కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 1

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

భయం వేస్తే యెహోవా వైపు చూడండి

భయం వేస్తే యెహోవా వైపు చూడండి

2024 వార్షిక వచనం: “నాకు భయం వేసినప్పుడు, నేను నీ మీద నమ్మకం పెట్టుకుంటాను.”కీర్త. 56:3.

ముఖ్యాంశం

మన భయాల్ని పోగొట్టుకుని, యెహోవా మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చో గమనించండి.

1. మనం కొన్నిసార్లు ఎందుకు భయపడతాం?

 మనందరం ఏదోక సమయంలో భయపడే ఉంటాం. నిజమే మనం సత్యం నేర్చుకున్న తర్వాత చనిపోయినవాళ్లకు, చెడ్డదూతలకు, భవిష్యత్తుకు భయపడడం మానేశాం. కానీ, మనం ఇంకా కష్టమైన కాలంలోనే జీవిస్తున్నాం. కాబట్టి యుద్ధాలు, నేరాలు, జబ్బులు లాంటి “భయంకరమైన దృశ్యాలకు” కొన్నిసార్లు భయపడుతుంటాం. (లూకా 21:11) అంతేకాదు, సత్యారాధనను వ్యతిరేకించే ప్రభుత్వాలకు లేదా కుటుంబ సభ్యులకు కూడా మనం భయపడుతుండవచ్చు. ఇంకొంతమంది ప్రస్తుతం ఉన్న కష్టాన్నే తట్టుకోలేకపోతున్నాం, ఇక భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని ఎలా తట్టుకుంటాం అని ఆందోళన పడుతుండవచ్చు.

2. గాతులో ఉన్నప్పుడు దావీదు పరిస్థితి ఏంటో వివరించండి.

2 దావీదు కొన్నిసార్లు భయపడ్డాడు. ఉదాహరణకు, రాజైన సౌలు తనను చంపడానికి తరుముతున్నప్పుడు దావీదు ఫిలిష్తీయుల నగరమైన గాతుకు పారిపోయాడు. గాతు రాజైన ఆకీషు, దావీదు ఒక పెద్ద యోధుడని విన్నాడు. అలాగే “పదివేలమంది శత్రువుల్ని చంపాడు” అనే పాట ఇతని గురించే పాడారని రాజుకు తెలుసు. దాంతో దావీదు “చాలా భయపడ్డాడు.” (1 సమూ. 21:10-12) ఆకీషు తనను ఏం చేస్తాడో అని ఆందోళనపడ్డాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు?

3. కీర్తన 56:1-3, 11 ప్రకారం, దావీదు తన భయాల్ని ఎలా పోగొట్టుకున్నాడు?

3 గాతులో ఉన్నప్పుడు దావీదు తన భయాలన్నిటిని 56వ కీర్తనలో రాశాడు. ఆయన తన భయాల గురించి చెప్పడమే కాదు, వాటిని ఎలా పోగొట్టుకున్నాడో కూడా రాశాడు. తనకు భయం వేసినప్పుడు దావీదు యెహోవా మీద నమ్మకం ఉంచాడు. (కీర్తన 56:1-3, 11 చదవండి.) ఆ నమ్మకం వమ్ముకాలేదు. యెహోవా సహాయంతో దావీదుకు ఒక తెలివైన ఐడియా వచ్చింది. ఆయన పిచ్చోడిలా నటించాడు! ఆకీషు అది చూసి దావీదు నిజంగానే పిచ్చోడనుకొని చంపకుండా వదిలేశాడు. దాంతో దావీదు అక్కడి నుండి తప్పించుకున్నాడు.—1 సమూ. 21:13–22:1.

4. యెహోవా మీద నమ్మకాన్ని మనం ఎలా పెంచుకోవచ్చో ఉదాహరణతో చెప్పండి.

4 మనం కూడా యెహోవా మీద నమ్మకం ఉంచడం వల్ల, మనకున్న భయాల్ని పోగొట్టుకోవచ్చు. అయితే, మనకు భయమేసినప్పుడు యెహోవా మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు? ఈ ఉదాహరణ పరిశీలించండి: మీకు ఒక జబ్బు ఉందని తెలిసినప్పుడు మొదట్లో చాలా భయమేస్తుంది. కానీ డాక్టర్‌ మీద నమ్మకం ఉంచినప్పుడు ఆ భయాలన్నీ పోతాయి. బహుశా ఆ డాక్టర్‌కి ఇంతకుముందే ఇలాంటి జబ్బును నయం చేశాడనే మంచి పేరు ఉన్నప్పుడు, మీరు చెప్పేదంతా శ్రద్ధగా విని, మీ మనసులో ఉన్నదంతా ఆయన అర్థం చేసుకున్నప్పుడు, ఆ జబ్బుకు మంచి వైద్యాన్ని చెప్పినప్పుడు మీకున్న భయాలన్నీ పోతాయి. అదేవిధంగా, యెహోవా గతంలో ఏం చేశాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఆలోచించినప్పుడు ఆయన మీద మనకున్న నమ్మకం పెరుగుతుంది. దావీదు అదే చేశాడు. 56వ కీర్తనలో ఆయన రాసిన మాటల్ని పరిశీలిస్తున్నప్పుడు, మీరు కూడా యెహోవా మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చో, మీకున్న భయాల్ని ఎలా తీసేసుకోవచ్చో ఆలోచించండి.

యెహోవా గతంలో ఏం చేశాడు?

5. తన భయాల్ని పోగొట్టుకోవడానికి దావీదు వేటిగురించి ఆలోచించాడు? (కీర్తన 56:12, 13)

5 దావీదు ప్రాణం ఇంకా ప్రమాదంలో ఉన్నప్పుడే, యెహోవా తనకు అప్పటికే ఏమేం చేశాడో ఆలోచించాడు. (కీర్తన 56:12, 13 చదవండి.) అలా ఆలోచించడం దావీదుకు కొత్తేమీ కాదు. ఆయన జీవితంలో చాలాసార్లు అలా ఆలోచించాడు. ఉదాహరణకు, ఆయన యెహోవా సృష్టి గురించి ధ్యానించాడు. ఆ సృష్టిలో యెహోవాకున్న శక్తిని, మనుషుల మీద ఆయనకున్న ప్రేమను దావీదు చూశాడు. (కీర్త. 65:6-9) యెహోవా ఇతరుల కోసం ఏమేం చేశాడో దావీదు ఆలోచించాడు. (కీర్త. 31:19; 37:25, 26) అన్నిటికన్నా ముఖ్యంగా, తన కోసం యెహోవా ఏమేం చేశాడో కూడా దావీదు ధ్యానించాడు. పసితనం నుండే యెహోవా దావీదును కాపాడాడు, ఆయనవైపు నిలబడ్డాడు. (కీర్త. 22:9, 10) ఇవన్నీ ఆలోచించడం వల్ల దావీదుకు యెహోవా మీద ఎంత నమ్మకం పెరిగి ఉంటుందో కదా!

యెహోవా తనకు ఇప్పటికే ఏంచేశాడు, ఏంచేస్తున్నాడు, భవిష్యత్తులో ఏంచేస్తాడు అని దావీదు ఆలోచించి, ఆయన మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు (5, 8, 12 పేరాలు చూడండి) d


6. మనకు భయమేసినప్పుడు, యెహోవా మీద నమ్మకం ఉంచడానికి ఏది సహాయం చేస్తుంది?

6 మీకు భయమేసినప్పుడు ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా ఇప్పటికే ఏమేం చేశాడు?’ ఆయన సృష్టి గురించి ఆలోచించండి. ఉదాహరణకు యెహోవా పక్షుల్ని, పువ్వుల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నాడో “గమనించండి.” వాటిని ఆయన తన స్వరూపంలో చేయకపోయినా, అవి తనను ఆరాధించకపోయినా ఆయన వాటిని శ్రద్ధగా చూసుకుంటున్నాడు. దీన్నిబట్టి ఆయన మనల్ని ఇంకా ఎక్కువ శ్రద్ధగా చూసుకుంటాడనే నమ్మకం కలుగుతుంది. (మత్త. 6:25-32) అలాగే యెహోవా తన ఆరాధకుల్ని గతంలో ఎలా చూసుకున్నాడో ఆలోచించండి. బహుశా మీరు బైబిల్లో అసాధారణమైన విశ్వాసం చూపించినవాళ్ల గురించి అధ్యయనం చేయవచ్చు లేదా మనకాలంలో ఉన్న ఎవరైనా ఒకరి ఉదాహరణను గానీ, అనుభవాన్ని గానీ చదవచ్చు. a అంతేకాదు, యెహోవా మీ కోసం ఇప్పటికే ఏమేం చేశాడో ఆలోచించండి. ఆయన మిమ్మల్ని సత్యం వైపుకు ఎలా ఆకర్షించాడు? (యోహా. 6:44) మీ ప్రార్థనలకు ఎలా జవాబిచ్చాడు? (1 యోహా. 5:14) తన కుమారుడు ఇచ్చిన బలి నుండి మీరు ప్రతీరోజు ఎలా ప్రయోజనం పొందుతున్నారు?—ఎఫె. 1:7; హెబ్రీ. 4:14-16.

యెహోవా మన జీవితంలో ఇప్పటికే ఏంచేశాడు, ఏంచేస్తున్నాడు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో ఆలోచించినప్పుడు ఆయన మీద నమ్మకాన్ని పెంచుకోగలుగుతాం (6, 9-10, 13-14 పేరాలు చూడండి) e


7. వెనిస్సా తన భయాన్ని పోగొట్టుకోవడానికి దానియేలు ప్రవక్త అనుభవం ఎలా సహాయం చేసింది?

7 హయిటీలో ఉండే వెనిస్సా b అనే సిస్టర్‌కి భయపడే ఒక పరిస్థితి వచ్చింది. ఆమె ఇంటిదగ్గర ఉండే ఒకతను ఆమెకు ప్రతీరోజు ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు చేస్తూ తనను ప్రేమించమని వేదించేవాడు. దానికి వెనిస్సా అస్సలు ఒప్పుకోలేదు. దాంతో అతను బాగా కోపం పెంచుకుని, ఆమెను బెదిరించేవాడు. వెనిస్సా ఇలా చెప్తుంది: “నాకు చాలా భయమేసింది.” మరి వెనిస్సా ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోగలిగింది? ఆమె తననుతాను కాపాడుకోవడానికి కొన్ని పనులు చేసింది. ముందుగా, సంఘపెద్దల సలహా మేరకు ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ తర్వాత, గతంలో తన సేవకుల్ని యెహోవా ఎలా కాపాడాడో ఆలోచించింది. వెనిస్సా ఇలా చెప్తుంది: “నాకు గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి దానియేలు ప్రవక్త. ఏ తప్పు చేయకపోయినా ఆయన్ని సింహాల గుహలో వేశారు. అప్పుడు యెహోవా ఆయన్ని కాపాడాడు. కాబట్టి నా పరిస్థితిని కూడా పూర్తిగా యెహోవా చేతిలో పెట్టాను. ఆ తర్వాత నాకు అస్సలు భయం అనిపించలేదు.”—దాని. 6:12-22.

యెహోవా ఇప్పుడు ఏం చేస్తున్నాడు?

8. దావీదు ఏ విషయాన్ని బలంగా నమ్మాడు? (కీర్తన 56:8)

8 గాతులో ఉన్నప్పుడు దావీదుకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురైనా ఆయన భయంలోనే ఉండిపోలేదు. బదులుగా, యెహోవా ఆ సమయంలో తనకు ఏమేం చేస్తున్నాడో దావీదు ఆలోచించాడు. యెహోవా తనను నడిపిస్తున్నాడని, కాపాడుతున్నాడని, తనకు ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకుంటున్నాడని దావీదు గుర్తించగలిగాడు. (కీర్తన 56:8 చదవండి.) అంతేకాదు, దావీదుకు యోనాతాను, ప్రధానయాజకుడైన అహీమెలెకు లాంటి మంచి స్నేహితులున్నారు. వాళ్లు ఆయన్ని ప్రోత్సహించి, ఆయనకు కావాల్సిన సహాయం చేశారు. (1 సమూ. 20:41, 42; 21:6, 8, 9) రాజైన సౌలు తనను చంపాలని తిరుగుతున్నా దావీదు తప్పించుకున్నాడు. తనకు వచ్చిన కష్టమే కాదు, ఆ కష్టం వల్ల తనకు ఎలా అనిపిస్తుందో కూడా యెహోవాకు తెలుసని దావీదు బలంగా నమ్మాడు.

9. యెహోవా ప్రతీ ఒక్కరిలో ఏం గమనిస్తాడు?

9 ఏదైనా కష్టం వల్ల మీరు భయపడుతుంటే యెహోవా మీ కష్టాన్ని చూస్తాడని, ఆ కష్టం వల్ల మీకు ఎలా అనిపిస్తుందో కూడా గమనిస్తాడని మర్చిపోకండి. ఉదాహరణకు, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పడిన కష్టాన్నే కాదు, ఆ కష్టం వల్ల “వాళ్లు పడుతున్న వేదన” కూడా యెహోవా గమనించాడు. (నిర్గ. 3:7) అలాగే తను పడే “బాధల్ని,” తనకు కలిగే ‘వేదనను’ యెహోవా చూస్తాడని దావీదు రాశాడు. (కీర్త. 31:7) అంతేకాదు, తన ప్రజలు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాల వల్ల బాధలు పడినప్పుడు కూడా యెహోవా “బాధ అనుభవించాడు.” (యెష. 63:9) కాబట్టి మీరెప్పుడైనా భయపడితే, మీకెలా అనిపిస్తుందో యెహోవా అర్థం చేసుకుంటాడు. అలాగే, మీ భయాల్ని పోగొట్టుకోవడానికి సహాయం చేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు.

10. యెహోవా మిమ్మల్ని శ్రద్ధగా చూసుకుంటున్నాడని, ఏ కష్టాన్నైనా తట్టుకోవడానికి సహాయం చేస్తాడని మీరెందుకు నమ్ముతున్నారు?

10 మిమ్మల్ని భయపెట్టే ఏదైనా కష్టం వచ్చినప్పుడు యెహోవా ఎలా మద్దతిస్తాడని మీకు అనిపించవచ్చు. అయితే, ఆయనిచ్చే మద్దతును చూసేలా సహాయం చేయమని అడగండి. (2 రాజు. 6:15-17) ఆ తర్వాత వీటి గురించి ఆలోచించండి: మీటింగ్‌లో ఎవరైనా ఇచ్చిన కామెంట్‌ గానీ, ఒక ప్రసంగం గానీ మీకు కొత్త బలాన్ని ఇచ్చిందా? ఏదైనా ప్రచురణ, ఒక వీడియో లేదా ఒక పాట మీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందా? ఎవరైనా లేఖనాలు ఉపయోగించి మీకు ధైర్యం చెప్పారా? లేదా ఏదైనా ఒక మంచి మాట చెప్పారా? బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనపై చూపించిన ప్రేమను, లేఖనాల నుండి మనకు దొరికిన ప్రోత్సాహాన్ని మనం త్వరగా మర్చిపోయే అవకాశం ఉంది. కానీ నిజానికి అవన్నీ యెహోవా మనకిచ్చిన వెలకట్టలేని బహుమతులు. (యెష. 65:13; మార్కు 10:29, 30) యెహోవా మనల్ని పట్టించుకుంటున్నాడని అవి రుజువు చేస్తున్నాయి. (యెష. 49:14-16) అంతేకాదు, మనం ఆయన్ని పూర్తిగా నమ్మవచ్చని అవి చూపిస్తున్నాయి.

11. ఐరా తన భయాల్ని ఎలా పోగొట్టుకోగలిగింది?

11 సెనెగల్‌లో ఉంటున్న ఐరా అనే సిస్టర్‌, తన కష్టంలో యెహోవా ఎలా చేయూతను ఇచ్చాడో గుర్తించింది. ఇంట్లో పెద్ద కూతురుగా తమను చూసుకోవాలని ఆమె అమ్మానాన్నలు ఆశించారు. కాబట్టి దానికి సరిపోయేంత డబ్బు సంపాదించాలని వాళ్లు చెప్పారు. కానీ ఐరా పయినీరు సేవ చేస్తూ చిన్నచిన్న ఉద్యోగాలు చేసేది. దాంతో ఆమె కుటుంబంలోని వాళ్లు ఆమె మీద మండిపడ్డారు, ఎగతాళి చేశారు. ఆమె ఇలా చెప్తుంది: “నేను మా అమ్మానాన్నల్ని చూసుకోలేనేమో, అందరు నన్ను తిడతారేమో అని భయపడ్డాను. అసలు ఈ పరిస్థితిని ఎందుకు అనుమతిస్తున్నాడని యెహోవాను కూడా నిందించాను.” ఆ తర్వాత ఆమె మీటింగ్‌లో ఒక ప్రసంగం వింది. దానిగురించి ఆమె ఇలా చెప్తుంది: “ఆరోజు ప్రసంగం ఇచ్చిన బ్రదర్‌ ఒక మాట చెప్పాడు. మన మనసుకు తగిలిన ప్రతీ గాయం యెహోవాకు తెలుసు. తర్వాత్తర్వాత, సంఘపెద్దలు అలాగే వేరేవాళ్లు ఇచ్చిన సలహాను బట్టి యెహోవా నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోగలిగాను. నేను ప్రార్థన చేసిన తర్వాత యెహోవా నాకు సహాయం చేస్తాడనే నమ్మకం ఇంకా పెరిగింది. అంతేకాదు, ఆయన వాటికి జవాబిచ్చినప్పుడు నా మనసంతా ప్రశాంతత నిండిపోయింది.” కొంతకాలానికి ఐరా పయినీరు సేవ చేస్తూనే తననుతాను పోషించుకోవడానికి అలాగే తన అమ్మానాన్నల్ని చూసుకోవడానికి సరిపడా డబ్బులు వచ్చే ఉద్యోగం సంపాదించింది. అంతేకాదు, ఇప్పుడు ఆమె వేరేవాళ్లకు ఇచ్చే స్థితిలో కూడా ఉంది. ఆమె ఇలా చెప్తుంది: “నేను యెహోవాను పూర్తిగా నమ్మడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత నా భయాలన్నీ పటాపంచలు అయిపోతాయి.”

యెహోవా భవిష్యత్తులో ఏం చేస్తాడు?

12. కీర్తన 56:9 ప్రకారం, దావీదు ఏ నమ్మకంతో ఉన్నాడు?

12 కీర్తన 56:9 చదవండి. దావీదు తన భయాల్ని పోగొట్టుకున్న ఇంకో విధానం గురించి ఈ వచనం చెప్తుంది. ఆయన ప్రాణం ఇంకా ప్రమాదంలో ఉన్నప్పుడే, యెహోవా తనకోసం భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా దావీదు ఆలోచించాడు. ఇశ్రాయేలీయులకు తర్వాతి రాజుగా యెహోవా దావీదును ఎంచుకున్నాడు కాబట్టి, సమయం వచ్చినప్పుడు యెహోవా తనను కాపాడతాడని దావీదుకి తెలుసు. (1 సమూ. 16:1, 13) కాబట్టి యెహోవా ఏదైనా మాటిస్తే, ఆరు నూరైనా నూరు ఆరైనా నిలబెట్టుకుంటాడని దావీదు నమ్మాడు.

13. యెహోవా మీద మనకు ఏ నమ్మకం ఉంది?

13 యెహోవా మీకోసం ఏం చేస్తానని మాటిచ్చాడు? మనకు ఏ సమస్య రాకుండా యెహోవా మన చుట్టూ ఒక కంచె వేయాలని ఆశించం. c కానీ ఇప్పుడు మనకు వచ్చే ఏ కష్టాన్నైనా, కొత్తలోకంలో యెహోవా పూర్తిగా తీసేస్తాడు. (యెష. 25:7-9) చనిపోయినవాళ్లను బ్రతికించే, మన మనసులో ఉన్న బాధల్ని తీసేసే, శత్రువుల్ని మట్టుపెట్టే శక్తి మన సృష్టికర్తకు ఖచ్చితంగా ఉంది.—1 యోహా. 4:4.

14. మనం దేని గురించి ధ్యానించవచ్చు?

14 మీకు భయమేసినప్పుడు యెహోవా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఆలోచించండి. సాతాను నామరూపాల్లేకుండా పోయినప్పుడు, చెడ్డ ప్రజల స్థానంలో నీతిమంతులు వచ్చినప్పుడు, ఒక్కోరోజు గడిచేకొద్దీ మనం పరిపూర్ణతకు దగ్గరౌతున్నప్పుడు జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి! మన నిరీక్షణ గురించి ఎలా ధ్యానించవచ్చో చూపించడానికి 2014 ప్రాదేశిక సమావేశంలో ఒక చక్కని డెమో వచ్చింది. అందులో ఒక తండ్రి, 2 తిమోతి 3:1-5 వచనాలు కొత్తలోకం గురించి చెప్తే ఎలా ఉంటుందో తన కుటుంబానికి చదివి వినిపించాడు. ఆయన ఇలా చదివాడు: “కొత్తలోకంలో సంతోషకరమైన కాలాలు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: ఇతరుల్ని ప్రేమించేవాళ్లు, సత్యాన్ని ప్రేమించేవాళ్లు, అణకువ గలవాళ్లు, వినయం గలవాళ్లు, దేవుణ్ణి మహిమపర్చేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడేవాళ్లు, కృతజ్ఞత చూపించేవాళ్లు, విశ్వసనీయులు, మమకారం ఉన్నవాళ్లు, ఇతరులతో సమ్మతించేవాళ్లు, ఇతరుల గురించి ఎప్పుడూ మంచే మాట్లాడేవాళ్లు, ఆత్మనిగ్రహం చూపించేవాళ్లు, సౌమ్యులు, మంచిని ప్రేమించేవాళ్లు, నమ్మకస్థులు, లోబడడానికి సిద్ధంగా ఉండేవాళ్లు, తమనుతాము తగ్గించుకునేవాళ్లు, సుఖాల్ని కాకుండా దేవుణ్ణి ప్రేమించేవాళ్లు, నిజమైన భక్తి చూపించేవాళ్లు. అలాంటివాళ్లను నువ్వు అంటిపెట్టుకొని ఉండు.” మీరు కొత్తలోకంలో జీవితం గురించి మీ కుటుంబంతో లేదా బ్రదర్స్‌-సిస్టర్స్‌తో మాట్లాడుతుంటారా?

15. తాన్య భయపడినా, తన భయాల్ని పోగొట్టుకోవడానికి ఏం చేసింది?

15 ఉత్తర మాసిదోనియలో ఉంటున్న తాన్య అనే సిస్టర్‌ అనుభవాన్ని గమనించండి. ఆమె భవిష్యత్తులో పొందబోయే దీవెనల గురించి ఆలోచిస్తూ తనకున్న భయాల్ని పోగొట్టుకుంది. ఆమె సత్యం నేర్చుకుంటున్నందుకు వాళ్ల అమ్మానాన్నలు చాలా వ్యతిరేకించేవాళ్లు. ఆమె ఇలా చెప్తుంది: “నేను వేటి గురించైతే భయపడ్డానో అవి జరిగాయి. నేను మీటింగ్‌కు వెళ్లొచ్చిన ప్రతీసారి మా అమ్మ నన్ను కొట్టేది. నేను ఒకవేళ యెహోవాసాక్షినైతే నన్ను చంపేస్తానని కూడా మా అమ్మానాన్న బెదిరించారు.” చివరికి తాన్యాను ఇంట్లో నుండి వెళ్లగొట్టారు. అప్పుడు తాన్య ఏం చేసింది? ఆమె ఇలా చెప్తుంది: “నేను నా యథార్థతను ఇప్పుడు కాపాడుకున్నందుకు, భవిష్యత్తులో శాశ్వతకాలం ఎంత సంతోషంగా ఉంటానో ఆలోచించాను. అంతేకాదు, ఇప్పుడు నేను కోల్పోయిన వాటిని కొత్తలోకంలో యెహోవా ఎలా తిరిగి ఇస్తాడో ఊహించుకునేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన విషయాలేమీ కొత్తలోకంలో గుర్తుండవని ఆలోచించేదాన్ని.” తాన్య తన యథార్థతను కాపాడుకుంది. అంతేకాదు, యెహోవా సహాయంతో ఆమె ఉండడానికి ఒక ఇల్లు దొరికింది. ప్రస్తుతం తాన్య యెహోవాను నమ్మకంగా సేవచేస్తున్న ఒక బ్రదర్‌ని పెళ్లిచేసుకుంది. వాళ్లిద్దరు కలిసి సంతోషంగా పూర్తికాల సేవ చేస్తున్నారు.

యెహోవా మీద మీ నమ్మకాన్ని పెంచుకోండి

16. లూకా 21:26-28 లోని సంఘటనల్ని జరగడం చూస్తున్నప్పుడు మనం ధైర్యంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

16 మహాశ్రమ వచ్చినప్పుడు లోకంలోని ప్రజలు భయం వల్ల “సొమ్మసిల్లుతారు.” కానీ యెహోవా ప్రజలు స్థిరంగా, ధైర్యంగా ఉంటారు. (లూకా 21:26-28 చదవండి.) మనం ఎందుకు భయపడం? ఎందుకంటే మనం యెహోవా మీద నమ్మకముంచడం అప్పటికే నేర్చుకుని ఉంటాం. ముందు పేరాలో చెప్పిన తాన్య, గతంలో తనకు ఎదురైన అనుభవాల్ని బట్టి కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేంత ధైర్యం వచ్చిందని చెప్పింది. ఆమె ఇలా అంటుంది: “మనం ఏ పరిస్థితినైనా తట్టుకునేంత శక్తిని యెహోవా ఇవ్వగలడు. అలాగే ఆయన మనల్ని దీవిస్తాడు. అంతేకాదు, కొన్నిసార్లు పరిస్థితులన్నీ తమ గుప్పిట్లో ఉన్నాయని కొంతమంది అనుకోవచ్చు. కానీ యెహోవా ఎంత అనుమతిస్తే అంతమాత్రమే వాళ్లు చేయగలుగుతారు. అలాగే మన కష్టం ఎంత పెద్దదైనా సరే దానికొక ముగింపు ఉంటుంది.”

17. 2024 వార్షిక వచనం మనకెలా సహాయం చేస్తుంది? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

17 ఈరోజుల్లో మనల్ని భయపెట్టే చాలా విషయాలున్నాయి. కానీ మనం భయం గుప్పిట్లోనే ఉండిపోకుండా దావీదులాగే బయటపడవచ్చు. 2024 వార్షిక వచనం, దావీదు యెహోవాకు చేసిన ప్రార్థనలోని మాటలు. ఆయనిలా అన్నాడు: “నాకు భయం వేసినప్పుడు, నేను నీ మీద నమ్మకం పెట్టుకుంటాను.” (కీర్త. 56:3) ఒక బైబిలు రిఫరెన్స్‌ ఈ వచనం గురించి ఇలా చెప్తుంది: “దావీదు తన భయాన్ని పెంచి పోషించలేదు. అలాగని తన సమస్యల గురించే ఆలోచిస్తూ కూర్చోలేదు. కానీ తనను విడిపించే వ్యక్తి వైపు చూశాడు.” కాబట్టి రాబోయే నెలల్లో మన వార్షిక వచనం గురించి ఆలోచించండి. ముఖ్యంగా భయపెట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు దీని గురించి ఇంకా ఎక్కువ ఆలోచించండి. యెహోవా గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో చేసిన పనుల గురించి ఆలోచించడానికి సమయం తీసుకోండి. ఆ తర్వాత దావీదులాగే మీరూ ఇలా అనగలుగుతారు: “నేను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను, నేను భయపడను.”—కీర్త. 56:4.

ఒక విపత్తు జరిగినప్పుడు వార్షిక వచనం గురించి ఆలోచిస్తున్న ఒక సిస్టర్‌ (17వ పేరా చూడండి)

వీటి గురించి ఆలోచిస్తూ మీ భయాల్ని ఎలా పోగొట్టుకోవచ్చు?

  • యెహోవా గతంలో ఏం చేశాడు?

  • ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?

  • భవిష్యత్తులో ఏం చేస్తాడు?

పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి

a jw.orgలో “వెతుకు” అనే బాక్సులో, “వాళ్లలా విశ్వాసం చూపించండి” అని, లేదా “అనుభవాలు” అని టైప్‌ చేస్తే విశ్వాసాన్ని బలపర్చే ఎంతో సమాచారం దొరుకుతుంది. JW లైబ్రరీ యాప్‌లో ఉన్న ఆర్టికల్‌ సిరీస్‌లోని “వాళ్లలా విశ్వాసం చూపించండి” లేదా “యెహోవాసాక్షుల జీవిత కథలు” చూడండి.

b కొన్ని పేర్లను మార్చాం.

d చిత్రం వివరణ: ఎలుగుబంటిని చంపడానికి యెహోవా ఎలా శక్తిని ఇచ్చాడో, తనకు అవసరమైన సహాయాన్ని అహీమెలెకు ద్వారా ఎలా ఇచ్చాడో, తనను ఎలా రాజుగా చేస్తాడో దావీదు ఆలోచించాడు.

e చిత్రం వివరణ: సిగరెట్‌ మానేయడానికి యెహోవా తనకు ఎలా సహాయం చేశాడో, ఇష్టమైనవాళ్లు రాసిన ఉత్తరాల నుండి తనకు ఎలా ప్రోత్సాహాన్ని ఇచ్చాడో, భవిష్యత్తులో శాశ్వత జీవితాన్ని ఎలా ఇస్తాడో జైల్లో ఉన్న ఒక బ్రదర్‌ ఆలోచిస్తున్నాడు.