కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

భవిష్యత్తును చెప్పగల యెహోవా సామర్థ్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?

యెహోవా భవిష్యత్తును చెప్పగలడని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (యెష. 45:21) అయితే ఆయన ఎప్పుడు, ఎలా, ఎంతవరకు చెప్పాలనుకుంటాడు అనే దానిగురించి పూసగుచ్చినట్లు బైబిలు చెప్పట్లేదు. కాబట్టి ఈ విషయంలో మనం మరీ మొండిపట్టు పట్టాల్సిన అవసరంలేదు. అయితే, దీనికి సంబంధించి కొన్ని విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా తనకుతానే పెట్టుకున్న పరిమితులు తప్ప ఆయనకు ఏ పరిమితులూ లేవు. ఆయన ఏమైనా చేయగలడు. తనకున్న అపారమైన తెలివితో దేని భవిష్యత్తు గురించైనా చెప్పగలడు. (రోమా. 11:33) కానీ తనకు అమితమైన ఆత్మనిగ్రహం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని అనుకోకపోవచ్చు.—యెషయా 42:14 పోల్చండి.

యెహోవా తన ఇష్టం నెరవేర్చడానికి ఏమైనా చేయగలడు. దీనికి, భవిష్యత్తును చెప్పగల ఆయన సామర్థ్యానికి సంబంధం ఏంటి? యెషయా 46:10 ఇలా చెప్తుంది: “మొదటి నుండి నేనే చివరికి ఏమౌతుందో చెప్తున్నాను, ఎప్పటినుండో నేనే ఇంకా జరగని సంగతుల్ని చెప్తున్నాను. ‘నా నిర్ణయం నిలుస్తుంది, నాకు ఏది ఇష్టమో అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.”

కాబట్టి యెహోవా భవిష్యత్తును ఎందుకు చెప్పగలడంటే, తను అనుకున్నది ఏదైనా చేసే శక్తి ఆయనకు ఉంది. మనం కొన్నిసార్లు సినిమా ముగింపేంటో తెలుసుకోవడానికి ఫార్వడ్‌ చేసిన్నట్టు, భవిష్యత్తును తెలుసుకోవడానికి యెహోవా ఫార్వడ్‌ చేసి చూడాల్సిన అవసరంలేదు. బదులుగా ఫలానా టైంలో ఒక సంఘటన జరగాలని యెహోవా నిర్ణయిస్తే, ఆ సమయం వచ్చినప్పుడు అది జరిగేలా ఆయన చేస్తాడు.—నిర్గ. 9:5, 6; మత్త. 24:36; అపొ. 17:31.

అందుకే కొన్ని భవిష్యత్తు సంఘటనలప్పుడు యెహోవా ఏంచేస్తాడో వివరించడానికి బైబిల్లో “సిద్ధం చేశాను,” “తయారు చేశాను,” “సంకల్పించాను” లాంటి పదాల్ని ఉపయోగించారు. (2 రాజు. 19:25; అధస్సూచి; యెష. 46:11) ఈ పదాలను, మూలభాషలో “కుమ్మరి” అనే అర్థం వచ్చే పదం నుండి అనువదించారు. (యిర్మీ. 18:4) ఒక నైపుణ్యంగల కుమ్మరి మట్టి ముద్దను అందమైన వస్తువులా మలిచినట్లే, యెహోవా తన ఇష్టం నెరవేర్చుకోవడానికి విషయాల్ని ఎలాగంటే అలా మలచగలడు.—ఎఫె. 1:11.

మనుషులందరూ సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను యెహోవా ఇచ్చాడు. ప్రతీఒక్కరి జీవితంలో ఏం జరగాలో యెహోవా ముందే రాసిపెట్టడు. అలాగే మంచివాళ్లు చెడు నిర్ణయాలు తీసుకుని, చెడిపోవాలని ఆయన నిర్ణయించి పెట్టలేదు. సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఆయన అందరికీ ఇచ్చాడు. వాళ్లు సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాడు.

రెండు ఉదాహరణల్ని గమనించండి. మొదటిది నీనెవె ప్రాంతంలో ఉన్న ప్రజలు. వాళ్లు చేసిన చెడ్డపనుల్ని బట్టి యెహోవా ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని ముందే చెప్పాడు. కానీ వాళ్లు పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా, “వాళ్ల మీదికి తీసుకొస్తానని చెప్పిన విపత్తు గురించి ఇంకోసారి ఆలోచించాడు. ఆయన వాళ్ల మీదికి ఆ విపత్తును తీసుకురాలేదు.” (యోనా 3:1-10) నీనెవె ప్రాంతంలో ఉన్నవాళ్లు నిర్ణయాలు తీసుకునే తమ స్వేచ్ఛను చక్కగా ఉపయోగించి యెహోవా ఇచ్చిన హెచ్చరికకు లోబడి, పశ్చాత్తాపం చూపించారు కాబట్టి ఆయన తన మనసు మార్చుకున్నాడు.

రెండో ఉదాహరణ, కోరెషు అనే వ్యక్తికి సంబంధించిన ప్రవచనం. అతను యూదుల్ని విడిపిస్తాడని, యెహోవా ఆలయాన్ని తిరిగి కట్టమనే ఆజ్ఞ జారీ చేస్తాడని ఆ ప్రవచనం చెప్తుంది. (యెష. 44:26–45:4) పారసీక రాజైన కోరెషు ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. (ఎజ్రా 1:1-4) అయితే, కోరెషు సత్యదేవుణ్ణి ఆరాధించలేదు. తనను ఆరాధించమని యెహోవా కోరెషును బలవంతం చేయలేదు. కానీ ఆ ప్రవచనం నెరవేర్చడానికి యెహోవా అతన్ని ఉపయోగించుకున్నాడు.—సామె. 21:1.

నిజమే, భవిష్యత్తు గురించి చెప్తున్నప్పుడు యెహోవా ఆలోచించే కొన్నిటిని మాత్రమే మనం ఇప్పటివరకు పరిశీలించాం. వాస్తవానికి, యెహోవా ఆలోచనల్ని ఏ మనిషి పూర్తిగా అర్థంచేసుకోలేడు. (యెష. 55:8, 9) కానీ ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్న దాన్నిబట్టి, యెహోవా ఏం చెప్పినా ఆఖరికి భవిష్యత్తు గురించి చెప్పినా కరెక్ట్‌గా చెప్తాడన్న మన విశ్వాసం మాత్రం బలపడుతుంది!