కంటెంట్‌కు వెళ్లు

ఎడమవైపు: సుమారు 1940లలో కొంతమంది పయినీర్లు, గిలియడ్‌ పట్టభద్రులు కలిసి దిగిన ఫొటో. కుడివైపు పైన: జిలోఫాగౌ గ్రామంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘంలోని సహోదర సహోదరీలు. కుడివైపు కింద: 1952 లో కొంతమంది సహోదరులు ఒక బహిరంగ ప్రసంగ అంశాన్ని చూపిస్తున్నారు

మార్చి 29, 2022
సైప్రస్‌

1922-2022: సైప్రస్‌లో మన పనికి వందేళ్లు!

1922-2022: సైప్రస్‌లో మన పనికి వందేళ్లు!

మధ్యధరా సముద్రంలో ఉన్న సైప్రస్‌ అనే ద్వీపంలో, యెహోవాసాక్షులు ప్రకటనా పనిని మొదలుపెట్టి 2022 సంవత్సరంతో 100 ఏళ్లు అయ్యింది. అపొస్తలుడైన పౌలు సైప్రస్‌ (కుప్ర) ద్వీపాన్ని తన మొదటి మిషనరీ యాత్రలో సందర్శించాడు. ఆయనతో పాటు ఆ ద్వీపానికి చెందిన బర్నబా కూడా వెళ్లాడు. 1922 లో ఒక మతబోధకుడు ఆత్మకు చావు ఉందా? (ఇంగ్లీషు) అనే చిన్న పుస్తకాన్ని అందుకున్నప్పుడు ఆధునిక కాలంలో మొట్టమొదటిసారి ఈ ద్వీపానికి బైబిలు సత్యం చేరింది.

రెండేళ్ల తర్వాత, సైప్రస్‌కి చెందిన సైరస్‌ చరాలంబస్‌ అనే బైబిలు విద్యార్థి అమెరికా నుండి సైప్రస్‌కు తిరిగెళ్లాడు. అక్కడ ఆయన, చనిపోయిన వాళ్లు ఎక్కడున్నారు? (ఇంగ్లీషు) అనే కరపత్రాన్ని ప్రతీ పట్టణానికి, గ్రామానికి పంచిపెడుతూ ఉత్సాహంగా ప్రకటించాడు.

ఆంటోనిస్‌ స్పెసియోట్స్‌

అలా ఆ కరపత్రం ఆంటోనిస్‌ స్పెసియోట్స్‌కి చేరింది. అది చదివాక, ఇదే సత్యం అని ఆంటోనిస్‌కి అర్థమైంది. ఆయన అందులో ఉన్న విషయాల్ని తన ఇంటిదగ్గర ఉంటున్న ఆండ్రియాస్‌ క్రిస్టౌతో మాట్లాడాడు. ఆ తర్వాత, వాళ్లిద్దరూ కలిసి నేర్చుకున్న విషయాల్ని వేరేవాళ్లకు చెప్పడం మొదలుపెట్టారు.

గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చీ, వాళ్లు చేస్తున్న ప్రకటనా పనిని అడ్డుకుని, వాళ్లిద్దరిని చర్చీ నుండి బహిష్కరించింది. అయితే వాళ్ల పరిచర్య వృథాగా పోలేదు. వాళ్లు చేసిన కృషి వల్ల, 1930 తర్వాత సైప్రస్‌ ద్వీపంలోని జిలోఫాగౌ అనే గ్రామంలో మొట్టమొదటి సంఘం ఏర్పడింది.

1947 లో, గిలియడ్‌ శిక్షణ పొందిన ఆంటోనియోస్‌ కరాండినోస్‌ అనే మొదటి మిషనరీ సైప్రస్‌ ద్వీపానికి వెళ్లాడు. దానివల్ల అక్కడున్న సహోదరులు ఇంకా ఎక్కువ ప్రకటనా పనిని చేయగలిగారు. 1948 కల్లా 50 మంది ప్రచారకులు ఆ ద్వీపంలో ప్రకటిస్తున్నారు. అంతేకాదు అక్కడ మొదటి బ్రాంచి కార్యాలయం ఏర్పడింది. 1960 లో అక్కడ మన సహోదరులు చట్టపరమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకే నికోసియా పట్టణంలో మొదటి రాజ్యమందిరం నిర్మాణం జరిగింది. సాక్షుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. అలాగే 1969 లో కొత్తగా ఒక పెద్ద బ్రాంచి కార్యాలయం సమర్పణ జరిగింది.

అయితే, దీనితోపాటు అక్కడ వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. సుమారు 1965 లో, మిలిటరీలో చేరడానికి నిరాకరించిన యౌవన సహోదరుల్ని జైల్లో వేశారు. కొంతమంది సహోదరుల్ని చిత్రహింసలు పెట్టి బలవంతంగా మిలిటరీలో చేర్పించాలని చూశారు.

లిమాసోల్‌కి చేరిన విపత్తు సహాయక అవసరాలు

1974 లో అక్కడ యుద్ధం మొదలవ్వడంతో మరిన్ని సవాళ్లు వచ్చాయి. దాదాపు 300 మంది సహోదర సహోదరీలు శరణార్థులుగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. బ్రాంచి కార్యాలయంలో ఉంటున్న బెతెల్‌ కుటుంబం మొత్తం అక్కడ నుండి ఖాళీ చేయాల్సొచ్చింది. వేరే దేశాల్లో ఉంటున్న సహోదర సహోదరీలు సైప్రస్‌లో ఉంటున్న మనవాళ్లకు అవసరమైనవి పంపించి సహాయం చేశారు. అలాగే, ఆ ద్వీపం నుండి వేరే ప్రాంతానికి వెళ్లిన మనవాళ్లను, కొంతమంది సహోదరులు వాళ్ల ఇంట్లో పెట్టుకుని చూసుకున్నారు.

ఆ తర్వాతి సంవత్సరాల్లో ప్రకటనా పని ముందుకు వెళ్లింది. 2006 లిమాసోల్‌లో జరిగిన “విడుదల సమీపించింది” అనే జిల్లా సమావేశంలో సహోదరులు ఒక మైలురాయిని చేరుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి సైప్రస్‌లో ఉన్న యెహోవాసాక్షులందరూ ఒక్కచోట కలుసుకుని ఈ సమావేశాన్ని జరుపుకున్నారు.

2006 లో లిమాసోల్‌లో జరిగిన “విడుదల సమీపించింది” జిల్లా సమావేశం

ఇప్పుడు ఈ ద్వీపంలో 2,866 మంది ప్రచారకులు ఉన్నారు. వీళ్లు 14 భాషలకు చెందిన 41 సంఘాల్లో, 17 గ్రూపుల్లో సేవచేస్తున్నారు. 2021 లో 5,588 మంది క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు.

సైప్రస్‌లో ఉన్న సహోదర సహోదరీలతో మనమూ ఆనందిస్తాం. వాళ్లు యెహోవా సహాయంతో, ఇదే స్ఫూర్తిని చూపిస్తూ ముందుకు వెళ్తారనే నమ్మకంతో ఉన్నాం.—ఫిలిప్పీయులు 3:16.