కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 16

పాట 64 సంతోషంగా కోతపని చేద్దాం

ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోండి

ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోండి

“సంతోషంతో యెహోవాను సేవించండి.”కీర్త. 100:2.

ముఖ్యాంశం

ప్రీచింగ్‌లో రెట్టింపు సంతోషాన్ని పొందడానికి ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

1. ప్రీచింగ్‌ విషయంలో కొంతమందికి ఎలాంటి ఫీలింగ్స్‌ ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

 యెహోవా ప్రజలుగా మనం మన పరలోక తండ్రిని ప్రేమిస్తాం, ఇరుగుపొరుగువాళ్లు ఆయన గురించి తెలుసుకోవాలని కోరుకుంటాం కాబట్టి ప్రీచింగ్‌ చేస్తాం. మనలో చాలామందిమి చాలా ఇష్టంగా ప్రీచింగ్‌ చేస్తాం. కానీ కొంతమందికి అది కష్టంగా ఉండవచ్చు. ఎందుకు? బహుశా కొంతమందికి సిగ్గు, బిడియం అడ్డొస్తుండవచ్చు. సరిగ్గా బోధించలేమని అనుకోవచ్చు. పిలవనివాళ్ల ఇంటికి వెళ్లడానికి మొహమాట పడవచ్చు. ఇంటివ్యక్తి మండిపడతాడేమో అని భయపడుతుండవచ్చు. లేదా అనవసరంగా వేరేవాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్లు అనుకోవచ్చు. ఇలాంటి ఫీలింగ్స్‌ ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి యెహోవా మీద చాలా ప్రేమ ఉన్నా, పరిచయం లేనివాళ్లకు మంచివార్త చెప్పడం వాళ్లకు కష్టంగా ఉంటుంది. అయినాసరే, వాళ్లు చేతులెత్తేయకుండా ఈ పని ఎంత ప్రాముఖ్యమైందో గుర్తించి బరిలోకి దిగుతున్నారు. వాళ్లను చూసి యెహోవా ఎంత మురిసిపోతాడో కదా!

ప్రీచింగ్‌ చేయడమంటే మీకు ఇష్టమా? (1వ పేరా చూడండి)


2. ప్రీచింగ్‌ అంత ఇష్టంగా చేయలేకపోతుంటే మీరెందుకు దిగులుపడాల్సిన అవసరంలేదు?

2 మీరు కూడా అలాంటి ఫీలింగ్స్‌ వల్ల ప్రీచింగ్‌ అంత ఇష్టంగా చేయలేకపోతున్నారా? అలాగైతే దిగులుపడకండి. ప్రీచింగ్‌కి వెళ్లి మాట్లాడాలంటే అందరికీ కంగారుగానే అనిపిస్తుంది. ఎందుకంటే వేరేవాళ్లతో మాటామాటా పెంచుకోవాలని గానీ, నలుగురి కళ్లు మనమీద పడాలని గానీ మనం అనుకోం. అంతేకాదు, వేరేవాళ్ల మంచికోసమే మనం ప్రీచింగ్‌ చేయడానికి వెళ్లి, వాళ్లతోనే మాటలు అనిపించుకోవాలని ఎవ్వరం అనుకోం. అయితే మనకెలా అనిపిస్తుందో మన పరలోక తండ్రికి బాగా తెలుసని, ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నాడని గుర్తుంచుకోండి. (యెష. 41:13) అలాంటి ఆలోచనల నుండి బయటపడడానికి, ప్రీచింగ్‌లో మన సంతోషాన్ని కాపాడుకోవడానికి ఐదు సలహాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

దేవుని వాక్యంతో ధైర్యాన్ని కూడగట్టుకోండి

3. ప్రీచింగ్‌ చేయడానికి యిర్మీయా ప్రవక్తకు ఏది సహాయం చేసింది?

3 గతంలో కూడా దేవుని సందేశం వల్ల నమ్మకమైన సేవకులు తమకిచ్చిన కష్టమైన పనిని పూర్తి చేయగలిగారు. ఉదాహరణకు, యిర్మీయా ప్రవక్త గురించే ఆలోచించండి. యెహోవా ప్రీచింగ్‌ చేయమనే నియామకం తనకు ఇచ్చినప్పుడు యిర్మీయా కంగారుపడ్డాడు. అప్పుడిలా అన్నాడు: “నేను చిన్నవాణ్ణి, ఎలా మాట్లాడాలో నాకు తెలీదు.” (యిర్మీ. 1:6) మరి యిర్మీయా ధైర్యాన్ని ఎలా కూడగట్టుకున్నాడు? యెహోవా చెప్పిన మాటల ద్వారా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. ఆ తర్వాత యిర్మీయా ఇలా అన్నాడు: “అది నా ఎముకల్లో మూయబడిన అగ్నిలా నా హృదయంలో మండుతోంది, దాన్ని ఓర్చుకునీ ఓర్చుకునీ అలసిపోయాను.” (యిర్మీ. 20:8, 9) తనకు ఇచ్చిన టెరిటరీలో ప్రీచింగ్‌ చేయడం కష్టంగా ఉన్నా, ఆ పనిని చేస్తూ ఉండడానికి తను ప్రకటించే సందేశమే యిర్మీయాకు ధైర్యాన్నిచ్చింది.

4. బైబిల్ని చదివి, ధ్యానించడం వల్ల ఏం జరుగుతుంది? (కొలొస్సయులు 1:9, 10)

4 క్రైస్తవులుగా మనం యెహోవా మాటలు ఉన్న బైబిలు ద్వారా ధైర్యాన్ని కూడగట్టుకుంటాం. అపొస్తలుడైన పౌలు కొలొస్సీ సంఘంలో ఉన్నవాళ్లకు యెహోవా ఇష్టాన్ని ఎక్కువగా తెలుసుకోమని చెప్పాడు. దానివల్ల వాళ్లు ‘ప్రతీ మంచిపని చేస్తూ, యెహోవాకు తగినట్టు నడుచుకోగలుగుతారు.’ (కొలొస్సయులు 1:9, 10 చదవండి.) ఆ మంచి పనిలో మంచివార్త గురించి చెప్పడం కూడా ఉంది. కాబట్టి బైబిల్ని చదివి, ధ్యానించడం వల్ల యెహోవా మీద మన విశ్వాసాన్ని పెంచుకుంటాం. అలాగే, రాజ్యం గురించి ప్రకటించడం చాలా ప్రాముఖ్యమని ఇంకా బాగా అర్థం చేసుకుంటాం.

5. బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

5 బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే దాన్ని గబగబ చదివేసి పక్కన పెట్టేయకండి. అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి సమయం తీసుకోండి. మీరు చదువుతున్నప్పుడు ఏదైనా ఒక వచనం అర్థం కాకపోతే, దాన్ని వదిలేసి వేరే దానికి వెళ్లిపోకండి! బదులుగా, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం లేదా పరిశోధన చేయడానికి ఉన్న వేరే పనిముట్ల ద్వారా ఆ వచనం గురించి లోతుగా తెలుసుకోండి. మీరు సమయం తీసుకుని అధ్యయనం చేసినప్పుడు బైబిలు చెప్తున్న విషయాలు నిజమనే నమ్మకం మీకు కుదురుతుంది. (1 థెస్స. 5:21) మీరెంత ఎక్కువ నమ్మితే, మీరు నేర్చుకున్నవాటిని వేరేవాళ్లకు అంత సంతోషంగా చెప్పగలుగుతారు.

ప్రీచింగ్‌కి బాగా సిద్ధపడండి

6. ప్రీచింగ్‌కి మనం ఎందుకు బాగా సిద్ధపడి వెళ్లాలి?

6 మనం ప్రీచింగ్‌కి బాగా సిద్ధపడి వెళ్తే ప్రజలతో జంకకుండా మాట్లాడగలుగుతాం. యేసు కూడా తన శిష్యుల్ని సిద్ధం చేసిన తర్వాతే వాళ్లను ప్రీచింగ్‌కి పంపించాడు. (లూకా 10:1-11) యేసు చెప్పింది చేసినప్పుడు వాళ్లు ప్రీచింగ్‌లో సాధించిన వాటినిబట్టి పట్టలేనంత సంతోషాన్ని పొందారు.—లూకా 10:17.

7. మనం ప్రీచింగ్‌కి ఎలా సిద్ధపడవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

7 మనం ప్రీచింగ్‌కి ఎలా సిద్ధపడవచ్చు? ముందు, మనం దేనిగురించి మాట్లాడాలని అనుకుంటున్నామో దాన్ని సొంత మాటల్లో ఎలా చెప్పొచ్చో ఆలోచించి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చెప్పేదానికి ఇంటివ్యక్తి ఏం అంటాడో, దానికి మనం ఏ జవాబు ఇవ్వొచ్చో ఆలోచించుకోవాలి. ఇలా సిద్ధపడిన తర్వాత ప్రీచింగ్‌లో ప్రశాంతంగా, చిరునవ్వుతో, స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు.

ప్రీచింగ్‌కి బాగా సిద్ధపడండి (7వ పేరా చూడండి)


8. క్రైస్తవులు ఎలా మట్టి పాత్రల్లా ఉన్నారు?

8 అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “మట్టి పాత్రల్లో ఈ సంపద మాకు ఉంది.” (2 కొరిం. 4:7) ఇంతకీ ఆయన చెప్పిన సంపద ఏంటి? ప్రజల్ని కాపాడే పని. అంటే రాజ్యం గురించి ప్రకటించే పని. (2 కొరిం. 4:1) ఆ మట్టి పాత్రలు ఎవరు? మంచివార్తను ఇతరులకు చెప్పే దేవుని సేవకులు. పౌలు రోజుల్లో వ్యాపారం చేసేవాళ్లు ఆహారం, ద్రాక్షారసం, డబ్బు లాంటి విలువైనవాటిని మట్టి పాత్రల్లో పెట్టి రవాణా చేసేవాళ్లు. అదేవిధంగా మంచివార్తను ప్రకటించే విలువైన పనిని యెహోవా మనకు అప్పగించాడు. యెహోవా మన వెన్నంటే ఉంటూ ఆ సందేశాన్ని ప్రకటించడానికి కొండంత ధైర్యాన్నిస్తాడు.

ధైర్యం కోసం ప్రార్థించండి

9. భయాల్ని పోగొట్టుకోవడానికి ఏం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

9 కొన్నిసార్లు ప్రీచింగ్‌లో వ్యతిరేకత వస్తుందేమో అని లేదా ప్రజలు వినరేమో అని మనం భయపడుతుండవచ్చు. మరి, అలాంటి భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? ప్రీచింగ్‌ చేయొద్దని అపొస్తలుల్ని ఆజ్ఞాపించినప్పుడు వాళ్లు చేసిన ప్రార్థన గుర్తుతెచ్చుకోండి. భయపడి ప్రీచింగ్‌ ఆపేసే బదులు, “నీ వాక్యాన్ని పూర్తి ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయి” అని వాళ్లు యెహోవాను అడిగారు. ఆ ప్రార్థనకు యెహోవా చిటికెలో జవాబిచ్చాడు. (అపొ. 4:18, 29, 31) అలాంటి భయాల వల్ల కొన్నిసార్లు మీరు బిగుసుకుపోతే, ప్రజల మీదున్న ప్రేమ ఆ భయాల్ని ఓడించేలా చేయమని యెహోవాను అడగండి.

ధైర్యం కోసం ప్రార్థించండి (9వ పేరా చూడండి)


10. తనకు సాక్షులుగా ఉండే బాధ్యతను సరిగ్గా చేయడానికి యెహోవా మనకెలా సహాయం చేస్తున్నాడు? (యెషయా 43:10-12)

10 తన సాక్షులుగా ఉండే బాధ్యతను యెహోవా మనకు ఇచ్చాడు. అలాగే ధైర్యంగా ఉండడానికి సహాయం చేస్తానని కూడా మాటిచ్చాడు. (యెషయా 43:10-12 చదవండి.) యెహోవా మనకు సహాయం చేసే నాలుగు విధానాల్ని గమనించండి. ఒకటి, మనం ప్రీచింగ్‌ చేసినప్పుడల్లా యేసును మనకు తోడుగా ఇచ్చాడు. (మత్త. 28:18-20) రెండు, మనకు సహాయం చేయడానికి యెహోవా దేవదూతల్ని పంపిస్తాడు. (ప్రక. 14:6) మూడు, మనం నేర్చుకున్నవాటిని గుర్తుతెచ్చుకోవడానికి యెహోవా తన పవిత్రశక్తిని ఇస్తాడు. (యోహా. 14:25, 26) నాలుగు, మనతో కలిసి పనిచేయడానికి బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఇచ్చాడు. మన వెనక యెహోవా దేవుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ ఉండగా ఇక ప్రీచింగ్‌ చేయడానికి మనకెందుకు భయం!

పరిస్థితికి తగ్గట్టు మారండి, సరిగ్గా ఆలోచించండి

11. ప్రీచింగ్‌లో ఎక్కువమందిని కలవాలంటే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

11 మీరు ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు ప్రజలు ఇళ్లదగ్గర లేకపోతే మీకు నిరాశగా అనిపిస్తుందా? అలాగైతే ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ సమయంలో ప్రజలు ఎక్కడికి వెళ్తారు?’ (అపొ. 16:13) ‘పనికి వెళ్తారా? షాపింగ్‌కి వెళ్తారా?’ ఒకవేళ ఇళ్లల్లో ప్రజల్ని కలవలేకపోతుంటే వీధి సాక్ష్యం ఎందుకు చేయకూడదు! జాషువ అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లినప్పుడు, ప్రజలతో కిటకిటలాడే స్థలాలకు వెళ్లినప్పుడు ప్రీచింగ్‌ చేసే అవకాశాలు నాకు దొరుకుతాయి.” ఆయనా, ఆయన భార్య బ్రిజట్‌ సాయంత్రాలు గానీ, ఆదివారం మధ్యాహ్నాలు గానీ ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు ప్రజలు ఎక్కువగా ఇంటి దగ్గర ఉంటున్నారని గమనించారు.—ఎఫె. 5:15, 16.

పరిస్థితికి తగ్గట్టు మారండి (11వ పేరా చూడండి)


12. ప్రజలు ఏం నమ్ముతున్నారో, దేనిగురించి ఆలోచిస్తున్నారో ఎలా తెలుసుకోవచ్చు?

12 ఎవరికైనా మొదట్లో మనం చెప్పే విషయాలు ఆసక్తిగా అనిపించకపోతే వాళ్లేం నమ్ముతున్నారో, వాళ్లు దేనిగురించి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. జాషువ అలాగే బ్రిజట్‌ మన కరపత్రాల మీదున్న ప్రశ్నలు ఉపయోగిస్తూ ప్రజలతో మాట్లాడేవాళ్లు. ఉదాహరణకు, బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి? అనే కరపత్రాన్ని ఉపయోగించి: “కొంతమంది బైబిల్ని దేవుడిచ్చిన పుస్తకమని అంటారు, ఇంకొంతమంది అలా అనుకోరు, మరి మీరేం అంటారు?” అని అడుగుతారు. ఇక దాంతో సంభాషణ మొదలౌతుంది.

13. ప్రజలు వినకపోయినా మనం ప్రీచింగ్‌లో విజయం సాధించామని ఎందుకు చెప్పవచ్చు? (సామెతలు 27:11)

13 ప్రజలు మనం చెప్పేది వింటేనే మనం ప్రీచింగ్‌లో విజయం సాధించినట్టా? కానేకాదు! ఎందుకంటే మనం యెహోవా, యేసు అప్పగించిన పని చేశాం. ప్రజలకు సాక్ష్యం ఇచ్చాం! (అపొ. 10:42) ఇక, ప్రజలు మనం చెప్పేది విన్నా, వినకపోయినా మనం మాత్రం యెహోవాను సంతోషపెడుతున్నాం. అది తెలుసుకొని మనం కూడా సంతోషంగా ఉండవచ్చు.—సామెతలు 27:11 చదవండి.

14. మన బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఎవరైనా బాగా ఆసక్తిగలవాళ్లను కలిస్తే మనం ఎందుకు సంతోషించవచ్చు?

14 మన బ్రదర్స్‌సిస్టర్స్‌లో ఎవరైనా బాగా ఆసక్తిగలవాళ్లను కలిస్తే మనం కూడా సంతోషించవచ్చు. మనం చేసే పనిని తప్పిపోయిన పిల్లవాడిని వెదకడంతో కావలికోట పోల్చింది. ఆ పిల్లవాడి కోసం చాలామంది గాలించి వెదుకుతారు. అయితే ఆ పిల్లవాడు దొరికినప్పుడు, ఎవరికైతే దొరుకుతాడో అతనికే కాదు వెదికిన అందరికీ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా, శిష్యుల్ని చేసే పని ఒక్కరు చేసేది కాదు. జట్టుగా మనందరం కలిసి చేయాల్సిన పని. టెరిటరీలో ఉన్న ప్రజలందరికీ ప్రకటించాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. కాబట్టి ఎవరైనా కొత్తవాళ్లు మీటింగ్స్‌కి రావడం చూసినప్పుడు, మనందరికీ ఎగిరిగంతేసే అంత సంతోషం కలుగుతుంది.

యెహోవా మీద, ఇరుగుపొరుగువాళ్ల మీద ఉన్న ప్రేమను మనసులో ఉంచుకోండి

15. ప్రీచింగ్‌ చేయాలనే ఉత్సాహం ఉరకలు వేయాలంటే మత్తయి 22:37-39 లేఖనాన్ని ఎలా పాటించాలి? (చిత్రం కూడా చూడండి.)

15 ప్రీచింగ్‌ చేయాలనే మన ఉత్సాహం ఉరకలు వేయాలంటే యెహోవా మీద, ఇరుగుపొరుగువాళ్ల మీదున్న ప్రేమను మనసులో ఉంచుకోవాలి. (మత్తయి 22:37-39 చదవండి.) మనం ప్రీచింగ్‌ చేస్తుండడం యెహోవా చూసినప్పుడు, ఆయన ముఖంలో కలిగే ఆనందాన్ని అలాగే బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పుడు ప్రజల కళ్లలో కలిగే ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి! అంతేకాదు, మనం ప్రకటించే మంచివార్తకు స్పందించేవాళ్ల కోసం శాశ్వత జీవితమనే బహుమతి వేచి చూస్తుందని గుర్తుంచుకోండి.—యోహా. 6:40; 1 తిమో. 4:16.

యెహోవా మీద, ఇరుగుపొరుగువాళ్ల మీద ఉన్న ప్రేమను మనసులో ఉంచుకుంటే సంతోషంగా ప్రీచింగ్‌ చేస్తాం (15వ పేరా చూడండి)


16. మనం ఇంటికే పరిమితమైనా, ప్రీచింగ్‌లో సంతోషాన్ని ఎలా వెతుక్కోవచ్చు? ఒక అనుభవం చెప్పండి.

16 ఏదైనా కారణంవల్ల మీరు ఇంటికే పరిమితమయ్యారా? అలాగైతే, ఆ పరిస్థితిలో మీరు యెహోవా మీద, ఇరుగుపొరుగువాళ్ల మీద ఉన్న ప్రేమను చూపించడానికి ఏం చేయగలరో దానిమీదే మనసుపెట్టండి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో శ్యాముయేల్‌ అలాగే ఆయన భార్య డానియా ఇంటికే పరిమితమయ్యారు. ఆ కష్టమైన పరిస్థితి మొత్తంలో వాళ్లు క్రమంగా టెలిఫోన్‌ సాక్ష్యం ఇచ్చారు, ఉత్తరాలు రాశారు, జూమ్‌లో బైబిలు స్టడీలు చేశారు. శ్యాముయేల్‌కి క్యాన్సర్‌ ఉండడం వల్ల హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకునేవాడు. ఆయన హాస్పిటల్‌కి వెళ్లిన ప్రతీసారి అక్కడ కలిసేవాళ్లకు ప్రీచింగ్‌ చేసేవాడు. ఆయన ఇలా అంటున్నాడు: “మనకు కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఆందోళనగా ఉంటుంది, అలసిపోతాం, మన విశ్వాసానికి అదొక పరీక్షగా ఉంటుంది. అయినాసరే, యెహోవా సేవలో మనం సంతోషాన్ని వెతుక్కోవాలి.” ఇదిలా ఉంటే, ఒకరోజు డానియా కిందపడిపోయి మూడు నెలలపాటు మంచానికే పరిమితమైంది. ఆ తర్వాత ఇంకో ఆరు నెలలు ఆమె వీల్‌ఛైర్‌కే పరిమితమైంది. ఆమె ఇలా అంటుంది: “నా పరిస్థితుల్ని బట్టి నేను ఏం చేయగలనో అవి చేయడానికే చూశాను. నన్ను చూసుకోవడానికి వచ్చే నర్సుకి ప్రీచింగ్‌ చేశాను. మా ఇంటికి సరుకులు డెలివరీ చేయడానికి వచ్చే వాళ్లకు సాక్ష్యం ఇచ్చాను. అంతేకాదు, మందులు అమ్మే కంపెనీలో పనిచేసే ఆవిడతో చక్కగా టెలిఫోన్‌ సాక్ష్యం ఇవ్వగలిగాను.” శ్యాముయేల్‌ అలాగే డానియా ఇంతకుముందులా ప్రీచింగ్‌ చేయలేకపోయినా, వాళ్లు చేయగలిగింది చేస్తూ దాంట్లో సంతోషాన్ని వెతుక్కున్నారు.

17. ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాల నుండి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

17 ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాలన్నీ కలిపి పాటిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతీ సలహా వంటలో ఉపయోగించే ఒక్కో పదార్థం లాంటిది. అవన్నీ కలిపితేనే ఒక రుచికరమైన వంట తయారౌతుంది. మనం కూడా ఈ సలహాలన్నీ కలిపి పాటిస్తేనే మనకున్న భయాలన్నీ పోయి, ధైర్యంగా ప్రీచింగ్‌ చేయగలుగుతాం, ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోగలుగుతాం.

ప్రీచింగ్‌లో సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే ఇవి ఎలా సహాయం చేస్తాయి?

  • సమయం తీసుకుని చక్కగా సిద్ధపడడం

  • ధైర్యం కోసం ప్రార్థించడం

  • యెహోవా మీద, ఇరుగుపొరుగువాళ్ల మీద ఉన్న ప్రేమను మనసులో ఉంచుకోవడం

పాట 80 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి