కంటెంట్‌కు వెళ్లు

ఈ లోకం నిలుస్తుందా?

ఈ లోకం నిలుస్తుందా?

ఈ లోకం నిలుస్తుందా?

లోకాంతం గూర్చి ఈ తరం విన్నంతగా మరేతరం కూడా వినలేదు. లోకం న్యూక్లియర్‌ వినాశనంలో విధ్వంసమౌతుందని చాలామంది భయపడుతున్నారు. కాలుష్యం యీ లోకాన్ని నశింపజేస్తుందేమోనని మరికొందరు అనుకుంటున్నారు. ఆర్థిక అల్లకల్లోలం మూలంగా మానవులు ఒకరిపైనొకరు చెలరేగుతారని కలతచెందుతున్నారు.

ఈ లోకం నిజంగా అంతమొందునా? ఒకవేళ అలా జరిగితే దాని భావమేమిటి? మునుపెన్నడైనా ఈ లోకం అంతమయిందా?

ఒక లోకం అంతం—దాని స్థానంలో మరొకటి

అవును, ఒక లోకం అంతమైంది. నోవహు కాలంలో అతి దుర్మార్గంగా మారిన లోకాన్ని పరిగణించండి. “ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను” అని బైబిలు వివరిస్తోంది. ఇంకా బైబిలు ఇలా అంటోంది, “మరియు ఆయన [దేవుడు] పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.”—2 పేతురు 2:5; 3:6.

ఆ లోకాంతం అంటే భావమేమిటి, దాని భావమేదికాదు అన్న విషయాన్ని మీరు గమనించండి. మానవ జాతికే అంతమని దాని భావము కాదు. నోవహు అతని కుటుంబం, భూమిని ముంచెత్తిన జలప్రళయాన్ని తప్పించుకుంది. ఈ భూగ్రహం, అందమైన తారలతో అలంకరించబడిన నింగికూడా అలాగే తప్పించుకున్నాయి. అక్కడ నాశనమైంది “భక్తిహీనుల సమూహమైన” ఒక దుష్ట విధానమే.

చివరికి, నోవహు సంతానం వృద్ధిచెందేకొలది, మరో లోకం ప్రవృద్ధిచెందింది. ఆ రెండో లోకం లేక విధానం ఈనాటివరకూ కొనసాగింది. దాని చరిత్రంతా యుద్ధాలు, నేరాలు, దౌర్జన్యాలతోనే నిండిపోయింది. ఈ లోకానికి ఏం జరగబోతోంది? అది నిలుస్తుందా?

ఈ లోక భవితవ్యం

నోవహు కాలంలోని లోకం నాశనమైందని చెబుతూ బైబిలు ఇంకా ఇలా వివరిస్తోంది: “అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు . . . అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.” (2 పేతురు 3:7) నిజమే, మరో బైబిల్‌ రచయిత వివరించినట్లు: “లోకమును [ఇప్పుడున్న లోకము] . . . గతించిపోవుచున్నవి.”—1 యోహాను 2:17.

అక్షరార్థ భూమి లేక నక్షత్రాలనింగి అంతమైపోతాయని బైబిల్‌ భావంకాదు. నోవహు దినములలో కూడా అలా జరగలేదు. (కీర్తన 104:5) అలాకాకుండా, అగ్నితో నాశనం చేయబడుతుందన్నట్లుగా, ఈ లోకం దాని “ఆకాశము,” తోపాటు లేక సాతాను ఆధీనంలోవున్న ప్రభుత్వాలును, దాని “భూమి” లేక మానవ వ్యవస్థ నాశనమౌతాయి. (యోహాను 14:30; 2 కొరింథీయులు 4:4) జలప్రళయానికి ముందున్న లోకంలాగే, ఈ లోకం లేక విధానం వినాశనమౌతుంది. ఈ లోకం అంతంకాకముందు జరగబోయే సంఘటనలను గూర్చి చెబుతూ, యేసుక్రీస్తు “నోవహు దినముల” లోని పరిస్థితిని ఉదహరించాడు.—మత్తయి 24:37-39.

“నీ రాకడకును ఈ లోకాంతానికిని సూచనలేవి?” అని తన అపొస్తలులడిగిన ప్రశ్నకు సమాధానమివ్వడానికే యేసు నోవహు దినములను గూర్చి మాట్లాడాడు. (మత్తయి 24:3 కింగ్‌జేమ్స్‌ వర్స్‌న్‌) ఈ లోకం అంతమౌతుందని యేసు అనుచరులకు ముందే తెలుసు. ఈ వివరణ వారిని భయబ్రాంతులను చేసిందా?

దీనికి విరుద్ధంగా, లోకం అంతమవ్వకముందు జరగబోయే సంఘటనలను వివరిస్తూ, యేసు ‘వారి విడుదల సమీపించుచున్నది’ కనుక ఆనందించుడని వారిని ప్రోత్సహించాడు. (లూకా 21:28) అవును, సాతాను వాని దుష్ట విధానమునుండి ఒక శాంతియుత నూతన లోకంలోకి విడుదల కలుగబోతోంది.—2 పేతురు 3:13.

అయితే ఈ లోకం ఎప్పుడు అంతమౌతుంది? తన “రాకడకును, ఈ లోకాంతానికిని” యేసు ఏ “సూచనను” ఇచ్చాడు?

“సూచన”

ఇక్కడ “రాకడ” అని అనువదించబడిన గ్రీకు పదం పరోసియా, మరి దాని భావం “ప్రత్యక్షత”. అంటే ఇప్పటికే ఆయన రంగంలోదిగాడు అని భావం. కాబట్టి “సూచన” కనిపించినప్పుడు యేసు త్వరలో వస్తాడని కాదుగాని, ఆయన అప్పటికే తిరిగివచ్చాడనీ, వచ్చేఉన్నాడనీ దాని భావం. ఇప్పటికే ఆయన పరలోక రాజుగా అదృశ్యపాలన ప్రారంభించాడని, మరి త్వరలోనే ఆయన తన శత్రువులను అంతమొందిస్తాడని దాని అర్థం.—ప్రకటన 12:7-12; కీర్తన 110:1, 2.

యేసు ఒక్క సంఘటననే “సూచన” గా ఇవ్వలేదు. ఆయన అనేక ప్రపంచ సంఘటనలను, పరిస్థితులను వివరించాడు. బైబిలు రచయితలు రాసిన “అంత్యదినముల” కాలంలో ఇవన్నీ జరుగుతాయి. (2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:3, 4) యేసు ముందే చెప్పిన “అంత్యదినముల” గుర్తులను కొన్నింటిని పరిశీలించండి.

“జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” (మత్తయి 24:7) ఆధునిక కాలాల్లోని యుద్ధాలు మునుపెన్నటికన్నా చాల భయంకరంగా జరుగుతున్నాయి. ఒక చరిత్రకారుడు ఇలా చెప్పాడు: “[1914 లో ప్రారంభమైన] మొదటి ప్రపంచ యుద్ధం, ప్రప్రధమ ‘సంపూర్ణ’ యుద్ధం.” అయినా రెండో ప్రపంచ యుద్ధం దానికంటే మరెక్కువ నాశనకరమైంది. యుద్ధం భూమిని కొల్లగొడుతూనేవుంది. అవును, యేసు మాటలు చక్కగా నెరవేరాయి.

“కరవులును . . . కలుగును.” (మత్తయి 24:8) మొదటి ప్రపంచ యుద్ధం అయిన వెంటనే, బహుశ చరిత్రలోకెల్లా మహా గొప్ప క్షామం కలిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతకూడా ఘోరమైన క్షామం కలిగింది. కుపోషణ, ప్రపంచ జనాబాలో ఐదోవంతు ప్రజల మీద ప్రభావం చూపుతూ సంవత్సరానికి 14 లక్షల మంది పిల్లలను పొట్టన పెట్టుకుంటోంది. నిజంగా, “కరువులు” సంభవిస్తున్నాయి.

“గొప్ప భూకంపమును కలుగును.” (లూకా 21:11) గత శతాబ్దాలకన్నా 1914 నుండి భూకంపాలవల్ల ప్రతి సంవత్సరం షుమారు పదిరెట్లమంది చనిపోతూనేవున్నారు. ఇక్కడ కొన్నిపెద్ద సంఘటనలను మాత్రమే పరిశీలించండి: 1920, చైనాలో, 2,00,000 చనిపోయారు; 1923, జాపాన్‌లో, 99,300 మరణించారు; 1939, టర్కీలో, 32,700 ప్రమాదాలు; 1970, పెరూలో, 66,800 మృతులు; 1976, చైనాలో, దాదాపు 2,40,000 (లేక, కొన్ని ఆధారాలనుబట్టి, 8,00,000) చనిపోయారు. నిశ్చయంగా, “గొప్ప భూకంపములు” సంభవించాయి.

“తెగుళ్లును . . . తటస్థించును.” (లూకా 21:11) మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, దాదాపు 21 లక్షలమంది ప్రజలు స్పానిష్‌ ఫ్లూ వల్ల మరణించారు. సైన్స్‌ డైజెస్ట్‌ ఇలా నివేదించింది: “చరిత్రంతటిలో ఎన్నడూకూడా ఇంత నికృష్టమైన, తీవ్రమైన మరణ పరీక్షరాలేదు.” ఆనాటినుండి, హృద్రోగాలు, క్యాన్సర్‌, ఎయిడ్స్‌, మరి అనేక ఇతర తెగుళ్లు కోట్లాదిమందిని మట్టుపెట్టాయి.

“అక్రమము విస్తరించుట. (మత్తయి 24:12) పందొమ్మిది వందల పద్నాలుగు నుండి, మన లోకం నేరానికి, దౌర్జన్యానికి పేరుమోసింది. అనేక ప్రాంతాలలో పగటిపూట కూడా తాము వీధుల్లో సురక్షితంగా నడువగల్గుతున్నట్లు ఎవ్వరూ భావించటంలేదు. రాత్రులందు బయటకు వెళ్లటానికి భయపడుతున్న ప్రజలు, తాళాలు, అడ్డగడియలు వేసుకొని తమ యిండ్లలోనే ఉంటున్నారు.

అంత్యదినములలో జరిగే ఇంకా అనేక ఇతర విషయాలుకూడా సూచింపబడ్డాయి, మరి అన్నీకూడా నెరవేరాయి. అంటే లోకాంతం సమీపంలోనేవుందని అర్థం. అయితే ఇందులో తప్పించుకొనే వారుంటారు. “లోకమును . . . గతించిపోవుచున్నవి” అని చెప్పిన తర్వాత, “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును” అని బైబిలు వాగ్దానం చేస్తోంది.—1 యోహాను 2:17.

కాబట్టి మనం దేవుని చిత్తం తెలుసుకొని, దానిని చేయాలి. అప్పుడు మనం ఈ లోకాంతమునుండి రక్షించబడి, దేవుని నూతన లోకంలోని నిరంతర ఆశీర్వాదాలను పొందగలం. అప్పుడు “. . . ఆయన (దేవుడు) వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైననూ వేదనయైనను ఇక ఉండదు” అని బైబిలు వాగ్దానం చేస్తోంది.—ప్రకటన 21:3, 4.

ప్రత్యేకంగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి

[6వ పేజీలోని చిత్రసౌజన్యం]

Photo Credits: Airplane: USAF photo. Child: WHO photo by W. Cutting. Earth quake: Y. Ishiyama, Hokkaido University, Japan.