కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

“నేను ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.”​—రాడెల్‌ రాడ్రిగస్‌ రాడ్రిగస్‌

పుట్టిన సంవత్సరం: 1959

దేశం: క్యూబా

ఒకప్పుడు: ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వ్యక్తి

నా గతం: నేను క్యూబాలోని హవానాలో పుట్టాను. అక్కడ పేద ప్రజలుండే మురికివాడల్లో పెరిగాను. ప్రజలు వీధుల్లోకి వచ్చి కొట్టుకోవడం అక్కడ మామూలే. నేను పెరిగి పెద్దవుతున్నప్పుడు, జూడో లాంటి కొట్లాడుకునే ఆటల మీద నాకు ఆసక్తి పెరిగింది.

నేను బాగా చదివేవాణ్ణి, దాంతో మా అమ్మానాన్నలు యూనివర్సిటీకి వెళ్లి చదువుకోమని నన్ను పంపించారు. అక్కడ ఉన్నప్పుడు, మా దేశంలోని రాజకీయ వ్యవస్థను మార్చాలని నాకు అనిపించింది. దాంతో నేను ప్రభుత్వానికి ఎదురుతిరగాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి నేనూ, నాతోపాటు చదువుకునే అబ్బాయి కలిసి ఒక పోలీస్‌ ఆఫీసర్‌ దగ్గరున్న తుపాకీని దొంగిలించడానికి ప్రయత్నించాం. అప్పుడు జరిగిన దాడిలో, ఆ పోలీస్‌ ఆఫీసర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో నన్ను, ఆ అబ్బాయిని జైలుకు తీసుకెళ్లారు, అలాగే మమ్మల్ని కాల్చి చంపేయమని ఆదేశాలిచ్చారు. నా వయసు అప్పటికి 20 ఏళ్లే, కానీ నా జీవితం ముగిసిపోబోతుంది!

జైల్లో ఒక్కడినే ఒంటరిగా ఉన్నప్పుడు, నన్ను కాల్చేవాళ్ల ముందు భయపడకుండా ఎలా ధైర్యంగా ఉండాలో ప్రాక్టీస్‌ చేశాను. అదే సమయంలో, ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ‘ప్రపంచంలో ఇంత అన్యాయం ఎందుకు ఉంది? జీవితం అంటే ఇంతేనా?’ అని ఆలోచించాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... ఆ తర్వాత, మా మరణశిక్షను 30 ఏళ్ల జైలు శిక్షగా మార్చారు. ఆ సమయంలో, తమ నమ్మకాల కారణంగా జైల్లో ఉన్న కొంతమంది యెహోవాసాక్షుల్ని కలిశాను. వాళ్లకున్న ధైర్యం, శాంత స్వభావం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాళ్ల తప్పేమీ లేకుండా జైలుపాలైనా, వాళ్ల ముఖాల్లో అసలు కోపం గానీ, చిరాకు గానీ లేవు.

మనుషుల విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉందని యెహోవాసాక్షులు నాకు బోధించారు. నేరం గానీ, అన్యాయం గానీ ఉండని పరదైసుగా దేవుడు ఈ భూమిని మారుస్తాడని వాళ్లు నాకు బైబిలు నుండి చూపించారు. అప్పుడు భూమంతా మంచివాళ్లతో నిండిపోతుంది. అంతేకాదు, మంచి పరిస్థితుల మధ్య శాశ్వతకాలం జీవించే అవకాశం వాళ్లకు ఉంటుంది.​—కీర్తన 37:29.

యెహోవాసాక్షుల దగ్గర నేర్చుకుంటున్న విషయాలు నాకు నచ్చాయి. కానీ నేను వాళ్లలా ఉండలేనేమో అనిపించింది. ఎందుకంటే, రాజకీయ విషయాల్లో తలదూర్చకుండా ఉండడం, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం నావల్ల కాని పని. అందుకే, వాళ్లతో కలవకుండా నేనే సొంతగా బైబిలు చదవాలని నిర్ణయించుకున్నాను. అలా బైబిలు మొత్తం చదివిన తర్వాత, తొలి క్రైస్తవుల్లా ఉన్నది కేవలం యెహోవాసాక్షులు మాత్రమే అని నాకు అర్థమైంది.

బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల, నా జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలని నాకు అర్థమైంది. ఉదాహరణకు, నేను బూతులు మాట్లాడడం మానేయాలి, సిగరెట్‌ తాగకూడదు, అలాగే రాజకీయ విషయాల్లో తలదూర్చకూడదు. ఈ మార్పులు చేసుకోవడం కష్టమే అయినా, యెహోవా సహాయంతో నేను మెల్లమెల్లగా మార్చుకోగలిగాను.

అలా మార్పులు చేసుకుంటున్నప్పుడు, కోపం తగ్గించుకోవడం నాకు కష్టమైంది. ఇప్పటికీ, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తుంటాను. సామెతలు 16:32 వంటి బైబిలు లేఖనాలు, కోపాన్ని తగ్గించుకోవడానికి నాకు బాగా సహాయం చేశాయి. అక్కడ ఇలా ఉంది: “కోప్పడే విషయంలో నిదానించేవాడు బలశాలి కన్నా బలవంతుడు, తన కోపాన్ని అదుపు చేసుకునేవాడు నగరాన్ని జయించేవాడి కన్నా శక్తిమంతుడు.”

1991 లో, నేను బాప్తిస్మం తీసుకుని ఒక యెహోవాసాక్షి అయ్యాను. జైల్లో ఉన్న ఒక నీటి తొట్టిలో నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఆ తర్వాతి సంవత్సరం నన్ను, ఇంకొంతమంది ఖైదీల్ని జైలు నుండి విడుదల చేశారు. నా బంధువులు స్పెయిన్‌లో ఉండడం వల్ల నన్ను స్పెయిన్‌కి పంపించారు. నేను స్పెయిన్‌కి వెళ్లగానే యెహోవాసాక్షుల మీటింగ్స్‌కి హాజరవ్వడం మొదలుపెట్టాను. అక్కడున్న యెహోవాసాక్షులు, నేను వాళ్లకు ఎప్పటినుండో తెలుసు అన్నట్టు నన్ను ప్రేమగా ఆహ్వానించారు. అలాగే నేను కొత్త జీవితం మొదలుపెట్టడానికి సహాయం చేశారు.

నేనెలా ప్రయోజనం పొందానంటే ... ఇప్పుడు నేను నా భార్యతో, ఇద్దరు కూతుళ్లతో కలిసి సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఇతరులు బైబిలు గురించి నేర్చుకునేలా సహాయం చేయడానికి ఎక్కువ సమయం పెడుతున్నాను. చావు అంచుల దాకా వెళ్లిన ఒకప్పటి జీవితానికి, ఇప్పటి జీవితానికి ఎంతో తేడా ఉంది. ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను, అంతేకాదు ఒక నిజమైన ఆశతో బ్రతుకుతున్నాను. అన్యాయం, ‘మరణం ఇక ఉండని’ పరదైసు కోసం నేను ఎదురుచూస్తున్నాను.​—ప్రకటన 21:3, 4.