేస్తున్నప్పుడు, ఆయన్ని ఆరాధించే అవకాశం దొరికినందుకు కృతజ్ఞత ఉందని చూపిస్తాం.

18. హెబ్రీయులు 10:22-25 ప్రకారం, మనం దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు? దేన్ని మర్చిపోకూడదు?

18 హెబ్రీయులు 10:22-25 చదవండి. హెబ్రీయులకు రాస్తున్న ఉత్తరం చివర్లో, పౌలు మన ఆరాధనలో నిర్లక్ష్యం చేయకూడని కొన్ని విషయాల గురించి చెప్తున్నాడు. అందులో, యెహోవాకు ప్రార్థించడం, మన నిరీక్షణ గురించి ఇతరులకు ప్రకటించడం, మీటింగ్స్‌కి వెళ్లడం, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ “ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా” అలా చేయడం చేరివున్నాయి. ప్రకటన గ్రంథం చివర్లో, ‘దేవుణ్ణే ఆరాధించండి!’ అని యెహోవా దూత చెప్పాడు. దాని ప్రాముఖ్యతను చెప్పడానికి దేవదూత ఆ మాటను రెండుసార్లు అన్నాడు. (ప్రక. 19:10; 22:9) యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయం గురించిన లోతైన సత్యాల్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఉందాం. అలాగే, మన గొప్ప దేవుడైన యెహోవాను ఆరాధించే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ సంతోషిద్దాం.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

a యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయం బైబిల్లో ఉన్న లోతైన సత్యాల్లో ఒకటి. ఇంతకీ ఆ ఆలయం ఏంటి? ఆ ఆలయం గురించి హెబ్రీయులు పుస్తకంలో ఉన్న వివరాలు ఈ ఆర్టికల్‌లో చూస్తాం. యెహోవాను ఆరాధించే అవకాశం దొరికినందుకు మీకున్న కృతజ్ఞతను ఈ ఆర్టికల్‌ ఇంకా పెంచుతుంది.

b బైబిల్లోని హెబ్రీయులు పుస్తకం గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి, jw.orgలో హెబ్రీయులకి పరిచయం వీడియోని చూడండి.

c క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో యేసు ప్రధానయాజకుడని హెబ్రీయులు పుస్తకంలో మాత్రమే ఉంది.

d ఒక రెఫరెన్స్‌ ప్రకారం, క్రీ.శ. 70లో యెరూషలేము దేవాలయం నాశనమయ్యే సమయానికి, ఇశ్రాయేలులో దాదాపు 84 మంది ప్రధానయాజకులు ఉండేవాళ్లు.

e ప్రాయశ్చిత్త రోజున ప్రధానయాజకుడు చేసే పనులు వేటిని సూచిస్తున్నాయో తెలుసుకోవడానికి jw.orgలో ఆలయ గుడారం అనే వీడియో చూడండి.