మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?
ప్రార్థించడం గురించి యేసు చాలాసార్లు బోధించాడు. ఆ కాలంలోని యూదా మత నాయకులు “ముఖ్య వీధుల మూలల్లో” ప్రార్థించేవాళ్లు. ఎందుకు? “మనుషులకు కనిపించేలా” వాళ్లు అలా చేసేవాళ్లని యేసు చెప్పాడు. అంటే, వాళ్లు తమ భక్తితో ఇతరుల్ని ముగ్ధుల్ని చేయాలనుకున్నారు. “ఎక్కువ మాటలు ఉపయోగిస్తే” దేవుడు తమ ప్రార్థనలు వింటాడని అనుకుంటూ, వాళ్లు పెద్దపెద్ద ప్రార్థనలు పదేపదే చేసేవాళ్లు. (మత్తయి 6:5-8) యేసు అలాంటివి వ్యర్థమని చెప్తూ, మంచి మనసున్నవాళ్లు ప్రార్థించేటప్పుడు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో నేర్పించాడు. అయితే ఆయన కేవలం ఎలా ప్రార్థించకూడదో చెప్పి ఊరుకోలేదు.
దేవుని పేరు పవిత్రపర్చబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన ఇష్టం నెరవేరాలి అనే కోరిక మనకు ఉందని మన ప్రార్థనలు చూపించాలని యేసు నేర్పించాడు. మన సొంత విషయాల గురించి కూడా ప్రార్థించవచ్చని యేసు చెప్పాడు. (మత్తయి 6:9-13; లూకా 11:2-4) యెహోవా మన ప్రార్థనలు వినాలంటే మనకు పట్టుదల, విశ్వాసం, వినయం ఉండాలని యేసు ఉదాహరణలతో నేర్పించాడు. (లూకా 11:5-13; 18:1-14) ఆయన కేవలం మాటలతో కాకుండా తన ఆదర్శంతో ఆ విషయాలు నేర్పించాడు.—మత్తయి 14:23; మార్కు 1:35.
ఆ ఉపదేశం, మెరుగ్గా ప్రార్థించడానికి యేసు శిష్యులకు తప్పకుండా సహాయం చేసింది. అయితే ప్రార్థన గురించిన అతి ముఖ్యమైన పాఠాన్ని యేసు తన శిష్యులకు తన భూజీవితం చివరి రోజున నేర్పించాడు.
“ప్రార్థనకు సంబంధించినంత వరకు అదొక కీలకమైన మలుపు”
యేసు భూమ్మీద గడిపిన చివరి రోజు ఎక్కువ సమయాన్ని తన నమ్మకమైన అపొస్తలుల్ని ప్రోత్సహించడానికే ఉపయోగించాడు. ఒక కొత్త విషయం చెప్పడానికి అది సరైన సమయం. యేసు ఇలా చెప్పాడు: “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.” తర్వాత ఆయన వాళ్లకు ఈ భరోసా ఇచ్చాడు: “నా పేరున మీరు ఏది అడిగినా నేను అది చేస్తాను, కుమారుడి ద్వారా తండ్రికి మహిమ వచ్చేలా నేను అలా చేస్తాను. మీరు నా పేరున ఏమి అడిగినా నేను చేస్తాను.” చివర్లో ఆయన ఇలా అన్నాడు: “ఇప్పటివరకు మీరు నా పేరున ఏదీ అడగలేదు. అడగండి, మీరు దాన్ని పొందుతారు; అప్పుడు మీ సంతోషం సంపూర్ణం అవుతుంది.”—యోహాను 14:6, 13, 14; 16:24.
అవి చాలా ముఖ్యమైన మాటలు. ఒక బైబిలు నిఘంటువు దాని గురించి మాట్లాడుతూ, “ప్రార్థనకు సంబంధించినంత వరకు అదొక కీలకమైన మలుపు” అంది. యేసు ఉద్దేశం, ఇకమీదట దేవునికి కాకుండా తనకు ప్రార్థించాలని కాదు. యెహోవా దేవుణ్ణి సమీపించడానికే యేసు ఒక కొత్త మార్గం తెరుస్తున్నాడు.
నిజమే, దేవుడు తన నమ్మకమైన సేవకులు చేసిన ప్రార్థనలు ఎల్లప్పుడూ విన్నాడు. (1 సమూయేలు 1:9-19; కీర్తన 65:2) కానీ ఇశ్రాయేలుతో ఒప్పందం చేసిన దగ్గర నుండి, దేవుడు తమ ప్రార్థనలు వినాలని కోరుకునే వాళ్లందరూ ఇశ్రాయేలీయులు దేవుడు ఎంచుకున్న జనం అని గుర్తించాలి. తర్వాత సొలొమోను కాలం నుండి, ఆలయం అనేది బలులు అర్పించడానికి దేవుడు ఎంచుకున్న స్థలం అని గుర్తించాలి. (ద్వితీయోపదేశకాండం 9:29; 2 దినవృత్తాంతాలు 6:32, 33) అయినాసరే, ఆ ఆరాధనా ఏర్పాటు శాశ్వతమైనది కాదు. అపొస్తలుడైన పౌలు రాసినట్టు, ఇశ్రాయేలుకు ఇచ్చిన ధర్మశాస్త్రం అలాగే ఆలయంలో అర్పించిన బలులు “రాబోయే మంచివాటికి నీడ మాత్రమే కానీ అదే నిజమైన రూపం కాదు.” (హెబ్రీయులు 10:1, 2) ఆ నీడ స్థానంలో నిజమైనది వస్తుంది. (కొలొస్సయులు 2:17) సా.శ. 33వ సంవత్సరం నుండి, ఒక వ్యక్తికి యెహోవాతో ఉన్న సంబంధం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం మీద ఆధారపడి ఉండదు. బదులుగా, ధర్మశాస్త్రం ఎవరి దగ్గరికైతే ప్రజల్ని నడిపించిందో ఆ క్రీస్తుయేసుకు విధేయత చూపించడం మీదే ఆధారపడి ఉంటుంది.—యోహాను 15:14-16; గలతీయులు 3:24, 25.
“అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరు”
మన ప్రార్థనల్ని దేవుడు విని వాటికి జవాబు ఇవ్వడానికి, మన కోసం మార్గాన్ని తెరిచే ఒక శక్తిమంతుడైన స్నేహితుడిలా యేసు తనను తాను వర్ణించుకున్నాడు. అలా ఆయన, యెహోవాను సమీపించడానికి ఒక ఉన్నతమైన ఏర్పాటును పరిచయం చేశాడు. యేసు మన తరఫున అలా ఎందుకు చేయగలడు?
మనందరం పాపంలో పుట్టాం కాబట్టి మనమెన్ని మంచి పనులు చేసినా, ఎన్ని బలులు అర్పించినా అవి ఆ పాపపు మరకను తుడిచేయలేవు. అలాగే పవిత్రుడైన యెహోవా దేవునితో స్నేహం చేసే హక్కును ఇవ్వలేవు. (రోమీయులు 3:20, 24; హెబ్రీయులు 1:3, 4) అయితే విడుదల పొందే అవకాశమున్న వాళ్ల పాపాల కోసం యేసు తన పరిపూర్ణ మానవ జీవితాన్ని బలిగా అర్పించాడు. (రోమీయులు 5:12, 18, 19) కాబట్టి ఎవరైతే దేవుడు తమ పాపాల్ని తుడిచేయాలని కోరుకుంటారో వాళ్లందరూ దేవుని ముందు పవిత్రులుగా ఉండవచ్చు, దేవునికి నిర్భయంగా ప్రార్థించవచ్చు. అందుకోసం వాళ్లు తప్పనిసరిగా యేసు బలి మీద విశ్వాసం చూపించాలి, ఆయన పేరున ప్రార్థించాలి.—ఎఫెసీయులు 3:11, 12.
మనం యేసు పేరున ప్రార్థించినప్పుడు, దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆయన కనీసం మూడు విధాల్లో పనిచేస్తున్నాడని విశ్వాసం చూపిస్తాం. అవి ఏంటంటే (1) ఆయన “దేవుని గొర్రెపిల్ల,” ఆయన బలి ఆధారంగానే దేవుడు మన పాపాల్ని క్షమిస్తాడు. (2) యెహోవా యేసును మళ్లీ బ్రతికించాడు, ఇప్పుడు ఆయన తన బలి ప్రయోజనాలు మనకు అందించడానికి ‘ప్రధానయాజకుడిగా’ సేవచేస్తున్నాడు. (3) ప్రార్థనలో యెహోవాను సమీపించడానికి యేసు మాత్రమే “మార్గం.”—యోహాను 1:29; 14:6; హెబ్రీయులు 4:14, 15.
యేసు పేరున ప్రార్థిస్తే, యేసుకు ఘనత వస్తుంది. అది సరైనదే, ఎందుకంటే “ప్రతీ ఒక్కరు యేసు పేరున మోకరించాలని, తండ్రైన దేవునికి మహిమ కలిగేలా ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తే ప్రభువని బహిరంగంగా ఒప్పుకోవాలి” అనేది దేవుని ఇష్టం. (ఫిలిప్పీయులు 2:10, 11) అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసు పేరున ప్రార్థిస్తే యెహోవాకు మహిమ వస్తుంది. ఎందుకంటే, మన ప్రయోజనం కోసం తన కుమారుణ్ణి ఇచ్చింది ఆయనే.—యోహాను 3:16.
మనం యాంత్రికంగా కాదు, “హృదయపూర్వకంగా” ప్రార్థించాలి
మనం యేసు స్థానం ఎంత గొప్పదో అర్థంచేసుకునేలా, బైబిలు ఆయన్ని కొన్ని బిరుదులతో పేర్లతో పిలుస్తుంది. అవి యేసు చేసిన, చేస్తున్న, చేయబోతున్న పనులు మనకెలాంటి ప్రయోజనాలు తెస్తాయో గ్రహించేలా సహాయం చేస్తాయి. (“ యేసు ముఖ్యమైన పాత్ర” చూడండి.) అవును, నిజంగానే దేవుడు యేసుకు “అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును” ఇచ్చాడు. * పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం ఇచ్చాడు.—ఫిలిప్పీయులు 2:9; మత్తయి 28:18.
అది కేవలం ఒక అలవాటుగా ఉండకూడదు
అవును, యెహోవా మన ప్రార్థనలు వినాలంటే మనం యేసు పేరున ప్రార్థించాలి. (యోహాను 14:13, 14) అయితే “యేసు పేరున” అనే మాటను కేవలం అలవాటుగా ఉపయోగించకూడదు. ఎందుకని?
ఒక ఉదాహరణ గమనించండి. మీకు ఒక వ్యాపారవేత్త నుండి ఉత్తరం వస్తే, ముగింపులో “ఇట్లు” అంటూ కొన్ని గౌరవపూర్వక మాటలు ఉంటాయి. అది చదివినప్పుడు మీరు నిజంగానే అతను అలా చెప్తున్నాడని అనుకుంటారా? లేక సాధారణంగా వ్యాపార ఉత్తరాల్లో వాడే పదాలు ఉపయోగించాడని అనుకుంటారా? కాబట్టి మన ప్రార్థనల్లో యేసు పేరు ఉపయోగించడం అనేది కేవలం ఒక వ్యాపార ఉత్తరం ముగించినట్టు ఉండకూడదు. అది చాలా అర్థవంతంగా ఉండాలి. “ఎప్పుడూ ప్రార్థించండి” అని బైబిలు చెప్తుంది; అంతమాత్రాన మన ప్రార్థనలు యాంత్రికంగా ఉండకూడదు, అవి “హృదయపూర్వకంగా” ఉండాలి.—1 థెస్సలొనీకయులు 5:17; కీర్తన 119:145.
“యేసు పేరున” అనే మాటలు కేవలం ఒక అలవాటుగా ఉపయోగించకుండా ఉండాలంటే ఏంచేయాలి? యేసుకున్న చక్కని లక్షణాల గురించి ఆలోచించండి. ఆయన మీ కోసం ఇప్పటికే ఏంచేశాడో, ముందుముందు ఏంచేయడానికి సిద్ధంగా ఉన్నాడో ఆలోచించండి. తన కుమారుణ్ణి అంత చక్కగా ఉపయోగించుకున్నందుకు ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి, ఆయన్ని స్తుతించండి. అలాచేస్తే, “మీరు నా పేరున తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడు” అని యేసు చేసిన వాగ్దానం మీద నీ నమ్మకం బలపడుతుంది.—యోహాను 16:23.
^ వైన్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్టమెంట్ వర్డ్స్ ప్రకారం, “పేరు” అని అనువదించబడిన గ్రీకు పదం, “ఒక పేరు సూచించే ప్రతీదాన్ని, అంటే అధికారాన్ని, వ్యక్తిత్వాన్ని, హోదాను, గొప్పతనాన్ని, శక్తిని, [అలాగే] ఔన్నత్యాన్ని” సూచించవచ్చు.