కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఘనతకు అర్హులైనవాళ్లను ఘనపర్చండి

ఘనతకు అర్హులైనవాళ్లను ఘనపర్చండి

“సింహాసనం మీద కూర్చున్న దేవునికి, గొర్రెపిల్లకు యుగయుగాలు స్తుతి, ఘనత, మహిమ, శక్తి కలగాలి.”ప్రక. 5:13.

పాటలు: 9, 14

1. మనం ఎలాంటివాళ్లను ఘనపరుస్తాం? ఈ ఆర్టికల్‌లో ఏమి నేర్చుకుంటాం?

 మనుష్యులను మనం ఏవిధంగా ఘనపరుస్తాం? వాళ్లను ప్రత్యేకంగా చూడడం ద్వారా, గౌరవించడం ద్వారా ఘనపరుస్తాం. మామూలుగా, ఏదైనా గొప్పపని చేసినవాళ్లను లేదా ముఖ్యమైన నియామకంలో, స్థానంలో ఉన్నవాళ్లను మనం ఘనపరుస్తాం. అయితే మనం ఎలాంటివాళ్లను ఘనపర్చాలో, ఎందుకు ఘనపర్చాలో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

2, 3. (ఎ) అందరికన్నా ముఖ్యంగా యెహోవా ఎందుకు ఘనతకు అర్హుడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ప్రకటన 5:13⁠లో ప్రస్తావించబడిన గొర్రెపిల్ల ఎవరు? ఆయన్ను మనమెందుకు ఘనపర్చాలి?

2 ‘సింహాసనం మీద కూర్చున్న దేవుడు, గొర్రెపిల్ల’ ఘనతకు అర్హులు అని ప్రకటన 5:13⁠లో ఉంది. ‘సింహాసనం మీద కూర్చున్న దేవుడు’ అంటే యెహోవా. ప్రకటన 4వ అధ్యాయంలో గమనిస్తే, “యుగయుగాలు జీవించే” దేవుడు ఎందుకు ఘనతకు అర్హుడో వివరించే ఒక కారణాన్ని పరలోకంలోని అదృశ్య ప్రాణులు చెప్తున్నారు. వాళ్లు ఇలా అంటున్నారు, “యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.” —ప్రక. 4:9, 11.

3 ప్రకటన 5:13⁠లో ప్రస్తావించబడిన ‘గొర్రెపిల్ల’ యేసుక్రీస్తు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే యేసు భూమ్మీదున్నప్పుడు, ఆయన “లోక పాపాల్ని తీసేసే దేవుని గొర్రెపిల్ల!” అని పిలువబడ్డాడు. (యోహా. 1:29) ఆయన ఘనతకు అర్హుడని చెప్పడానికి అది ఎంత చక్కని కారణమో కదా! ఏ రాజైనా తన ప్రజలకోసం విమోచన క్రయధనంగా చనిపోయాడా? యేసు “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” కాబట్టి ఆయన్ను మనం ఘనపర్చాలి. (1 తిమో. 6:14-16) శక్తివంతమైన వేలాది దూతలు ఇలా పాడుతున్నారు, “వధించబడిన గొర్రెపిల్ల శక్తిని, ఐశ్వర్యాన్ని, తెలివిని, బలాన్ని, ఘనతను, మహిమను, స్తుతిని పొందడానికి అర్హుడు.” మీ మనసులోని భావాలు కూడా అవేనా?—ప్రక. 5:12.

4. మనం యెహోవాను, యేసును ఎందుకు ఖచ్చితంగా ఘనపర్చాలి?

4 మనుషులందరికీ తీర్పు తీర్చే అధికారాన్ని యెహోవా యేసుకు ఇచ్చాడని యోహాను 5:22, 23 చెప్తోంది. మనం యేసును ఘనపర్చడానికి అది ముఖ్యమైన కారణం. మనం ఆయన్ను ఘనపరిస్తే యెహోవాను కూడా ఘనపర్చినట్లే. యెహోవాను, యేసును ఘనపరిస్తే మనం నిత్యజీవాన్ని సొంతం చేసుకుంటాం.—కీర్తన 2:11, 12 చదవండి.

5. మనం మనుషులను కూడా కొంతమేరకు ఎందుకు ఘనపర్చాలి, గౌరవించాలి?

5 ‘దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు.’ (ఆది. 1:27, NW) అంటే చాలామంది దేవునికున్న లాంటి లక్షణాల్ని చూపించగలరని దానర్థం. ఉదాహరణకు మనుషులు ప్రేమ, దయ, జాలి వంటి లక్షణాల్ని చూపించగలరు. అంతేకాదు దేవుడు మనుషులకు మనస్సాక్షిని అంటే తప్పొప్పులను, నిజానిజాలను, మంచిచెడులను గుర్తించే సామర్థ్యాన్ని ఇచ్చాడు. (రోమా. 2:14, 15) యెహోవా క్రమాన్ని, సమాధానాన్ని ప్రేమించే దేవుడు కాబట్టే చాలామంది శుభ్రంగా, అందంగా ఉన్నవాటిని ఇష్టపడతారు, అలాగే ఇతరులతో సమాధానంగా ఉండాలని కోరుకుంటారు. ఖచ్చితంగా, మనుషులందరూ ఏదోక రకంగా యెహోవాను అనుకరించగలిగే సామర్థ్యంతో చేయబడ్డారు. కాబట్టి మనం మనుషులను కూడా కొంతమేరకు ఘనపర్చాలి, గౌరవించాలి.—కీర్త. 8:5.

మనుషులను ఎంతమేరకు ఘనపర్చాలి?

6, 7. మనుషుల్ని ఘనపర్చే విషయంలో యెహోవా సాక్షులు ఇతరులకు ఎలా భిన్నంగా ఉన్నారు?

6 సాటి మనుషుల్ని ఘనపర్చాలని మనకు తెలుసుగానీ, వాళ్లను ఏవిధంగా ఘనపర్చాలి, ఎంతమేరకు ఘనపర్చాలి వంటివి తెలుసుకోవడం మనకు కష్టంగా అనిపించవచ్చు. ఎంతోమంది అపరిపూర్ణ మనుషులపై ఈ సాతాను లోక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు కొంతమందిని యెహోవా చెప్పినదానికన్నా ఎక్కువగా ఘనపరుస్తూ, గౌరవిస్తూ వాళ్లను తమ దేవుళ్లుగా చేసుకుంటారు. రాజకీయ నాయకుల్ని, మతనాయకుల్ని, క్రీడాకారుల్ని, సినిమా తారల్ని, ఇతర ప్రముఖుల్ని ప్రజలు ఎంతగా అభిమానిస్తారంటే వాళ్లను దేవుళ్లుగా చూస్తారు. అందుకే చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలామంది వాళ్లను ఆదర్శంగా తీసుకుంటూ వాళ్లు వేసుకునేలాంటి బట్టల్ని వేసుకోవడం, వాళ్లలా ప్రవర్తించడం చేస్తుంటారు.

7 కానీ మనుషుల్ని అంతలా ఘనపర్చడం తప్పని నిజ క్రైస్తవులమైన మనకు తెలుసు. ఇప్పటివరకు భూమ్మీద జీవించిన వాళ్లందరిలో మనం ఆదర్శంగా తీసుకోదగ్గ ఏకైక వ్యక్తి యేసు. (1 పేతు. 2:21) “అందరూ పాపం చేశారు, దేవుని మహిమను ప్రతిబింబించలేకపోతున్నారు” అని మనం గుర్తుంచుకోవాలి. (రోమా. 3:23) కాబట్టి ఏ మనిషినీ మనం ఆరాధించకూడదు. మనం ఎవరినైనా అతిగా ఘనపరిస్తే యెహోవా సంతోషించడు.

8, 9. (ఎ) యెహోవాసాక్షులు పైఅధికారులకు ఎలా సహకరిస్తారు? (బి) మనం వాళ్ల మాట ఎప్పుడు వినం?

8 అయితే అధికారంలో ఉన్న కొంతమందిని మనం ఘనపర్చాల్సిన, గౌరవించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ప్రభుత్వాధికారుల గురించి, వాళ్లు మనకోసం చేసేవాటి గురించి ఆలోచించండి. శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజల అవసరాల్ని తీర్చాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. వాళ్లు చేసే పనివల్ల అందరూ ప్రయోజనం పొందుతారు. అందుకే వాళ్లను ‘పై అధికారులుగా’ భావించమని, వాళ్లు పెట్టే నియమాల్ని పాటించమని చెప్తూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “వాళ్లకు ఇవ్వాల్సినవన్నీ వాళ్లకు ఇచ్చేయండి. అంటే, పన్ను కట్టాల్సిన వాళ్లకు పన్ను కట్టండి; ఘనపర్చాల్సిన వాళ్లను ఘనపర్చండి.”—రోమా. 13:1, 7

9 యెహోవాసాక్షులముగా, మనం పైఅధికారుల్ని అన్నివిధాలా గౌరవిస్తాం. అయితే గౌరవం చూపించే విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కాబట్టి దేశాన్నిబట్టి పైఅధికారులు మన నుండి ఆశించే విషయాలు మారవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులకు వాళ్ల పనుల్లో మనం సహకరిస్తాం. కానీ యెహోవా ఇష్టపడని ఏదైనా పనిని చేయమని చెప్తే మాత్రం మనం చేయం. అలాంటి సందర్భాల్లో మనం మనుషులకు కాదుగానీ యెహోవాకు లోబడతాం, ఆయన్నే ఘనపరుస్తాం.—1 పేతురు 2:13-17 చదవండి.

10. గతంలోని యెహోవా సేవకులు మనకు ఏవిధంగా మంచి ఆదర్శాన్ని ఉంచారు?

10 ప్రభుత్వాల్ని, ప్రభుత్వాధికారుల్ని ఘనపర్చే విషయంలో గతంలోని యెహోవా సేవకుల నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈ విషయంలో యోసేపు మరియలు చక్కని ఆదర్శం ఉంచారు. తమ దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని రోమా ప్రభుత్వం అనుకుంది. అందుకోసం ప్రజలు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ప్రజల్ని కోరింది. మరియ నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ యోసేపు మరియలు బేత్లెహేముకు వెళ్లి తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. (లూకా 2:1-5) మానవ పరిపాలకుల్ని గౌరవించిన మరో వ్యక్తి అపొస్తలుడైన పౌలు. పౌలుపై నిందారోపణ జరిగినప్పుడు, అతను రాజైన హేరోదు అగ్రిప్ప ముందు, యూదయకు అధిపతిగా ఉన్న రోమాధికారియైన ఫేస్తు ముందు నిలబడి తన వాదనను గౌరవపూర్వకంగా వివరించాడు.—అపొ. 25:1-12; 26:1-3.

11, 12. (ఎ) మతనాయకుల్ని ప్రత్యేకంగా చూస్తూ ఘనపర్చడం ఎందుకు తప్పు? (బి) ఆస్ట్రియాలోని యెహోవాసాక్షి ఒక రాజకీయ నాయకుణ్ణి గౌరవించడం వల్ల ఏం జరిగింది?

11 మరి మతనాయకుల సంగతేంటి? వాళ్లను ప్రత్యేకంగా చూస్తూ ఘనపర్చాలా? సాటి మనుషులకు ఇచ్చే గౌరవాన్నే వాళ్లకు కూడా ఇస్తాం. అంతేకానీ వాళ్లను ప్రత్యేకంగా చూస్తూ ఘనపర్చడం తప్పు. ఒకవేళ అలా ఘనపర్చాలని వాళ్లు కోరుకున్నా మనం అలా చేయం. ఎందుకు? ఎందుకంటే అబద్ధమతం దేవుని గురించిన, బైబిలు గురించిన సత్యాన్ని బోధించడం లేదు. అందుకే యేసు అబద్ధమత బోధకుల్ని విమర్శిస్తూ వాళ్లను వేషధారులని, చెడ్డ నాయకులని పిలిచాడు. (మత్త. 23:23, 24) మరి ప్రభుత్వాధికారుల విషయమేమిటి? వాళ్లకు తగినంత గౌరవాన్నిస్తూ ఘనపర్చడంలో తప్పేమీ లేదు. నిజానికి అలా గౌరవించడం వల్ల వాళ్లు కొన్నిసార్లు మనకు సహాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

12 అలా సహాయం చేసినవాళ్లలో ఆస్ట్రియా రాజకీయ నాయకుడైన డాక్టర్‌ హైన్రిక్‌ గ్లీస్న ఒకరు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు అతన్ని అరెస్టు చేసి కాన్‌సంట్రేషన్‌ క్యాంపుకు పంపించడం కోసం ట్రైన్‌లోకి ఎక్కించారు. ఆ ట్రైన్‌లో అతనికి ఆస్ట్రియాకు చెందిన లేయోపొల్ట్‌ ఎంగ్‌లైట్నా అనే ఉత్సాహవంతమైన యెహోవాసాక్షి కలిశాడు. సహోదరుడు ఎంగ్‌లైట్నా తన నమ్మకాల్ని డాక్టర్‌ హైన్రిక్‌కు గౌరవపూర్వకంగా వివరించాడు, అతను శ్రద్ధగా విన్నాడు. అయితే యుద్ధం అయిపోయాక, డాక్టర్‌ హైన్రిక్‌ తన పలుకుబడి ఉపయోగించి ఆస్ట్రియాలోని సాక్షులకు ఎన్నోసార్లు సహాయం చేశాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. యెహోవాసాక్షులు ప్రభుత్వాధికారుల్ని గౌరవించడం వల్ల పొందిన ఇతర ప్రయోజనాల గురించి మీకు తెలిసివుండవచ్చు.

ఇతరుల్ని ఘనపర్చండి

13. ముఖ్యంగా ఎవర్ని మనం ఘనపర్చాలి, గౌరవించాలి? ఎందుకు?

13 మన తోటి సహోదరసహోదరీలు కూడా ఘనతకు, గౌరవానికి అర్హులు. ముఖ్యంగా సంఘపెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు, బ్రాంచి కమిటీ సభ్యులు, పరిపాలక సభ సభ్యులు వంటి నాయకత్వం వహించేవాళ్లను మనం ఘనపర్చాలి, గౌరవించాలి. (1 తిమోతి 5:17 చదవండి.) వాళ్లు దేవుని ప్రజల అవసరాలపట్ల శ్రద్ధ తీసుకుంటారు, బైబిలు అలాంటి వాళ్లను ‘మనుషుల్లో వరాలు’ అని పిలుస్తోంది. (ఎఫె. 4:8) కాబట్టి వాళ్ల జాతి, చదువు, సమాజంలో పేరు, ఆర్థిక స్తోమత ఏదైనా మనం వాళ్లను ఘనపర్చాలి, గౌరవించాలి. ఈ విషయంలో తొలి క్రైస్తవులు మంచి ఆదర్శాన్ని ఉంచారు. నాయకత్వం వహించే సహోదరుల్ని వాళ్లు ఘనపర్చారు, నేడు మనం కూడా అదే చేస్తాం. అయితే మనం వాళ్లను దూతల్లా పరిగణిస్తూ మనుషుల కన్నా ఉన్నతమైనవాళ్లగా చూడం. కానీ వాళ్లు కష్టపడి చేస్తున్న పనినిబట్టి, చూపిస్తున్న వినయాన్ని బట్టి వాళ్లను గౌరవిస్తాం, ఘనపరుస్తాం.2 కొరింథీయులు 1:24; ప్రకటన 19:10 చదవండి.

14, 15. ఎంతోమంది మతనాయకులకు, క్రైస్తవ పెద్దలకు ఉన్న తేడా ఏమిటి?

14 నిజానికి అలాంటి సంఘపెద్దల్ని వినయంగల కాపరులతో పోల్చవచ్చు. ఇతరులు తమను ప్రముఖమైన వ్యక్తుల్లా చూడాలని పెద్దలు ఆశించరు. మనకాలంలోని మతనాయకుల గురించి, అలాగే తన కాలంలోని మతనాయకుల గురించి యేసు ఇలా అన్నాడు, ‘వాళ్లకు విందుల్లో ప్రత్యేక స్థానాలు, సభామందిరాల్లో ముందువరుస కుర్చీలు కావాలి. సంతల్లో నమస్కారాలు పెట్టించుకోవడం, రబ్బీ అని పిలిపించుకోవడం వాళ్లకు ఇష్టం.’ కానీ సంఘపెద్దలు అలాంటివాళ్లు కాదు.—మత్త. 23:6, 7.

15 క్రైస్తవ పెద్దలు యేసు చెప్పిన ఈ మాటలు పాటిస్తారు: “మీరు మాత్రం రబ్బీ అని పిలిపించుకోకూడదు, ఎందుకంటే ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సోదరులు. అంతేకాదు భూమ్మీద ఎవర్నీ మీరు తండ్రీ అని పిలవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. అలాగే, మీరు నాయకులు అని కూడా పిలిపించుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు. మీలో గొప్పవాడు మీకు సేవకుడిగా ఉండాలి. తనను తాను గొప్ప చేసుకునే వ్యక్తి తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు.” (మత్త. 23:8-12) ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటిలోని సంఘపెద్దలు వినయంగా ఉంటూ, యేసు మాటల్ని పాటిస్తే తోటి సహోదరసహోదరీలు వాళ్లను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఘనపరుస్తారు.

సంఘపెద్దలు వినయంగా సేవ చేసినప్పుడు తోటి సహోదరులు వాళ్లను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఘనపరుస్తారు (13-15 పేరాలు చూడండి)

16. ఇతరుల్ని ఘనపరుస్తూ ఉండడానికి మనమెందుకు కృషిచేస్తూ ఉండాలి?

16 ఇతరుల్ని ఘనపర్చడం ఎలాగో నేర్చుకోవడానికి మనకు సమయం పట్టవచ్చు. తొలి క్రైస్తవులకు కూడా సమయం పట్టింది. (అపొ. 10:22-26; 3 యోహా. 9, 10) కానీ నేర్చుకోవడానికి మనం చేసే కృషి మంచి ఫలితాల్ని తీసుకొస్తుంది. యెహోవా చెప్తున్న విధంగా మనం ఇతరుల్ని ఘనపరిస్తే ఎన్నో ప్రయోజనాలు పొందుతాం.

ఘనపర్చడంవల్ల వచ్చే లాభాలు

17. అధికారం ఉన్నవాళ్లను ఘనపర్చడంవల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

17 సమాజంలో అధికారం ఉన్నవాళ్లను మనం ఘనపర్చి, గౌరవించినప్పుడు ప్రకటించే విషయంలో మనకున్న హక్కును వాళ్లు సమర్థించే అవకాశాలు చాలా ఉంటాయి. మనం చేసే ప్రకటనా పనిపై వాళ్లకు మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీలో ఇలాగే జరిగింది. బీర్జిట్‌ అనే పయినీరు సహోదరి తన కూతురి స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి వెళ్లింది. సాక్షుల పిల్లలు తమ స్కూల్‌లో ఉండడం తమకు సంతోషంగా ఉందనీ, వాళ్లు స్కూల్లో మంచి వాతావరణాన్ని నెలకొల్పుతారనీ అక్కడ టీచర్లు చెప్పారు. అప్పుడు బీర్జిట్‌ వాళ్లతో ఇలా అంది, “ప్రవర్తన విషయంలో దేవుని ప్రమాణాల్ని పాటించాలని మా పిల్లలకు నేర్పుతాం. అందులో భాగంగానే, టీచర్లను గౌరవించాలని, వాళ్లను ఘనపర్చాలని కూడా చెప్తాం.” పిల్లలందరూ సాక్షుల పిల్లల్లా ఉంటే వాళ్లకు పాఠాలు చెప్పడం తేలిగ్గా ఉంటుందని ఓ టీచర్‌ చెప్పింది. యెహోవాసాక్షుల పిల్లలపై అక్కడి టీచర్లకు ఎంత మంచి అభిప్రాయం ఉందంటే, కొన్ని వారాల తర్వాత జరిగిన సమావేశానికి ఓ టీచర్‌ హాజరయ్యింది.

18, 19. సంఘపెద్దల్ని ఘనపర్చే విషయంలో మనమేమి గుర్తుంచుకోవాలి?

18 సంఘపెద్దల్ని ఏవిధంగా ఘనపర్చాలో అర్థంచేసుకోవడానికి దేవుని వాక్యంలోని సూత్రాలు మనకు సహాయం చేస్తాయి. (హెబ్రీయులు 13:7, 17 చదవండి.) కష్టపడి పనిచేస్తున్నందుకు మనం వాళ్లను మెచ్చుకోవచ్చు, అలా మెచ్చుకోవాలి కూడా. వాళ్లు ఇస్తున్న నిర్దేశాల్ని పాటించినప్పుడు వాళ్లు తమ బాధ్యతల్ని సంతోషంగా నిర్వర్తించగలుగుతారు. అంతేకాదు మనం వాళ్ల విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బైబిలు చెప్తోంది. కానీ దానర్థం, సంఘపెద్దలు వేసుకునేలాంటి బట్టలే వేసుకోవాలని, అచ్చం వాళ్లలాగే మాట్లాడాలని, బోధించాలని కాదు. ఒకవేళ మనమలా చేస్తే, క్రీస్తుకు బదులు మనుషుల్ని అనుకరించినట్లు అవుతుంది. సంఘపెద్దలు కూడా మనలాగే అపరిపూర్ణులని మనం మర్చిపోకూడదు.

19 మనం సంఘపెద్దల్ని ఘనపర్చాలి, గౌరవించాలిగానీ వాళ్లను ప్రముఖులుగా చూడకూడదు. అలా చేయడంవల్ల వాళ్లకు ప్రయోజనం కలుగుతుంది. ఏ విధంగా? వాళ్లకు వినయంగా ఉండడం మరింత తేలికౌతుంది, తాము ఇతరులకన్నా గొప్పవాళ్లమనే లేదా తాము చేసేది ఎల్లప్పుడూ సరైనదనే ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతారు.

20. ఇతరుల్ని ఘనపర్చడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

20 ఇతరుల్ని ఘనపర్చడం వల్ల మనలో స్వార్థం పెరగదు అలాగే ఇతరులు మనల్ని ప్రత్యేకమైన వాళ్లుగా చూసినప్పుడు వినయంగా ఉండగలుగుతాం. ఒకవేళ మనం గౌరవించే ఎవరైనా మనం నొచ్చుకునే పనిచేసినా మనం అభ్యంతరపడకుండా ఉండగలుగుతాం. మరో ప్రయోజనం ఏమిటంటే, యెహోవా సంస్థతో కలిసి ఉండడానికి అది మనకు సహాయం చేస్తుంది. ఒక వ్యక్తి యెహోవాసాక్షి అయినా, కాకపోయినా దేవుని సంస్థ ఏ మనిషినీ అతిగా ఘనపర్చదు.

21. ఇతరుల్ని ఘనపర్చడం వల్ల వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏమిటి?

21 ఇతరుల్ని సరైనవిధంగా ఘనపర్చడం వల్ల వచ్చే అత్యంత ప్రాముఖ్యమైన ప్రయోజనమేమిటంటే, మనం దేవున్ని సంతోషపెడతాం. యెహోవా కోరుకునేది చేస్తాం, ఆయనకు నమ్మకంగా ఉండగలుగుతాం. అప్పుడు, ఎవ్వరూ నమ్మకంగా ఉండలేరని నిందించిన సాతానుకు యెహోవా చెంపపెట్టు లాంటి జవాబు ఇవ్వగలుగుతాడు. (సామె. 27:11) ఇతరుల్ని సరైన విధంగా ఎలా ఘనపర్చాలో లోకంలోని చాలామందికి అర్థం కావడంలేదు. యెహోవా కోరుకున్నట్లుగా ఇతరుల్ని ఏవిధంగా ఘనపర్చాలో తెలుసుకున్నందుకు మనమెంతో కృతజ్ఞులం.