పత్రిక ముఖ్యాంశం
పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?
నేటి లోకం పోర్నోగ్రఫీ లేదా అశ్లీల చిత్రాలతో * నిండిపోయింది. అది వ్యాపార ప్రకటనల్లో, ఫ్యాషన్‌లో, సినిమాల్లో, సంగీతంలో, పత్రికల్లో, టీవీల్లో, వీడియో గేముల్లో, స్మార్ట్ఫోన్లలో, ట్యాబ్‌లలో, వెబ్సైట్లలో, అలాగే ఆన్లైన్లో ఫొటోలు పంపించుకునే యాప్‌లలో కనిపిస్తుంది. ఆధునిక సమాజంలో పోర్నోగ్రఫీని ప్రజలు చాలా సాధారణమైన విషయంగా చూస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేనంతగా ఎక్కువ ప్రాంతాల్లో, ఎక్కువమంది ప్రజలు దాన్ని చూస్తున్నారు.— “కొన్ని వాస్తవాలు” అనే బాక్సు చూడండి.
అశ్లీల చిత్రాల తీరుతెన్నులు కూడా మారుతున్నాయి. ప్రొఫెసర్ గేల్ డైన్స్ ఇలా రాస్తున్నాడు: “ఈ రోజుల్లో అశ్లీల చిత్రాలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే, ఒకప్పుడు చాలా ఘోరమైన అశ్లీల చిత్రాలు అని అనుకున్నవి ఇప్పుడు మామూలు అశ్లీల చిత్రాలు అయిపోయాయి.”
ఇదంతా గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది? పోర్నోగ్రఫీ ఏమాత్రం హానిలేని వినోదమా లేక భయంకరమైన విషమా? లేదా ఆ రెండిటికీ మధ్యలో ఉందా? యేసు ఇలా అన్నాడు: “ప్రతీ మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, ప్రతీ చెడ్డ చెట్టు పనికిరాని ఫలాలు ఇస్తుంది.” (మత్తయి 7:17) మరి పోర్నోగ్రఫీ వల్ల ఎలాంటి ఫలాలు లేదా ఫలితాలు వస్తున్నాయి? అది తెలుసుకోవాలంటే, పోర్నోగ్రఫీ గురించిన కొన్ని ప్రాథమిక ప్రశ్నల్ని పరిశీలించాలి.
పోర్నోగ్రఫీ చూసేవాళ్ల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది?
నిపుణులు ఇలా అంటున్నారు: పోర్నోగ్రఫీ ఒక పెద్ద వ్యసనం. దాని నుండి బయటపడడం డ్రగ్స్నుండి బయటపడడంతో సమానమని కొంతమంది పరిశోధకులు, డాక్టర్లు అంటున్నారు.
ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ చూడడానికి బాగా అలవాటుపడిన బ్రయాన్ * ఇలా చెప్తున్నాడు: “నన్ను ఏదీ అపలేకపోయేది. ఏదో మైకంలో ఉన్నట్లు నాకు అనిపించేది. నా ఒళ్లంతా ఊగిపోయేది, తలనొప్పి వచ్చేది. దాన్ని మానేయడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ సంవత్సరాలు గడిచినా ఆ అలవాటు మాత్రం పోలేదు.”
పోర్నోగ్రఫీ చూసేవాళ్లు తమ అలవాటు గురించి ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడతారు. వాళ్లు దొంగచాటుగా, మోసకరంగా ప్రవర్తిస్తారు. అందుకే వాళ్లలో చాలామంది ఒంటరితనం, సిగ్గు, ఆందోళన, కృంగుదల, కోపం వంటి భావాలతో సతమతమౌతుంటారు. ఒక్కోసారి వాళ్లకు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు దాదాపు ప్రతీరోజు ఫోన్లో అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసుకున్న సెర్గే ఇలా చెప్తున్నాడు: “నేను నా లోకంలో ఉండేవాణ్ణి, మనసంతా వాటిమీదే ఉండేది. నేను ఎందుకూ పనికిరానని, తప్పు చేస్తున్నానని అనిపించేది. ఒంటరితనం బాధించేది, వలలో చిక్కుకుపోయినట్టు అనిపించేది. వేరేవాళ్ల సహాయం తీసుకోవాలంటే సిగ్గుగా, భయంగా ఉండేది.”
అనుకోకుండా లేదా కొన్ని క్షణాలే అశ్లీల చిత్రాలు చూసినా, దాని ప్రభావం మనమీద ఉంటుంది. ప్రముఖ పోర్నోగ్రఫీ పరిశోధకుడైన జూడిత్ రైజ్మన్ అమెరికా సెనేట్ కమిటీ ముందు తన వాదన వినిపిస్తూ ఇలా అన్నాడు: “అశ్లీల చిత్రాలు ఒకవ్యక్తి మెదడులో నాటుకుపోయి, దాన్ని మార్చేస్తాయి. దానివల్ల ఉన్నపళంగా, దానంతటదే ఒక శాశ్వత జ్ఞాపకం ఏర్పడేలా జీవ రసాయన చర్య మొదలౌతుంది. దాన్ని తీసేయడం చాలా కష్టం, ఒక్కోసారి అసాధ్యం.” అనుకోకుండా అశ్లీల వెబ్సైట్లు చూసిన 19 ఏళ్ల సూసన్ ఇలా అంటోంది: “ఆ చిత్రాలు నా మనసులో ముద్రించుకుపోయాయి. అవి ఉన్నట్టుండి గుర్తుకొస్తాయి. నేను ఎప్పటికీ వాటిని నా మనసులో నుండి పూర్తిగా తీసేసుకోలేనని అనిపిస్తుంది.”
ఒక్కమాటలో: పోర్నోగ్రఫీ ప్రజల్ని బానిసల్ని చేసుకొని, వాళ్ల జీవితాల్ని సర్వనాశనం చేస్తుంది.—2 పేతురు 2:19.
పోర్నోగ్రఫీ వల్ల కుటుంబం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది?
నిపుణులు ఇలా అంటున్నారు: “పోర్నోగ్రఫీ వల్ల వివాహ బంధాలు, కుటుంబ బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి.”—వెండీ మాల్ట్జ్, లారీ మాల్ట్జ్ రాసిన ద పోర్న్ ట్రాప్ పుస్తకం.
ఈ కింది విధాల్లో పోర్నోగ్రఫీ వివాహ, కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది:
భార్యాభర్తల మధ్య ఉండే నమ్మకం, సాన్నిహిత్యం, ప్రేమ తగ్గిపోతాయి.—సామెతలు 2:12-17.
స్వార్థం, భావోద్వేగ దూరం పెరిగిపోతాయి, వివాహజతతో సంతృప్తి పొందలేరు.—ఎఫెసీయులు 5:28, 29.
తప్పుడు లైంగిక కోరికలు, వాంఛలు కలుగుతాయి.—2 పేతురు 2:14.
వివాహజతతో సరికాని లైంగిక ప్రవర్తనకు పాల్పడతారు.—ఎఫెసీయులు 5:3, 4.
మానసికంగా, శారీరకంగా వివాహజతకు కట్టుబడి ఉండరు.—మత్తయి 5:28.
భార్యాభర్తలు ఒకరితోఒకరు “మోసపూరితంగా ప్రవర్తించకూడదు” అని బైబిలు చెప్తుంది. (మలాకీ 2:16) భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా లేకపోతే అది వాళ్ల వివాహాన్ని విచ్ఛిన్నం చేసి, విడిపోవడానికీ విడాకులకూ దారితీయవచ్చు. దానివల్ల వాళ్ల పిల్లలకు కూడా హాని జరుగుతుంది.
కొన్నిసార్లు పోర్నోగ్రఫీ ప్రభావం పిల్లల మీద నేరుగా పడుతుంది. పైన చెప్పుకున్న బ్రయాన్ ఇలా అంటున్నాడు: “దాదాపు 10 ఏళ్ల వయసులో నేను ఒకసారి దొంగా-పోలీస్ ఆట ఆడుతున్నప్పుడు, అనుకోకుండా మా నాన్న చదివే అశ్లీల మ్యాగజీన్లు చూశాను. నేను కూడా రహస్యంగా వాటిని చూడడం మొదలుపెట్టాను, అలాంటి చిత్రాలు నాకు ఎందుకు నచ్చాయో నిజానికి నాకు తెలీదు. అలా మొదలైన చెడ్డ అలవాటు నేను పెద్దయ్యాక కూడా పోలేదు.” పోర్నోగ్రఫీ వల్ల టీనేజీ పిల్లలు చిన్న వయసులోనే లైంగికంగా చురుగ్గా ఉంటారని, విచ్చలవిడిగా, లైంగిక దౌర్జన్యాలు చేసేవాళ్లుగా తయారౌతారని, భావోద్వేగంగా-మానసికంగా అస్థిరంగా ఉంటారని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి.
ఒక్కమాటలో: పోర్నోగ్రఫీ కుటుంబ బంధాల్ని పాడుచేసి గుండెకోతను, వేదనను మిగులుస్తుంది.—సామెతలు 6:27.
పోర్నోగ్రఫీ గురించి బైబిలు ఏం చెప్తుంది?
బైబిలు ఇలా చెప్తుంది: “మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి. లైంగిక పాపం, అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ, చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ అనేవి వాటిలో నుండే పుడతాయి.”—కొలొస్సయులు 3:5.
ఒక్కమాటలో చెప్పాలంటే, యెహోవా * దేవుడు పోర్నోగ్రఫీని అసహ్యించుకుంటాడు. దానర్థం, లైంగిక విషయాలకు ఆయన వ్యతిరేకమని కాదు. మనుషులకు లైంగిక సామర్థ్యాలు ఇచ్చింది ఆయనే. భార్యాభర్తలు ఒకరినొకరు సంతోషపెట్టుకోవడానికి, భావోద్వేగంగా సన్నిహితంగా ఉండడానికి, అలాగే పిల్లల్ని కనడానికి ఆయన వాటిని ఇచ్చాడు.—యాకోబు 1:17.
మరైతే యెహోవా దేవుడు పోర్నోగ్రఫీని ఎందుకు అంతగా అసహ్యించుకుంటున్నాడు? అందుకు కొన్ని కారణాలు పరిశీలించండి.
పోర్నోగ్రఫీ జీవితాలను నాశనం చేస్తుందని ఆయనకు తెలుసు.—ఎఫెసీయులు 4:17-19.
ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు హాని జరగకుండా కాపాడాలని అనుకుంటున్నాడు.—యెషయా 48:17, 18.
యెహోవా వివాహ, కుటుంబ బంధాల్ని సురక్షితంగా కాపాడాలని అనుకుంటున్నాడు.—మత్తయి 19:4-6.
మనం నైతికంగా పవిత్రంగా ఉండాలని, ఇతరుల హక్కుల్ని గౌరవించాలని ఆయన కోరుకుంటున్నాడు.—1 థెస్సలొనీకయులు 4:3-6.
మనం పిల్లల్ని కనే సామర్థ్యాన్ని గౌరవించాలని, దాన్ని గౌరవప్రదంగా ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు.—హెబ్రీయులు 13:4.
పోర్నోగ్రఫీ సాతానుకు ఉన్న వంకర, స్వార్థపూరిత ఆలోచనను ప్రతిబింబిస్తుందని యెహోవాకు తెలుసు.—ఆదికాండం 6:2; యూదా 6, 7.
ఒక్కమాటలో: పోర్నోగ్రఫీ ఒక వ్యక్తికి దేవునితో ఉన్న స్నేహాన్ని పాడుచేస్తుంది.—రోమీయులు 1:24.
అయితే పోర్నోగ్రఫీ ఉచ్చు నుండి బయటపడాలని కోరుకుంటున్నవాళ్ల మీద యెహోవాకు ఎంతో కనికరం ఉంది. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా కరుణ, కనికరం గల దేవుడు, ఆయన ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపిస్తాడు. ఎందుకంటే, మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు, మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు.” (కీర్తన 103:8, 14) “సహాయం అవసరమైనప్పుడు కరుణను, అపారదయను పొందగలిగేలా” తనను సమీపించమని ఆయన వినయస్థుల్ని ఆహ్వానిస్తున్నాడు.—హెబ్రీయులు 4:16; “అశ్లీల చిత్రాలు చూసే అలవాటు నుండి బయటపడాలంటే ...” అనే బాక్సు చూడండి.
లెక్కలేనంతమంది దేవుని సహాయాన్ని తీసుకున్నారు. ఆయన చేసే సహాయం ఎంతవరకు ఉపయోగపడుతుంది? చెడు అలవాట్ల నుండి బయటపడిన కొంతమంది గురించి బైబిలు ఏం చెప్తుందో గమనించండి: “దేవుడు మిమ్మల్ని శుభ్రం చేసి, పవిత్రపర్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు పేరున తన పవిత్రశక్తితో నీతిమంతులుగా తీర్పు తీర్చాడు.” (1 కొరింథీయులు 6:11) అలాంటివాళ్లు అపొస్తలుడైన పౌలులాగే ఇలా చెప్పగలరు: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.
పోర్నోగ్రఫీ వ్యసనం నుండి బయటపడిన సూసన్ ఇలా చెప్తుంది: “పోర్నోగ్రఫీ ఉచ్చు నుండి బయటపడడానికి యెహోవా మాత్రమే మీకు సహాయం చేయగలడు. మీరు ఆయన సహాయాన్ని, నిర్దేశాన్ని అడిగితే ఆయన ముందు పవిత్రులుగా ఉండగలరు. ఆయన మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు.”