కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందే వచ్చిన హెచ్చరికల్ని వింటే మీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు

ముందే వచ్చిన హెచ్చరికల్ని వింటే మీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు

డిసెంబర్‌ 26, 2004⁠లో రిక్టర్‌స్కేలు మీద 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ఇండోనేషియా దేశానికి చెందిన సీమలూయ ద్వీపాన్ని కుదిపేసింది. తీరం దగ్గర ఉన్నవాళ్లందరూ సముద్రం వైపు చూసినప్పుడు నీళ్లు ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం గమనించారు. వెంటనే అందరూ కొండల వైపు పరుగెత్తుతూ “స్మోన్గ్‌! స్మోన్గ్‌!” (వాళ్ల భాషలో స్మోన్గ్‌ అంటే సునామీ) అని అరవడం మొదలుపెట్టారు. 30 నిమిషాల్లో, పెద్దపెద్ద సునామీ అలలు విరుచుకు పడ్డాయి. అక్కడున్న చాలా ఇళ్లు, ఊర్లు నాశనమైపోయాయి.

ఆ ఘోరమైన సునామీ మొదట సీమలూయ ద్వీపాన్ని దెబ్బకొట్టింది. కానీ అక్కడ ఉన్న 78,000 మందిలో కేవలం ఏడుగురు మాత్రమే చనిపోయారు. అంతమంది ఎలా తప్పించుకోగలిగారు? a అక్కడి వాళ్లలో ఉన్న ఒక సామెత ఏంటంటే, ‘భూమి బలంగా కంపించాక, సముద్రం వెనక్కి వెళ్లిపోతే, వెంటనే కొండలు ఎక్కండి, ఎందుకంటే సముద్రం తిరిగి వచ్చేస్తుంది.’ గతంలో అనుభవం వల్ల సీమలూయ ప్రాంతం వాళ్లు సముద్రంలో వచ్చే మార్పులు బట్టి సునామీని కనిపెట్టడం తెలుసుకున్నారు. ముందే వచ్చిన హెచ్చరికను పట్టించుకోవడం వల్ల వాళ్ల ప్రాణాలు కాపాడుకున్నారు.

బైబిలులో కూడా ఒక పెద్ద విపత్తు గురించి ఉంది. అది చాలా దగ్గర్లో ఉందని, “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు,” అని దాని గురించి ఉంది. (మత్తయి 24:21) ఇది మనుషుల నిర్లక్ష్యం వల్ల లేదా ప్రకృతి విపత్తు వల్ల భూమికి వచ్చే నాశనం కాదు. ఎందుకంటే, భూమి ఎప్పటికీ నాశనం కాదని దేవుడు చెప్పాడు. (ప్రసంగి 1:4) “భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకు” దేవుడు ఈ శ్రమను తీసుకొస్తాడు. చెడుతనం, బాధలు ఇక ఉండవు. (ప్రకటన 11:18; సామెతలు 2:22) అది ఎంత మేలును తెస్తుందో కదా!

సునామీలు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం లాంటి విపత్తుల వల్ల చాలామంది అమాయకులు చనిపోతారు. కానీ ఈ శ్రమ అలా కాదు. ఎందుకంటే “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెప్తుంది. ఆ దేవుని పేరు యెహోవా. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు,” అని కూడా ఆయన మాటిచ్చాడు. (1 యోహాను 4:8; కీర్తన 37:29) అయితే ఆ మహాశ్రమను తప్పించుకుని, దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఎలా పొందవచ్చు? అందుకు మనం ముందే చెప్పిన హెచ్చరికను వినాలి.

మారుతున్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించండి

చెడుతనం, బాధలు అంతమైపోయే ఖచ్చితమైన తేదీ మనం చెప్పలేము ఎందుకంటే యేసు ఇలా అన్నాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” అయితే యేసు “మెలకువగా ఉండుడి” అని చెప్పాడు. (మత్తయి 24:36; 25:13) ఎందుకు? దేవుడు అంతం తెచ్చే ముందు లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో బైబిలు వివరిస్తుంది. సీమలూయ ప్రాంతంవాళ్లు సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం చూసి, వచ్చే అపాయాన్ని తెలుసుకున్నారు. అలానే లోకంలో ఒక్కసారిగా వచ్చే మార్పులు చూసి అంతం దగ్గర పడిందని మనకు అర్థమౌతుంది. ఏయే మార్పులు వస్తాయని బైబిలు చెప్తుందో ఇక్కడ ఇచ్చిన బాక్సులో ఉన్నాయి.

ఇక్కడ ఇచ్చిన సంఘటనలు ఒక్కొక్కటిగా కొంతవరకు అంతకుముందే జరిగాయని చెప్పవచ్చు. కానీ, “సంగతులన్నియు” జరగడం చూసినప్పుడు అంతం దగ్గర పడుతుందని యేసు చెప్పాడు. (మత్తయి 24:33) ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ చెప్పినవి (1) లోకవ్యాప్తంగా, (2) ఒకేసారిగా, (3) అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్టుగా ముందెప్పుడైనా చరిత్రలో చూశామా? ఆలోచిస్తే, మనం ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యమైన కాలంలోనే జీవిస్తున్నామని తెలుస్తుంది.

దేవుడు ప్రేమతో చేసిన ఏర్పాటు

ముందే హెచ్చరికలు ఇచ్చే పరికరాలు ప్రాణాలను కాపాడతాయి అని ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు అన్నాడు. 2004 సునామీ వచ్చిన తర్వాత మళ్లీ అలాంటి ప్రాణ నష్టం జరగకుండా దెబ్బతిన్న ప్రాంతంలో విపత్తుల గురించి ముందే హెచ్చరించే పరికరాల్ని పెట్టారు. అదే విధంగా, అంతం వచ్చే ముందే అందరు తెలుసుకునేలా దేవుడు హెచ్చరికను ఏర్పాటు చేశాడు. బైబిల్లో దీని గురించి ముందే ఇలా చెప్పారు: “మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.

కేవలం పోయిన సంవత్సరంలోనే, యెహోవాసాక్షులు 240 దేశాల్లో 700 భాషల్లో 190 కోట్ల గంటలు సువార్తను ప్రకటించడానికి వెచ్చించారు. మన కాలంలో జరుగుతున్న ఈ పని అంతం దగ్గర పడిందనడానికి ఒక పెద్ద రుజువు. యెహోవాసాక్షులు పొరుగువాళ్లను ఎంతో ప్రేమిస్తారు. కాబట్టి, దేవుడు తీర్పు తీర్చే రోజు త్వరలో రాబోతుందని చెప్పడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. (మత్తయి 22:39) దేవునికి మీపై ప్రేమ ఉంది కాబట్టే మీరు ఈ విషయాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందుతున్నారు. “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని” దేవుడు కోరుతున్నాడు. (2 పేతురు 3:9) దేవుని ప్రేమను అర్థం చేసుకుని, ఆయన ముందే ఇచ్చిన హెచ్చరిక మీరు వింటారా?

సురక్షితమైన చోటుకు పారిపోండి!

సముద్రం లోపలికి వెళ్లడం చూసి సీమలూయ తీర ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లు ఎత్తైన చోటుకు పరుగెత్తారు. అంతేగానీ, సముద్రం తిరిగి వచ్చేంత వరకు ఆగలేదు. వాళ్లు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. రాబోయే శ్రమను తప్పించుకోవాలంటే ఒక విధంగా మీరు కూడా ఆలస్యం చేయకుండా, ఎత్తుగా ఉన్న ప్రాంతానికి వెళ్లాలి. ఎలా? యెషయా అనే ఒక దేవుని సేవకుడు “అంత్యదినములలో” అంటే మన కాలంలో అందరికీ ఒక గొప్ప ఆహ్వానం ఉందని రాశాడు. అక్కడిలా ఉంది: “యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము.”—యెషయా 2:2, 3.

కొండపైకి వెళ్లినప్పుడు మీకు అన్నీ కనిపిస్తాయి, సురక్షితంగా ఉంటారు. అదే విధంగా బైబిలు చదివినప్పుడు దేవుని మార్గాలు తెలుస్తాయి. నేడు లోకవ్యాప్తంగా కోట్లమంది అలా తెలుసుకుని వాళ్ల జీవితాల్లో మంచి మార్పులు చేసుకుంటున్నారు. (2 తిమోతి 3:16, 17) అలా వాళ్లు దేవుని “త్రోవలలో” నడుస్తున్నారు, ఆయన ప్రేమను, కాపుదలను చవిచూస్తున్నారు.

ఆ ఆహ్వానాన్ని స్వీకరించి, ఈ కష్టతరమైన రోజుల్లో దేవుడు ప్రేమతో ఇచ్చే కాపుదలను మీరు తీసుకుంటారా? ఇక్కడ ఇచ్చిన బాక్సులో మనం అంత్యదినాల్లో ఉన్నాము అనడానికి లేఖనాల్లో ఉన్న రుజువులు ఉన్నాయి. దయచేసి వాటిని జాగ్రత్తగా చూడండి. బైబిలును బాగా అర్థం చేసుకుని, వాటిని పాటించడానికి మీకు దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షులు సంతోషంగా సహాయం చేస్తారు. లేదా మీకున్న ప్రశ్నలకు జవాబులు మా వెబ్‌సైట్‌ www.pr418.comలో దొరకవచ్చు. బైబిలు బోధలు > బైబిలు ప్రశ్నలకు జవాబులు కింద చూడండి. ▪ (w16-E No.2)

a 2004⁠లో వచ్చిన ఈ సునామీ 2,20,000 మంది ప్రాణాలు తీసుకుంది. ఇంత నాశనం తెచ్చిన సునామీ ముందెప్పుడూ రాలేదు.