బైబిలు జీవితాల్ని మారుస్తుంది
“‘మనం ఎందుకు పుట్టాం?’ అని ఎన్నో ఏళ్లు ఆలోచించాను”—రోసాలిండ్ జాన్
పుట్టిన సంవత్సరం: 1963
దేశం: బ్రిటన్
ఒకప్పుడు: పెద్దస్థాయి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం ఉండేవి
నా గతం:
నేను దక్షిణ లండన్‌లోని క్రాయ్డన్లో పుట్టాను. మా అమ్మానాన్నలకు మేము తొమ్మిదిమంది పిల్లలం. అందులో నేను ఆరో దాన్ని. అసలైతే, మా అమ్మానాన్నలది కరీబియన్ దీవుల్లో సెయింట్ విన్సెంట్ అనే దీవి. మా అమ్మ మెథడిస్ట్ చర్చికి వెళ్లేది. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం ఆసక్తి ఉన్నా, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉండేది కాదు. స్కూల్లో సెలవులు ఇచ్చినప్పుడల్లా, మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక చెరువు గట్టుకు వెళ్లి, లైబ్రరీ నుండి తెచ్చుకున్న చాలా పుస్తకాలు చదువుతూ గడిపేదాన్ని.
స్కూల్ చదువు పూర్తయిన కొన్ని సంవత్సరాల తర్వాత, అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలనే కోరిక నాలో ఉందని నేను గుర్తించాను. దాంతో, ఇల్లు లేనివాళ్లకు, శారీరక-మానసిక లోపం ఉన్నవాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టాను. తర్వాత, యూనివర్సిటీలో చేరి, హెల్త్ సైన్సెస్‌లో డిగ్రీ చేశాను. డిగ్రీ పూర్తయిన తర్వాత, నాకు పెద్దస్థాయి ఉద్యోగాలు చాలా వచ్చాయి, అలాగే నా జీవితం విలాసవంతంగా అయిపోయింది. నేను సొంతగా ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా, సోషల్ రీసెర్చర్‌గా చేస్తున్నాను కాబట్టి నాకు ఒక లాప్టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు. నేను రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లిపోయి, నచ్చిన హోటల్లో తింటూ, చుట్టుపక్కల మంచి పరిసరాలు ఆస్వాదిస్తూ, ఫిట్‌గా ఉండడానికి స్పాకు-జిమ్‌కు వెళ్తూ, జీవితాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. నా జీవితం చాలా బాగుందని నేను అనుకున్నాను. కానీ, కష్టాల మధ్య జీవిస్తున్నవాళ్ల గురించైతే నేను ఆలోచిస్తూనే ఉన్నాను.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...
‘మనం ఎందుకు పుట్టాం? జీవితానికి అర్థం ఏంటి?’ అని ఎన్నో ఏళ్లు ఆలోచించాను. కానీ, వాటికి జవాబులు బైబిల్లో వెతకడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. 1999 లో ఒకరోజు, అప్పటికే యెహోవాసాక్షి అయిన మా చెల్లి మార్గరెట్, ఒక సహోదరిని నా దగ్గరికి తీసుకొచ్చింది. ఆమె నా మీద వ్యక్తిగత శ్రద్ధ చూపించింది. ఎందుకో తెలీదు గానీ, నేను ఆ సహోదరి దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకున్నాను. కాకపోతే, అప్పట్లో నా కెరీర్ వల్ల, విలాసవంతమైన జీవితం వల్ల టైం ఉండేది కాదు. కాబట్టి చాలా నిదానంగా ప్రగతి సాధించాను.
2002 లో, నేను నైరుతి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాను. సోషల్ రీసెర్చ్‌లో పీజీ చేయడానికి అక్కడ ఒక యూనివర్సిటీలో చేరాను. అందులో డాక్టరేట్ సంపాదించాలన్నది నా ఉద్దేశం. అయితే, నేను మా అబ్బాయిని తీసుకుని, అక్కడున్న రాజ్యమందిరానికి క్రమంగా వెళ్లేదాన్ని. నాకు పైచదువులు చదవడం ఇష్టమే, కానీ బైబిలు చదివినప్పుడు మాత్రమే జీవితంలో సమస్యలు ఎందుకున్నాయో, అవి ఎలా పరిష్కారం అవుతాయో అర్థం చేసుకున్నాను. మత్తయి 6:24 లో ఉన్న మాటలు ఎంత నిజమో నాకు అర్థమైంది. ఆ లేఖనం చెప్తున్నట్టు, ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. అయితే దేవునికి దాసుడిగా ఉండాలి, లేదా సంపదలకు దాసుడిగా ఉండాలి. కాబట్టి, ఆ రెండిట్లో ఏదోకటి తేల్చుకోవాలని నాకు అర్థమైంది.
ఆ ముందటి సంవత్సరం, యెహోవాసాక్షులు ఒక ఇంట్లో చేసుకుంటున్న సంఘ బైబిలు అధ్యయనానికి నేను వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ, మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? a అనే పుస్తకం మీద అధ్యయనం జరుగుతుంది. అందులో విన్న విషయాల్ని బట్టి, సృష్టికర్త అయిన యెహోవా మాత్రమే మనుషుల సమస్యల్ని తీసేయగలడని నాకు నమ్మకం కుదిరింది. కానీ యూనివర్సిటీలో చూడబోతే, అసలు జీవితంలో సృష్టికర్తే అవసరం లేదని బోధిస్తున్నారు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. అందుకే, ఆ కోర్సు మొదలుపెట్టిన రెండు నెలలకే దాన్ని వదిలేసి, ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాను.
విలాసవంతమైన జీవితాన్ని సాదాసీదాగా మార్చుకోవడానికి నాకు సహాయం చేసిన బైబిలు లేఖనం, సామెతలు 3:5, 6: “నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు, నీ సొంత అవగాహన మీద ఆధారపడకు. నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో, అప్పుడు ఆయన నీ జీవితాన్ని సఫలం చేస్తాడు.” మన ప్రేమగల దేవుని గురించి తెలుసుకోవడం కన్నా సంపదలూ, డాక్టరేట్ వల్ల వచ్చే హోదా నాకు అంత ప్రాముఖ్యం అనిపించలేదు. భూమి విషయంలో యెహోవాకున్న ఉద్దేశం గురించి, మనకోసం ప్రాణం పెట్టిన యేసు గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ, నా జీవితాన్ని సృష్టికర్తకు సమర్పించుకోవాలని అనిపించింది. 2003, ఏప్రిల్‌లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. తర్వాత, మెల్లమెల్లగా మార్పులు చేసుకుని సాదాసీదాగా జీవించడం మొదలుపెట్టాను.
నేనెలా ప్రయోజనం పొందానంటే ...
యెహోవాతో నాకున్న స్నేహం వెలకట్టలేనిది. ఆయన్ని తెలుసుకోవడం వల్ల నేను నిజమైన మనశ్శాంతిని, ఆనందాన్ని పొందాను. అంతేకాదు, యెహోవాను ప్రేమిస్తున్న వాళ్లతో స్నేహం చేస్తున్నందుకు కూడా నేను సంతోషంగా ఉన్నాను.
ఇప్పటికీ నాకు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం, అందుకే బైబిలు నుండి, మీటింగ్స్ నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూ సంతోషంగా ఉన్నాను. నా నమ్మకాల్ని వేరేవాళ్లతో పంచుకోవడం కూడా నాకు ఇష్టం. ఇప్పుడు అదే నా కెరీర్ అయిపోయింది. ప్రజలు ఇప్పుడు ఎలా సంతోషంగా ఉండవచ్చో, భవిష్యత్తు మీద ఆశతో ఎలా బ్రతకవచ్చో చెప్తూ నేను వాళ్లకు నిజంగా సహాయం చేయగలుగుతున్నాను. 2008, జూన్‌లో నేను క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాను. దానివల్ల ఇంతకుముందు కన్నా ఎక్కువ సంతృప్తిని, సంతోషాన్ని పొందుతున్నాను. జీవితానికి ఉన్న నిజమైన అర్థం ఏంటో ఇప్పుడు నాకు తెలిసింది. అది తెలుసుకునేలా సహాయం చేసినందుకు నేను యెహోవాకు చాలా రుణపడి ఉన్నాను.
a యెహోవాసాక్షులు ప్రచురించినది.