కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 5

పాట 27 దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం

“నిన్ను ఎన్నడూ వదిలేయను”!

“నిన్ను ఎన్నడూ వదిలేయను”!

“దేవుడే ఇలా అన్నాడు: ‘నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.’”హెబ్రీ. 13:5బి.

ముఖ్యాంశం

మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి వెళ్లిపోయినప్పుడు, ఈ భూమ్మీదున్న దేవుని సేవకుల్ని యెహోవా వదిలేయడు అని ఈ ఆర్టికల్‌ భరోసా ఇస్తుంది.

1. భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులందరూ ఎప్పుడు పరలోకానికి వెళ్తారు?

 కొన్నేళ్ల క్రితం దేవుని ప్రజలు, ‘అభిషిక్త క్రైస్తవుల్లోని చివరి వ్యక్తి ఎప్పుడు పరలోకానికి వెళ్తాడా?’ అని ఆలోచించారు. అలాగే అభిషిక్త క్రైస్తవుల్లో కొంతమంది, హార్‌మెగిద్దోన్‌ యుద్ధం తర్వాత భూపరదైసు మీద కొంతకాలం ఉంటారేమో అని ఒకప్పుడు అనుకున్నాం. కానీ భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులందరూ హార్‌మెగిద్దోన్‌ కన్నా ముందే పరలోకానికి వెళ్లిపోతారని 2013, జూలై 15 కావలికోట సంచిక స్పష్టం చేసింది.—మత్త. 24:31.

2. మనకు ఏ ప్రశ్న రావచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 మరి, “మహాశ్రమ” సమయంలో యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న “వేరే గొర్రెల” సంగతేంటి? అనే ప్రశ్న కొంతమందికి రావచ్చు. (యోహా. 10:16; మత్త. 24:21) అభిషిక్త క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత తాము ఒంటరైపోతామని, తమను నడిపించేవాళ్లు ఎవరూ ఉండరని మరికొంతమంది అనుకుంటారు. వాళ్లకు అలా ఎందుకు అనిపిస్తుందో చెప్పే రెండు బైబిలు వృత్తాంతాల్ని ఇప్పుడు చూద్దాం. అలాగే, మనం ఎందుకు ఆందోళనపడాల్సిన అవసరం లేదో చూద్దాం.

వేరేగొర్రెలకు ఏం జరగదు?

3-4. కొంతమంది ఏమనుకుంటారు? ఎందుకు?

3 అభిషిక్త క్రైస్తవులైన పరిపాలక సభ సభ్యులు మనల్ని నడిపించడానికి లేకపోతే, చాలామంది సత్యం వదిలేసి వెళ్లిపోతారు అని కొంతమంది అనుకుంటారు. బహుశా, బైబిల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు తెచ్చుకుని వాళ్లు అలా భయపడతారు. అలాంటి రెండు సంఘటనల్ని ఇప్పుడు చూద్దాం. మొదటిది యెహోయాషుది. ఆయన్ని చిన్నప్పుడే ప్రధానయాజకుడైన యెహోయాదా, ఆయన భార్య యెహోషబతు దాచిపెట్టి కాపాడారు. యెహోయాదా దేవున్ని నమ్మకంగా సేవ చేసే వ్యక్తి. అందుకే యెహోయాషును ఒక రాజుగా, దేవుని సేవకునిగా, మంచి పనులు చేసేలా పెంచాడు. యెహోయాదా ఉన్నంతకాలం యెహోయాషు మంచిగా ఉన్నాడు. కానీ యెహోయాదా చనిపోయిన తర్వాత, యెహోయాషు తోటి రాజుల మాట విని యెహోవాను ఆరాధించడం మానేసి, చెడిపోయాడు.—2 దిన. 24:2, 15-19.

4 మరో సంఘటన, రెండో శతాబ్దంలో ఉన్న క్రైస్తవులది. యేసు శిష్యుల్లో చివరి వ్యక్తి అపొస్తలుడైన యోహాను. ఆయన బ్రతికున్నంతకాలం సంఘంలోని క్రైస్తవులందరూ యెహోవాను నమ్మకంగా ఆరాధించేలా సహాయం చేశాడు. (3 యోహా. 4) యేసు అలాగే ఇతర శిష్యుల్లాగే యోహాను కూడా సంఘంలో మతభ్రష్టత్వం పెరగకుండా అడ్డుగోడలా నిలిచాడు. (1 యోహా. 2:18; 2 థెస్స. 2:7.) కానీ ఆయన చనిపోయిన తర్వాత, సంఘంలో మతభ్రష్టత్వం కార్చిచ్చులా వ్యాపించింది. ఎంతోకాలం గడవకముందే, మతభ్రష్టత్వం సంఘంలో విపరీతంగా పాకిపోయింది.

5. ఈ రెండు సంఘటనలు ఏం సూచించడం లేదు?

5 అయితే, అభిషిక్తులు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత వేరేగొర్రెలకు కూడా అలాగే జరుగుతుందని ఆ రెండు సంఘటనలు సూచిస్తున్నాయా? అంటే యెహోయాషు, రెండో శతాబ్దంలోని చాలామంది క్రైస్తవుల్లాగే నమ్మకమైన క్రైస్తవులు కూడా సత్యాన్ని వదిలేస్తారా? అస్సలు అలా జరగదు! అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత కూడా వేరేగొర్రెలు యెహోవాను సరైన విధంగా ఆరాధిస్తూనే ఉంటారు. ఆయన వాళ్లను అప్పుడు కూడా శ్రద్ధగా చూసుకుంటాడు. అలాగని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

స్వచ్ఛారాధన కలుషితం అవ్వదు

6. మనం ఏ మూడు కాలాల గురించి ఇప్పుడు చూస్తాం?

6 రానున్న రోజుల్లో పరిస్థితులు కష్టంగా మారినా, స్వచ్ఛారాధన కలుషితం అవ్వదని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు? ఎందుకంటే మనం జీవిస్తున్న కాలం ప్రాచీన ఇశ్రాయేలీయుల, రెండో శతాబ్దంలో జీవించిన క్రైస్తవుల కాలానికి చాలా వేరుగా ఉందని బైబిలు వివరిస్తుంది. ఇప్పుడు ఆ మూడు కాలాల గురించి మనం మరింత ఎక్కువ తెలుసుకుంటాం. ఆ మూడు కాలాలు ఏంటంటే: (1) ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలం, (2) అపొస్తలులు చనిపోయిన తర్వాతి కాలం, (3) మన కాలం, అంటే “అన్నిటినీ పునరుద్ధరించే” కాలం.—అపొ. 3:21.

7. రాజులు, ప్రజలు చెడుగా ప్రవర్తించినా నమ్మకమైన ఇశ్రాయేలీయులు మాత్రం ఎందుకు ధైర్యంగా ఉన్నారు?

7 ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలం. మోషే చనిపోవడానికి కాస్త ముందు ఇశ్రాయేలీయులతో ఇలా ఉన్నాడు: “నేను చనిపోయాక మీరు ఖచ్చితంగా చాలా చెడుగా ప్రవర్తిస్తారు, నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి పక్కకుమళ్లుతారు.” (ద్వితీ. 31:29) అలాగే ఇశ్రాయేలీయులు యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేశం నుండి వెళ్లగొట్టబడతారు అని కూడా మోషే హెచ్చరించాడు. (ద్వితీ. 28:35, 36) మరి ఆ మాటలు నిజమయ్యాయా? అయ్యాయి. కొన్ని శతాబ్దాల తర్వాత చాలామంది ఇశ్రాయేలు రాజులు చెడుగా ప్రవర్తించి, ప్రజలు అబద్ధారాధన చేసేలా నడిపించారు. దాంతో యెహోవాకు కోపం వచ్చి ఆ చెడ్డ ప్రజల్ని శిక్షించి, ఇకమీదట ఆ చెడ్డ రాజులు పరిపాలించకుండా చేశాడు. (యెహె. 21:25-27) కానీ కొంతమంది నమ్మకమైన ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పింది నిజమవ్వడం చూసి ధైర్యంగా ఉన్నారు.—యెష. 55:10, 11.

8. రెండో శతాబ్దంలో స్వచ్ఛారాధన కలుషితం అవ్వడం చూసి మనం ఆశ్చర్యపోవాలా? వివరించండి.

8 అపొస్తలులు చనిపోయిన తర్వాతి కాలం. రెండో శతాబ్దంలో స్వచ్ఛారాధన కలుషితం అవ్వడం చూసి మనం ఆశ్చర్యపోవాలా? అస్సలు లేదు. ఎందుకంటే, మతభ్రష్టత్వం మొదలౌతుందని యేసు ముందే చెప్పాడు. (మత్త. 7:21-23; 13:24-30, 36-43) యేసు చెప్పిన ఆ ప్రవచనం తమ కాలంలో మొదలైందని అపొస్తలుడైన పౌలు, పేతురు, యోహాను స్పష్టం చేశారు. (2 థెస్స. 2:3, 7; 2 పేతు. 2:1; 1 యోహా. 2:18) రెండో శతాబ్దంలో ఆ మతభ్రష్టత్వం వ్యాపించి అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోనులో ఒక ముఖ్యమైన భాగమైంది. అలా ఆ ప్రవచనం నెరవేరింది.

9. మనం జీవించే కాలం ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలానికి, అపొస్తలులు చనిపోయిన తర్వాతి కాలానికి ఎలా వేరుగా ఉంది?

9 “అన్నిటినీ పునరుద్ధరించే” కాలం. మనం జీవించే కాలం ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలానికి, అపొస్తలులు చనిపోయిన తర్వాతి కాలానికి చాలా వేరుగా ఉంది. మనం జీవించే కాలాన్ని ఏమని అంటాం? సాధారణంగా ఈ వ్యవస్థకు “చివరి రోజులు” అని అంటాం. (2 తిమో. 3:1) అయితే, ఈ చివరి రోజుల్లో మొదలైన ఇంకో కాలం గురించి కూడా బైబిలు మాట్లాడుతుంది. అది, మెస్సీయ రాజ్యం మనుష్యుల్ని పరిపూర్ణ స్థితికి తీసుకొచ్చే వరకు, అలాగే భూమినంతా పరదైసుగా మార్చే వరకు కొనసాగుతుంది. ఈ కాలాన్ని “అన్నిటినీ పునరుద్ధరించే” కాలం అని అంటాం. (అపొ. 3:21) ఇది 1914 లో మొదలైంది. ఏయే విషయాలు పునరుద్ధరించబడ్డాయి? యేసు పరలోకంలో రాజయ్యాడు. అలా యెహోవాకు ప్రతినిధిగా దావీదు వంశం నుండి మళ్లీ ఒకవ్యక్తి రాజయ్యాడు. అయితే, ఇదొక్కటే కాదు స్వచ్ఛారాధన కూడా పునరుద్ధరించబడింది. (యెష. 2:2-4; యెహె. 11:17-20) మరి, అది మళ్లీ ఎప్పుడైనా కలుషితమౌతుందా?

10. (ఎ) మనకాలంలోని స్వచ్ఛారాధన గురించి బైబిలు ముందే ఏం చెప్పింది? (యెషయా 54:17) (బి) ఆ ప్రవచనాలు మనకు ఎలా భరోసా ఇస్తున్నాయి?

10 యెషయా 54:17 చదవండి. “నీకు విరోధంగా రూపొందించబడిన ఆయుధమైనా అస్సలు వర్ధిల్లదు” అనే ఆ ప్రవచనం గురించి ఆలోచించండి. ఆ ప్రేరేపిత మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ వచనంలోని ఊరటనిచ్చే తర్వాతి మాటలు కూడా మన కాలానికి వర్తిస్తాయి. అక్కడ ఇలా ఉంది: “నీ పిల్లలందరూ యెహోవా చేత బోధించబడతారు, నీ పిల్లలకు ఎంతో శాంతి ఉంటుంది. నీతి వల్ల నువ్వు దృఢంగా స్థాపించబడతావు. . . . నువ్వు దేనికీ భయపడవు, ఏదీ నిన్ను భయపెట్టలేదు, ఎందుకంటే అది నీ దగ్గరికి కూడా రాదు.” (యెష. 54:13, 14) యెహోవా గురించి మాట్లాడకుండా, “ఈ లోక దేవుడైన” సాతాను కూడా దేవుని ప్రజల నోరు నొక్కేయలేడు! (2 కొరిం. 4:4) స్వచ్ఛారాధన పునరుద్ధరించబడింది, అది మళ్లీ ఎప్పుడూ కలుషితమవ్వదు, శాశ్వతంగా ఉంటుంది. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు!

వేరేగొర్రెలకు ఏం జరుగుతుంది?

11. అభిషిక్తులు పరలోకానికి వెళ్లిపోయినప్పుడు గొప్పసమూహం వాళ్లు ఒంటరైపోరని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

11 అభిషిక్తులందరూ పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? యేసు మన కాపరి అని, క్రైస్తవ సంఘానికి శిరస్సు అని గుర్తుంచుకోండి. “క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు” అని యేసు స్పష్టంగా చెప్పాడు. (మత్త. 23:10) పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్న మన రాజు మనల్ని ఎప్పుడూ వదిలేయడు. మన నాయకుడైన క్రీస్తే మనల్ని నడిపిస్తుంటే, ఇక మనకెందుకు భయం! నిజమే క్రీస్తు ఆ సమయంలో మనల్ని ఎలా నడిపిస్తాడో ప్రతీ వివరం మనకు తెలీదు. కాబట్టి మనకు భరోసానిచ్చే కొన్ని బైబిలు ఉదాహరణల్ని ఇప్పుడు చూద్దాం.

12. (ఎ) మోషే చనిపోయాక (బి) ఏలీయాకు వేరే నియామకం ఇచ్చాక, యెహోవా తన ప్రజల్ని ఎలా పట్టించుకున్నాడు? (చిత్రం కూడా చూడండి.)

12 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి వెళ్లడానికి ముందే మోషే చనిపోయాడు. అప్పుడు దేవుని ప్రజలకు ఏమైంది? ఆ నమ్మకమైన వ్యక్తి చనిపోయిన తర్వాత యెహోవా తన ప్రజలకు సహాయం చేయడం ఆపేశాడా? లేదు! వాళ్లు తనకు నమ్మకంగా ఉన్నంతకాలం యెహోవా వాళ్ల చేయి పట్టుకునే ఉన్నాడు. మోషే చనిపోవడానికి ముందే ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోషువను నియమించమని యెహోవా చెప్పాడు. దానికన్నా కొన్ని దశాబ్దాల ముందు నుండే మోషే యెహోషువకు శిక్షణనిస్తూ వచ్చాడు. (నిర్గ. 33:11; ద్వితీ. 34:9) దానికితోడు తెలివి, అనుభవం ఉన్న సమర్థులైన పురుషులు “వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద” ప్రధానులుగా కూడా ఉండేవాళ్లు. (ద్వితీ. 1:15) అలా వాళ్లు దేవుని ప్రజల్ని బాగా చూసుకున్నారు. అలాంటి ఇంకో ఉదాహరణే ఏలీయాది. ఆయన ఇశ్రాయేలులో కొన్ని దశాబ్దాలుగా స్వచ్ఛారాధనను ముందుండి నడిపించాడు. కానీ ఒక సందర్భంలో యెహోవా తన నియామకాన్ని దక్షిణ యూదాకు మార్చాడు. (2 రాజు. 2:1; 2 దిన. 21:12) మరి ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యంలో ఉన్న నమ్మకమైన ఇశ్రాయేలీయులు ఒంటరివాళ్లు అయిపోయారా? లేదు. ఏలీయా కొన్ని సంవత్సరాలుగా ఎలీషాకు శిక్షణ ఇస్తూ వచ్చాడు. దాంతోపాటు శిక్షణ పొందిన “ప్రవక్తల కుమారులు” కూడా ఉన్నారు. (2 రాజు. 2:7) అలా ఈ నమ్మకమైన పురుషుల్ని ఉపయోగించి యెహోవా తన ప్రజల్ని నడిపించాడు. ఆ విధంగా యెహోవా ఇష్టం నెరవేరింది. అలాగే ఆయన తన ప్రజల మీద శ్రద్ధ చూపించాడు.

మోషే (ఎడమవైపు చిత్రం) అలాగే ఏలీయా (కుడివైపు చిత్రం) ఇద్దరూ తమ తర్వాతి నాయకులకు శిక్షణ ఇచ్చారు (12వ పేరా చూడండి)


13. హెబ్రీయులు 13:5బి మనకు ఏ భరోసా ఇస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

13 ఇప్పుడు చూసిన ఉదాహరణల్ని మనసులో ఉంచుకుని, అభిషిక్త క్రైస్తవుల్లోని చివరి వ్యక్తి పరలోకానికి వెళ్లాక ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? దానిగురించి మనం కంగారుపడాల్సిన అవసరంలేదు. బైబిలు భరోసాను ఇచ్చే ఈ సత్యాన్ని చెప్తుంది: యెహోవా భూమ్మీదున్న తన ప్రజల్ని ఎప్పుడూ వదిలేయడు. (హెబ్రీయులు 13:5బి చదవండి.) మోషే, ఏలీయాలాగే ఈ భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపు వేరేగొర్రెల్లోని ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటుంది. పరిపాలక సభ కొన్ని దశాబ్దాలుగా వేరేగొర్రెల్లోని పురుషులకు శిక్షణ ఇస్తూ వస్తుంది. ఉదాహరణకు పెద్దల కోసం, ప్రయాణ పర్యవేక్షకుల కోసం, బ్రాంచి కమిటీ సభ్యుల కోసం, బెతెల్‌లో ఉన్న పర్యవేక్షకుల కోసం, మరితరుల కోసం చాలా పాఠశాలల్ని ఏర్పాటు చేసింది. స్వయంగా పరిపాలక సభ కొంతమంది సహాయకుల్ని కూడా ఏర్పాటుచేసి, వాళ్లకు శిక్షణ ఇస్తుంది. ప్రస్తుతం ఆ సహాయకులు సంస్థలో ఎన్నో బాధ్యతల్ని నమ్మకంగా చూసుకుంటున్నారు. వీళ్లందరూ క్రీస్తు గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి బాగా సిద్ధపడి ఉన్నారు.

పరిపాలక సభ తమ సహాయకులకు శిక్షణ ఇవ్వడానికి ఎంతో కృషిచేస్తున్నారు. అలాగే పెద్దలకు, ప్రాంతీయ పర్యవేక్షకులకు, బ్రాంచి కమిటీ సభ్యులకు, బెతెల్‌లో ఉన్న పర్యవేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిషనరీలకు శిక్షణ ఇచ్చే పాఠశాలల్ని ఏర్పాటు చేస్తున్నారు (13వ పేరా చూడండి)


14. మనం చర్చించుకున్న సారాంశం ఏంటి?

14 మనం చర్చించుకున్న సారాంశం ఏంటంటే: మహాశ్రమ చివర్లో, అభిషిక్త క్రైస్తవుల్లోని చివరి వ్యక్తి పరలోకానికి తీసుకెళ్లబడిన తర్వాత కూడా భూమ్మీద స్వచ్ఛారాధన కొనసాగుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు తన నాయకత్వంలో ఉన్న దేవుని ప్రజలకు ఆధ్యాత్మికంగా ఏలోటూ లేకుండా చూసుకుంటాడు. నిజమే, ఆ సమయానికి మాగోగు వాడైన గోగు అని బైబిలు పిలిచే దేశాల గుంపు మనపై దాడి చేస్తుంటుంది. (యెహె. 38:18-20) కానీ ఆ దాడి కొంతకాలమే ఉంటుంది. అలాగే యెహోవాను ఆరాధించకుండా దేవుని ప్రజల్ని ఆ దాడి అస్సలు అడ్డుకోలేదు. చివరికి అది ఒక విఫలయత్నంగానే మిగిలిపోతుంది! యెహోవా తన ప్రజల్ని తప్పకుండా కాపాడతాడు. అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో క్రీస్తు వేరేగొర్రెలు ఉన్న “ఒక గొప్పసమూహం” చూశాడు. “వీళ్లు మహాశ్రమను దాటి వచ్చేవాళ్లు” అని దేవదూత యోహానుకు చెప్పాడు. (ప్రక. 7:9, 14) అవును, యెహోవా తన ప్రజల్ని సురక్షితంగా ఉంచుతాడు!

15-16. ప్రకటన 17:14 ప్రకారం, అభిషిక్త క్రైస్తవులు హార్‌మెగిద్దోన్‌ యుద్ధం సమయంలో ఏం చేస్తారు? అది మనకు ఎందుకు ప్రోత్సాహంగా ఉంది?

15 అయితే, కొంతమంది ఇలా అనుకోవచ్చు: ‘మరి అభిషిక్తుల సంగతేంటి? పరలోకానికి వెళ్లిన తర్వాత వాళ్లు ఏం చేస్తారు?’ బైబిలు దానికి సూటైన జవాబిస్తుంది. ఈ భూమ్మీదున్న ప్రభుత్వాలు “గొర్రెపిల్లతో యుద్ధం” చేస్తాయి. కానీ వాళ్లు చిత్తుచిత్తుగా ఓడిపోతారు. ఎందుకంటే మనం ఇలా చదువుతాం: “గొర్రెపిల్ల . . . వాళ్లను జయిస్తాడు.” మరి గొర్రెపిల్లకు ఎవరు సహాయం చేస్తారు? ఆ వచనంలోనే జవాబు ఉంది. “దేవుడు పిలిచినవాళ్లు, దేవుడు ఎంచుకున్నవాళ్లు, దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్లు” యేసుతోపాటు ఉంటారు. (ప్రకటన 17:14 చదవండి.) ఎవరు వీళ్లు? అవును, పునరుత్థానమైన అభిషిక్త క్రైస్తవులే! కాబట్టి మహాశ్రమ చివర్లో, అభిషిక్త క్రైస్తవుల్లోని చివరి వ్యక్తి పరలోకానికి వెళ్లిన తర్వాత వాళ్లకున్న మొట్టమొదటి నియామకం, యుద్ధం చేయడమే. ఎంత ఆసక్తికరమైన నియామకం కదా! కొంతమంది అభిషిక్త క్రైస్తవులు యెహోవాసాక్షులు అవ్వకముందు గొడవలకు కాలుదువ్వేవాళ్లు. ఇంకొంతమందైతే మిలిటరీలో కూడా పనిచేశారు. కానీ వాళ్లు నిజక్రైస్తవులైన తర్వాత శాంతి మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టారు. (గల. 5:22; 2 థెస్స. 3:16) ఇక వాళ్లు యుద్ధాలకు, గొడవలకు స్వస్తి చెప్పారు. కానీ, వాళ్లు పరలోకానికి వెళ్లిన తర్వాత క్రీస్తు, అతని పవిత్ర దూతలున్న సైన్యంలో చేరి దేవుని శత్రువులతో చివరి యుద్ధాన్ని చేస్తారు.

16 ఒక్కసారి ఆలోచించండి! భూమ్మీదున్నప్పుడు కొంతమంది అభిషిక్త క్రైస్తవులు ముసలివాళ్లుగా, బలహీనంగా ఉన్నారు. కానీ పరలోకానికి పునరుత్థానమైన తర్వాత వాళ్లు శక్తివంతమైన, అమర్త్యమైన పరలోక ప్రాణులు అవుతారు. యోధుడు, రాజు అయిన యేసుక్రీస్తుతో కలిసి పోరాడతారు. వాళ్లు హార్‌మెగిద్దోన్‌ యుద్ధం ముగిశాక, మనుషుల్ని పరిపూర్ణత వైపుకు నడిపించడానికి యేసుతో కలిసి పనిచేస్తారు. అపరిపూర్ణ మనుషులుగా వాళ్లు చేసిన దానికన్నా, పరలోకానికి వెళ్లాక భూమ్మీదున్న తమ బ్రదర్స్‌-సిస్టర్స్‌కి ఇంకా వెయ్యిరెట్లు ఎక్కువ సహాయం చేస్తారు అనడం అతిశయోక్తి కాదు!

17. హార్‌మెగిద్దోన్‌ యుద్ధమప్పుడు దేవుని ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని ఎలా చెప్పవచ్చు?

17 మీరు వేరేగొర్రెల్లో ఒకరా? అయితే హార్‌మెగిద్దోన్‌ యుద్ధం మొదలైనప్పుడు మీరేం చేయాలి? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే: యెహోవా మీద నమ్మకముంచి, ఆయన నిర్దేశాల్ని పాటించడం! అంటే ఏంటి? బైబిలు ఓదార్పునిచ్చే ఈ మాటలు చెప్తుంది: “నా ప్రజలారా, వెళ్లండి, లోపలి గదుల్లోకి ప్రవేశించి తలుపులు వేసుకోండి. దేవుని కోపం దాటివెళ్లే వరకు కాసేపు దాక్కోండి.” (యెష. 26:20) పరలోకంలో అలాగే భూమ్మీద దేవుని నమ్మకమైన సేవకులందరూ ఆ సమయంలో సురక్షితంగా ఉంటారు. “ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా . . . దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేవని” అపొస్తలుడైన పౌలులాగే మనమూ నమ్ముతాం. (రోమా. 8:38, 39) కాబట్టి యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయడని గుర్తుంచుకోండి!

అభిషిక్త క్రైస్తవుల్లోని చివరి వ్యక్తి పరలోకానికి వెళ్లిన తర్వాత

  • ఏం జరగదు?

  • స్వచ్ఛారాధన కలుషితం అవ్వదని ఎందుకు చెప్పవచ్చు?

  • యెహోవా తన ప్రజల్ని సంరక్షిస్తాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?

పాట 8 యెహోవా మనకు ఆశ్రయం