బైబిలు జీవితాలను మారుస్తుంది
బైబిలు జీవితాలను మారుస్తుంది
ప్రజల్ని ప్రేమించాలని, వాళ్లకు సహాయం చేయాలని కోరుకునేలా ఒక పంక్ గ్యాంగ్ సభ్యుణ్ణి ఏది కదిలించింది? అనైతిక జీవనశైలిని విడిచిపెట్టేలా మెక్సికోలోని ఒక వ్యక్తిని ఏది పురికొల్పింది? జపాన్‌లోని ప్రముఖ సైకిల్ రేసర్ దేవుణ్ణి సేవించడం కోసం రేసింగ్‌ను ఎందుకు విడిచిపెట్టాడు? వాళ్ల మాటల్లోనే తెలుసుకోండి.
“నేను చాలా అమర్యాదగా, తలబిరుసుగా, దూకుడుగా ప్రవర్తించాను.”—డెన్నిస్ ఓబైర్న్
పుట్టిన సంవత్సరం: 1958
దేశం: ఇంగ్లాండ్
ఒకప్పుడు: పంక్ గ్యాంగ్‌కి చెందినవాణ్ణి
నా గతం: మా నాన్నవాళ్లు ఐర్లాండ్ దేశానికి చెందినవాళ్లు, నేను ఒక ఐరిష్ క్యాథలిక్‌గా పెరిగాను. కానీ చర్చికి ఒక్కడినే వెళ్లాల్సి వచ్చేది, నాకేమో వెళ్లాలనిపించేది కాదు. అయినా, దేవుని విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉండేది. పరలోక ప్రార్థన చేస్తూ ఉండేవాణ్ణి, రాత్రి మంచం మీద పడుకుని ఆ ప్రార్థన అర్థం ఏంటా అని ఆలోచించేవాణ్ణి. ఆ ప్రార్థనను చిన్నచిన్న వాక్యాలుగా విడగొట్టి ఒక్కో వాక్యం అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి.
నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు, రస్టాఫరియన్ ఉద్యమంలో పాల్గొన్నాను. నాజీ వ్యతిరేక లీగ్ లాంటి రాజకీయ ఉద్యమాల మీద కూడా ఆసక్తి ఉండేది. అయితే పంక్ ఉద్యమంలోని తిరుగుబాటు స్వభావం నా మీద చాలా ప్రభావం చూపించింది. నేను డ్రగ్స్, ముఖ్యంగా గంజాయి తీసుకునేవాణ్ణి. దాదాపు ప్రతీరోజు ఆ పొగ పీల్చేవాణ్ణి. దేన్నీ లెక్కచేసేవాణ్ణి కాదు. బాగా తాగేవాణ్ణి, సాహసాలు చేసేవాణ్ణి, ఇతరుల గురించి అస్సలు పట్టించుకునే వాణ్ణి కాదు. సంఘవిద్రోహ పనులు చేసేవాణ్ణి. అవసరమైతే తప్ప ఎవరితోనూ మాట్లాడేవాణ్ణి కాదు, నన్ను ఫోటో కూడా తీయనిచ్చేవాణ్ణి కాదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను చాలా అమర్యాదగా, తలబిరుసుగా, దూకుడుగా ప్రవర్తించానని అనిపిస్తుంది. నాకు బాగా దగ్గరగా ఉన్నవాళ్లతో మాత్రమే దయగా ఉండేవాణ్ణి, ఏదైనా ఇచ్చేవాణ్ణి.
నాకు దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పుడు బైబిలు మీద ఆసక్తి పెరిగింది. డ్రగ్స్ అమ్మే ఒక ఫ్రెండ్ జైల్లో ఉన్నప్పుడు బైబిలు చదవడం మొదలుపెట్టాడు. మేము మతం గురించి, చర్చి గురించి, లోకంపై సాతాను ప్రభావం గురించి చాలాసేపు మాట్లాడుకునేవాళ్లం. నేను ఒక బైబిలు కొనుక్కొని స్వయంగా చదవడం మొదలుపెట్టాను. నేను, మా ఫ్రెండ్ బైబిల్లో కొంతభాగం చదివి, తర్వాత ఇద్దరం కలుసుకొని ఎవరు ఏం నేర్చుకున్నారో మాట్లాడుకునేవాళ్లం, ఆయా విషయాల గురించి ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్లం. ఇలా కొన్ని నెలలపాటు జరిగింది.
అలా చదివి మేము అర్థం చేసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే: మనం ఈ లోకం చివరి రోజుల్లో జీవిస్తున్నాం; క్రైస్తవులు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి; వాళ్లకు లోకంతో గానీ, లోక రాజకీయాలతో గానీ సంబంధం ఉండకూడదు; బైబిలు నైతిక విషయాల గురించిన సరైన నిర్దేశాన్ని ఇస్తుంది. బైబిల్లో సత్యం ఉంది, కాబట్టి ఒక సత్య మతం ఉంటుందని మాకు స్పష్టంగా అర్థమైంది. కానీ ఆ మతం ఏది? పెద్దపెద్ద చర్చీలు, వాటి హంగు-ఆర్భాటం, రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం చూసినప్పుడు యేసుకు, వాటికి అసలు ఏమాత్రం సంబంధం లేదని మాకు అర్థమైంది. వాటి వెనుక దేవుడు లేడని కూడా మాకు అర్థమైంది. అందుకే మేము అంతగా తెలియని మతాల్ని పరిశీలించి, అవి ఏం చెప్తున్నాయో గమనించాలని అనుకున్నాం.
మేము ఆ మతాల వాళ్లను కలిసి కొన్ని ప్రశ్నలు అడిగేవాళ్లం. వాటిలో ప్రతీ ప్రశ్నకు బైబిలు ఏంచెప్తుందో మాకు తెలుసు కాబట్టి, వాళ్లిచ్చే జవాబులు దేవుని వాక్యం ప్రకారం ఉన్నాయో లేదో మాకు ఇట్టే తెలిసిపోయేది. అలా కలిసిన తర్వాత నేను ఎప్పుడూ దేవునికి ఇలా ప్రార్థించేవాణ్ణి: ‘ఒకవేళ వాళ్లది నిజమైన మతం అయితే, దయచేసి మళ్లీ వాళ్లను కలవాలని అనిపించేలా చేయి.’ కొన్ని నెలల పాటు అలాంటి వాళ్లతో మాట్లాడినా సరే, మేము అడిగిన ప్రశ్నలకు బైబిలు నుండి జవాబులు చెప్పిన గుంపు ఒక్కటి కూడా కనిపించలేదు; మళ్లీ వాళ్లను కలవాలని కూడా అనిపించలేదు.
చివరికి నేను, నా ఫ్రెండ్ యెహోవాసాక్షుల్ని కలిశాం. ఎప్పటిలాగే అవే ప్రశ్నలు అడిగాం, కానీ వాళ్లు బైబిలు నుండి జవాబులు చెప్పారు. వాళ్లు చెప్పినవి, మేము నేర్చుకున్నవి అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. తర్వాత మేము, బైబిల్లో మాకు జవాబు తెలియని కొన్ని ప్రశ్నలు అడిగాం. వాటిలో ఒకటి, ధూమపానం-డ్రగ్స్ గురించి దేవుడు ఏంచెప్తున్నాడు? అని. దానికి కూడా వాళ్లు దేవుని వాక్యం నుండే జవాబు చెప్పారు. దాంతో మేము, రాజ్యమందిరంలో జరిగే కూటానికి వస్తామని చెప్పాం.
కూటానికి వెళ్లడం నాకు చాలా కష్టమనిపించింది. నేను ఎన్ని సంఘవిద్రోహ పనులు చేశానంటే, చక్కగా బట్టలు వేసుకొని ఎంతో స్నేహపూర్వకంగా ఉన్న వాళ్లంతా నన్ను పలకరిస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్లలో కొంతమంది ఉద్దేశాలను తప్పుబట్టాను, ఇక కూటాలకు వెళ్లొద్దని అనుకున్నాను. కానీ, వాళ్లది నిజమైన మతం అయితే దయచేసి మళ్లీ వాళ్ల కూటాలకు వెళ్లాలనిపించేలా చేయి అని దేవునికి ప్రార్థించాను; యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... నేను డ్రగ్స్ మానేయాలని తెలుసు, వెంటనే మానేశాను కూడా. కానీ సిగరెట్లు మానడం చాలా కష్టమైంది. చాలాసార్లు ప్రయత్నించాను కానీ నావల్ల కాలేదు. సిగరెట్లను పారేసి మళ్లీ వాటిని ముట్టుకోని వాళ్ల గురించి విన్నప్పుడు, ఆ విషయం గురించి యెహోవాకు ప్రార్థించాను. తర్వాత యెహోవా సహాయంతో నేను కూడా సిగరెట్లు మానేశాను. ప్రార్థనలో యెహోవాతో నిజాయితీగా, నిర్మొహమాటంగా మాట్లాడడం ఎంత మంచిదో అర్థంచేసుకున్నాను.
నేను చేసుకున్న ఇంకో పెద్ద మార్పు, నా బట్టలు-కనబడేతీరుకు సంబంధించినది. మొదటిసారి రాజ్యమందిరంలో కూటానికి వెళ్లినప్పుడు నా జుట్టు నిక్కబొడుచుకొని ఉంది, ఒక పాయకు నెమలి రంగు వేసి ఉంది. తర్వాత జుట్టుకు ముదురు నారింజ రంగు వేశాను. నేను జీన్స్ పాంట్, స్లోగన్స్ ఉన్న లెదర్ జాకెట్ వేసుకున్నాను. యెహోవాసాక్షులు దాని గురించి దయగా నాతో మాట్లాడారు, అయినాసరే అవి మార్చుకోవాల్సిన అవసరం లేదని నాకనిపించింది. చివరకు నేను, “లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, ఆ వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదు” అని చెప్తున్న 1 యోహాను 2:15-17 లోని మాటల గురించి ఆలోచించాను. నా బట్టలు-కనబడేతీరు నేను లోకాన్ని ప్రేమిస్తున్నానని చూపిస్తున్నాయి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చూపించాలంటే వాటిని మార్చుకోవాలి అని అర్థంచేసుకున్నాను, మార్చుకున్నాను.
కొంతకాలానికి, నేను క్రైస్తవ కూటాలకు వెళ్లాలని కోరుకుంటున్నది యెహోవాసాక్షులు మాత్రమే కాదు దేవుడు కూడా అని హెబ్రీయులు 10:24, 25 నుండి గ్రహించాను. నేను కూటాలన్నిటికీ వెళ్లడం, వాళ్లను బాగా తెలుసుకోవడం మొదలుపెట్టాక యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నాను.
నేనెలా ప్రయోజనం పొందానంటే ... మనం తనతో దగ్గరి స్నేహం పెంచుకునేలా యెహోవా అనుమతించడం నన్ను బాగా కదిలించింది. ఆయన చూపించే కనికరం, శ్రద్ధ గురించి ఆలోచించినప్పుడు ఆయనలా ఉండాలని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుసరించాలని, నా జీవితానికి ఆయన్ని ఆదర్శంగా చేసుకోవాలని అనిపించింది. (1 పేతురు 2:21) క్రైస్తవ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే నా సొంత గుర్తింపును కూడా కలిగివుండొచ్చని గ్రహించాను. ఇతరులతో ఎప్పుడూ ప్రేమగా ఉండడం, శ్రద్ధ చూపించడం నేర్చుకున్నాను. నా భార్య దగ్గర, కొడుకు దగ్గర క్రీస్తు లాంటి లక్షణాలు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. సత్యంలో ఉన్న సహోదరసహోదరీల గురించి చాలా పట్టించుకుంటూ ఉంటాను. క్రీస్తును అనుసరించడం వల్ల హుందాగా, ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఇతరుల మీద ప్రేమ చూపించగలుగుతున్నాను.
“వాళ్లు నాకు మర్యాద ఇచ్చారు.”—గ్వాడాలూప్ విల్లారియల్
పుట్టిన సంవత్సరం: 1964
దేశం: మెక్సికో
ఒకప్పుడు: అనైతిక జీవితం గడిపేవాణ్ణి
నా గతం: మేము ఏడుగురు పిల్లలం. మెక్సికోలో సొనోరా రాష్ట్రంలో హెర్మోసిల్లో అనే నగరంలో పెరిగాం. అది నిరుపేదలు ఉండే ప్రాంతం. నా చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు, దాంతో అమ్మే పనిచేస్తూ మమ్మల్ని పెంచింది. బూట్లు కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కావు కాబట్టి ఎక్కడికైనా వెళ్లాలంటే వట్టి కాళ్లతోనే వెళ్లేవాణ్ణి. చిన్నతనంలోనే కుటుంబం అవసరాల కోసం పనిచేయడం మొదలుపెట్టాను. చాలా కుటుంబాల్లాగే మేము కూడా ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్లం.
అమ్మ ఎక్కువగా బయటే ఉండేది, దాంతో మమ్మల్ని పక్కనే ఉండి చూసుకోవడం ఆమెకు వీలయ్యేది కాదు. నాకు 6 ఏళ్లు ఉన్నప్పుడు, 15 ఏళ్లు ఉన్న ఒక అబ్బాయి నన్ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అలా చాలాకాలం పాటు జరిగింది. దాంతో సెక్స్ విషయంలో నేను అయోమయానికి గురయ్యాను, మగవాళ్ల మీద ఇష్టం కలగడం సహజమే అని అనుకునేవాణ్ణి. సమస్య గురించి డాక్టర్లతో, పాస్టర్లతో మాట్లాడినప్పుడు, నాలో ఏ సమస్యా లేదని, అలా అనిపించడం సహజమేనని చెప్పారు.
నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు, నేను ఒక స్వలింగ సంయోగిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. తర్వాతి 11 ఏళ్లు అలాగే బ్రతికాను, చాలామంది మగవాళ్లతో కలిసి జీవించాను. ఆ తర్వాత, నేను హెయిర్ స్టైలిస్ట్ కోర్సు నేర్చుకుని, ఒక బ్యూటీ పార్లర్ పెట్టాను. అయితే నా జీవితంలో సంతోషం లేదు. నేను చాలా కష్టాలు పడ్డాను, నమ్మకద్రోహానికి గురయ్యాను. నా జీవన విధానం సరిగ్గా లేదని నాకు అర్థమైంది. ‘అసలు ఈ లోకంలో మంచివాళ్లు, నమ్మదగినవాళ్లు ఎవరైనా ఉన్నారా?’ అని ఆలోచించేవాణ్ణి.
నేను మా అక్క గురించి ఆలోచించాను. తను యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ మొదలుపెట్టి, బాప్తిస్మం తీసుకుంది. తను నేర్చుకుంటున్న విషయాలు నాకు చెప్పేది, కానీ నేను వినేవాణ్ణి కాదు. అయితే తన జీవన విధానం, వివాహ జీవితం చూసినప్పుడు చాలా బాగుంది అనిపించేది. అక్క, బావ ఒకరిమీద ఒకరు ప్రేమ, గౌరవం చూపించుకునేవాళ్లు. ఒకరితో ఒకరు దయగా నడుచుకునేవాళ్లు. కొంతకాలానికి యెహోవాసాక్షుల్లో ఒకరు నాతో బైబిలు స్టడీ మొదలుపెట్టారు. మొదట్లో, ఎలాంటి ఆసక్తి చూపించేవాణ్ణి కాదు. కానీ ఆ తర్వాత మార్చుకున్నాను.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... సాక్షులు నన్ను కూటాలకు రమ్మని ఆహ్వానించారు, నేను వెళ్లాను. అక్కడంతా కొత్తగా అనిపించింది. బయటి ప్రజలు నన్ను ఎగతాళి చేసేవాళ్లు, కానీ సాక్షులు అలా చేయలేదు. వాళ్లు నన్ను ప్రేమతో పలకరించారు. వాళ్లు నాకు మర్యాద ఇచ్చారు. అది నన్నెంతో కదిలించింది.
నేను ఒక యెహోవాసాక్షుల సమావేశానికి వెళ్లినప్పుడు, వాళ్లమీద ఇంకా మంచి అభిప్రాయం కలిగింది. అంతమంది ఉన్నా, అందరూ మా అక్కలాగే నిజాయితీగా, కల్మషం లేకుండా ఉన్నారు. అసలు ఈ లోకంలో మంచివాళ్లు, నమ్మకమైనవాళ్లు ఉన్నారా అనే ప్రశ్నకు వీళ్లే జవాబు అనిపించింది. వాళ్ల ప్రేమ, ఐక్యత అలాగే వాళ్లు ప్రతీ ప్రశ్నకు బైబిలుతో జవాబు చెప్పడం చూసి ఆశ్చర్యం అనిపించింది. వాళ్లు అలా మంచిగా ఉండడానికి ముఖ్య కారణం బైబిలే అని అర్థం చేసుకున్నాను. నేను వాళ్లలో ఒకరిగా అవ్వాలంటే చాలా మార్పులు చేసుకోవాలని నాకు అర్థమైంది.
నేను ఒక స్త్రీలా బ్రతకడానికి అలవాటుపడ్డాను కాబట్టి, నా ప్రవర్తనను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. నా మాటలు, వ్యవహార శైలి, బట్టలు-కనబడే తీరు, స్నేహితులు అన్నిటినీ మార్చుకోవాలి. నా పాత స్నేహితులు, “ఇలా ఎందుకు చేస్తున్నావు? బాగానే ఉండేవాడివి కదా? బైబిలు స్టడీ ఆపేయి. నీకు అన్నీ ఉన్నాయి” అంటూ నన్ను ఎగతాళి చేసేవాళ్లు. అయితే అనైతిక జీవితపు అలవాట్లను మార్చుకోవడం అన్నిటికన్నా కష్టమైంది.
అయితే పెద్దపెద్ద మార్పులు చేసుకోవడం సాధ్యమే అని నాకు తెలుసు. ఎందుకంటే 1 కొరింథీయులు 6:9-11 వచనాల్లో బైబిలు చెప్పిన ఈ మాటలు నా హృదయాన్ని తాకాయి: ‘అన్యాయస్థులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరని మీకు తెలీదా? మోసపోకండి. లైంగిక పాపం చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, వ్యభిచారులు, ఆడంగివాళ్లు, స్వలింగ సంపర్కులైన పురుషులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు. మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే. కానీ దేవుడు మిమ్మల్ని శుభ్రం చేశాడు.’ మార్పులు చేసుకోవడానికి యెహోవా వాళ్లకు సహాయం చేసినట్టే నాకూ చేశాడు. అందుకు కొన్ని సంవత్సరాల పాటు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే సాక్షులు ఇచ్చిన సలహాలు, వాళ్లు చూపించిన ప్రేమ ఎంతో సహాయం చేశాయి.
నేనెలా ప్రయోజనం పొందానంటే ... ప్రస్తుతం నేను అందరిలాంటి జీవితం గడుపుతున్నాను. నాకు పెళ్లయింది. నేనూ, నా భార్య మా అబ్బాయికి బైబిలు సూత్రాల ప్రకారం ఎలా జీవించాలో నేర్పిస్తున్నాం. నా పాత జీవితం పూర్తిగా కనుమరుగైపోయింది, ఇప్పుడు నేను దేవుని సేవలో ఎన్నో సేవావకాశాలు, ఆశీర్వాదాలు పొందుతున్నాను. నేను సంఘపెద్దగా సేవ చేస్తున్నాను, దేవుని వాక్యంలోని సత్యాన్ని తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తున్నాను. నేను చేసుకున్న మార్పులు చూసి మా అమ్మ ఎంతో సంతోషించింది, తను కూడా బైబిలు స్టడీ మొదలుపెట్టి, బాప్తిస్మం తీసుకుంది. అనైతిక జీవితాన్ని గడిపిన మా చెల్లి కూడా ఇప్పుడు యెహోవాసాక్షి అయ్యింది.
నా పాత జీవితం గురించి తెలిసిన చాలామంది, నేను ఇప్పుడు మంచిగా మారానని గుర్తు పడుతున్నారు. అయితే అందుకు కారణం ఎవరో నాకు తెలుసు. గతంలో నేను నిపుణుల సహాయం కోరినప్పుడు వాళ్లు తప్పుడు సలహాలు ఇచ్చారు. అయితే యెహోవా నిజంగా నాకు సహాయం చేశాడు. నేను అర్హత లేదని నాకు అనిపించినా, ఆయన నా మీద దృష్టిపెట్టి, నాతో ప్రేమగా, ఓపిగ్గా వ్యవహరించాడు. అలాంటి అద్భుతమైన, తెలివైన, ప్రేమగల దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, నాకు మెరుగైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు అని తెలుసుకోవడమే నా జీవితాన్ని మార్చేసింది.
“నాకు అసంతృప్తిగా, ఒంటరిగా, శూన్యంగా అనిపించేది.”—కాజుహీరో కూనిమోచీ
పుట్టిన సంవత్సరం: 1951
దేశం: జపాన్
ఒకప్పుడు: సైకిల్ రేసర్
నా గతం: నేను జపాన్‌లో షిజువోకా జిల్లాలోని ఒక నౌకాశ్రయ పట్టణంలో పెరిగాను. మేము మొత్తం ఎనిమిదిమందిమి ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. మా నాన్నకు సైకిల్ షాపు ఉండేది. నాన్న నన్ను చిన్నప్పటి నుండి సైకిల్ రేసులకు తీసుకెళ్లేవాడు, దాంతో నాకు ఆ ఆట మీద ఇష్టం పెరిగింది. ఆ తర్వాత నాన్న నన్ను ఒక మంచి రేసర్‌ని చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నేను స్కూల్లో ఉన్నప్పుడే నాకు మంచి ట్రైనింగ్ ఇప్పించాడు. నేను స్కూల్లో వరుసగా మూడుసార్లు వార్షిక జాతీయ క్రీడా పోటీల్లో గెలిచాను. నాకు యూనివర్సిటీకి వెళ్లడానికి అవకాశం వచ్చింది, కానీ నేను రేసింగ్ స్కూల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 19 ఏళ్లకు నేను ప్రొఫెషనల్ రేసర్ అయ్యాను.
ఆ సమయానికి, నేను జపాన్‌లో అత్యుత్తమ సైకిల్ రేసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను చాలా డబ్బు సంపాదించి, నా కుటుంబం సురక్షితంగా సెటిల్ అయ్యేలా చేయాలని అనుకున్నాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. ట్రైనింగ్ తీసుకునేప్పుడు లేదా రేసింగ్‌లో ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తే, నేను సైకిల్ రేసింగ్ కోసమే పుట్టానని, ఎట్టిపరిస్థితిలోనూ వెనక్కి తిరిగి చూడకూడదని నాకు నేను చెప్పుకునేవాణ్ణి. అలాగే చేశాను కూడా. నా కష్టానికి తగిన ఫలితం వచ్చింది. మొదటి సంవత్సరం, కొత్త రేసర్లలో మొదటి స్థానంలో నిలిచాను. రెండో సంవత్సరం, జపాన్ నెంబర్ 1 రేసర్ ఎవరో తేల్చే రేసులో పాల్గొనడానికి అర్హత సాధించాను. ఆ రేసులో నేను ఆరుసార్లు రెండో స్థానంలో నిలిచాను.
నేను బహుమతులు గెలుచుకునే రేసర్ల లిస్టులో పైన ఉండేవాణ్ణి కాబట్టి, జపాన్‌లో టొకాయ్ అనే ప్రాంతంలో బలమైన రేసర్‌గా పేరుగాంచాను. నాలో పోటీతత్వం ఎక్కువగా ఉండేది. కాలం గడుస్తుండగా, నేను రేసుల్లో మరీ నిర్దాక్షిణ్యంగా ఉంటున్నానని తోటి రేసర్లు భయపడేవాళ్లు. నా సంపాదన పెరిగింది, ఏది కొనాలనిపిస్తే అది కొనేవాణ్ణి. నేను ఒక ఇల్లు కొని, అందులోనే అత్యుత్తమ పరికరాలతో జిమ్ ఏర్పాటు చేసుకున్నాను. దాదాపు ఇంటి ఖరీదుతో సమానమైన ఖరీదు పెట్టి ఒక కారు కొనుకున్నాను. ఆర్థిక భద్రత కోసం డబ్బును రియల్ ఎస్టేట్‌లో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాను.
అయినా నాకు అసంతృప్తిగా, ఒంటరిగా, శూన్యంగా అనిపించేది. అప్పటికే నాకు భార్య, పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ల మీద ఎప్పుడూ చిరాకుపడేవాణ్ణి. చిన్నచిన్న విషయాలకే భార్యాపిల్లల మీద కోప్పడేవాణ్ణి. వాళ్లు నా మూడ్ఎలా ఉందో చూడాలని భయంభయంగా నా ముఖకవళికల్ని గమనించేవాళ్లు.
కొంతకాలానికి నా భార్య యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ మొదలుపెట్టింది. దానివల్ల కొన్ని మార్పులు వచ్చాయి. తను సాక్షుల మీటింగ్స్‌కి వెళ్తానని అడిగింది, దాంతో కుటుంబమంతా కలిసి వెళ్లాలని నిర్ణయించాను. ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద మా ఇంటికి వచ్చి, నాతో బైబిలు స్టడీ మొదలుపెట్టడం నాకు ఇంకా గుర్తుంది. నేను నేర్చుకున్న విషయాలు బాగా నచ్చాయి.
బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ... నేను ఎఫెసీయులు 5:5 చదివినప్పుడు, అది నామీద ఎంత ప్రభావం చూపించిందో ఎప్పటికీ మర్చిపోలేను. ఆ వచనంలో ఇలా ఉంది: “లైంగిక పాపి గానీ, అపవిత్రుడు గానీ, విగ్రహపూజ చేసేవాళ్లతో సమానుడైన అత్యాశపరుడు గానీ క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికి వారసుడు అవ్వడు.” సైకిల్ రేసింగ్‌కి జూదంతో దగ్గరి సంబంధం ఉందని, ఆ ఆట నాలో అత్యాశను పెంచుతోందని నేను గమనించాను. నా మనస్సాక్షి నన్ను ఇబ్బంది పెట్టింది. నేను యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, రేసింగ్ వదిలేయాలని నాకు అర్థమైంది. కానీ అది నాకు కష్టమైన నిర్ణయం.
ఆ ముందు సంవత్సరమే నా రేసింగ్ చాలా బాగా జరిగింది, కాబట్టి అలాగే ముందుకెళ్లాలని కోరుకున్నాను. అయితే, బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు నా మనసు ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండేది. మనసు అలా ఉంటే నేను రేసుల్లో గెలవలేను. నేను స్టడీ మొదలుపెట్టాక, మూడుసార్లు మాత్రమే రేసుల్లో పాల్గొన్నాను, కానీ మనసు ఇంకా రేసింగ్ మీదే ఉండేది. పైగా రేసింగ్ మానేస్తే, కుటుంబాన్ని పోషించడం ఎలా అని ఆందోళనపడేవాణ్ణి. నాకేం చేయాలో అర్థం కాలేదు. దాంతోపాటు నేను సత్యం తెలుసుకోవడం కారణంగా మా బంధువుల నుండి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నా నిర్ణయం మా నాన్నకు కూడా అస్సలు నచ్చలేదు. ఎటూ తేల్చుకోలేక నేను ఇంకా ఒత్తిడికి గురయ్యాను, దాంతో అల్సర్ వచ్చింది.
బైబిలు స్టడీ కొనసాగించడం అలాగే యెహోవాసాక్షుల మీటింగ్స్‌కు వెళ్లడం ఆ కష్టకాలంలో నాకు సహాయం చేశాయి. మెల్లమెల్లగా నా విశ్వాసం బలపడింది. నా ప్రార్థనలు వినమని, అలా వింటున్నాడనే విషయం నేను గ్రహించేలా సహాయం చేయమని యెహోవాను వేడుకున్నాను. ఆ సమయంలో నా భార్య, తాను పెద్ద ఇంట్లో ఉండకపోయినా సంతోషంగానే ఉంటానని నాతో అంది, అప్పుడు నా ఒత్తిడి ఇంకొంచెం తగ్గింది. మెల్లమెల్లగా నేను ప్రగతి సాధించాను.
నేనెలా ప్రయోజనం పొందానంటే ... మత్తయి 6:33 లో యేసు చెప్పిన మాటలు ఎంత నిజమో నేను అర్థం చేసుకున్నాను. ఆయనిలా చెప్పాడు: “కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.” యేసు చెప్పినట్లుగా, జీవించడానికి కావాల్సినవి మాకు ఎప్పుడూ తక్కువ కాలేదు. నేను రేసర్‌గా ఉన్నప్పుడు, ఇప్పుడు సంపాదించే దానికన్నా 30 రెట్లు ఎక్కువ సంపాదించేవాణ్ణి. అయినాసరే ఈ 20 ఏళ్లలో నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఏ లోటూ రాలేదు.
అంతకన్నా ముఖ్యంగా, నేను తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేస్తున్నప్పుడు లేదా ఆరాధిస్తున్నప్పుడు, గతంలో ఎప్పుడూ చవిచూడని సంతోషం, సంతృప్తి అనుభవిస్తున్నాను. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. నా కుటుంబ జీవితం ఎంతో మెరుగైంది. నా ముగ్గురు కొడుకులు, కోడళ్లు అందరూ యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారు.