కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 23

పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

యెహోవా మనల్ని అతిథులుగా పిలుస్తున్నాడు

యెహోవా మనల్ని అతిథులుగా పిలుస్తున్నాడు

“నా డేరా వాళ్లతోపాటు ఉంటుంది, నేను వాళ్ల దేవుడిగా ఉంటాను.”యెహె. 37:27.

ముఖ్యాంశం

యెహోవా గుడారంలో అతిథులుగా ఉండడం అంటే ఏంటో, అతిథులుగా వెళ్లిన మనల్ని ఆయన ఎంత బాగా చూసుకుంటాడో చూస్తాం.

1-2. యెహోవా తన నమ్మకమైన ఆరాధకులకు ఏ ఆహ్వానం ఇస్తున్నాడు?

 యెహోవా మీకు ఏమౌతాడని అడిగితే మీరేం చెప్తారు? మీరు టక్కుమని ‘యెహోవా నా తండ్రి అని, నా దేవుడని, నా ఫ్రెండ్‌’ అని అనొచ్చు. అయితే, ఆయనకు వేరే పాత్రలు కూడా ఉన్నాయి. మీరెప్పుడైనా మిమ్మల్ని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టే వ్యక్తిలా యెహోవాను చూశారా?

2 యెహోవాకు, తన నమ్మకమైన ఆరాధకులకు మధ్య బంధాన్ని ఒక అతిథికి, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తికి మధ్యున్న బంధంతో దావీదు రాజు పోల్చాడు. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా, నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?” (కీర్త. 15:1) ఈ మాటల్నిబట్టి మనం యెహోవా గుడారంలో అతిథులుగా అంటే ఆయనకు ఫ్రెండ్స్‌గా ఉండడానికి ఆహ్వానిస్తున్నాడని అర్థమౌతుంది. అది ఎంత గొప్ప గౌరవమో కదా!

మనం తనకు అతిథులుగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు

3. యెహోవా మొట్టమొదటి అతిథి ఎవరు? యెహోవాకు అలాగే ఆయన అతిథికి ఎలా అనిపించింది?

3 ఈ సృష్టిని చేయడానికి ముందు యెహోవా ఒక్కడే ఉండేవాడు. కానీ యెహోవా తన మొట్టమొదటి కుమారుణ్ణి సృష్టించి, ఒక విధంగా తన గుడారంలోకి ఆయన్ని ఆహ్వానించాడు. దాంతో యెహోవా ఒక కొత్త పాత్రలోకి అడుగుపెట్టాడు, ఆయన ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అయ్యాడు. ఆయన తన కుమారుణ్ణి చూసి “ఎంతో సంతోషించేవాడు” అని బైబిలు చెప్తుంది. తన మొట్టమొదటి అతిథి అయిన యేసు కూడా “ఎప్పుడూ [యెహోవా] ముందు సంతోషిస్తూ” ఉండేవాడు.—సామె. 8:30.

4. యెహోవా ఇంకా ఎవరిని కూడా అతిథులుగా పిలుస్తూ ఉన్నాడు?

4 ఆ తర్వాత యెహోవా దేవదూతల్ని సృష్టించి, వాళ్లను కూడా అతిథులుగా పిలిచాడు. ఆ దేవదూతలు ‘దేవుని కుమారులు’ అని, వాళ్లు ఆయన దగ్గర చాలా సంతోషంగా ఉన్నారని బైబిలు చెప్తుంది. (యోబు 38:7; దాని. 7:10) కొంతకాలం వరకు యెహోవా పరలోకంలో తన చుట్టూవున్న దేవదూతల్ని మాత్రమే తన గుడారంలో అతిథులుగా ఉండనిచ్చాడు. కానీ తర్వాత భూమ్మీదున్న మనుషుల్ని కూడా తన గుడారంలోకి ఆహ్వానించడం మొదలుపెట్టాడు. వాళ్లలో కొంతమంది ఎవరంటే హనోకు, నోవహు, అబ్రాహాము, యోబు. వీళ్లందరూ దేవుని స్నేహితులని లేదా “సత్యదేవునితో” నడిచిన వాళ్లని బైబిలు చెప్తుంది.—ఆది. 5:24; 6:9; యోబు 29:4; యెష. 41:8.

5. యెహెజ్కేలు 37:26, 27 లో ఉన్న ప్రవచనం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

5 వందల సంవత్సరాలుగా యెహోవా తన స్నేహితుల్ని తన గుడారంలోకి అతిథులుగా పిలుస్తూనే ఉన్నాడు. (యెహెజ్కేలు 37:26, 27 చదవండి.) ఉదాహరణకు, తన నమ్మకమైన సేవకులు తనకు దగ్గరి స్నేహితులుగా ఉండాలనేది దేవుని కోరిక అని యెహెజ్కేలు ప్రవచనం నుండి నేర్చుకోవచ్చు. ఆయన “వాళ్లతో ఒక శాంతి ఒప్పందం చేస్తాను” అని మాటిచ్చాడు. పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లు, భూనిరీక్షణ ఉన్నవాళ్లు ఆయన గుడారంలో “ఒకే మందగా” ఐక్యంగా ఉండే సమయం గురించి ఆ ప్రవచనం చెప్తుంది. (యోహా. 10:16) ఆ సమయం ఇప్పుడే!

మనం ఎక్కడున్నా దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు

6. మనం యెహోవా గుడారంలో ఎలా అతిథులమౌతాం? ఆయన గుడారం ఎక్కడుంటుంది?

6 బైబిలు కాలాల్లో ఒక గుడారం విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడేది. అలాగే ఎండ నుండి, వాన నుండి ఆ గుడారం కాపాడేది. ఆ గుడారంలో ఆతిథ్యం ఇచ్చేవాళ్లు అతిథులను బాగా చూసుకునేవాళ్లు. మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు ఆయన గుడారంలో అతిథులం అవుతాం. (కీర్త. 61:4) అక్కడ ఆధ్యాత్మిక ఆహారం పుష్కలంగా ఉంటుంది. అలాగే యెహోవా పిలిచిన వేరే అతిథులు మనకు స్నేహితులు అవుతారు. ఆయన గుడారం ఏదో ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. మీరు బహుశా ఏదైనా ప్రత్యేక సమావేశం కోసం వేరే దేశానికి వెళ్లినప్పుడు, దేవుని గుడారంలోకి వచ్చిన వేరే అతిథుల్ని మీరు కలుసుకుంటారు. అంటే దేవుని నమ్మకమైన ఆరాధకులు ఎక్కడుంటే అక్కడ ఆయన గుడారం ఉన్నట్టే!—ప్రక. 21:3.

7. చనిపోయిన నమ్మకమైన సేవకులు ఇంకా యెహోవా గుడారంలో అతిథులుగానే ఉన్నారని ఎందుకు చెప్పొచ్చు? (చిత్రం కూడా చూడండి.)

7 మరి చనిపోయిన నమ్మకమైన సేవకుల సంగతేంటి? వాళ్లింకా యెహోవా గుడారంలో అతిథులుగా ఉన్నట్టేనా? అవును. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే వాళ్లింకా యెహోవా జ్ఞాపకంలో సజీవంగా ఉన్నారు. యేసు ఇలా చెప్పాడు: “ముళ్లపొద గురించిన భాగంలో మోషే యెహోవాను ‘అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు’ అని పిలుస్తూ చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికించబడతారని సూచించాడు. ఆయన చనిపోయినవాళ్లకు కాదు, బ్రతికున్నవాళ్లకే దేవుడు. ఎందుకంటే వాళ్లంతా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు.”—లూకా 20:37, 38.

చనిపోయిన నమ్మకమైనవాళ్లు కూడా దేవుని గుడారంలో అతిథులుగా ఉన్నారు (7వ పేరా చూడండి)


అతిథులకు వచ్చే ప్రయోజనాలు, బాధ్యతలు

8. యెహోవా గుడారంలో అతిథులుగా ఉండేవాళ్లకు వచ్చే ప్రయోజనాలు ఏంటి?

8 ఒక గుడారంలో విశ్రాంతి తీసుకోవచ్చు, ఎండ నుండి, వాన నుండి కాపాడుకోవచ్చు. అదేవిధంగా, యెహోవా గుడారంలో ఆధ్యాత్మిక హాని నుండి కాపాడుకోవచ్చు అలాగే భవిష్యత్తు మీద ఆశను కలిగివుండవచ్చు. మనం యెహోవాకు దగ్గరగా ఉన్నప్పుడు సాతాను మనకు శాశ్వత హాని చేయలేడు. (కీర్త. 31:23; 1 యోహా. 3:8) కొత్త లోకంలో కూడా యెహోవా తన నమ్మకమైన స్నేహితుల్ని ఆధ్యాత్మిక హాని నుండే కాదు మరణం నుండి కూడా కాపాడుతూనే ఉంటాడు.—ప్రక. 21:4.

9. తన అతిథులు ఎలా ప్రవర్తించాలని యెహోవా కోరుతున్నాడు?

9 యెహోవా గుడారంలో అతిథిగా ఉండడం అంటే ఆయనతో దగ్గరి స్నేహాన్ని ఆనందించడం. అది నిజంగా గొప్ప గౌరవం! మరి ఆయన గుడారంలో అతిథులుగా కొనసాగాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎవరైనా మిమ్మల్ని వాళ్ల ఇంటికి పిలిస్తే, మీరు వాళ్లకు నచ్చినట్టు ఉండాలనుకుంటారు కదా. ఉదాహరణకు, వాళ్లు మిమ్మల్ని చెప్పులు బయట విప్పి రమ్మంటే, మీరు దాన్ని చేస్తారు. అదేవిధంగా తన గుడారంలో అతిథులుగా ఉండేవాళ్ల విషయంలో యెహోవా ఏం కోరుతున్నాడో మనం తెలుసుకోవాలి. మనకు యెహోవా మీదున్న ప్రేమ వల్ల ‘ఆయన్ని పూర్తిగా సంతోషపెట్టడానికి’ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. (కొలొ. 1:10) అలాగే యెహోవా మన స్నేహితుడే కాదు మన తండ్రి, దేవుడు అని గుర్తుంచుకోవాలి. ఆయన మన గౌరవాన్ని పొందడానికి అర్హుడు. (కీర్త. 25:14) ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే ఆయన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. అలాంటి గౌరవం ఉన్నప్పుడు ఆయన్ని బాధపెట్టే పని ఏదీ చేయాలనుకోం. బదులుగా, “అణకువ కలిగి” దేవునితో నడవాలని అనుకుంటాం.—మీకా 6:8.

యెహోవా ఇశ్రాయేలీయులందర్నీ సమానంగా చూశాడు

10-11. యెహోవాకు అందరూ ఒక్కటే అని సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయులతో ప్రవర్తించిన విధానం నుండి ఎలా చెప్పవచ్చు?

10 యెహోవాకు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, ఆయన తన అతిథులందర్నీ సమానంగా చూస్తాడు. (రోమా. 2:11) సీనాయి ఎడారిలో ఆయన ఇశ్రాయేలీయులతో ప్రవర్తించిన విధానం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

11 ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించిన తర్వాత, గుడారం దగ్గర సేవ చేయడానికి యెహోవా యాజకుల్ని పెట్టాడు. ఆ పవిత్ర గుడారానికి సంబంధించిన వేరే పనుల్ని చూసుకోవడానికి ఆయన లేవీయుల్ని పెట్టాడు. అంటే గుడారంలో సేవచేసే వాళ్లను గానీ, దానికి దగ్గరగా జీవించే వాళ్లను గానీ మిగతా వాళ్లకన్నా యెహోవా బాగా పట్టించుకుంటాడనా? కాదు. యెహోవాకు అందరూ ఒక్కటే.

12. కొత్తగా ఏర్పడిన ఇశ్రాయేలు జనాంగంలో ప్రతిఒక్కరూ యెహోవాకు సమానమేనని ఎలా చెప్పవచ్చు? (నిర్గమకాండం 40:38) (చిత్రం కూడా చూడండి.)

12 పాలెంలో ఉన్న ప్రతీఒక్కరికి అంటే వాళ్లకు ప్రత్యేకమైన నియామకాలు ఉన్నా లేకపోయినా, వాళ్లు గుడారానికి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా, యెహోవాతో స్నేహాన్ని ఆనందించే అవకాశం అందరికీ సమానంగా ఉంది. ఉదాహరణకు, గుడారం పైన నిలిచే మేఘాన్ని, అగ్నిని ఇశ్రాయేలు జనాంగం మొత్తం చూడగలిగేది. (నిర్గమకాండం 40:38 చదవండి.) ఆ మేఘం కదిలినప్పుడు గుడారానికి దూరంగా డేరాలు వేసుకున్న వాళ్లు కూడా దాన్ని చూడగలిగేవాళ్లు. వాళ్ల వస్తువులు సర్దుకొని, వాళ్ల ఇంటి డేరాలు పీకేసి మిగతా జనాంగంతో కలిసి బయల్దేరేవాళ్లు. (సంఖ్యా. 9:15-23) అలాగే బయల్దేరడం మొదలుపెట్టండి అని చెప్పడానికి రెండు వెండి బాకాలు ఊదేవాళ్లు. అది కూడా అందరికి పెద్దగా స్పష్టంగా వినబడేది. (సంఖ్యా. 10:2) కాబట్టి గుడారానికి దగ్గరగా జీవించేవాళ్లు యెహోవాకు దగ్గరి స్నేహితులని, దూరంగా ఉండేవాళ్లు ఆయనకు కాస్త దూరంగా ఉన్నారని దానర్థం కాదు. బదులుగా కొత్తగా ఏర్పడిన ఇశ్రాయేలు జనాంగంలో ప్రతిఒక్కరూ యెహోవాకు అతిథులుగా ఉండగలరని, ఆయన నిర్దేశాన్ని-కాపుదలను పొందగలరని అది చూపించింది. అదేవిధంగా, ఇప్పుడు కూడా మనం ఈ భూమ్మీద ఏ మూల ఉన్నా యెహోవా ప్రేమను, శ్రద్ధను, కాపుదలను సమానంగా పొందవచ్చు.

దేవునికి అందరూ సమానమే అని గుడారం ఏర్పాటు చూపించింది (12వ పేరా చూడండి)


ఇప్పుడు కూడా యెహోవాకు అందరూ ఒక్కటే

13. యెహోవాకు ఇప్పుడు కూడా అందరూ ఒక్కటే అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటి?

13 కొంతమంది ప్రపంచ ప్రధాన కార్యాలయం దగ్గర లేదా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం దగ్గర నివసిస్తుండవచ్చు. ఇంకొంతమంది ఏకంగా ఆ బ్రాంచి కార్యాలయాల్లోనే సేవ చేస్తుండవచ్చు. దానివల్ల వాళ్లు అక్కడ జరిగే చాలా పనుల్లో పాల్గొనగలుగుతారు. అలాగే నాయకత్వం వహిస్తున్న సహోదరులతో దగ్గరగా పనిచేయగలుగుతారు. మరికొంతమంది ప్రయాణ పర్యవేక్షకులుగా లేదా వేరే రకాల ప్రత్యేక పూర్తికాల సేవకులుగా సేవ చేస్తుండవచ్చు. మీకు ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే తన అతిథులందర్నీ యెహోవా ప్రేమిస్తాడు అనే నమ్మకంతో ఉండండి. ఆయన వాళ్లందర్నీ శ్రద్ధగా చూసుకుంటాడు. (1 పేతు. 5:7) తన ప్రజలందరికీ ఆయన ఆధ్యాత్మిక ఆహారాన్ని, నిర్దేశాన్ని, కాపుదలను ఇస్తాడు.

14. యెహోవాకు తన అతిథులందరూ ఒక్కటే అనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటి?

14 యెహోవాకు తన అతిథులందరూ ఒక్కటే అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఈ భూమ్మీద ఎక్కడున్న వాళ్లయినా బైబిలు చదవగలిగేలా ఆయన ఏర్పాటు చేశాడు. అసలైతే బైబిల్ని హీబ్రూ, అరామిక్‌, గ్రీకు అనే మూడు భాషల్లో రాశారు. అంటే ఇప్పుడు ఆ భాషలు వచ్చినవాళ్లే దేవునికి దగ్గరగా ఉండి, ఆ భాషలు రానివాళ్ల సంగతి ఇక అంతేనా? అలా ఏమీకాదు.—మత్త. 11:25.

15. యెహోవాకు అందరూ సమానమే అనడానికి మరొక ఉదాహరణ ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

15 యెహోవా బాగా చదువుకున్నవాళ్లను, చాలా భాషలు మాట్లాడేవాళ్లను మాత్రమే అతిథులుగా పిలుస్తాడా? కాదు. ఆయన బాగా చదువుకున్నవాళ్లకే బైబిల్ని అందుబాటులో ఉంచే బదులు ఈ భూప్రపంచంలో ఎక్కడున్న వాళ్లకైనా, వాళ్లు బాగా చదువుకున్నా, చదువుకోకపోయినా ఆయన దాన్ని అందుబాటులో ఉంచాడు. బైబిలు వేల భాషల్లోకి అనువాదమైంది. కాబట్టి ఈ భూప్రపంచంలో ఎక్కడున్న వాళ్లయినాసరే బైబిలు ఏం చెప్తుందో, ఆయనకు ఎలా స్నేహితులు అవ్వొచ్చో తెలుసుకోవచ్చు.—2 తిమో. 3:16, 17.

బైబిల్ని చాలా భాషల్లో అనువదించడం దేవుడు అందర్నీ సమానంగా చూస్తాడని ఎలా రుజువు చేస్తుంది? (15వ పేరా చూడండి)


యెహోవా ‘అంగీకరించే’ అతిథిగా ఉండండి

16. అపొస్తలుల కార్యాలు 10:34, 35 ప్రకారం మనం యెహోవా అంగీకరించే అతిథులుగా ఎలా ఉండవచ్చు?

16 యెహోవా గుడారంలో అతిథులుగా ఉండడం కన్నా గొప్ప గౌరవం ఇంకొకటి లేదు. ఆయన తన అతిథులతో చాలా దయగా, ప్రేమగా ఉంటాడు, అతిథి మర్యాదలు బాగా చేస్తాడు. పైగా ఆయనకు అందరూ ఒక్కటే. ఆడామగ అనే తేడా లేకుండా, మన ప్రాంతం, పుట్టిపెరిగిన పరిస్థితులు, చదువు, జాతి, తెగ, వయసు ఏదైనా అందర్నీ ఆయన సమానంగా పిలుస్తున్నాడు. అయినా, తన ప్రమాణాలు ఎవరైతే పాటిస్తారో వాళ్లని మాత్రమే ఆయన అతిథులుగా అంగీకరిస్తాడు.—అపొస్తలుల కార్యాలు 10:34, 35 చదవండి.

17. తర్వాతి ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

17 కీర్తన 15:1 లో దావీదు ఈ ప్రశ్నలు వేశాడు: “యెహోవా, నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?” తర్వాత ఆ ప్రశ్నలకు ఆయనే జవాబు చెప్పాడు. యెహోవా అంగీకరించే అతిథిగా ఉండాలంటే మనకు ఉండాల్సిన కొన్ని అర్హతలు ఏంటో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

పాట 32 యెహోవా పక్షాన ఉండండి!