కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ బైబిలు డ్రామా కోసం 27,500 కన్నా ఎక్కువ కిలోల రాయి పొడిని మౌంట్‌ ఈబో స్టూడియోకి తెప్పించారు

మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...

‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశం కోసం వీడియోలు తయారుచేయడం

‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశం కోసం వీడియోలు తయారుచేయడం

ఆగస్టు 10, 2020

 మన ప్రాదేశిక సమావేశాల్లో చూసే వీడియోలు హృదయాల్ని కదిలిస్తాయి, బైబిలు బోధల్ని చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశంలో, పరిపాలక సభ సభ్యులు అలాగే వాళ్ల సహాయకులు ఇచ్చిన 43 ప్రసంగాలతో సహా 114 వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలు తయారుచేయడానికి ఎంత కృషి జరిగిందో, ఎంత ఖర్చు అయిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

 ఈ కార్యక్రమాన్ని తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 మంది సహోదరసహోదరీలు తమ సమయాన్ని, నైపుణ్యాల్ని వెచ్చించారు. ఈ ప్రాజెక్టు కోసం వాళ్లు రెండేళ్ల పాటు దాదాపు 1,00,000 గంటలు కష్టపడ్డారు. అందులో 70,000 గంటలు, నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం” అనే 76 నిమిషాల బైబిలు డ్రామాను తయారుచేయడానికే వెచ్చించారు.

 స్వయంత్యాగ స్ఫూర్తి చూపించిన ఈ స్వచ్ఛంద సేవకుల బాగోగులు చూసుకోవడానికి, అలాగే పనిని పూర్తి చేయడానికి వాళ్లకు అవసరమైన సాంకేతిక మద్ధతు, పరికరాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చు అయింది.

 ఆడియో/వీడియో సేవల విభాగంలో పనిచేసే సహోదరుడు జేరెడ్‌ గాస్మన్‌ ఇలా చెప్తున్నాడు, “మన వీడియోల్లో రకరకాల సంస్కృతుల్ని, ప్రాంతాల్ని చూపించాలని పరిపాలక సభ టీచింగ్‌ కమిటీ ఎంతగానో కోరుకుంటుంది. అది మన ప్రపంచవ్యాప్త సహోదరత్వానికి చక్కగా అద్దంపడుతుంది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం 11 దేశాల్లో ఉన్న 24 టీమ్‌లు ఈ ప్రాజెక్టు మీద పనిచేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలు ఇలా కలిసికట్టుగా పనిచేయాలంటే ఎంతో డబ్బు, ప్రణాళిక, సహకారం అవసరం.”

 చాలా వీడియోలకు ప్రత్యేక పరికరాలు, సెట్‌లు అవసరం. ఉదాహరణకు, నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం” అనే డ్రామా కోసం ప్యాటర్‌సన్‌ దగ్గర్లోని మౌంట్‌ ఈబో స్టూడియోలో సెట్‌లను వేశారు. ఇది అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ఒకవైపు విరాళాలను తెలివిగా ఉపయోగిస్తూనే, డ్రామాను సరైన వివరాలతో రూపొందించడానికి కృషి చేశారు. వాళ్లు ప్రాచీన యెరూషలేము గోడల్ని పోలిన తక్కువ బరువున్న సెట్‌ నిర్మాణాల్ని తయారుచేశారు. వాటిలో ఒక్కోదాన్ని తయారు చేయడానికి ఆరు మీటర్ల (20 అడుగుల) ఎత్తు ఉన్న చెక్క ఫ్రేము తీసుకొని, రాళ్లలా కనిపించే ఫోమ్‌ను దానికి అంటించారు. ఈ “గోడల్ని” ఒకచోటి నుండి ఇంకోచోటికి తీసుకెళ్లి వేర్వేరు సన్నివేశాల్లో ఉపయోగించవచ్చు. దానివల్ల ఎక్కువ సెట్‌లను వేయాల్సిన అవసరం రాదు. అయినప్పటికీ, కేవలం ఈ డ్రామాలోని సెట్‌లను తయారుచేయడానికే దాదాపు 74 లక్షల రూపాయలు (1 లక్ష అమెరికన్‌ డాలర్లు) ఖర్చు అయింది. a

 ఈ వివరాలు తెలుసుకోవడం వల్ల, ఈ సంవత్సరం ప్రాదేశిక సమావేశ కార్యక్రమం మీద మన కృతజ్ఞత పెరుగుతుంది. ఈ కృషి అంతటి వల్ల ప్రపంచవ్యాప్తంగా యెహోవాకు గొప్ప స్తుతి వస్తుందని నమ్ముతున్నాం. మీరు ప్రపంచవ్యాప్త పని కోసం donate.pr418.com ద్వారా, ఇంకా ఇతర పద్ధతుల్లో ఉదారంగా విరాళాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు.

a నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం” డ్రామా కోసం సెట్‌లను కోవిడ్‌-19 మహమ్మారి రాకముందు వేశారు, అప్పట్లో భౌతిక దూరం పాటించాల్సిన అవసరం రాలేదు.