యేసు దేవుడా?
చాలామంది త్రిత్వాన్ని “క్రైస్తవ మతానికి చెందిన అతి ముఖ్యమైన సిద్ధాంతం” అనుకుంటారు. ఆ బోధ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకే దేవునిలోని ముగ్గురు వ్యక్తులు అని చెప్తుంది. కార్డినల్ జాన్ ఓ’కాన్నర్ త్రిత్వం గురించి ఇలా అన్నాడు: “అది మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టని ఒక లోతైన మర్మం అని మనకు తెలుసు.” త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం ఎందుకంత కష్టం?
ద ఇలస్ట్రేటెడ్ బైబిల్ డిక్షనరీ అందుకు ఒక కారణాన్ని చెప్తుంది. త్రిత్వం గురించి ఆ ప్రచురణ ఇలా ఒప్పుకుంటుంది: “దాన్ని వివరించే లేఖనాలేవీ బైబిల్లో లేవు కాబట్టి అది బైబిలు ఆధారిత సిద్ధాంతం కాదు.” త్రిత్వం “బైబిలు ఆధారిత సిద్ధాంతం కాదు” కాబట్టే, దాన్ని నమ్మేవాళ్లు తమ బోధకు ఆధారాన్ని కనుగొనడం కోసం చాలా ఆత్రంగా లేఖనాల్ని వెతుక్కుంటున్నారు, చివరికి వాటి అర్థాన్ని కూడా మారుస్తున్నారు.
ఆ లేఖనం త్రిత్వాన్ని బోధిస్తుందా?
అలా ఎక్కువసార్లు తప్పుగా ఉపయోగించే ఒక లేఖనం, యోహాను 1:1. పరిశుద్ధ గ్రంథములో ఆ లేఖనం ఇలా ఉంటుంది: “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని [గ్రీకులో టాన్ థియోన్] యొద్ద ఉండెను, వాక్యము దేవుడై [గ్రీకులో థియోస్] ఉండెను.” ఈ వచనంలో గ్రీకు నామవాచకమైన థియోస్ (దేవుడు) రెండు రూపాల్లో కనిపిస్తుంది. మొదటి దానికి ముందు టాన్ అనే పదం (definite article) ఉంది కాబట్టి, అది సర్వశక్తిగల దేవుణ్ణి సూచిస్తుంది. కానీ రెండో దానికి ముందు అలాంటి పదాలేవీ లేవు. దానర్థం, రెండో దానికి ముందు ఆ పదాన్ని పెట్టడం మర్చిపోయారనా?
త్రిత్వ సిద్ధాంతం నమ్మడానికి ఎందుకంత కష్టంగా ఉంటుంది?
యోహాను సువార్తను సాధారణ ప్రజలు మాట్లాడే కొయిని గ్రీకులో రాశారు. ఆ గ్రీకులో, టాన్ లాంటి పదాన్ని (definite articleని) వాడడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఒకవేళ కర్తకు (subject), దాని గురించిన వివరణకు (predicate) రెండిటికీ ముందు అలాంటి పదాలు (articles) ఉంటే, ‘రెండూ ఒకే లాంటివి (definite) అని, రెండూ ఒకటే అని, ఒకదాని స్థానంలో ఇంకోదాన్ని పెట్టొచ్చని భావిస్తారు’ అని బైబిలు పండితుడు ఏ. టి. రాబర్ట్సన్ అంటున్నాడు. దానికి మత్తయి 13:38 ఒక ఉదాహరణ అని ఆయన అంటున్నాడు. అక్కడిలా ఉంది: “పొలం [గ్రీకులో ఓ అగ్రోస్] ఈ లోకం [గ్రీకులో ఓ కాస్మోస్].” కాబట్టి వ్యాకరణం ప్రకారం, ‘ఈ లోకం పొలం’ అని కూడా చెప్పొచ్చని మనకు అర్థమౌతుంది.
ఒకవేళ యోహాను 1:1 లో ఉన్నట్టు, కేవలం కర్తకు (subject) ముందు మాత్రమే ఆ పదం (definite article) ఉంటే దానర్థమేంటి? ఆ వచనాన్ని ఉదాహరణగా తీసుకొని, జేమ్స్ అలెన్ హ్యూవట్ అనే పండితుడు ఇలా నొక్కిచెప్తున్నాడు: “అలాంటి వాక్య నిర్మాణంలో కర్త (subject), దాని గురించిన వివరణ (predicate) ఒకటి కాదు, రెండూ సమానం కాదు, ఒకేలాంటివి కాదు, అసలు అలాంటి పోలిక ఏదీ ఉండదు.”
దాన్ని వివరించడానికి హ్యూవట్ 1 యోహాను 1:5 ను ఉదాహరణగా తీసుకున్నాడు. ఆ వచనంలో ఇలా ఉంది: “దేవుడు వెలుగు.” ఇక్కడ “దేవుడు” అని ఉన్న చోట, గ్రీకులో ఓ థియోస్ అని ఉంది. కానీ “వెలుగు” అనే మాటకు, ఫోస్ అని మాత్రమే ఉంది. దానికి ముందు ఓ (definite article) లేదు. కాబట్టి హ్యూవట్ ఇలా అంటున్నాడు: ‘దేవుడు ఎప్పుడూ వెలుగుమయంగా ఉంటాడని చెప్పవచ్చు; కానీ వెలుగు గురించి, అది దేవుడని ఎప్పుడూ చెప్పలేం.’ అలాంటి ఉదాహరణలు కొన్ని ఏంటంటే, “దేవుడు అదృశ్య వ్యక్తి” అని చెప్పే యోహాను 4:24; అలాగే “దేవుడు ప్రేమ” అని చెప్పే 1 యోహాను 4:16. ఈ రెండు లేఖనాల్లోనూ “దేవుడు” అనే పదానికి ముందు ఓ (definite article) ఉంది, కానీ “అదృశ్య వ్యక్తి,” “ప్రేమ” అనే మాటలకు ముందు ఓ లేదు. కాబట్టి మనం వాటిని మార్చి “అదృశ్య వ్యక్తే దేవుడు” “ప్రేమే దేవుడు” అని చెప్పలేం.
“వాక్యం” గుర్తింపా?
చాలామంది ప్రాచీన గ్రీకు పండితులు, బైబిలు అనువాదకులు యోహాను 1:1 లేఖనం, “వాక్యం” గుర్తింపును కాదుగానీ లక్షణాన్ని నొక్కిచెప్తుందని అంగీకరిస్తారు. విలియమ్ బార్క్లే అనే బైబిలు అనువాదకుడు ఇలా చెప్తున్నాడు: ‘అపొస్తలుడైన యోహాను థియోస్కి ముందు ఓ (definite article) పెట్టలేదు కాబట్టి, అది వర్ణన అవుతుంది. యోహాను ఇక్కడ, వాక్యాన్ని దేవునిగా గుర్తించట్లేదు. ఇంకా సరళంగా చెప్పాలంటే వాక్యం దేవుడని ఆయన అనట్లేదు.’ అలాగే, జేసన్ డేవిడ్ బెడూన్ అనే పండితుడు ఇలా అంటున్నాడు: “గ్రీకులో యోహాను 1:1సి లాంటి వాక్యంలో థియోస్కి ముందు ఓ (definite article) పెట్టకపోతే, మీరు ‘ఒక దేవుడు’ అని చెప్పాలని అనుకుంటున్నారని మీ పాఠకులు అర్థం చేసుకుంటారు. … థియోస్కి ముందు ఓ లేకపోవడం వల్ల అది ఓ థియోస్ అనే మాటకు పూర్తి భిన్నమైన అర్థాన్నిస్తుంది. ఆ రెండిటికీ, ఇంగ్లీషులో ‘a god’ అలాగే ‘God’ అనేవాటికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది.” ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “యోహాను 1:1 లో వాక్యం ఒకేఒక్క దేవుడు కాదుగానీ, ఒక దేవుడు లేదా దైవత్వం ఉన్నవాడు.” దీన్నే అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ బైబిలు కోసం పనిచేసిన జోసెఫ్ హెన్రీ థేయర్ అనే పండితుని మాటల్లో చెప్పాలంటే, “లోగోస్ [లేదా, వాక్యం] దైవత్వం గలవాడు, తానే దేవుడు కాదు.”
తాను, తండ్రి ఇద్దరూ వేరు అని యేసు స్పష్టంగా చూపించాడు
దేవుని గుర్తింపు ‘ఒక లోతైన మర్మంగా’ ఉండాలా? యేసుకు అలా అనిపించలేదు. యేసు తన తండ్రికి ప్రార్థించినప్పుడు తనకు, తండ్రికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా చూపించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” (యోహాను 17:3) మనం యేసును నమ్మి, బైబిలు సరళంగా బోధిస్తున్నదాన్ని అర్థంచేసుకుంటే, యేసును దేవుని కుమారునిగా, దైవత్వం ఉన్నవాడిగా గౌరవిస్తాం. యెహోవా “ఒకేఒక్క సత్యదేవుడు” అని గుర్తించి ఆయన్ని ఆరాధిస్తాం.