కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ సంతోషించండి

యెహోవా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ సంతోషించండి

యెహోవా ఈ లోకంలో ఉన్న చెడంతటినీ తీసేసి, అన్నిటినీ కొత్తగా చేసే రోజు కోసం మీరు ఎదురుచూస్తున్నారా? (ప్రక. 21:1-5) దాంట్లో సందేహమే లేదు! కానీ దానికోసం ఎదురుచూడడం అంత ఈజీ కాదు, ముఖ్యంగా కష్టాలొచ్చినప్పుడు అది ఇంకా కష్టంగా ఉండొచ్చు. నిజమే, “ఎదురుచూసింది ఆలస్యమైనప్పుడు బాధ కలుగుతుంది.”—సామె. 13:12.

అయినా, తాను చర్య తీసుకునే రోజు వరకు మనం ఎదురుచూడాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన ఎందుకలా కోరుకుంటున్నాడు? అలా ఎదురుచూస్తూనే సంతోషంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

మనం ఎదురుచూడాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

“మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు, మీ మీద కరుణ చూపించడానికి ఆయన లేస్తాడు. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడైన దేవుడు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నవాళ్లంతా సంతోషంగా ఉంటారు” అని బైబిలు చెప్తుంది. (యెష. 30:18) ఈ మాటలు మొండి వాళ్లయిన యూదుల్ని ఉద్దేశించి చెప్పబడ్డాయి. (యెష. 30:1) కానీ నమ్మకమైన కొంతమంది యూదుల్లో మాత్రం ఆ మాటలు ఆశను నింపాయి. ఆ మాటలే ఈరోజుల్లో ఉన్న యెహోవా నమ్మకమైన సేవకుల్లో కూడా ఆశను నింపుతున్నాయి.

యెహోవా ఓపిక చూపిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఓపిగ్గా ఉండాలి. ఈ వ్యవస్థను అంతం చేయడానికి యెహోవా ఒక సమయాన్ని నిర్ణయించేశాడు. ఆ రోజు కోసం, ఆ గంట కోసం ఆయన ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు. (మత్త. 24:36) ఆ సమయం వచ్చినప్పుడు యెహోవా మీద, ఆయన సేవకుల మీద సాతాను వేసిన నిందలన్నీ తప్పని రుజువు అవుతుంది. ఆయన సాతానును, అతనికి మద్దతిచ్చేవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. కానీ “[మనమీద] కరుణ చూపిస్తాడు.”

అయితే, ఈలోపు మనకొచ్చే కష్టాల్ని తీసేస్తానని యెహోవా చెప్పట్లేదు గానీ, మనం ఎదురుచూస్తూ కూడా సంతోషంగా ఉండగలం అని ఆయన మాటిస్తున్నాడు. యెషయా చెప్పినట్లు, ఏదైనా మంచి జరుగుతుందని ఎదురుచూస్తూ లేదా ఆశలు పెట్టుకుంటూ కూడా సంతోషంగా ఉండొచ్చు. (యెష. 30:18) మనం అలా ఎలా సంతోషంగా ఉండవచ్చు? దానికి సహాయం చేసే నాలుగు విషయాల్ని ఇప్పుడు చూద్దాం.

ఎదురుచూస్తూనే సంతోషంగా ఎలా ఉండవచ్చు?

మంచి విషయాల మీద మనసుపెట్టండి. దావీదు రాజు తన జీవితంలో ఎన్నో చెడు విషయాల్ని చూశాడు. (కీర్త. 37:35) అయినప్పటికీ ఆయనిలా రాశాడు: “యెహోవా ఎదుట మౌనంగా ఉండి, ఆయన కోసం ఓపిగ్గా ఎదురుచూడు. తన పన్నాగాల్ని అమలు చేయడంలో సఫలమయ్యే మనిషిని చూసి బాధపడకు.” (కీర్త. 37:7) యెహోవా తనను కాపాడతానని ఇచ్చిన మాటమీద మనసుపెట్టడం వల్ల దావీదు ఈ సలహాను పాటించాడు. అంతేకాదు, యెహోవా తనకోసం చేసిన మంచి అంతటినీ గుర్తించాడు. (కీర్త. 40:5) మనం కూడా దావీదులాగే మనచుట్టూ జరుగుతున్న చెడు విషయాల మీద కాకుండా, మంచి విషయాల మీద మనసు పెట్టినప్పుడు, యెహోవా కోసం ఎదురుచూడడం తేలికౌతుంది.

యెహోవాను స్తుతించడంలో బిజీగా ఉండండి. 71వ కీర్తనను బహుశా దావీదే రాసుండొచ్చు. ఆయన యెహోవాతో ఇలా అంటున్నాడు: “నేనైతే నీ కోసం కనిపెట్టుకునే ఉంటాను; ఇంకా ఎక్కువగా నిన్ను స్తుతిస్తాను.” (కీర్త. 71:14) ఆయన యెహోవాను ఎలా స్తుతిస్తాడు? ఇతరులకు యెహోవా గురించి చెప్పడం ద్వారా, పాటలు పాడడం ద్వారా అలా చేస్తాడు. (కీర్త. 71:16, 23) దావీదులాగే మనం కూడా యెహోవా కోసం ఎదురుచూస్తూ సంతోషంగా ఉండవచ్చు. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు, ఇరుగుపొరుగు వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మనం యెహోవాను స్తుతించవచ్చు. ఈసారి మీరు పాటలు పాడుతున్నప్పుడు అందులో ఉన్న ప్రతీ పదం మీలో ఎలా ఉత్సాహాన్ని నింపుతుందో ఆలోచించండి.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ నుండి ప్రోత్సాహం పొందండి. కష్టాల్లో ఉన్నప్పుడు దావీదు యెహోవాతో ఇలా అన్నాడు: “నీ విశ్వసనీయుల ముందు నీ పేరుమీద ఆశపెట్టుకుంటాను.” (కీర్త. 52:9) మనం కూడా తోటి ఆరాధకుల నుండి ప్రోత్సాహం పొందవచ్చు. అయితే మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు, ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రమే కాదు సరదాగా సమయం గడుపుతున్నప్పుడు కూడా మనమలా చేయవచ్చు.—రోమా. 1:11, 12.

మీ నిరీక్షణను బలపర్చుకోండి. కీర్తన 62:5 ఇలా చెప్తుంది: “దేవుని కోసం నా ప్రాణం మౌనంగా ఎదురుచూస్తోంది. ఆయనే నా నిరీక్షణకు ఆధారం.” మనం అనుకున్నంత త్వరగా అంతం రానప్పుడు, మన నిరీక్షణను బలపర్చుకోవడం ఇంకా ప్రాముఖ్యం. మనం దానికోసం ఎంతకాలం ఎదురుచూడాల్సి వచ్చినా, యెహోవా మాటిచ్చినవి ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకంతో ఉండండి. మీ నిరీక్షణను బలపర్చుకోవడానికి బైబిలు చదవండి. దానిలోని ప్రవచనాలు ఎలా నిజమయ్యాయో, అవి వేర్వేరు వ్యక్తులు రాసినా ఒకదానితో ఒకటి ఎలా పొందికగా ఉన్నాయో, యెహోవా గురించి అవేమి చెప్తున్నాయో ఆలోచించండి. (కీర్త. 1:2, 3) అంతేకాదు, యెహోవా మాటిచ్చిన శాశ్వత జీవితం కోసం ఎదురుచూస్తుండగా ఆయనతో మంచి సంబంధం కలిగివుండేలా “పవిత్రశక్తి” కోసం ప్రార్థిస్తూ ఉండండి.—యూదా 20, 21.

దావీదులాగే యెహోవా తన కోసం ఎదురు చూసేవాళ్లను గమనిస్తున్నాడని, వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడని నమ్మకంతో ఉండండి. (కీర్త. 33:18, 22) మీ జీవితంలోని మంచి విషయాల మీద మనసుపెట్టండి, యెహోవాను స్తుతించండి, బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఇస్తున్న ప్రోత్సాహం తీసుకోండి, మీ నిరీక్షణను బలపర్చుకోండి. అలా చేసినప్పుడు యెహోవా కోసం మీరు ఓపిగ్గా ఎదురుచూస్తూ సంతోషిస్తారు!