కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

“ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో”

“ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో”

అది 1922 సెప్టెంబరు నెల, శుక్రవారం ఉదయం. 8,000 మందితో నిండిన ఆడిటోరియం లోపల అప్పటికే చాలా వేడిగా ఉంది. అయితే, ఆ సమావేశం మొదలయ్యాక ఎవరైనా కావాలనుకుంటే హాలు బయటకు వెళ్లవచ్చుగానీ, మళ్లీ లోపలికి రావడం కుదరదని సమావేశ ఛైర్మన్‌ ఒక ప్రకటన చేశాడు.

మొదటిగా పాటలతో “సేవను స్తుతించడం” ప్రారంభించిన తర్వాత సహోదరుడు జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ప్రసంగీకుని మైకు దగ్గరకు వచ్చాడు. కూర్చున్న ప్రేక్షకుల్లో చాలామంది, తర్వాత ఏమి జరుగుతుందోనని చూస్తున్నారు. కొంతమంది మాత్రం లోపలి వేడికి అటూఇటూ తిరుగుతున్నారు. ప్రసంగీకుడు వాళ్లను కూర్చొని, వినమని గట్టిగా చెప్పాడు. ప్రసంగం మొదలైంది, ఇంతకీ స్టేజీకి పైన చక్కగా చుట్టి, తాళ్లతో కట్టి ఉన్న పెద్ద బ్యానర్‌ని ఎవరైనా చూశారా?

‘పరలోకరాజ్యం సమీపించింది’ అనే అంశం మీద సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రసంగించాడు. దాదాపు గంటన్నర ఉన్న ఆ ప్రసంగంలో బైబిలు కాలాల్లోని ప్రవక్తలు దేవుని రాజ్యం రాబోతున్న విషయాన్ని ఎలా ధైర్యంగా ప్రకటించారో అతను వివరించాడు. అతని గంభీరమైన స్వరంతో ఆ హాలంతా దద్దరిల్లిపోయింది. తన ప్రసంగం చివర్లో సహోదరుడు, “మహిమగల రాజు తన పరిపాలనను ప్రారంభించాడని మీరు నమ్ముతున్నారా” అని అడిగాడు. అందుకు ప్రేక్షకులు, “అవును” అని గట్టిగా జవాబిచ్చారు.

“అలాగైతే ఓ సర్వోన్నత దేవుని కుమారులారా, తిరిగి సేవకు వెళ్లండి! ఇదిగో, రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అని సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ గంభీరంగా చెప్పాడు.

అప్పుడు, స్టేజీ పైభాగంలో చుట్టి ఉన్న ఆ బ్యానర్‌ చక్కగా విప్పుకుంది. దానిమీద ఇలా రాసివుంది, “రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి.”

“ప్రేక్షకుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి” అని రే బోప్‌ చెప్పాడు. “వాళ్ల చప్పట్లకు దూలాలు దద్దరిల్లాయి” అని ఆన గార్డనర్‌ వివరించింది. “అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు” అని ఫ్రెడ్‌ ట్వారోష్‌ చెప్పాడు. “ఏదో బలమైన శక్తి మమ్మల్ని మా సీట్లలో నుండి లేపినట్టు అనిపించింది. అంతేకాదు మా అందరి కళ్లు చెమర్చాయి” అని ఎవాన్‌జెలోస్‌ స్కూఫస్‌ చెప్పాడు.

సమావేశంలో చాలామంది అప్పటికే రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తున్నారు. కానీ, ఇప్పుడు వాళ్ల పనికి ఒక కొత్త అర్థం చేకూరినట్లు వాళ్లకు అనిపించింది. “ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో నిండిన హృదయాలతో” బైబిలు విద్యార్థులు ఇంటికి వెళ్లారని ఎతల్‌ బెనకోఫ్‌ చెప్పింది. అప్పటికి 18 ఏళ్లు ఉన్న ఓడెసా టక్‌, “నేను ఎవని పంపెదను?” అనే ఆహ్వానానికి ప్రతిస్పందనగా సేవ చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించుకుంది. అయితే “ఎక్కడ, ఎలా, ఏమి ప్రకటించాలో నాకు తెలియలేదు. నాకు తెలిసిందల్లా, ‘చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు’ అని చెప్పిన యెషయాలా ఉండడమే” అని ఆమె చెప్పింది. (యెష. 6:8) “ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనాపని నిజంగా మొదలైంది ఆ రోజే” అని రాల్ఫ్‌ లెఫ్లర్‌ అన్నాడు.

1922, ఒహాయోలోని సిడార్‌పాయింట్‌లో జరిగిన ఈ సమావేశం దేవుని ప్రజల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పడంలో ఆశ్చర్యంలేదు. “ఆ సమావేశానికి హాజరైనప్పటి నుండి ప్రతీ సమావేశానికి ఖచ్చితంగా వెళ్లాలనే కోరిక నాలో కలిగింది” అని జార్జ్‌ గ్యాంగస్‌ చెప్పాడు. అతనికి గుర్తున్నంతవరకు అతను అన్నీ సమావేశాలకు వెళ్లాడు. జూల్య విల్కాక్స్‌ ఇలా రాసింది, “1922 సిడార్‌పాయింట్‌ గురించి మన ప్రచురణల్లో చూసిన ప్రతీసారి నాకు ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందో నేను చెప్పలేను. ‘యెహోవా, ఆ రోజున సమావేశానికి హాజరయ్యే అవకాశమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు’ అని నాకెప్పుడూ చెప్పాలనిపిస్తుంది.”

మనలో చాలామందికి కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఉండివుంటాయి. ముఖ్యంగా మనకు సంతోషాన్ని కలిగించి, మన గొప్ప దేవుడైన యెహోవాపట్ల, రాజైన యేసుపట్ల మనలో ఉత్సాహాన్ని ప్రేమను నింపిన సమావేశాలు గుర్తుండిపోతాయి. అలాంటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నప్పుడు మనం కూడా ఇలా చెప్తాం, “యెహోవా, ఆ రోజున సమావేశానికి హాజరయ్యే అవకాశమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు.”