కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 7

పాట 51 దేవునికి సమర్పించుకున్నాం!

నాజీరుల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

నాజీరుల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

“అతను నాజీరుగా ఉన్నన్ని రోజులు యెహోవాకు పవిత్రుడిగా ఉంటాడు.”సంఖ్యా. 6:8.

ముఖ్యాంశం

యెహోవా సేవలో త్యాగాలు చేయడానికి, ధైర్యం చూపించడానికి నాజీరులను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చో చూస్తాం.

1. బైబిలు కాలాల్లోని దేవుని సేవకులు ఎలాంటి స్ఫూర్తిని చూపించారు?

 యెహోవాను మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారా? దాంట్లో అనుమానమే లేదు! అయితే, మీరొక్కరే కాదు బైబిలు కాలాల్లోని ఎంతోమంది అలా ప్రేమించారు. (కీర్త. 104:33, 34) యెహోవా సేవ చేయడానికి వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్లలో ఒకరు ప్రాచీన ఇశ్రాయేలులోని నాజీరులు. ఇంతకీ వాళ్లెవరు? వాళ్ల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

2. (ఎ) నాజీరులు అంటే ఎవరు? (సంఖ్యాకాండం 6:1, 2) (బి) ఇశ్రాయేలీయుల్లో కొంతమంది నాజీరులుగా ఎందుకు ఉండాలనుకున్నారు?

2 “నాజీరు” అంటే హీబ్రూలో “వేరుచేయబడిన వ్యక్తి; సమర్పించబడిన వ్యక్తి; ప్రత్యేకించబడిన వ్యక్తి” అని అర్థం. యెహోవాకు ప్రత్యేకమైన విధానంలో సేవచేయడానికి ఉత్సాహవంతమైన ఇశ్రాయేలీయులు చేసే త్యాగాలకు ఈ పదం సరిగ్గా సరిపోతుంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక పురుషుడు గానీ స్త్రీ గానీ యెహోవాకు కొంతకాలం నాజీరుగా సేవ చేస్తానని ప్రత్యేక మొక్కుబడి చేసుకునే అవకాశం ఉంది. a (సంఖ్యాకాండం 6:1, 2 చదవండి.) ఆ మొక్కుబడి లేదా ప్రమాణం చేసుకున్నవాళ్లు మిగతా ఇశ్రాయేలీయులు పాటించాల్సిన అవసరంలేని కొన్ని నియమాల్ని పాటించాలి. మరి, ఎందుకని ఇశ్రాయేలీయుల్లో కొంతమంది నాజీరులుగా ఉండాలనుకునేవాళ్లు? బహుశా యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ చూపించడానికి, ఆయన కుమ్మరించిన దీవెనలకు మనసారా కృతజ్ఞత చెప్పడానికి వాళ్లు అలా ఉండాలనుకోవచ్చు.—ద్వితీ. 6:5; 16:17.

3. ఈరోజుల్లో దేవుని ప్రజలు నాజీరులుగా ఎలా ఉన్నారు?

3 “క్రీస్తు నియమం” వచ్చాక, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నాజీరులుగా ఉండే ఏర్పాటు ముగిసిపోయింది. (గల. 6:2; రోమా. 10:4) అయినా, ఈరోజుల్లో కూడా దేవుని ప్రజలు నాజీరులుగా నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో, పూర్తి బలంతో యెహోవా సేవ చేయాలనే తపనతో ఉన్నారు. (మార్కు 12:30) అలా చేస్తామని మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు ఇష్టపూర్వకంగా మాటిచ్చాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం యెహోవా ఇష్టానికి లోబడాలి, త్యాగాలు చేయాలి. ఇచ్చిన మాటకు తగ్గట్టు నాజీరులు ఎలా బ్రతికారో పరిశీలిస్తుండగా, మన సమర్పణకు తగ్గట్టు ఎలా బ్రతకవచ్చో చూస్తాం అలాగే వాళ్లనుండి విలువైన పాఠాల్ని నేర్చుకుంటాం. b (మత్త. 16:24) ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం.

త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి

4. సంఖ్యాకాండం 6:3, 4 ప్రకారం, నాజీరులు ఏ త్యాగం చేసేవాళ్లు?

4 సంఖ్యాకాండం 6:3, 4 చదవండి. నాజీరులు మద్యాన్ని గానీ, ద్రాక్షలతో తయారుచేసిన ఏ పానీయాన్ని గానీ తాగకూడదు. ఆఖరికి తాజా ద్రాక్షల్ని, ఎండు ద్రాక్షల్ని కూడా తినకూడదు. నిజానికి తమ చుట్టూవున్న ప్రజలు అలాంటి ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఆస్వాదించేవాళ్లు. దానిలో అసలు ఏ తప్పూ లేదు. పైగా, “మనిషి హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసం” యెహోవా ఇచ్చే బహుమతి అని బైబిలు చెప్తుంది. (కీర్త. 104:14, 15) అయినా, నాజీరులు ఆ ఆనందాన్ని ఇష్టంగా త్యాగం చేసేవాళ్లు. c

నాజీరుల్లాగే మీరు కూడా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? (4-6 పేరాలు చూడండి)


5. మాడియన్‌, మార్సెల్లా ఏ త్యాగాలు చేశారు? ఎందుకు?

5 నాజీరుల్లాగే మనం కూడా యెహోవా సేవ ఎక్కువ చేయడానికి కొన్ని త్యాగాలు చేస్తాం. మాడియన్‌, మార్సెల్లా ఉదాహరణే తీసుకోండి. d మాడియన్‌కి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఉండడం వల్ల వాళ్లకు మంచి కారు, బంగ్లా ఉండేవి. అయితే, వాళ్లు దేవుని సేవ ఎక్కువ చేయాలనుకున్నారు. దానికోసం కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలనుకున్నారు. వాళ్లు ఇలా చెప్తున్నారు: “మా ఖర్చుల్ని తగ్గించుకున్నాం. మా కారును అమ్మేసి చిన్న ఇల్లు చూసుకున్నాం.” మాడియన్‌, మార్సెల్లా ఈ త్యాగాలు చేయాల్సిన అవసరంలేదు. కానీ పరిచర్యను ఇంకా ఎక్కువ చేయడానికి వాళ్లు అలా చేశారు. వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల సంతోషం, సంతృప్తి వాళ్ల సొంతం అయ్యాయి.

6. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఎందుకు త్యాగాలు చేస్తున్నారు? (చిత్రం కూడా చూడండి.)

6 ఇప్పుడు కూడా దేవుని సేవ ఎక్కువ చేయడానికి క్రైస్తవులు సంతోషంగా త్యాగాలు చేస్తున్నారు. (1 కొరిం. 9:3-6) అలాంటి త్యాగాలు చేయమని యెహోవా అడగట్లేదు; అలాగని మనం విడిచిపెట్టినవి తప్పుడు విషయాలు కూడా కాదు. ఉదాహరణకు, కొంతమంది నచ్చిన ఉద్యోగాన్ని, ఇంటిని, ఇష్టంగా పెంచుకున్న జంతువుని వదిలేశారు. మరికొంతమంది, కొన్ని సంవత్సరాలపాటు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు లేదా పిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఇంకొంతమంది, అయినవాళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చినా సరే, అవసరం ఎక్కువున్న చోటుకు వెళ్లి సేవ చేస్తున్నారు. మనం యెహోవాకు బెస్ట్‌ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టే ఈ త్యాగాలన్నీ చేయడానికి ఇష్టంగా ముందుకొస్తున్నాం. అయితే, మీరు యెహోవా కోసం చేసే త్యాగం చిన్నదైనా, పెద్దదైనా ఆయన దాన్ని విలువైనదిగా చూస్తాడనే భరోసాతో ఉండండి!—హెబ్రీ. 6:10.

వేరుగా ఉండడానికి ఇష్టపడండి

7. తమ మొక్కుబడికి కట్టుబడి ఉండడం నాజీరులకు ఎందుకు కష్టంగా అనిపించివుండవచ్చు? (సంఖ్యాకాండం 6:5) (చిత్రం కూడా చూడండి.)

7 సంఖ్యాకాండం 6:5 చదవండి. నాజీరులు జుట్టు కత్తిరించుకోకూడదని మొక్కుబడి చేసుకునేవాళ్లు. అలా, వాళ్లు యెహోవాకు పూర్తిగా లోబడుతున్నాం అని చూపించేవాళ్లు. కొంతమంది ఇశ్రాయేలీయులు నాజీరులుగా ఎక్కువకాలం ఉండాలనుకోవచ్చు. అప్పుడు వాళ్ల జుట్టు బాగా పెరిగి ఇతరులు చూసినప్పుడు వీళ్లు నాజీరులని వెంటనే గుర్తుపట్టేవాళ్లు. అలాగే వాళ్లు చేసుకున్న మొక్కుబడికి, చుట్టూ ఉన్నవాళ్లు మద్దతు ఇచ్చినప్పుడు, నాజీరులుగా ఉండడం వీళ్లకు అంత కష్టమేమీ కాదు. కానీ విచారకరంగా, ఇశ్రాయేలీయులు ఒకానొక సమయంలో నాజీరులను అంత గౌరవించేవాళ్లు కాదు, మద్దతిచ్చేవాళ్లు కాదు. ఆమోసు ప్రవక్త కాలంలో, నాజీరులు తమ మొక్కుబడిని మీరేలా చేయడానికి కొంతమంది మతభ్రష్టులు వాళ్లకు “ద్రాక్షారసం ఇస్తూ వచ్చారు.” (ఆమో. 2:12) కొన్నిసార్లు నాజీరులు తమ మొక్కుబడికి కట్టుబడి ఉండడానికి, వేరుగా ఉండడానికి చాలా ధైర్యం అవసరమై ఉంటుంది.

తన మొక్కుబడికి కట్టుబడి ఉండే నాజీరు వేరుగా ఉండడానికి ఇష్టపడతాడు (7వ పేరా చూడండి)


8. బెంజమిన్‌ అనుభవంలో మీకేది బాగా నచ్చింది?

8 మనకు స్వతహాగా సిగ్గు, బిడియం ఉన్నా వేరుగా ఉండడానికి కావాల్సిన ధైర్యం యెహోవా ఇస్తాడు. నార్వేలో ఉంటున్న బెంజమిన్‌ అనే పదేళ్ల బాబు ఉదాహరణ గమనించండి. యుద్ధంవల్ల చిన్నాభిన్నమైన యుక్రెయిన్‌కి మద్దతివ్వడానికి వాళ్ల స్కూల్లో ఒక ప్రోగ్రామ్‌ జరుగుతుంది. పిల్లలందరూ యుక్రెయిన్‌ జాతీయ జెండాలో ఉండే ఏదైనా రంగు బట్టలు వేసుకుని, పాట పాడాలని చెప్పారు. ఈ ప్రోగ్రామంతా జరుగుతున్నప్పుడు బెంజమిన్‌ దూరంగా ఉండాలనుకున్నాడు. అయితే, ఒక టీచర్‌ “త్వరగా రా! నీకోసం అందరం వెయిట్‌ చేస్తున్నాం” అని బెంజమిన్‌తో గట్టిగా అంది. కానీ, బెంజమిన్‌ ధైర్యంగా టీచర్‌ దగ్గరికి వెళ్లి “నేను ఎవ్వరికీ మద్దతివ్వను, ఎలాంటి రాజకీయ విషయాల్లో పాల్గొనను టీచర్‌. నిజానికి యుద్ధంలో పాల్గొనకపోవడం వల్ల చాలామంది యెహోవాసాక్షులు జైల్లో కూడా ఉన్నారు” అని చెప్పాడు. దానికి టీచర్‌ అతన్ని వదిలేసింది. కానీ ఆ తర్వాత వాళ్ల క్లాస్‌మేట్స్‌ అతన్ని పట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్‌లో నువ్వెందుకు పాల్గొనలేదని వాళ్లందరూ అడిగినప్పుడు, బెంజమిన్‌కి చాలా భయమేసి ఏడ్పు వచ్చింది. కానీ ధైర్యం తెచ్చుకుని, టీచర్‌కి ఏదైతే చెప్పాడో అదే వాళ్లందరికీ చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి, వేరుగా ఉండడానికి యెహోవా తనకు ఎలా సహాయం చేశాడో బెంజమిన్‌ వాళ్ల మమ్మీడాడీకి చెప్పాడు.

9. మనం యెహోవా హృదయాన్ని ఎలా సంతోషపెడతాం?

9 మనం యెహోవాకు లోబడాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇతరులకు వేరుగా ఉండాలని కోరుకుంటాం. స్కూల్లో, పనిస్థలంలో మనం యెహోవాసాక్షులం అని చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. అలాగే ఈ లోకంలోని ప్రజలు రోజురోజుకీ చెడుగా మారిపోతున్నారు. దానివల్ల బైబిలు సూత్రాలకు తగ్గట్టు జీవించడం, ఇతరులకు మంచివార్త చెప్పడం మనకు కష్టం కావచ్చు. (2 తిమో. 1:8; 3:13) కానీ, యెహోవాను సేవించని వాళ్ల నుండి వేరుగా ఉండడానికి మనం ధైర్యం చూపించిన ప్రతీసారి, ఆయన “హృదయాన్ని సంతోషపెడతాం” అని గుర్తుంచుకోండి.—సామె. 27:11; మలా. 3:18.

మీ జీవితంలో యెహోవాకే మొదటిస్థానం ఇవ్వండి

10. సంఖ్యాకాండం 6:6, 7 చెప్తున్నదాన్ని చేయడం నాజీరులకు ఎందుకు కష్టంగా అనిపించివుండవచ్చు?

10 సంఖ్యాకాండం 6:6, 7 చదవండి. నాజీరులు శవం దగ్గరికి వెళ్లకూడదు. అది వినగానే, ఇదేమంత పెద్ద త్యాగం కాదని మనకు అనిపించవచ్చు. కానీ బైబిలు కాలాల్లో, వాళ్ల దగ్గరి బంధువు ఎవరైనా చనిపోతే వెళ్లకుండా ఉండడం నాజీరులకు చాలా కష్టంగా అనిపించింది. సాధారణంగా అప్పట్లో ఒక ఆచారం ఏంటంటే, చనిపోయిన వ్యక్తి సమాధి చేయబడేవరకు ప్రజలు ఆ శవం దగ్గరే ఉండేవాళ్లు. (యోహా. 19:39, 40; అపొ. 9:36-40) కానీ నాజీరు అలాంటి ఆచారాలకు దూరంగా ఉండాలి. ఆఖరికి సొంత కుటుంబ సభ్యులు చనిపోయిన బాధలో ఉన్నా, తమ మొక్కుబడికి కట్టుబడి ఉంటూ బలమైన విశ్వాసం చూపించేవాళ్లు. అలాంటి నమ్మకమైనవాళ్లకు ఆ బాధను తట్టుకోవడానికి యెహోవా సహాయం చేశాడు.

11. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు క్రైస్తవులుగా మనమేం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

11 క్రైస్తవులుగా యెహోవాకు చేసుకున్న సమర్పణను మనం ప్రాముఖ్యంగా చూడాలి. అది కుటుంబంలో మనం తీసుకునే నిర్ణయాల్లో, పనుల్లో కనిపించాలి. నిజమే, మనం మన కుటుంబ అవసరాల్ని తీర్చాలి. కానీ యెహోవా ఇష్టం చేయడం కన్నా, మన కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడానికే మొదటిస్థానం ఇవ్వం. (మత్త. 10:35-37; 1 తిమో. 5:8) కొన్నిసార్లు యెహోవాను సంతోషపెట్టడానికి మన బంధాల్ని-బంధుత్వాల్ని కూడా త్యాగం చేయాల్సి రావచ్చు.

కష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోవా ఇష్టానికి మొదటిస్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? (11వ పేరా చూడండి) e


12. కుటుంబంలో కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అలెక్సాద్రు ఏం చేశాడు? ఏం చేయలేదు?

12 అలెక్సాద్రు, ఆయన భార్య డోరీన ఉదాహరణ గమనించండి. వీళ్లిద్దరు కలిసి ఒక సంవత్సరంపాటు బైబిలు స్టడీ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత డోరీన దాన్ని ఆపేసింది. అలెక్సాద్రు కూడా ఆపేయాలని కోరుకుంది. కానీ ఆయన దాన్ని కొనసాగిస్తానని ఆమెను నొప్పించకుండా, ప్రశాంతంగా చెప్పాడు. అది డోరీనాకు నచ్చలేదు. ఎలాగైనా స్టడీ ఆపించాలని ప్రయత్నించింది. అలెక్సాద్రు ఇలా చెప్తున్నాడు: “ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ దాన్ని తట్టుకోవడం కష్టంగా అనిపించింది.” కొన్నిసార్లు డోరీన సూటిపోటి మాటలతో ఆయన్ని తీసిపారేసినట్టు, చాలా కటువుగా మాట్లాడేది. అప్పుడు ఆయనకు బైబిలు స్టడీ ఆపేయాలని అనిపించేది. అయినా, అలెక్సాద్రు ఒకవైపు యెహోవాకు మొదటిస్థానం ఇస్తూనే, మరోవైపు భార్యను ప్రాణంగా ప్రేమించాడు, గౌరవించాడు. చివరికి, ఆయన మంచి ఆదర్శాన్ని చూసి, ఆమె కూడా బైబిలు స్టడీ తీసుకుని, బాప్తిస్మం తీసుకుంది. jw.orgలో “సత్యం జీవితాలను మార్చేస్తుంది” అనే సిరీస్‌లో అలెక్సాద్రు, డోరీన వకార్‌: “ప్రేమ ఓర్పు, దయ చూపిస్తుంది” అనే వీడియో చూడండి.

13. మనం యెహోవా మీద, మన కుటుంబం మీద ఎలా ప్రేమ చూపించవచ్చు?

13 కుటుంబాల్ని ఏర్పాటు చేసింది యెహోవాయే. కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (ఎఫె. 3:14, 15) అయితే, మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే యెహోవాకు నచ్చినట్టు జీవించాలి. ఒకవైపు కుటుంబాన్ని శ్రద్ధగా, ప్రేమగా, గౌరవంగా చూసుకుంటూనే ఇంకోవైపు ఆయన్ని ఆరాధించడానికి మనం చేసే త్యాగాల్ని చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తాడని నమ్మకంతో ఉండవచ్చు.—రోమా. 12:10.

నాజీరులా ఉండడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

14. మనం ముఖ్యంగా ఎవర్ని మన మాటలతో ప్రోత్సహించాలి?

14 యెహోవాను ఆరాధించాలని అనుకునే ప్రతీ ఒక్కరూ ఆయన మీద ప్రేమతో ఇష్టంగా త్యాగాలు చేయాలి. అయితే, అది అన్నిసార్లు అంత ఈజీ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవచ్చు? మాటల ద్వారా ప్రోత్సహించుకోవచ్చు. (యోబు 16:5) యెహోవా సేవ ఎక్కువ చేయడానికి వాళ్ల జీవితంలో సర్దుబాట్లు చేసుకుంటున్న వాళ్లెవరైనా మీ సంఘంలో ఉన్నారా? కష్టంగా ఉన్నాసరే స్కూల్లో వేరుగా ఉండడానికి ధైర్యంగా ప్రయత్నిస్తున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? కుటుంబ సభ్యుల నుండి ఎంత వ్యతిరేకత వస్తున్నా, యెహోవాకు నమ్మకంగా ఉండడానికి పోరాడుతున్న బైబిలు విద్యార్థులు లేదా తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఎవరైనా ఉన్నారా? వాళ్లు చేస్తున్న త్యాగాల్ని, చూపిస్తున్న ధైర్యాన్ని మెచ్చుకునే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకండి!—ఫిలే. 4, 5, 7.

15. పూర్తికాల సేవ చేస్తున్నవాళ్లకు కొంతమంది ఎలా సహాయం చేశారు?

15 కొన్నిసార్లు మనం పూర్తికాల సేవలో ఉన్నవాళ్లకు అవసరమైన సహాయం చేయవచ్చు. (సామె. 19:17; హెబ్రీ. 13:16) శ్రీలంకలో ఉంటున్న ఒక పెద్దవయసు సిస్టర్‌ అలా చేయాలని అనుకుంది. ఆమెకు వచ్చే పెన్షన్‌ పెరిగాక, ఆర్థిక ఇబ్బందులున్నా పయినీరు సేవలో కొనసాగేలా ఇద్దరు యౌవన సిస్టర్స్‌కి ఆమె సహాయం చేసింది. ప్రతీనెల వాళ్ల టెలిఫోన్‌ బిల్లులు కట్టడానికి సరిపోయేంత డబ్బును ఆమె వాళ్లకు ఇచ్చేది. నిజంగా, ఆ సిస్టర్‌ ఎంత మంచి స్ఫూర్తి చూపించిందో కదా!

16. బైబిలు కాలంలోని నాజీరు ఏర్పాటు నుండి మనమేం నేర్చుకోవచ్చు?

16 బైబిలు కాలాల్లో, స్వచ్ఛందంగా నాజీరులుగా ఉండాలనుకునేవాళ్ల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అయితే, ఈ ఏర్పాటు మన పరలోక తండ్రైన యెహోవా గురించి కూడా ఒక విషయాన్ని చెప్తుంది. అదేంటంటే, మనం ఆయన్ని సంతోషపెడతామని, అలాగే మన సమర్పణకు తగినట్టు జీవించడానికి ఇష్టంగా త్యాగాలు చేస్తామని ఆయన నమ్ముతాడు. ఆయన మీద ప్రేమ చూపించే అవకాశం ఇచ్చి మనల్ని ఘనపరుస్తున్నాడు. (సామె. 23:15, 16; మార్కు 10:28-30; 1 యోహా. 4:19) తన సేవ చేయడానికి మనం చేసే ప్రతీ త్యాగాన్ని యెహోవా చూస్తాడని, విలువైనదిగా ఎంచుతాడని ఈ నాజీరు ఏర్పాటు చూపిస్తుంది. కాబట్టి యెహోవాకు సేవచేస్తూ ఇష్టంగా మన బెస్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం!

మీరెలా జవాబిస్తారు?

  • స్వచ్ఛందంగా నాజీరులుగా ఉండాలనుకునేవాళ్లు ఏ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్లు? ఎలా ధైర్యం చూపించేవాళ్లు?

  • ఈ రోజుల్లో నాజీరుల్లాంటి స్ఫూర్తిని చూపించేలా ఒకరినొకరం ఎలా ప్రోత్సహించుకోవచ్చు?

  • తన ఆరాధకుల మీద యెహోవాకు ఏ నమ్మకం ఉందని నాజీరు ఏర్పాటు చూపిస్తుంది?

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

a కొంతమంది నాజీరులను స్వయంగా యెహోవాయే నియమించాడు. అయితే, ఎక్కువశాతం మంది ఇశ్రాయేలీయులు స్వచ్ఛందంగా నాజీరులుగా ఉండడానికి ముందుకొచ్చి ఉంటారు. “ యెహోవా నియమించిన నాజీరులు” అనే బాక్స్‌ చూడండి.

b కొన్నిసార్లు మన ప్రచురణల్లో, నాజీరులను పూర్తికాల సేవకులతో పోల్చారు. అయితే, ఈ ఆర్టికల్‌లో యెహోవాకు సమర్పించుకున్న సేవకులందరూ నాజీరుల్లాంటి స్ఫూర్తిని ఎలా చూపించవచ్చో చూస్తాం.

c సాధారణంగా, నాజీరుగా ఉండాలనుకునేవాళ్లు వాళ్ల మొక్కుబడిలో భాగంగా ప్రత్యేకించి ఏ నియామకాలూ చేయాల్సిన అవసరంలేదు.

d jw.orgలో “యెహోవాసాక్షుల అనుభవాలు” సిరీస్‌లో ఉన్న “మా జీవితాన్ని సింపుల్‌ చేసుకుందాం అనుకున్నాం” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చూడండి.

e చిత్రాల వివరణ: తనకు ఇష్టమైన కుటుంబ సభ్యుల్లో ఒకర్ని సమాధి చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు మేడపై నుండి చూస్తున్న నాజీరు. తను చేసుకున్న మొక్కుబడి ప్రకారం ఆయన దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదు.