కంటెంట్‌కు వెళ్లు

స్పానిష్‌ అనువాద బృందం స్పెయిన్‌కు మారింది

స్పానిష్‌ అనువాద బృందం స్పెయిన్‌కు మారింది

భూమ్మీదున్న ప్రజలందరికీ రాజ్య సువార్త ప్రకటిస్తారని యేసు చెప్పాడు. (మత్తయి 24:14) 1909 నుండి యెహోవాసాక్షుల బైబిలు పుస్తకాలు స్పానిష్‌ భాషలోకి అనువాదమౌతున్నాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రాజ్య సందేశాన్ని తమ మాతృభాషలో వినగలుగుతున్నారు. చైనీస్‌ తర్వాత ఎక్కువమంది చక్కగా మాట్లాడగలిగే భాష స్పానిష్‌. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్లమంది స్పానిష్‌ మాట్లాడతారు.

స్పానిష్‌ అనువాద బృందంలో సభ్యుడైన విలియమ్‌ ఇలా అంటున్నాడు: “స్పానిష్‌ ఒక అంతర్జాతీయ భాష. చాలా దేశాల్లో, వేర్వేరు సంస్కృతుల వాళ్లు ఈ భాషలో మాట్లాడతారు. ... వేర్వేరు నేపథ్యాలకు, విద్యా స్థాయిలకు, జీవన పరిస్థితులకు చెందిన స్పానిష్‌ మాట్లాడే ప్రజల హృదయాలు చేరుకునేలా అనువదించాలన్నదే మా లక్ష్యం.” అందుకోసం స్పానిష్‌ అనువాద జట్టులో పనిచేయడానికి అమెరికా, అర్జెంటీనా, ఉరుగ్వే, ఎల్‌ సాల్వడార్‌, కొలంబియా, గ్వాటిమాల, ప్యూర్టోరికో, మెక్సికో, వెనిజ్యులా, స్పెయిన్‌ దేశాలకు చెందినవాళ్లను తీసుకున్నారు.

దశాబ్దాలపాటు యెహోవాసాక్షుల ప్రచురణలను స్పానిష్‌ భాషలోకి అనువదించే పని అమెరికాలోనే జరిగింది. అర్జెంటీనా, మెక్సికో, స్పెయిన్‌ దేశాలకు చెందిన సాక్షుల సహాయంతో ఆ పని చేసేవాళ్లు. అయితే 1993లో స్పానిష్‌ అనువాద బృందం ప్యూర్టోరికోకు మారింది. దానివల్ల అనువాదకులందరూ ఒకే చోట ఉంటూ కలిసి పనిచేయగలిగారు.

2012 మార్చిలో, స్పానిష్‌ అనువాద విభాగాన్ని మళ్లీ వేరే చోటుకు, అంటే యెహోవాసాక్షుల స్పెయిన్‌ బ్రాంచి కార్యాలయానికి మార్చాలని నిర్ణయించారు. ఎడ్వర్డ్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “కేవలం అనువాదకులను, వాళ్ల వస్తువులను, పరికరాలనే కాదు ఇంకో ముఖ్యమైన ‘సభ్యుడిని’ అంటే అనువాదకుల గ్రంథాలయాన్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి.” దానిలో, వందల బైబిలు అనువాదాలతోపాటు దాదాపు 2,500 పుస్తకాలు ఉన్నాయి.

స్పెయిన్‌లో ప్రేమతో స్వాగతం పలికారు

2013 మే 29న, స్పానిష్‌ అనువాద విభాగ సభ్యులు తమ కొత్త ఇంటికి వచ్చారు. స్పెయిన్‌ బెతెల్‌ కుటుంబం వాళ్లకు ప్రేమతో స్వాగతం పలికింది. అనువాదకులు, పుస్తకాలు, పరికరాలు అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. అయినా చక్కని ప్రణాళికవల్ల, అనువాదకులు కష్టపడి పనిచేయడం వల్ల స్పానిష్‌ పాఠకులకు యెహోవాసాక్షుల పుస్తకాలు సమయానికి అందాయి. “రాజ్య సందేశమే అన్నిటికన్నా ముఖ్యమైనది ... వీలైనంత ఎక్కువమంది స్పానిష్‌ మాట్లాడే ప్రజలు దాని గురించి తెలుసుకోవాలన్నదే మా కోరిక” అని ఎడ్వర్డ్‌ అన్నాడు.