కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసం చూపిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోండి!

విశ్వాసం చూపిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోండి!

“ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో అడుగుతూ ఉండాలి.”యాకో. 1:6.

పాటలు: 54, 42

1. కయీను ఏ నిర్ణయం తీసుకున్నాడు? దాని ఫలితం ఏమిటి?

 కయీను చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. అతను తన పాపపు కోరికల్ని అదుపు చేసుకుని ప్రయోజనం పొందాలా, లేక తన కోరికల ప్రకారం ప్రవర్తించి చెడు పర్యవసానాలు అనుభవించాలా అని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అయితే కయీను చెడ్డ నిర్ణయం తీసుకున్నాడని బైబిలు చెప్తుంది. అతను తీసుకున్న నిర్ణయం వల్ల తన తమ్ముడి చావుకు కారణం అయ్యాడు, అలాగే సృష్టికర్తతో తనకున్న స్నేహాన్ని కోల్పోయాడు.—ఆది. 4:3-16.

2. మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

2 మనం కూడా జీవితంలో చిన్నా-పెద్దా నిర్ణయాలు ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం తీసుకునే ఏ నిర్ణయమైనా మన జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మనం మంచి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు తక్కువ ఉంటాయి, జీవితం సాఫీగా సాగుతుంది. అదే చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో చాలా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.—సామె. 14:8.

3. (ఎ) తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? దేవుని మీద విశ్వాసం మనకు సహాయం చేస్తుంది. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఆయన ఇస్తాడనీ, అలా ఇవ్వాలనే కోరిక ఆయనకు ఉందనీ మనం నమ్మాలి. అంతేకాదు మనం బైబిలు మీద, బైబిలు ఇచ్చే సలహాల మీద విశ్వాసం ఉంచాలి. (యాకోబు 1:5-8 చదవండి.) యెహోవాకు దగ్గరౌతూ ఆయన వాక్యమైన బైబిల్ని ప్రేమించే కొద్దీ, మనకు ఏది మంచిదో ఆయనకు బాగా తెలుసనే నమ్మకం మనకు ఏర్పడుతుంది. అప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సలహా కోసం బైబిల్లో చూస్తాం. అయితే మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు? మనం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చా?

నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో ఒక భాగం

4. ఆదాము ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? దానివల్ల ఏమి జరిగింది?

4 మానవ చరిత్ర ఆరంభం నుండి మనుషులు ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మొదటి మనిషైన ఆదాము, తనను సృష్టించిన యెహోవా మాట వినాలా, లేక తన భార్యయైన హవ్వ మాట వినాలా అని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అయితే ఆదాము తన భార్య మాట వినాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా యెహోవా అతన్ని ఏదెను తోటనుండి పంపించేశాడు, చివరికి అతను చనిపోయాడు. ఆదాము తీసుకున్న ఆ చెడ్డ నిర్ణయం వల్లే మనందరం ఇప్పటికీ బాధలు పడుతున్నాం.

5. నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యతను మనమెలా చూడాలి?

5 అసలు నిర్ణయాలు తీసుకోవాల్సిన పనే లేకపోతే, జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది అనుకుంటారు. బహుశా మీకూ అలా అనిపించవచ్చు. అయితే యెహోవా మనల్ని ఏమీ ఆలోచించలేని లేదా నిర్ణయాలు తీసుకోలేని రోబోల్లా సృష్టించలేదని గుర్తుంచుకోండి. అంతేకాదు తెలివైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేయడానికి ఆయన మనకు బైబిల్ని ఇచ్చాడు. నిర్ణయాల్ని మనమే తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అలా చేయడంవల్ల ప్రయోజనం పొందుతాం. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం.

6, 7. ఇశ్రాయేలీయులు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? వాళ్లు ఎందుకు తెలివైన నిర్ణయం తీసుకోలేకపోయారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 వాగ్దాన దేశంలో నివసిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించాలా లేక ఇతర దేవుళ్లను ఆరాధించాలా అని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. (యెహోషువ 24:15 చదవండి.) అది చాలా తేలికైన నిర్ణయమని అనిపించినప్పటికీ, వాళ్ల ప్రాణాలు ఆ నిర్ణయంపైనే ఆధారపడివున్నాయి. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు చెడ్డ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. వాళ్లు యెహోవాను ఆరాధించడం మానేసి, అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టారు. (న్యాయా. 2:3, 11-23) ఆ తర్వాత ఏలీయా ప్రవక్త కాలంలో కూడా, వాళ్లు యెహోవాను ఆరాధించాలా లేక బయలును ఆరాధించాలా అని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. (1 రాజు. 18:21, NW) యెహోవాను ఆరాధించడమే తెలివైన పని కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా తేలికని అనిపించవచ్చు. ఎందుకంటే జీవంలేని బయలును ఆరాధించాలని తెలివి ఉన్న ఏ వ్యక్తీ కోరుకోడు. అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు ఎటూ తేల్చుకోలేక ‘రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాడారు.’ అందుకే సత్య దేవుడైన యెహోవాను ఆరాధించమని ఏలీయా వాళ్లను ప్రోత్సహించాడు.

7 ఇశ్రాయేలీయులు ఎందుకు తెలివైన నిర్ణయం తీసుకోలేకపోయారు? మొదటిగా, వాళ్లు యెహోవా మీద విశ్వాసం కోల్పోయారు. ఆయన మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. వాళ్లు యెహోవాను నమ్మకపోవడమే కాకుండా, ఆయన గురించి, ఆయన జ్ఞానం గురించి నేర్చుకోవడానికి సమయం వెచ్చించలేదు. ఒకవేళ నేర్చుకుని ఉంటే, వాళ్లు తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగేవాళ్లు. (కీర్త. 25:12) రెండవదిగా, అన్యులు ఇశ్రాయేలీయులపై ఎంతగా ప్రభావం చూపించారంటే వాళ్ల ఆలోచనల్ని మార్చి, ఇశ్రాయేలీయులకు బదులు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా ఇశ్రాయేలీయులు అన్యులతో చేరి, అబద్ధ దేవుళ్లను ఆరాధించారు. అయితే దీనిగురించి యెహోవా చాలా సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు.—నిర్గ. 23:2.

మీ బదులు వేరేవాళ్లు నిర్ణయాలు తీసుకోవచ్చా?

8. ఇశ్రాయేలీయుల ఉదాహరణ నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు?

8 తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని వాక్యంపై ఆధారపడాలని ఇశ్రాయేలీయుల ఉదాహరణ చూపిస్తుంది. గలతీయులు 6:5 సూచిస్తున్నట్లుగా ఎవరి నిర్ణయాలకు వాళ్లే బాధ్యులు. కాబట్టి నిర్ణయాలు తీసుకునే మన బాధ్యతను ఇతరులకు అప్పగించకూడదు. బదులుగా, మనలో ప్రతీఒక్కరం దేవుని దృష్టిలో ఏది సరైనదో తెలుసుకుని, దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి.

9. మన బదులు ఇతరులు నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతించడం ఎందుకు ప్రమాదకరం?

9 నిర్ణయాలు తీసుకునే బాధ్యతను మనమెలా ఇతరులకు అప్పగించే ప్రమాదం ఉంది? చెడ్డ నిర్ణయం తీసుకోమని ఇతరులు చేసే ఒత్తిడికి లొంగిపోతే నిర్ణయాలు తీసుకునే మన బాధ్యతను ఇతరులకు అప్పగించినట్లే. (సామె. 1:10, 15) బైబిలు ఆధారంగా శిక్షణనిచ్చిన మనస్సాక్షిని బట్టి నిర్ణయాలు తీసుకోవడం మన బాధ్యత. అలా కాకుండా మన బదులు ఇతరులు నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతిస్తే, వాళ్లను వెంబడిస్తున్నట్లే. అది ఘోరమైన పర్యవసానాలకు దారితీస్తుంది.

10. పౌలు గలతీయులకు ఏ హెచ్చరిక చేశాడు?

10 తమకు బదులు ఇతరులు నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతించవద్దని అపొస్తలుడైన పౌలు గలతీయులను హెచ్చరించాడు. (గలతీయులు 4:17 చదవండి.) గలతీయ సంఘంలో కొంతమంది సహోదరులు, ఇతరుల బదులు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు ఏ ఉద్దేశంతో అలా చేశారు? సంఘంలోనివాళ్లు అపొస్తలులను కాకుండా తమను అనుసరించాలని ఆ స్వార్థపరులు కోరుకున్నారు. వాళ్లకు వినయం లేదు, అలాగే నిర్ణయాలు తీసుకునే విషయంలో తోటి సహోదరులకు ఉన్న హక్కుపై గౌరవం లేదు.

11. నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరులకు మనమెలా సహాయం చేయవచ్చు?

11 కానీ ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు ఉంచిన మంచి ఆదర్శాన్ని మనం పాటించాలి. తన సహోదరులకు సొంతగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని అతను గుర్తించాడు, దాన్ని గౌరవించాడు. (2 కొరింథీయులు 1:24 చదవండి.) వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన విషయాల్లో సహోదరసహోదరీలకు సలహా ఇస్తున్నప్పుడు నేడు సంఘపెద్దలు కూడా పౌలును ఆదర్శంగా తీసుకోవచ్చు. పెద్దలు బైబిలు ప్రచురణల్లోని సమాచారాన్ని సహోదరసహోదరీలకు చెప్తారేగానీ వాళ్ల బదులు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఎవరు తీసుకున్న నిర్ణయాలకు వచ్చే ఫలితాల్ని వాళ్లే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనకున్న ముఖ్యమైన పాఠం ఏమిటంటే: ఇతరులకు సలహా ఇస్తున్నప్పుడు, వాళ్ల పరిస్థితికి అన్వయించే బైబిలు సూత్రాల్ని మాత్రమే మనం గుర్తుచేస్తాం. కానీ నిర్ణయాలు తీసుకునే హక్కు, బాధ్యత వాళ్లదే. వాళ్లు సొంతగా తెలివైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి ప్రయోజనం పొందుతారు. కాబట్టి, తోటి సహోదరసహోదరీలు ఏమి చేయాలో నిర్ణయించే అధికారం మనకుందని ఎన్నడూ అనుకోకూడదు.

ఇతరులు సొంతగా నిర్ణయాలు తీసుకునేలా ప్రేమగల పెద్దలు సహాయం చేస్తారు (11వ పేరా చూడండి)

నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు హృదయం చెప్పేది వినకండి

12, 13. మన హృదయంలోని భావాల్నిబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు ప్రమాదకరం?

12 నేడు చాలామంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు తమ హృదయం చెప్పింది వింటారు. కానీ అపరిపూర్ణ హృదయం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని బైబిలు చెప్తుంది. (సామె. 28:26) “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” కాబట్టి మనం దాన్ని నమ్మలేం. (యిర్మీ. 17:9) అపరిపూర్ణ హృదయాన్ని నమ్ముకుని ఘోరమైన ఫలితాల్ని అనుభవించిన వాళ్ల ఉదాహరణలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. (యిర్మీ. 3:17; 13:10; 1 రాజు. 11:9, 10) కాబట్టి, నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మన హృదయం చెప్పింది వింటే ఏమి జరగవచ్చు?

13 మనం నిండు హృదయంతో తనను ప్రేమించాలని, మనల్ని మనం ప్రేమించుకున్నట్లే సాటిమనిషిని కూడా ప్రేమించాలని యెహోవా చెప్పాడు. (మత్త. 22:37-39) కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ముందటి పేరాలో ఉన్న లేఖనాల్నిబట్టి, మన హృదయంలోని భావాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని చూశాం. ఉదాహరణకు, కోపంలో ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోలేం. (సామె. 14:17; 29:22) అదేవిధంగా నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోలేం. (సంఖ్యా. 32:6-12; సామె. 24:10) కాబట్టి మనం ‘దేవుని నియమంపై’ ఆధారపడడం తెలివైన పని. (రోమా. 7:25) ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, మన హృదయంలోని భావాల ఆధారంగా తీసుకోకూడదు.

మీ నిర్ణయాల్ని ఎప్పుడు మార్చుకోవచ్చు?

14. కొన్నిసార్లు మన నిర్ణయాల్ని మార్చుకోవడం ఎందుకు సరైనది?

14 మనం తెలివైన నిర్ణయాలే తీసుకున్నప్పటికీ, వాటిగురించి ఇంకోసారి ఆలోచించి మార్చుకోవాలని మనకు అనిపించవచ్చు. ఈ విషయంలో యెహోవా పరిపూర్ణ ఆదర్శం ఉంచాడు. యోనా రోజుల్లో, నీనెవె ప్రజల విషయంలో ఏమి జరిగిందో గమనించండి: ‘వాళ్లు ఏమి చేశారో, వాళ్లు ఎలా తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టారో సత్యదేవుడు చూసినప్పుడు ఆయన వాళ్ల మీదకు తీసుకువస్తానని చెప్పిన విపత్తు గురించి ఇంకోసారి ఆలోచించాడు. ఆయన వాళ్లమీదకు ఆ విపత్తును తీసుకురాలేదు.’ (యోనా 3:10, NW) నీనెవె ప్రజలు తమ ప్రవర్తన మార్చుకుని, చెడును విడిచిపెట్టినప్పుడు యెహోవా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆయన సహేతుకత, వినయం, కనికరంగల దేవుడని అది చూపించింది. ఆయన మనుషుల్లా అనాలోచితంగా లేదా కోపంలో నిర్ణయాలు తీసుకోడు.

15. మనం ఎప్పుడెప్పుడు మన నిర్ణయాల్ని మార్చుకోవాల్సి రావచ్చు?

15 కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం గురించి మళ్లీ ఆలోచించాల్సి రావచ్చు. ముఖ్యంగా మన పరిస్థితులు మారినప్పుడు అలా చేయడం మంచిది. యెహోవా కూడా కొన్నిసార్లు తన నిర్ణయాల్ని మార్చుకున్నాడని గుర్తుంచుకోండి. (1 రాజు. 21:20, 21, 27-29; 2 రాజు. 20:1-5) ఇంకొన్నిసార్లు ఏదైనా కొత్త సమాచారం తెలిసినప్పుడు మన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. దావీదు రాజు గురించి ఆలోచించండి. సౌలు మనుమడైన మెఫీబోషెతుకు సంబంధించి, తనకు అందిన తప్పుడు సమాచారాన్నిబట్టి దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ వాస్తవాలు తెలిశాక తన నిర్ణయం మార్చుకున్నాడు. (2 సమూ. 16:3, 4; 19:24-29) కొన్నిసార్లు మనం కూడా అలా చేయడం తెలివైన పని.

16. (ఎ) నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ సలహాలు పాటించాలి? (బి) గతంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఎందుకు మళ్లీ ఆలోచించాలి? దాన్నెలా చేయవచ్చు?

16 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తొందరపడొద్దని బైబిలు చెప్తుంది. (సామె. 21:5) సమయం తీసుకుని వాస్తవాలన్నిటి గురించి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. (1 థెస్స. 5:21) కుటుంబ శిరస్సులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, బైబిల్లో అలాగే మన ప్రచురణల్లో పరిశోధన చేయడానికి సమయం తీసుకోవాలి. అంతేకాదు కుటుంబ సభ్యుల అభిప్రాయం తెలుసుకోవడం కూడా మంచిది. భార్య మాట వినమని యెహోవా అబ్రాహాముకు చెప్పాడని గుర్తుంచుకోండి. (ఆది. 21:9-12) సంఘపెద్దలు పరిశోధన చేయడానికి సమయం తీసుకోవాలి. వాళ్లకు అందిన కొత్త సమాచారాన్నిబట్టి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. అలాంటి సందర్భాల్లో ఇతరుల ముందు తమ పరువు పోతుందని వాళ్లు భయపడరు. సహేతుకత, వినయంగల పెద్దలు తమ ఆలోచనను, నిర్ణయాల్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ల ఆదర్శాన్ని పాటించడం మనందరికీ మంచిది. అప్పుడు సంఘంలో సమాధానం, ఐక్యత ఉంటాయి.—అపొ. 6:1-4.

మీ నిర్ణయానికి తగ్గట్లుగా ప్రవర్తించండి

17. సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ఏమి చేయాలి?

17 జీవితంలో మనం పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు పెళ్లి చేసుకోవాలా వద్దా, ఒకవేళ చేసుకుంటే ఎవర్ని చేసుకోవాలి, పూర్తికాల సేవను ఎప్పుడు మొదలుపెట్టాలి వంటివి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, మన పరిస్థితి గురించి జాగ్రత్తగా ఆలోచించి, సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాలి. అలా చేయడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ మనం తెలివైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే యెహోవా మీద నమ్మకం ఉంచి, ఆయనిచ్చే నిర్దేశాన్ని విని, దాన్ని పాటించాలి. (సామె. 1:5) యెహోవా మనకు కావాల్సిన మంచి సలహాల్ని తన వాక్యమైన బైబిల్లో ఉంచాడు. కాబట్టి మనం పరిశోధన చేసి, ఆయన నిర్దేశం కోసం ప్రార్థించాలి. అప్పుడు, తన ఇష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన లక్షణాలను ఆయన మనకిస్తాడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘నేను యెహోవాను ప్రేమిస్తున్నానని నా నిర్ణయం చూపిస్తుందా? ఇది నా కుటుంబంలో శాంతిని, సంతోషాన్ని తీసుకొస్తుందా? నేను సహనం, దయగల వ్యక్తినని నా నిర్ణయం చూపిస్తుందా?’

18. మనం సొంతగా నిర్ణయాలు తీసుకోవాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

18 తనను సేవించమని లేదా ప్రేమించమని యెహోవా ఎవర్నీ బలవంతపెట్టడు. బదులుగా నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయన మనకిచ్చాడు. ఆయన్ను సేవించాలా వద్దా అని నిర్ణయించుకునే మన హక్కును, బాధ్యతను ఆయన గౌరవిస్తాడు. (యెహో. 24:15; ప్రసం. 5:4) అయితే మనం బైబిలు ఆధారంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా ఇచ్చే నిర్దేశాల మీద విశ్వాసం ఉంచుతూ, ఆయన సూత్రాలను పాటిస్తే మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, అన్నివిషయాల్లో నిలకడగా ఉండగలుగుతాం.—యాకో. 1:5-8; 4:8.