కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు స్త్రీలను యెహోవాలాగే చూస్తున్నారా?

మీరు స్త్రీలను యెహోవాలాగే చూస్తున్నారా?

నమ్మకమైన ఎంతోమంది స్త్రీలతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం మనందరికి ఉంది. నమ్మకంగా, కష్టపడి పనిచేసే అలాంటి సిస్టర్స్‌ అంటే మనకెంతో ఇష్టం. వాళ్లను మెచ్చుకోకుండా ఉండలేం! a కాబట్టి బ్రదర్స్‌, వాళ్లను చిన్నచూపు చూడకుండా దయగా, గౌరవపూర్వకంగా ఉండాలి. కానీ అపరిపూర్ణత వల్ల కొంతమందికి అలా ఉండడం కష్టం కావచ్చు. ఇంకొంతమందికి అపరిపూర్ణతే కాకుండా ఇంకొకటి కూడా అడ్డుపడుతుంది.

మగ వాళ్లకంటే ఆడవాళ్లు తక్కువ అనే సంస్కృతిలో కొంతమంది పెరిగి ఉంటారు. ఉదాహరణకు, బొలీవియాలో ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవ చేస్తున్న హాన్స్‌ ఇలా చెప్తున్నాడు: “కొంతమంది పురుషులు మాచో వాతావరణంలో పెరిగారు. కాబట్టి ఆడవాళ్ల కన్నా మగవాళ్లే ఎక్కువ అనే ఆలోచన వాళ్ల నరనరాల్లో ఉండిపోయింది.” b తైవాన్‌లో ఉన్న ఒక సంఘపెద్ద షాన్‌షూన్‌ ఇలా చెప్తున్నాడు: “నేను ఉండే ప్రాంతంలో ఆడవాళ్లు మగవాళ్ల పనుల్లో తలదూర్చకూడదనే అభిప్రాయం ఉంది. ఒకవేళ ఒకవ్యక్తి ఆడవాళ్ల అభిప్రాయం తీసుకుంటే, అతని తోటివాళ్లు అతన్ని చేతకానివాడిలా చూసేవాళ్లు.” ఇంకొంతమంది పురుషులు వేరే విధాలుగా కూడా ఆడవాళ్లను చిన్నచూపు చూస్తారు. ఉదాహరణకు, వాళ్లు ఆడవాళ్లను కించపరిచే జోకులు వేస్తారు.

సంతోషకరమైన విషయమేమిటంటే, ఒక పురుషుడు ఏ సంస్కృతిలో పెరిగినా, ఆడవాళ్ల కన్నా మగవాళ్లే ఎక్కువ అనే ఆలోచనను తీసేసుకోవచ్చు. (ఎఫె. 4:22-24) దానికోసం అతను యెహోవాను ఆదర్శంగా తీసుకోవచ్చు. యెహోవా స్త్రీలను ఎలా చూస్తున్నాడో, బ్రదర్స్‌ యెహోవాలా స్త్రీలను ఎలా చూడాలో, సిస్టర్స్‌ని గౌరవించే విషయంలో సంఘపెద్దలు ఎలా ముందు ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

యెహోవా స్త్రీలను ఎలా చూస్తున్నాడు?

స్త్రీలను ఎలా చూడాలో యెహోవా నుండి నేర్చుకోవచ్చు. ఒక ప్రేమగల తండ్రిగా తన పిల్లలందర్నీ యెహోవా ప్రేమిస్తాడు. (యోహా. 3:16) అంతేకాదు, నమ్మకమైన సిస్టర్స్‌ యెహోవాకు అపురూపమైన కూతుళ్ల లాంటివాళ్లు. స్త్రీలను ఆయన ఏయే విధాలుగా గౌరవిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.

ఆయన వాళ్లతో నిష్పక్షపాతంగా ఉన్నాడు. యెహోవా పురుషుల్ని అలాగే స్త్రీలను కూడా తన స్వరూపంలో చేశాడు. (ఆది. 1:27) ఆయన ఆడవాళ్లకంటే మగవాళ్లకు ఎక్కువ తెలివితేటల్ని ఇవ్వలేదు. అలాగే ఆడవాళ్లకన్నా మగవాళ్లకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. (2 దిన. 19:7) అంతేకాదు, బైబిలు సత్యాల్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, తన లక్షణాల్ని చూపించగలిగే సామర్థ్యాన్ని ఆడవాళ్లకు మగవాళ్లకు సమానంగా ఇచ్చాడు. వాళ్లు చూపించే విశ్వాసాన్నిబట్టి ఆడవాళ్లకు మగవాళ్లకు ఒకేలాంటి నిరీక్షణను ఇచ్చాడు. అంటే, వాళ్లు భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ కావచ్చు లేదా పరలోకంలో రాజులుగా, యాజకులుగా సేవచేసే నిరీక్షణ కావచ్చు. (2 పేతు. 1:1) దీన్నిబట్టి యెహోవా ఆడవాళ్లను నిష్పక్షపాతంగా చూస్తున్నాడని అర్థమౌతుంది.

ఆయన వాళ్లు చెప్పేది వింటాడు. ఆడవాళ్ల ఫీలింగ్స్‌ని అలాగే వాళ్ల సమస్యల్ని యెహోవా పట్టించుకుంటాడు. ఉదాహరణకు, ఆయన రాహేలు అలాగే హన్నా చేసిన ప్రార్థనల్ని విన్నాడు, వాటికి జవాబిచ్చాడు. (ఆది. 30:22; 1 సమూ. 1:10, 11, 19, 20) అంతేకాదు, స్త్రీల మాట విన్న పురుషుల గురించి కూడా ఆయన బైబిల్లో రాయించాడు. ఉదాహరణకు, అబ్రాహాము యెహోవా నిర్దేశం ప్రకారం తన భార్య శారా మాట విన్నాడు. (ఆది. 21:12-14) దావీదు రాజు అబీగయీలు మాట విన్నాడు. నిజానికి, తనతో మాట్లాడడానికి యెహోవాయే ఆమెను పంపించాడని దావీదుకు అనిపించింది. (1 సమూ. 25:32-35) యెహోవా లక్షణాల్ని అచ్చుగుద్దినట్టు చూపించిన యేసు తన తల్లియైన మరియ మాట విన్నాడు. (యోహా. 2:3-10) ఈ ఉదాహరణలన్నీ యెహోవా ఆడవాళ్లు చెప్పేది విని, వాళ్లను గౌరవిస్తాడని చూపిస్తున్నాయి.

ఆయన వాళ్లను నమ్ముతాడు. ఉదాహరణకు, యెహోవా భూమంతటినీ చూసుకునే బాధ్యతను హవ్వకు కూడా అప్పగించాడు. (ఆది. 1:28) అలా చేయడం వల్ల, ఆదాము కన్నా హవ్వ తక్కువ కాదని యెహోవా చూపించాడు. అలాగే ఆదాముకు ఆమె చేదోడువాదోడుగా ఉంటుందని నమ్మాడు. అంతేకాదు, యెహోవా ప్రవక్త్రీలైన దెబోరాను, హుల్దాను నమ్మాడు. తన ప్రజలకు ఆఖరికి ఒక న్యాయాధిపతికి, ఒక రాజుకు కూడా సలహా ఇవ్వడానికి ఆయన వాళ్లను ఉపయోగించుకున్నాడు. (న్యాయా. 4:4-9; 2 రాజు. 22:14-20) ఈరోజుల్లో యెహోవా తన పనిని చేయడానికి సిస్టర్స్‌ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ నమ్మకమైన సహోదరీలు ప్రచారకులుగా, పయినీర్లుగా, మిషనరీలుగా సేవచేస్తున్నారు. వాళ్లు నిర్మాణ పనిలో సహాయం చేస్తున్నారు. అలాగే రాజ్యమందిరాలు, బ్రాంచి కార్యాలయాలు మరమ్మతు చేయడానికి సహాయం చేస్తున్నారు. వాళ్లలో కొంతమంది బెతెల్‌లో సేవచేస్తున్నారు. ఇంకొంతమంది అనువాద కార్యాలయాల్లో సేవచేస్తున్నారు. తన ఇష్టాన్ని నెరవేర్చడానికి యెహోవా ఈ సిస్టర్స్‌ అందర్నీ ఒక పెద్ద సైన్యంగా ఉపయోగిస్తున్నాడు. (కీర్త. 68:11) వీటన్నిటినిబట్టి యెహోవా ఆడవాళ్లను బలహీనులుగా లేదా అసమర్థులుగా చూడట్లేదని అర్థమౌతుంది.

స్త్రీలను యెహోవాలా చూడడం బ్రదర్స్‌ ఎలా నేర్చుకోవచ్చు?

బ్రదర్స్‌, మనం సిస్టర్స్‌ని యెహోవాలా చూస్తున్నామో లేదో తెలుసుకోవడానికి మన ఆలోచనల్ని, పనుల్ని నిజాయితీగా పరిశీలించుకోవాలి. దానికోసం మనకు వేరేవాళ్ల సహాయం అవసరం. ఒక వ్యక్తి గుండె ఆరోగ్యంగా ఉందో లేదో స్కానింగ్‌ మిషన్‌ బయట పెట్టినట్టే, ఆడవాళ్లను చిన్నచూపు చూసేలాంటి ఆలోచనలు మన హృదయంలో గూడుకట్టుకున్నాయో లేదో ఒక మంచి స్నేహితుడు గానీ, దేవుని వాక్యం గానీ బయట పెట్టవచ్చు. ఆ సహాయాన్ని తీసుకోవాలంటే మనమేం చేయాలి?

ఒక మంచి స్నేహితుణ్ణి అడగండి. (సామె. 18:17) దయగా, నిజాయితీగా చెప్తాడు అనిపించే ఒక నమ్మకస్థుడైన స్నేహితుణ్ణి ఇలా అడగండి: “నేను సిస్టర్స్‌తో ఎలా ఉంటున్నాను అని నీకు అనిపిస్తుంది? నేను వాళ్లను గౌరవిస్తున్నాను అని సిస్టర్స్‌కి అనిపిస్తుందా? వాళ్లతో వ్యవహరించే విషయంలో ఇంకేమైనా మార్పులు చేసుకోవాలా?” ఒకవేళ మీ స్నేహితుడు ఏవైనా మార్పులు చేసుకోవాలని చెప్తే, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. బదులుగా, అవసరమైన మార్పులు చేసుకోవడానికి చూడండి.

దేవుని వాక్యాన్ని చదవండి. సిస్టర్స్‌తో వ్యవహరించే విషయంలో మన ఆలోచన ఏంటో, మన పనులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక మంచి పద్ధతి బైబిల్ని ఉపయోగించడమే. (హెబ్రీ. 4:12) బైబిల్ని చదువుతున్నప్పుడు ఆడవాళ్లతో చక్కగా వ్యవహరించిన వాళ్ల గురించి, అలాగే వ్యవహరించని వాళ్ల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత, వాళ్లు చేసిన పనుల్ని మనం చేసే పనులతో పోల్చి చూసుకోవచ్చు. అంతేకాకుండా, బైబిలు లేఖనాల్ని ఒకదానితో ఒకటి పోల్చి చూసినప్పుడు, ఆడవాళ్ల విషయంలో మనకున్న తప్పుడు అభిప్రాయాన్ని సమర్థించుకునేలా లేఖనాల్ని ఉపయోగించకుండా ఉంటాం. ఉదాహరణకు, 1 పేతురు 3:7 లో భార్య “సున్నితమైన పాత్ర” అని చెప్తుంది. c అంటే, ఆడవాళ్లు మగవాళ్లకంటే తక్కువని, వాళ్లకంత తెలివితేటలు లేవని దానర్థమా? ఎంతమాత్రం కాదు! ఇక్కడ పేతురు చెప్పిన మాటల్ని గలతీయులు 3:26-29 లేఖనంతో పోల్చి చూడవచ్చు. ఆ లేఖనంలో యేసుతోపాటు సహపరిపాలకులుగా ఉండడానికి, యెహోవా పురుషుల్నే కాదు స్త్రీలను కూడా ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి, ఒక మంచి స్నేహితుని సలహా తీసుకున్నప్పుడు ఆడవాళ్లతో చక్కగా వ్యవహరించగలుగుతాం, వాళ్లను గౌరవించగలుగుతాం.

సంఘపెద్దలు సిస్టర్స్‌ని ఎలా గౌరవించవచ్చు?

సిస్టర్స్‌ని గౌరవించే విషయంలో సంఘంలో ఉన్న బ్రదర్స్‌ ప్రేమగల సంఘపెద్దల్ని చూసి నేర్చుకోవచ్చు. సంఘపెద్దలు సిస్టర్స్‌ని గౌరవించే విషయంలో ఎలా ముందుంటారో కొన్ని మార్గాల్ని ఇప్పుడు చూడండి.

వాళ్లు సిస్టర్స్‌ని మెచ్చుకుంటారు. సంఘపెద్దలకు ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు చక్కని ఆదర్శం. ఆయన రోములో ఉన్న సంఘానికి ఉత్తరం రాసినప్పుడు చాలామంది సిస్టర్స్‌ని మెచ్చుకున్నాడు. (రోమా. 16:12) పౌలు రాసిన ఆ ఉత్తరం సంఘంలో చదువుతున్నప్పుడు తమ పేర్లు విని ఆ సిస్టర్స్‌ ఎంత సంతోషించి ఉంటారో కదా! అదేవిధంగా, సిస్టర్స్‌కి ఉన్న మంచి లక్షణాల్ని బట్టి, యెహోవా సేవలో వాళ్లు చేస్తున్న పనినిబట్టి సంఘపెద్దలు వాళ్లను మెచ్చుకుంటారు. దానివల్ల సంఘంలోనివాళ్లు తమను గౌరవిస్తున్నారని, తాము కూడా సంఘంలో విలువైనవాళ్లమని సిస్టర్స్‌కి అనిపిస్తుంది. సిస్టర్స్‌ యెహోవా సేవలో నమ్మకంగా ముందుకెళ్లాలనే కోరికకు సంఘపెద్దలు చెప్పే ఆ మాటలే ఆయువును పోస్తాయి.—సామె. 15:23.

మెచ్చుకోండి

సంఘపెద్దలు సిస్టర్స్‌ చేసిన పనుల్ని ప్రత్యేకంగా చెప్తూ, నిజాయితీగా మెచ్చుకుంటారు. ఎందుకు? జెస్సికా అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “బ్రదర్స్‌ మమ్మల్ని ‘మంచి పని చేశారు’ అని మెచ్చుకున్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. కానీ మీ పిల్లల్ని అల్లరిచేయకుండా మీటింగ్‌లో కూర్చోబెట్టారని, లేదా మీరు బైబిలు విద్యార్థిని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని, అలా ఏదైనా ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పి మెచ్చుకున్నప్పుడు అది మాకు బాగా నచ్చుతుంది, గుర్తుండిపోతుంది.” సంఘపెద్దలు అలా మెచ్చుకున్నప్పుడు సిస్టర్స్‌ చాలా విలువైనవాళ్లని, సంఘానికి వాళ్లు చాలా అవసరమని చూపించిన వాళ్లవుతారు.

వాళ్లు సిస్టర్స్‌ చెప్పేది వింటారు. తమ దగ్గరే మంచిమంచి ఐడియాలు ఉంటాయని వినయంగల సంఘపెద్దలు అనుకోరు. కాబట్టి అలాంటి సంఘపెద్దలు సిస్టర్స్‌ సలహా కూడా అడుగుతారు. వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వింటారు. అలా చేసినప్పుడు సంఘపెద్దలు సిస్టర్స్‌ని ప్రోత్సహించినట్లు అవుతుంది. వాళ్లనుండి ప్రయోజనం పొందినట్టు ఉంటుంది. ఎలా? బెతెల్‌లో సేవచేస్తున్న జెరార్డో అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “నేను నా పనిని ఇంకా బాగా చేయడానికి సిస్టర్స్‌ని కూడా సలహా అడుగుతుంటాను. ఎందుకంటే, వేరే బ్రదర్స్‌తో పోలిస్తే ఆ పనిలో ఎక్కువకాలం నుండి ఉన్నది సిస్టర్లే.” సంఘంలో చాలామంది సిస్టర్స్‌ పయినీర్లుగా సేవచేస్తారు కాబట్టి స్థానికంగా ఉన్న ప్రజల గురించి వాళ్లకు బాగా తెలుస్తుంది. బ్రయాన్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “మన సంస్థకు అవసరమయ్యే ఎన్నో లక్షణాలు, నైపుణ్యాలు సిస్టర్స్‌ దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ల సహాయం తీసుకోండి.”

వినండి

తెలివైన సంఘపెద్దలు సిస్టర్స్‌ ఇచ్చే సలహాల్ని వెంటనే కొట్టిపారేయరు. ఎందుకు? ఎడ్వర్డ్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “ఒక సిస్టర్‌ చెప్పిన అభిప్రాయం, విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, వేరేవాళ్ల పరిస్థితిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.” (సామె. 1:5) ఒకవేళ ఒక సిస్టర్‌ ఇచ్చిన సలహాను ఒక సంఘపెద్ద పాటించకపోయినా, ఆమె తనకు తెలిసిన విషయాల్ని, తన అభిప్రాయాల్ని చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పవచ్చు.

వాళ్లు సిస్టర్స్‌కి శిక్షణ ఇస్తారు. తెలివైన సంఘపెద్దలు సిస్టర్స్‌కి శిక్షణ ఇచ్చే అవకాశాల కోసం చూస్తారు. ఉదాహరణకు, బాప్తిస్మం తీసుకున్న సహోదరుడు అందుబాటులో లేనప్పుడు క్షేత్రసేవ కూటాల్ని చేయడానికి సిస్టర్స్‌కి శిక్షణ ఇవ్వచ్చు. అంతేకాదు, రాజ్యమందిరాల్ని అలాగే బ్రాంచి కార్యాలయాల్ని నిర్మించడం, మరమ్మతులు చేయడం లాంటి పనుల్లో పనిముట్లను లేదా మిషిన్లను ఎలా వాడాలో వాళ్లు శిక్షణ ఇవ్వచ్చు. బెతెల్‌లో సిస్టర్స్‌ వేర్వేరు నియామకాలు చేసేలా పెద్దలు శిక్షణ ఇస్తారు. అందులో మేయింటనెన్స్‌, పర్చేసింగ్‌, అకౌటింగ్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ మొదలైనవి ఉన్నాయి. సంఘపెద్దలు సిస్టర్స్‌కి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్లను నమ్మకస్థులుగా, ఏ పనైనా చేయగల సమర్థులుగా చూస్తారు.

శిక్షణ ఇవ్వండి

చాలామంది సిస్టర్స్‌ సంఘపెద్దలు తమకిచ్చిన శిక్షణను వేరేవాళ్ల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నిర్మాణ పనిలో శిక్షణ పొందిన సిస్టర్స్‌ ప్రకృతి విపత్తుల వల్ల ఇళ్లను కోల్పోయినవాళ్లు తిరిగి కట్టుకునేలా సహాయం చేస్తారు. బహిరంగ సాక్ష్యం ఎలా చేయాలో శిక్షణ పొందిన ఎంతోమంది సిస్టర్స్‌, ఆ పనిని వేరేవాళ్లు చేసేలా శిక్షణ ఇస్తారు. తమకు శిక్షణ ఇచ్చిన సంఘపెద్దల గురించి సిస్టర్స్‌ ఏమనుకుంటున్నారు? జెన్నిఫర్‌ అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నేను ఒక రాజ్యమందిర నిర్మాణ ప్రాజెక్టులో పని చేసినప్పుడు, ఒక సంఘపెద్ద సమయం తీసుకుని నాకు శిక్షణ ఇచ్చాడు. ఆయన నేను చేస్తున్న పనిని గమనించి, దాన్నిబట్టి నన్ను మెచ్చుకున్నాడు. ఆయనతో పనిచేయడమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు విలువిస్తాడు, నన్ను నమ్ముతాడు.”

సంఘంలో ఉన్న స్త్రీలను మన సొంత అక్కాచెల్లెళ్లలా చూస్తే వచ్చే ప్రయోజనాలు

నమ్మకమైన సిస్టర్స్‌ని యెహోవా ఇష్టపడినట్లే మనమూ ఇష్టపడతాం. కాబట్టి వాళ్లను కుటుంబ సభ్యులుగా చూస్తాం. (1 తిమో. 5:1, 2) వాళ్లతో కలిసి పనిచేయడం మనకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్లను చూసి మనం చాలా గర్వపడుతున్నాం. మనం వాళ్లమీద చూపించే ప్రేమను, మద్దతును వాళ్లు గుర్తించడమే మనకు పదివేలు! వెనిస్సా అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “నాలో ఉత్సాహాన్ని నింపే సహోదరులతో ఉన్న ఈ సంస్థలో భాగంగా ఉన్నందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని.” తైవాన్‌లో ఉంటున్న సిస్టర్‌ ఇలా చెప్తుంది: “ఆడవాళ్లకు, వాళ్ల ఫీలింగ్స్‌కి విలువిస్తున్న యెహోవాకు, ఆయన సంస్థకు నేనెంతో రుణపడివున్నాను. ఇది నా విశ్వాసాన్ని చాలా బలపరుస్తుంది. యెహోవా సంస్థలో ఒకరిగా ఉండే అవకాశాన్ని నేను ఇంకా విలువైనదిగా చూస్తున్నాను.”

నమ్మకమైన పురుషులు, స్త్రీలను తనలాగే చూసినప్పుడు, తనలాగే గౌరవించినప్పుడు యెహోవా చాలా సంతోషిస్తాడు. (సామె. 27:11) స్కాట్‌లాండ్‌లో ఉంటున్న బెంజిమెన్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “ఈ లోకంలో ఆడవాళ్లను చాలా చిన్నచూపు చూస్తారు. కానీ రాజ్యమందిరంలోకి అడుగుపెట్టిన ప్రతీ స్త్రీ లోకానికి, మనకూ ఉన్న తేడాను స్పష్టంగా చూడగలగాలి.” కాబట్టి మన ప్రియమైన సిస్టర్స్‌కి ఇవ్వాల్సిన ప్రేమ, గౌరవం ఇస్తూ, యెహోవాను అనుకరించడానికి చేయగలిగినదంతా చేద్దాం.—రోమా. 12:10.

a ఈ ఆర్టికల్‌లో “సిస్టర్స్‌” అంటే సంఘంలో ఉన్న సిస్టర్సే గానీ సొంత అక్కాచెల్లెళ్లు కాదు.

b “మాచో” అనే పదం పురుష అహంకారాన్ని చూపించే పురుషుల్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ఈ సంస్కృతిలో పెరిగినవాళ్లు తరచూ ఆడవాళ్లను లోకువ చేస్తూ, మగవాళ్లే గొప్ప అనుకుంటారు.

c “సున్నితమైన పాత్ర” అనే పదం గురించి మరింత తెలుసుకోవడానికి 2006, మే 15 కావలికోట పత్రికలోని “‘బలహీన ఘటానికి’ ఉన్న విలువ” అలాగే 2005, మార్చి 1 కావలికోట పత్రికలోని “వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం” అనే ఆర్టికల్స్‌ చూడండి.