కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

బైబిల్లో ఎందుకని కొన్నిసార్లు రాసిన విషయాల్నే మళ్లీ రాశారు?

బైబిలు రాసినవాళ్లు కొన్నిసార్లు ఒకే విషయాన్ని పదేపదే రాశారు. అలా రాయడానికిగల మూడు కారణాల్ని ఇప్పుడు చూద్దాం.

ఎప్పుడు రాశారు? ప్రాచీన ఇశ్రాయేలులో చాలామంది దగ్గర సొంతగా ధర్మశాస్త్ర కాపీలు ఉండేవికావు. వాళ్లంతా గుడారం దగ్గర సమావేశమైనప్పుడు మాత్రమే ధర్మశాస్త్రాన్ని చదవడం వినేవాళ్లు. (ద్వితీ. 31:10-12) వాళ్లు ఆ పెద్ద గుంపులో చాలా గంటలు నిలబడినప్పుడు వాళ్ల ధ్యాసను పక్కకు మళ్లించే విషయాలు చాలానే ఉండివుంటాయి. (నెహె. 8:2, 3, 7) అలాంటి సందర్భాల్లో, ముఖ్యమైన పదాల్ని మళ్లీమళ్లీ చెప్పడం లేఖనాల్ని గుర్తుపెట్టుకునేలా, దాన్ని పాటించేలా ప్రజలకు సహాయం చేసివుంటుంది. అలాగే, ముఖ్యమైన విషయాల్ని అంటే దేవుని నియమాల్ని, ఆజ్ఞల్ని, న్యాయనిర్ణయాల్ని గుర్తుపెట్టుకోవడం వాళ్లకు తేలిగ్గా ఉండివుంటుంది.—లేవీ. 18:4-22; ద్వితీ. 5:1.

ఎలా రాశారు? బైబిల్లో 10 శాతం వరకు పాటలే ఉన్నాయి. మనం వాటిని కీర్తనలు, పరమగీతం అలాగే విలాపవాక్యాలు పుస్తకాల్లో చూడవచ్చు. కొన్ని పాటలకు పల్లవి ఉంటుంది. అది పాట ముఖ్యాంశాన్ని, పాటలోని మాటల్ని గుర్తుపెట్టుకునేలా సహాయం చేస్తుంది. ఉదాహరణకు, కీర్తన 115:9-11 లో ఉన్న మాటల్ని గమనించండి: “ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో, ఆయనే నీ సహాయకుడు, నీ డాలు. అహరోను ఇంటివాళ్లారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీ సహాయకుడు, మీ డాలు. యెహోవాకు భయపడేవాళ్లారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే మీ సహాయకుడు, మీ డాలు.” దాన్ని పాడేవాళ్లు ఆ మాటల్ని పదేపదే పలికినప్పుడు ఆ సత్యాలు వాళ్ల హృదయాల్లో, మనసులో ఎంత ప్రతిధ్వనించి ఉంటాయో ఆలోచించండి.

ఎందుకు రాశారు? బైబిలు రాసినవాళ్లు కొన్నిసార్లు ప్రాముఖ్యమైన విషయాల్ని మళ్లీమళ్లీ రాశారు. ఉదాహరణకు, యెహోవా ఇశ్రాయేలీయులకు రక్తం తినకూడదని ఆజ్ఞాపించినప్పుడు దానికిగల కారణాన్ని మోషే ద్వారా చాలాసార్లు రాయించాడు. ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంటుంది, ప్రతీ జీవికి దాని రక్తమే ప్రాణం అనే విషయాన్ని యెహోవా నొక్కి చెప్పాలనుకున్నాడు. (లేవీ. 17:11, 14) చాలాకాలం తర్వాత అపొస్తలులు అలాగే యెరూషలేములో ఉన్న పెద్దలు, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే క్రైస్తవులు చేయకూడని విషయాల గురించి మాట్లాడుతూ రక్తానికి దూరంగా ఉండాలని మళ్లీ నొక్కి చెప్పారు.—అపొ. 15:20, 29.

అయితే, బైబిల్లో ఉన్న మాటల్ని మనం ఒక అలవాటుగా పదేపదే జపించాలన్నది యెహోవా ఉద్దేశం కాదు. ఉదాహరణకు, యేసు ఇలా అన్నాడు: “నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, . . చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పకు.” (మత్త. 6:7) ఆ తర్వాత దేవుని ఇష్టానికి అనుగుణంగా వేటి-వేటి గురించి ప్రార్థించాలో ఆయన చెప్పాడు. (మత్త. 6:9-13) కాబట్టి మనం ప్రార్థనలో చెప్పిన మాటల్నే మళ్లీమళ్లీ చెప్పకుండా జాగ్రత్తపడాలి. కానీ ఒకే అంశం గురించి మళ్లీమళ్లీ ప్రార్థించవచ్చు.—మత్త. 7:7-11.

కాబట్టి మంచి కారణంతోనే బైబిల్లో కొన్ని మాటల్ని, పదాల్ని మళ్లీమళ్లీ రాశారు. మన మహాగొప్ప ఉపదేశకుడైన యెహోవా మనకు ప్రయోజనం కలిగేలా బోధించడానికి ఉపయోగించే చాలా పద్ధతుల్లో ఇదొకటి!—యెష. 48:17, 18.