కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టెక్నాలజీ మీ నేర్చుకునే సామర్థ్యాన్ని ఎలా తగ్గించగలదు?

టెక్నాలజీ మీ నేర్చుకునే సామర్థ్యాన్ని ఎలా తగ్గించగలదు?

స్కూల్‌, ఉద్యోగం లేదా వేరే అవసరాల వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అందుకు టెక్నాలజీ మనకు ఎంతో సహాయం చేస్తుంది. ఈరోజుల్లో దేని గురించైనా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా, కనీసం కూర్చున్న చోటు నుండి లేవకుండానే మనం ఎన్నో విషయాలు సులువుగా తెలుసుకుంటున్నాం.

కానీ, టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించేవాళ్లు ఏం అంటున్నారంటే . . .

  • చదివేటప్పుడు ధ్యాస పెట్టడం కష్టంగా అనిపిస్తుంది.

  • పనుల్ని మనసుపెట్టి చేయలేకపోతుంటారు.

  • ఒక్కరే ఉన్నప్పుడు త్వరగా బోర్‌ కొడుతుంది.

మీరు మనసులో ఉంచుకోవాల్సినవి . . .

చదువుతున్నప్పుడు

టెక్నాలజీని బాగా ఉపయోగించే కొంతమందికి ఏదైనా ఒక పుస్తకాన్ని మొత్తం చదివేంత ఓపిక ఉండదు. అందుకే దానిలోని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి దాన్ని పైపైన చదివేస్తుంటారు.

ఏదైనా ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే అలా పైపైన చదవడం బానే ఉంటుంది. కానీ, ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మాత్రం అది సరైన పద్ధతి కాదు.

ఇలా ఆలోచించండి: ఏదైనా సమాచారం ఎక్కువగా ఉంటే, దాన్ని మీరు ఓపిగ్గా చదవగలుగుతున్నారా? అలా ఓపిగ్గా చదివితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు?—సామెతలు 18:15.

మనసుపెట్టడం

కొంతమంది టెక్నాలజీని ఉపయోగిస్తూ ఒకేసారి రెండుమూడు పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు ఇటు చదువుతూనే అటు ఫ్రెండ్స్‌కి కూడా మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ, అలా చేస్తే వాళ్ల ధ్యాస ఒకే విషయం మీద ఉండదు కాబట్టి వాళ్లు ఆ రెండు పనుల్ని సరిగ్గా చేయలేకపోవచ్చు.

ఒక్కదాని మీదే మనసుపెట్టడం కష్టమే కానీ, అలా చేసినప్పుడు ఇంకా బాగా నేర్చుకోగలుగుతాం. 14 ఏళ్ల గ్రేస్‌ అనే అమ్మాయి ఇలా అంటుంది, “అలా మనసుపెట్టి చదివినప్పుడు తప్పులు తగ్గుతాయి, ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒకేసారి రెండుమూడు విషయాల మీద దృష్టి పెట్టకుండా ఒక్కదాని మీదే మనసుపెట్టడం వల్ల నేను ఇంకా బాగా నేర్చుకోగలుగుతున్నానని అర్థమైంది.”

ఇలా ఆలోచించండి: ఒకేసారి రెండుమూడు పనుల్ని చేయడం వల్ల చదివేవాటి మీద మనసుపెట్టడం, వాటిని గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా అనిపిస్తుందా?—సామెతలు 17:24.

ఒక్కరే ఉన్నప్పుడు

కొంతమందికి ఒక్కరే ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి టైమ్‌ పాస్‌ చేస్తుంటారు. ఒలీవీయా అనే ఒకామె ఇలా అంటుంది “నేను 15 నిమిషాలు కూడా నా ఫోన్‌, ట్యాబ్‌ లేదా టీవిని చూడకుండా ఉండలేను.”

కానీ, ఒక్కరే ఉన్నప్పుడు నేర్చుకున్న వాటి గురించి చక్కగా ఆలోచించడానికి, ఇంకా బాగా అర్థంచేసుకోవడానికి సమయం దొరుకుతుంది. చిన్నవాళ్లైనా, పెద్దవాళ్లైనా ఆ సమయాన్ని మంచిగా ఉపయోగించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

ఇలా ఆలోచించండి: ఒక్కరే ఉన్నప్పుడు మీకు దొరికిన ఆ సమయాన్ని ఆలోచించడానికి ఉపయోగిస్తున్నారా?—1 తిమోతి 4:15.

మీరు ఏం చేయవచ్చు?

టెక్నాలజీని మీరు ఎలా ఉపయోగిస్తున్నారో పరిశీలించుకోండి

ఏదైనా విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి టెక్నాలజీ మీకు ఎలా సహాయం చేయగలదు? అదే సమయంలో దేన్నైనా మనసుపెట్టి నేర్చుకోలేకపోవడానికి టెక్నాలజీ ఏయే విధాలుగా అడ్డుపడవచ్చు?

మంచి సలహా: “తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో.”—సామెతలు 3:21.