కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 19

పాట 22 రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదికి రావాలి!

భవిష్యత్తులో యెహోవా తీర్పులు

భవిష్యత్తులో యెహోవా తీర్పులు

“ఎవ్వరూ నాశనమవ్వడం [యెహోవాకు] ఇష్టంలేదు.”2 పేతు. 3:9.

ముఖ్యాంశం

భవిష్యత్తులో యెహోవా తీర్చే తీర్పులు న్యాయంగా, సరైనవిగా ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.

1. మనం ఆసక్తికరమైన సంఘటనలు జరిగే కాలంలో జీవిస్తున్నామని ఎలా చెప్పవచ్చు?

 మనం చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగే కాలంలో జీవిస్తున్నాం. ప్రతీరోజు బైబిలు ప్రవచనాలు మన కళ్లముందే నెరవేరుతున్నాయి. ఉదాహరణకు, “దక్షిణ రాజు . . . ఉత్తర రాజు” ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ఒకరితోఒకరు యుద్ధం చేస్తున్నారు. (దాని. 11:40) దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రపంచ నలుమూలల ప్రకటించబడుతుంది. ఇంకా లక్షలమంది ప్రజలు యెహోవాను సేవించడానికి తరలి వస్తున్నారు. (యెష. 60:22; మత్త. 24:14) అంతేకాదు, “తగిన సమయంలో” మనకు బోలెడంత ఆధ్యాత్మిక ఆహారం అందుతుంది.—మత్త. 24:45-47.

2. మనం ఏం నమ్మకంతో ఉండవచ్చు? అయితే మనం ఏం ఒప్పుకోవల్సిందే?

2 అతి త్వరలో జరిగే ముఖ్యమైన సంఘటనల్ని బాగా అర్థం చేసుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. (సామె. 4:18; దాని. 2:28) మహాశ్రమ మొదలయ్యే సమయానికల్లా దాన్ని తట్టుకుని నిలబడడానికి, కలిసికట్టుగా ఉండడానికి మనకు తెలియాల్సిన విషయాలన్నీ తెలుస్తాయనే నమ్మకంతో ఉండవచ్చు. మరోవైపు, భవిష్యత్తు గురించి మనకు కొన్ని విషయాలు తెలీదని ఒప్పుకోవల్సిందే. అయితే, కొన్ని సంఘటనల గురించి ఒకప్పుడు మనం అనుకున్న విషయాలకు సవరణలు అవసరమయ్యాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు, భవిష్యత్తుకు సంబంధించి మనకు ఏం తెలుసో, మన పరలోక తండ్రి ఏం చేస్తాడో కూడా చూస్తాం.

మనకు ఏం తెలీదు?

3. మహాశ్రమ మొదలైతే ఏ అవకాశం ఉండదని మనం గతంలో చెప్పాం? ఎందుకలా చెప్పాం?

3 ఒక్కసారి మహాశ్రమ మొదలైతే, లోకంలో వాళ్లెవ్వరూ ఇక యెహోవా మీద విశ్వాసం ఉంచడానికి, హార్‌మెగిద్దోన్‌ తప్పించుకోవడానికి అవకాశం లేదని మనం ఒకప్పుడు అనుకున్నాం. అలా ఎందుకు అనుకున్నామంటే, జలప్రళయమప్పుడు జరిగిన సంఘటనలు భవిష్యత్తులో జరిగేవాటికి ఒక సూచనగా ఉన్నాయని మనం అర్థంచేసుకున్నాం. ఉదాహరణకు, జలప్రళయం మొదలయ్యే ముందు యెహోవా ఓడ తలుపుల్ని మూసేసినట్టే, మహాశ్రమ మొదలైనప్పుడు ఆయన ఒక విధంగా సాతాను లోకానికి తలుపులు మూసేస్తాడని అంటే ఇంకెవ్వరూ రక్షించబడలేరని మనం అనుకున్నాం.—మత్త. 24:37-39.

4. జలప్రళయమప్పుడు జరిగిన సంఘటనలు భవిష్యత్తులో జరిగేవాటికి సూచనగా ఉన్నాయని మనం ఇప్పటికీ నమ్ముతున్నామా? వివరించండి.

4 జలప్రళయమప్పుడు జరిగిన ప్రతీ సంఘటన భవిష్యత్తులో జరిగేవాటికి సూచనగా ఉందా? లేదు. ఎందుకంటే బైబిలు దానిగురించి సూటిగా చెప్పట్లేదు. a నిజమే, ‘నోవహు రోజుల్ని’ యేసు తన ప్రత్యక్షత కాలంతో పోల్చాడు. కానీ నోవహు రోజుల్లో జరిగిన ప్రతీది భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయిలో నెరవేరుతుందని ఆయన ఎక్కడా చెప్పలేదు. అలాగే ఓడ తలుపుల్ని మూసేయడం భవిష్యత్తులో ఇంకా దేనికో సూచనగా ఉందని ఆయన చెప్పలేదు. అంతమాత్రాన నోవహు నుండి, జలప్రళయం నుండి మనం ఏ పాఠం నేర్చుకోలేమనా?

5. (ఎ) జలప్రళయం రాకముందు నోవహు తన విశ్వాసాన్ని ఎలా చూపించాడు? (హెబ్రీయులు 11:7; 1 పేతురు 3:20) (బి) ప్రీచింగ్‌ విషయంలో మన కాలానికి, నోవహు కాలానికి ఉన్న పోలిక ఏంటి?

5 యెహోవా హెచ్చరిక ఇచ్చినప్పుడు నోవహు విని, ఓడ కట్టడం ద్వారా తన విశ్వాసాన్ని చూపించాడు. (హెబ్రీయులు 11:7; 1 పేతురు 3:20 చదవండి.) అదేవిధంగా దేవుని రాజ్యం గురించి మంచివార్తను విన్న ప్రజలు తమ విశ్వాసాన్ని పనుల్లో చూపించాలి. (అపొ. 3:17-20) నోవహు ‘నీతిని ప్రకటించాడు’ అని పేతురు రాశాడు. (2 పేతు. 2:5) అయితే, జలప్రళయం రాకముందు భూమ్మీదున్న ప్రతీఒక్కరి దగ్గరికెళ్లి నోవహు ప్రీచింగ్‌ చేశాడో లేదో మనకు తెలీదని ముందటి ఆర్టికల్‌లో చూశాం. కానీ ఈ రోజుల్లో భూమ్మీదున్న ప్రజలందరికీ ప్రీచింగ్‌ చేయడానికి మనం ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నాం. అయితే, మనమెంత ప్రయత్నించినా అంతం రాకముందు మనం ప్రతీఒక్కరి దగ్గరికెళ్లి మంచివార్తను చెప్పలేకపోవచ్చు. ఎందుకని?

6-7. అంతం వచ్చేలోపు భూమ్మీదున్న ప్రతీఒక్కరికి ప్రీచింగ్‌ చేయలేమని మనం ఎందుకు చెప్పవచ్చు?

6 మన ప్రీచింగ్‌ పని ఏ స్థాయిలో జరుగుతుందో యేసు ముందే చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది.” (మత్త. 24:14) ముందెప్పటికన్నా ఇప్పుడు ఆ ప్రవచనం చాలా ఎక్కువ స్థాయిలో నెరవేరుతుంది. 1000 కన్నా ఎక్కువ భాషల్లో రాజ్యసువార్త అందుబాటులో ఉంది. అలాగే jw.org వెబ్‌సైట్‌ వల్ల ప్రపంచ జనాభాలో ఎక్కువశాతం మందికి మంచివార్త తెలుసుకునే అవకాశం ఉంది.

7 అయితే, యేసు తన శిష్యులకు ఇంకో విషయం కూడా చెప్పాడు. అదేంటంటే, తను వచ్చే సమయానికి “నగరాల్లో, గ్రామాల్లో మీ పని పూర్తి” అవ్వదని లేదా ప్రతీఒక్కరికి ప్రకటించలేరని చెప్పాడు. (మత్త. 10:23; 25:31-33) యేసు మాటలు ఇప్పుడు కూడా నిజమౌతున్నాయని చెప్పవచ్చు. ఎలాగంటే లక్షలమంది ప్రజలు మన ప్రీచింగ్‌ని పూర్తిగా నిషేధించిన ప్రాంతాల్లో ఉన్నారు. దానికితోడు, ప్రతీక్షణం వందలమంది పిల్లలు పుడుతున్నారు. నిజమే మనం “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు” ప్రకటించడానికి చేయగలిగినదంతా చేస్తున్నాం. (ప్రక. 14:6) కానీ వాస్తవమేమిటంటే, అంతం వచ్చేలోపు మనం భూమ్మీదున్న ప్రతీఒక్కరికి ప్రకటించలేం!

8. భవిష్యత్తులో యెహోవా తీర్పుల గురించి మనకు ఏ ప్రశ్నలు రావచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

8 అయితే మనకు ఇప్పుడొక ప్రశ్న రావచ్చు. మహాశ్రమ వచ్చే సమయానికి మంచివార్త వినే అవకాశం దొరకని వాళ్ల సంగతేంటి? యెహోవా, అలాగే తీర్పు తీర్చడానికి అధికారం పొందిన తన కుమారుడు వాళ్లను ఏం చేస్తారు? (యోహా. 5:19, 22, 27; అపొ. 17:31) ఈ ఆర్టికల్‌ ముఖ్య లేఖనం చెప్తున్నట్టు, “ఎవ్వరూ నాశనమవ్వడం [యెహోవాకు] ఇష్టంలేదు.” బదులుగా ఆయన “అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.” (2 పేతు. 3:9; 1 తిమో. 2:4) కానీ మంచివార్త వినే అవకాశం దొరకనివాళ్లకు యెహోవా ఎలా తీర్పు తీరుస్తాడు అన్నది ఆయన ఇంకా మనకు చెప్పలేదు. నిజానికి ఆయన ఏం చేశాడో, ఏం చేస్తాడో మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

మహాశ్రమ రాకముందు మంచివార్త వినే అవకాశం దొరకని వాళ్లను యెహోవా ఏం చేస్తాడు? (8వ పేరా చూడండి) c


9. యెహోవా బైబిల్లో ఏ విషయం గురించి చెప్పాడు?

9 అయినా, తను చేసే కొన్ని పనుల గురించి యెహోవా బైబిల్లో చెప్పాడు. ఉదాహరణకు ఆయన “అనీతిమంతుల్ని” అంటే మంచివార్త వినడానికి, తమ ప్రవర్తనను మార్చుకోవడానికి అవకాశం దొరకనివాళ్లను పునరుత్థానం చేస్తాడని బైబిలు చెప్తుంది. (అపొ. 24:15; లూకా 23:42, 43) కాబట్టి ఇప్పుడు మనకు ఇంకొన్ని ప్రశ్నలు రావచ్చు.

10. మనకు ఇంకా ఏ ప్రశ్నలు రావచ్చు?

10 మహాశ్రమ సమయంలో చనిపోయినవాళ్లు పునరుత్థాన నిరీక్షణ లేకుండా శాశ్వతంగా నాశనమైనట్టా? లేఖనాలు స్పష్టంగా ఏం చెప్తున్నాయంటే హార్‌మెగిద్దోన్‌లో యెహోవా, ఆయన సైన్యాలు నాశనం చేయబోయే వ్యతిరేకులు పునరుత్థానం అవ్వరు. (2 థెస్స. 1:6-10) మరి మిగతావాళ్ల సంగతేంటి? అంటే మహాశ్రమ సమయంలో అనారోగ్యంవల్ల, వృద్ధాప్యంవల్ల లేదా ఏదైనా యాక్సిడెంట్‌వల్ల లేదా ఎవరైనా చంపడంవల్ల చనిపోయినవాళ్ల పరిస్థితి ఏంటి? (ప్రసం. 9:11; జెక. 14:13) వాళ్లలో కొంతమందైనా కొత్తలోకంలో అనీతిమంతులుగా పునరుత్థానమౌతారా? మనకు జవాబు తెలీదు.

మనకు ఏం తెలుసు?

11. హార్‌మెగిద్దోన్‌ సమయంలో ప్రజలు దేన్నిబట్టి తీర్పుపొందుతారు?

11 భవిష్యత్తు సంఘటనల గురించి మనకు చాలా విషయాలే తెలుసు. ఉదాహరణకు, క్రీస్తు సహోదరులకు మద్దతిచ్చిన దాన్నిబట్టే హార్‌మెగిద్దోన్‌ సమయంలో ప్రజలకు తీర్పు తీర్చబడుతుందని మనకు తెలుసు. (మత్త. 25:40) క్రీస్తుకు, అభిషిక్తులకు మద్దతిచ్చేవాళ్లే గొర్రెలుగా తీర్పు పొందుతారు. అలాగే క్రీస్తు సహోదరుల్లో కొంతమంది మహాశ్రమ మొదలయ్యాక కూడా ఈ భూమ్మీదే ఉంటారని, హార్‌మెగిద్దోన్‌కి కాస్త ముందు మాత్రమే వాళ్లు పరలోకానికి వెళ్తారని మనకు తెలుసు. కాబట్టి క్రీస్తు సహోదరులు భూమ్మీద ఉన్నంతకాలం వాళ్లకు అలాగే వాళ్లు చేసే పనికి మద్దతిచ్చే అవకాశం ప్రజలకు ఇంకా తెరిచే ఉంటుంది. (మత్త. 25:31, 32; ప్రక. 12:17) ఈ వాస్తవాలు ఎందుకు ప్రాముఖ్యమైనవి?

12-13. “మహాబబులోను” నాశనమవ్వడం చూసినప్పుడు కొంతమంది ఎలా స్పందించవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

12 మహాశ్రమ మొదలయ్యాక “మహాబబులోను” నాశనాన్ని చూసిన కొంతమంది, దీనిగురించి యెహోవాసాక్షులు చాలాకాలంగా చెప్తూ ఉన్నారని గుర్తుచేసుకోవచ్చు. అప్పుడు వాళ్లల్లో కొంతమందైనా మనసు మార్చుకుంటారా?—ప్రక. 17:5; యెహె. 33:33.

13 అదే జరిగితే, మోషే రోజుల్లో ఇలాంటిదే జరిగిందని గుర్తుతెచ్చుకోండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచివెళ్తున్నప్పుడు “చాలామంది విదేశీయులు కూడా వాళ్లతోపాటు వెళ్లారు.” పది తెగుళ్ల గురించి మోషే ఇచ్చిన హెచ్చరికలు నిజమవ్వడం చూసినప్పుడు కొంతమంది యెహోవా మీద విశ్వాసం చూపించడం మొదలుపెట్టి ఉంటారు. (నిర్గ. 12:38) మహాబబులోను నాశనమైనప్పుడు అలాంటిదే ఏదైనా జరగవచ్చు. అంటే అంతానికి కాస్త ముందు ప్రజలు యెహోవా మీద విశ్వాసం ఉంచి మనతోపాటు కొత్తలోకంలో అడుగుపెట్టొచ్చు. మరి మనకు అది అన్యాయంగా అనిపిస్తుందా? కానేకాదు. మనం ‘కరుణ, కనికరం, కోప్పడే విషయంలో నిదానించే, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే’ మన పరలోక తండ్రిలా ఉండాలనుకుంటాం. bనిర్గ. 34:6.

“మహాబబులోను” నాశనాన్ని చూసిన కొంతమంది, దీనిగురించి యెహోవాసాక్షులు చాలాకాలంగా చెప్తూ ఉన్నారని గుర్తుచేసుకోవచ్చు (12-13 పేరాలు చూడండి) d


14-15. ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడా లేదా అన్నది అతను ఎప్పుడు చనిపోతాడు లేదా ఎక్కడ జీవిస్తాడు అన్న దానిమీద ఆధారపడివుందా? వివరించండి. (కీర్తన 33:4, 5)

14 కొన్నిసార్లు బ్రదర్స్‌సిస్టర్స్‌ వాళ్ల బంధువుల గురించి ఇలా అంటుంటారు: “వాళ్లు మహాశ్రమ మొదలవ్వడానికి ముందే చనిపోతే బాగుంటుంది. కనీసం కొత్తలోకంలో పునరుత్థానం అవుతారనే ఆశ అయినా ఉంటుంది.” ఇలాంటి మాటల వెనుక వాళ్ల మంచి మనసు కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడా లేదా అనేది అతను ఎప్పుడు చనిపోతాడు అనే దానిమీద ఆధారపడిలేదు. యెహోవా తిరుగులేని న్యాయాధిపతి కాబట్టి ఆయన తీర్పులకు కూడా తిరుగుండదు. (కీర్తన 33:4, 5 చదవండి.) “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనదే” చేస్తాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు.—ఆది. 18:25.

15 ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడా లేదా అన్నది అతను జీవిస్తున్న ప్రాంతం మీద కూడా ఆధారపడి ఉండదని మనం చెప్పవచ్చు. మంచివార్త వినే అవకాశం దొరకని ప్రాంతాల్లో ఉన్న లక్షలమందిని యెహోవా “మేకలుగా” తీర్పు తీరుస్తాడని మనం అస్సలు ఊహించుకోలేం. (మత్త. 25:46) భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు వాళ్లలో ప్రతీఒక్కరిని మన కన్నా ఎక్కువగా పట్టించుకుంటాడు. మహాశ్రమ కాలంలో జరిగే సంఘటనల్ని యెహోవా ఎలా మలుపు తిప్పుతాడో మనకు తెలీదు. ఆ సంఘటనల్ని చూసినప్పుడు బహుశా కొంతమంది ప్రజలు యెహోవా గురించి నేర్చుకుని, ఆయన మీద విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. అంతేకాదు, యెహోవా దేశాల ముందు తననుతాను పవిత్రపర్చుకుంటున్నప్పుడు వాళ్లు తన పక్షాన నిలబడవచ్చు.—యెహె. 38:16.

మహాశ్రమ మొదలయ్యాక జరిగే సంఘటనలు చూసి కొంతమంది మనసు మార్చుకుంటారా?

16. యెహోవా గురించి మనం ఏం తెలుసుకున్నాం? (చిత్రం కూడా చూడండి.)

16 బైబిలు అధ్యయనం చేయడం ద్వారా యెహోవా మనుషుల్ని ఎంత విలువైనవాళ్లుగా చూస్తాడో మనం తెలుసుకున్నాం. మనం శాశ్వతకాలం జీవించాలని ఆయన తన కొడుకునే ఇచ్చేశాడు. (యోహా. 3:16) యెహోవాకున్న ఆప్యాయతను, అనురాగాన్ని మనం రుచిచూశాం. (యెష. 49:15) మనలో ప్రతీఒక్కరం ఆయనకు పేరుపేరున తెలుసు. నిజానికి మనం ఆయనకు ఎంతబాగా తెలుసంటే ఒకవేళ మనం చనిపోతే, చనిపోకముందు మనం ఎలా ఉన్నామో అచ్చం అలాగే అంటే అవే రూపురేఖలతో, అదే వ్యక్తిత్వంతో, అవే జ్ఞాపకాలతో మనల్ని తిరిగి బ్రతికించగలడు. (మత్త. 10:29-31) కాబట్టి మన ప్రేమగల పరలోక తండ్రి మనలో ప్రతీఒక్కరికి న్యాయంగానే తీర్పు తీరుస్తాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. ఎందుకంటే ఆయన తెలివి, న్యాయం, కరుణగల దేవుడు.—యాకో. 2:13.

యెహోవా మనలో ప్రతీఒక్కరికి న్యాయంగానే తీర్పు తీరుస్తాడని ఖచ్చితంగా నమ్మవచ్చు. ఎందుకంటే ఆయన తెలివి, న్యాయం, కరుణగల దేవుడు (16వ పేరా చూడండి)


17. తర్వాతి ఆర్టికల్‌లో దేనిగురించి చూస్తాం?

17 మన అవగాహనలో వచ్చిన ఈ సవరణల వల్ల ప్రీచింగ్‌ని ముందుకన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేయాలని అర్థమౌతుంది. ఎందుకలా చెప్పవచ్చు? ప్రీచింగ్‌ని ఇంకా ఉత్సాహంగా చేస్తూ ఉండడానికి మనల్ని ఏది కదిలిస్తుంది? ఈ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.

పాట 76 మీకు సంతోషంగా ఉంటుందా?

a ఈ మార్పు ఎందుకు చేశామో అర్థం చేసుకోవడానికి కావలికోట మార్చి 15, 2015 పత్రికలోని, 7-11 పేజీల్లో ఉన్న “ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను” అనే ఆర్టికల్‌ని చూడండి.

b మహాబబులోను నాశనం అయ్యాక, మాగోగువాడైన గోగు దాడి చేసే సమయంలో యెహోవాసాక్షుల్లో ప్రతీ ఒక్కరు పరీక్షించబడతారు. అలాగే మహాబబులోను నాశనం అయ్యాక దేవుని ప్రజల వైపు నిలబడే వాళ్లు కూడా పరీక్షించబడతారు.

c చిత్రం వివరణ: కొంతమందికి మంచివార్త ఎందుకు చేరకపోవచ్చో చూపించే మూడు సన్నివేశాలు: (1) ఒకావిడ మత నమ్మకాల వల్ల ఆమెకు మంచివార్త చెప్పడం మనకు సురక్షితం కాకపోవచ్చు, (2) ఒక జంట నివసించే ప్రాంతంలో ఉన్న రాజకీయ పరిస్థితి వల్ల మనం మంచివార్త ప్రకటించడం చట్టవిరుద్ధం అలాగే ప్రమాదకరం, (3) ఒకతను చాలా మారుమూల ప్రాంతంలో, మనం వెళ్లడానికి కూడా సాధ్యంకాని ప్రాంతంలో ఉండవచ్చు.

d చిత్రం వివరణ: సత్యం వదిలేసిన ఒక యౌవనస్థురాలు “మహాబబులోను” నాశనం గురించి నేర్చుకున్నది గుర్తు చేసుకుంటుంది. ఆమె మనసు మార్చుకొని, యెహోవాసాక్షులైన తన అమ్మానాన్నల దగ్గరకు తిరిగెళ్లిపోయింది. అలా ఎవరైనా ఆఖరి క్షణంలో మనసు మార్చుకుంటే మనం కరుణ, కనికరం గల మన పరలోక తండ్రిలా ఉండాలనుకుంటాం అలాగే ఒక పాపి తిరిగి వచ్చాడని సంతోషిస్తాం.