మొదట్లో వాళ్ల బట్టలు హెయిర్ స్టైల్ చూసి అభ్యంతరపడ్డాను
మొదట్లో వాళ్ల బట్టలు హెయిర్ స్టైల్ చూసి అభ్యంతరపడ్డాను
ఐలీన్ బ్రమ్‌బ చెప్పినది
నేను ఓల్డ్ ఆర్డర్ జర్మన్ బాప్టిస్ట్ బ్రెత్రెన్ అనే మతంలో పెరిగాను. ఈ మతంలో చాలా పాత పద్ధతులు ఉంటాయి. చాలా నిష్ఠగా ఉంటారు. 1708 లో పీటిసమ్ అని పిలవబడే ఒక ఉద్యమం మొదలైంది. అది ప్రజల్ని ఆధ్యాత్మికంగా నిద్ర మేల్కొల్పడానికి మొదలుపెట్టిన ఒక ఉద్యమం. ది ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ రిలీజియన్ దాని గురించి ఏం చెప్తుందంటే, “కొంతమంది యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రజలందరికీ చెప్పాలి” అనే ఉద్దేశంతో దాన్ని మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా వేర్వేరు దేశాల్లో చాలా మిషనరీ యాత్రలు కూడా మొదలయ్యాయి.
1719 లో అలెగ్జాండర్ మాక్ అనే వ్యక్తితోపాటు ఒక గుంపు అమెరికాలోని పెన్సిల్వేనియాకు వచ్చారు. అప్పటినుండి ఆ గుంపు విస్తరించి చిన్నచిన్న గుంపులుగా విడిపోయారు. ప్రతీ గుంపు అలెగ్జాండర్ మాక్ అనే వ్యక్తి చెప్పిన బోధల్ని తమకు అర్థమైనట్టుగా పాటించడం మొదలుపెట్టారు. మా చర్చిలో దాదాపు 50 మంది ఉండేవాళ్లు. మేమందరం బైబిల్ని ఖచ్చితంగా చదవాలని, మా మతనాయకులు చెప్పేవాటికి ఎదురు చెప్పకుండా లోబడాలని నేర్చుకున్నాం.
మా కుటుంబం గత మూడు తరాలుగా ఇదే మతంలో ఉన్నాం. నేను చర్చిలో సభ్యత్వం తీసుకుని 13 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాను. నాకు చిన్నప్పటినుండి ఏం నేర్పించారంటే బండ్లు, ట్రాక్టర్, టెలిఫోను ఆఖరికి రేడియో లాంటి కరెంటుతో నడిచే ఏ పరికరాన్ని కూడా ఉపయోగించవద్దు, అలా ఉపయోగిస్తే తప్పు అని చెప్పారు. మా దాంట్లో ఆడవాళ్లు చాలా సాదాసీదాగా బట్టలు వేసుకుంటారు. వాళ్లు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, అవి కనిపించకుండా కప్పేసుకోవాలి. మా మతంలో మగవాళ్లందరూ గడ్డాలు పెంచుకోవాలి. మేము లోకస్థులుగా ఉండకూడదంటే అందరిలాంటి బట్టలు వేసుకోవద్దు, మేకప్ వేసుకోవద్దు, నగలు పెట్టుకోవద్దు అని చెప్పేవాళ్లు. అవన్నీ చేస్తే గర్వం చూపించినట్టు అవుతుందని, అది పాపంతో సమానమని చెప్పేవాళ్లు.
బైబిలు దేవుని వాక్యం కాబట్టి దాని మీద చాలా గౌరవం చూపించాలని మమ్మీ-డాడీ చెప్పేవాళ్లు. ప్రతీరోజు ఉదయం టిఫిన్ తినడానికి ముందు డాడీ ఒక అధ్యాయం చదివి తనకు ఏం అర్థమైందో చెప్పేవాడు. ఆ తర్వాత మేమందరం మోకాళ్లమీద ఉండి ప్రార్థన చేసేవాళ్లం. అది అయిపోయాక మమ్మీ పరలోక ప్రార్థనను వల్లించేది. రోజూ పొద్దున జరిగే ఆ ఆరాధన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కుటుంబమంతా ఒక దగ్గర ఉంటాం, ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువ ఆలోచిస్తాం.
మేము అమెరికాలోని డెల్ఫి నగరంలో ఉండేవాళ్లం. అక్కడ మాకొక పొలం ఉండేది. దాంట్లో పండించిన వాటిని గుర్రపు బండి మీద తీసుకెళ్లి వీధుల్లో లేదా ఇంటింటికి వెళ్లి అమ్మేవాళ్లం. అలా కష్టపడి పనిచేయడం కూడా దేవుని సేవే అని మేము అనుకున్నాం. కాబట్టి ఆదివారం విశ్రాంతి రోజు తప్ప మిగతా అన్ని రోజులు కష్టపడి పని చేసేవాళ్లం. కొన్నిసార్లు ఎంత పని చేసేవాళ్లమంటే దేవునికి సంబంధించిన పనులకు కూడా టైం ఉండేదికాదు.
పెళ్లి, పిల్లలు
1963 లో నాకు 17 ఏళ్లున్నప్పుడు జేమ్స్‌ని పెళ్లి చేసుకున్నాను. అతను కూడా మా చర్చికి సంబంధించినవాడే. వాళ్ల తాత-ముత్తాతల నుండి ఇదే మతంలో ఉన్నారు. మా ఇద్దరికి దేవుని సేవ చేయాలని ఎంతో ఆశ ఉండేది. మా చర్చి మాత్రమే నిజమైనదని మేము నమ్మేవాళ్లం.
మాకు ఏడుగురు పిల్లలు పుట్టారు. రెబెకా తప్పా అందరూ అబ్బాయిలే. ఆఖరి అబ్బాయి 1983 లో పుట్టాడు. మేము చాలా కష్టపడి పనిచేసేవాళ్లం. దుబారా ఖర్చులు పెట్టేవాళ్లం కాదు. సాదాసీదాగా జీవించేవాళ్లం. మా అమ్మానాన్నల నుంచి, చర్చిలో ఉన్న మిగతా సభ్యుల నుంచి నేర్చుకున్న బైబిలు సూత్రాల్ని మా పిల్లల హృదయాల్లో కూడా నాటడానికి మేము ప్రయత్నించేవాళ్లం.
ఒక వ్యక్తి హృదయాన్ని ఎవరూ చదవలేరు. కాబట్టి పైకి కనిపించే తీరునుబట్టి, వేసుకునే బట్టల్నిబట్టే ఒక వ్యక్తి ఎలాంటివాడో చెప్పవచ్చని మా చర్చివాళ్లు బలంగా నమ్మేవాళ్లు. అందుకే, ఆడవాళ్లు జట్టును కొంచెం స్టైల్‌గా దువ్వుకున్నా లేదా బట్టల మీద డిజైన్ మరీ పెద్దగా ఉన్నా వీళ్లకు గర్వం ఎక్కువ అనుకునేవాళ్లు. కొన్నిసార్లు బైబిల్లో ఉన్న విషయాలకన్నా వీటిని పాటించడమే చాలా ప్రాముఖ్యంగా చూసేవాళ్లు.
ఒక జైలు పరిచయం
1960 చివర్లో నా మరిది జెస్సీ మిలిటరీలో చేరనందుకు జైలుకెళ్లాడు. అతను కూడా మా చర్చికి సంబంధించినవాడే. జైల్లో ఉన్నప్పుడు యెహోవాసాక్షులు అతనికి పరిచయం అయ్యారు. వాళ్లు కూడా యుద్ధం చేయడం బైబిలు సూత్రాలకు వ్యతిరేకమని నమ్మేవాళ్లు. (యెషయా 2:4; మత్తయి 26:52) జెస్సీ వాళ్లతో చాలాసార్లు బైబిలు విషయాల్ని మాట్లాడేవాడు. వాళ్లలో ఉన్న మంచి లక్షణాలు కళ్లారా చూశాడు. బైబిల్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాడు. జెస్సీ అలా చేస్తాడని మేము అస్సలు ఊహించలేదు.
జెస్సీ మా ఆయనతో తను నేర్చుకునే విషయాల్ని మాట్లాడుతూ ఉండేవాడు. కావలికోట, తేజరిల్లు! పత్రికలు క్రమంగా ఆయనకు అందేలా చూసుకునేవాడు. అవి చదివినప్పుడు బైబిలు మీద మా ఆయనకు ఇంకా ఆసక్తి పెరిగింది. దేవుని సేవ చేయాలనే కోరిక ఆయనకు ఎప్పుడూ ఉండేది. కానీ ఎందుకో దేవునికి దూరంగా ఉన్నట్టు అనిపించేది. దేవునికి దగ్గర చేసేది ఏదైనా ఉందంటే, ఆ అవకాశాన్ని అస్సలు వదులుకునేవాడు కాదు.
అమిష్, మెన్నోనైట్స్, వేరే ఓల్డ్ బ్రెత్రెన్ చర్చీ నమ్మకాలు ఈ లోకానికి సంబంధించినవే అని మేము నమ్మినా, వాటి పత్రికలు చదవడంలో ఏం తప్పులేదని మా మతపెద్దలు చెప్పేవాళ్లు. అయితే మా నాన్నకు యెహోవాసాక్షులంటే అస్సలు పడేదికాదు. కావలికోట అలాగే తేజరిల్లు! పత్రికల్ని అసలు ముట్టనే ముట్టకూడదని చెప్పేవాడు. వాటిని జేమ్స్ చదువుతున్నప్పుడు ఎక్కడ ఆ తప్పుడు బోధల్ని వంటపట్టించుకుంటాడో అని నేను భయపడేదాన్ని.
కానీ మా చర్చి నమ్మకాల్లో జేమ్స్‌కి ఎప్పటినుండో కొన్ని సందేహాలు ఉండేవి. ఉదాహరణకు, ఆదివారం విశ్రాంతి రోజు కాబట్టి ఆ రోజు ఎలాంటి “శారీరక శ్రమ” చేసినా పాపంతో సమానమని చెప్పేవాళ్లు. అయితే ఆ రోజు జంతువులకు నీళ్లు పెట్టొచ్చు, కానీ కలుపు మొక్కలు తీయకూడదు. ఇదేదో బైబిలు లేఖనాలకు విరుద్ధంగా ఉందని జేమ్స్‌కు అనిపించింది. అయితే దీనికి సంబంధించి సరైన లేఖనాధార కారణాన్ని మా మత పెద్దలు చూపించలేకపోయారు. దాంతో నాకు కూడా ఈ మత నమ్మకాల్లో కొన్ని సందేహాలు మొదలయ్యాయి.
కానీ మా చర్చే దేవుని చర్చి అని మేము ఎప్పటినుండో నమ్మేవాళ్లం. ఒక్కసారిగా దాన్నుండి బయటికి వచ్చేస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయో కూడా మాకు తెలుసు. అందుకే దాన్నుండి బయటపడడం చాలా కష్టమైంది. కానీ బైబిలుకు అనుగుణంగా లేని మతంలో ఉండడానికి మా మనస్సాక్షి అస్సలు ఒప్పుకోలేదు. అందుకే 1983 లో దాన్నుండి బయటికి రావడానికిగల కారణాలు ఒక లెటర్‌లో రాసి, దాన్ని మా చర్చిలో చదవమని చెప్పాం. ఆ తర్వాత మమ్మల్ని ఆ గుంపులో నుండి వెలివేశారు.
నిజమైన మతం కోసం అన్వేషణ
నిజమైన మతం కోసం మేము అన్వేషించడం మొదలుపెట్టాం. ఏం చెప్తారో అదే చేసే ప్రజలున్న మతమేదో మేము తెలుసుకోవాలి అనుకున్నాం. మొదటిగా యుద్ధంలో పాల్గొనని మతం కోసం మేము చూశాం. “సాదాసీదాగా” జీవిస్తూ, హంగు ఆర్భాటంలేని బట్టలు వేసుకునే ప్రజలే నిజమైన మతానికి చెందినవాళ్లనే ఆలోచన మాకు ఇంకా ఉండేది. అందుకే 1983 నుండి 1985 వరకు దేశమంతా తిరుగుతూ ఒక్కొక్క మతాన్ని పరిశీలించాలి అనుకున్నాం. ఉదాహరణకు మెన్నోనైట్స్, క్వేకెర్స్ ఇంకా “సాదాసీదాగా” ఉండే ఇతర గుంపుల కోసం వెదికాం.
అదే సమయంలో అమెరికాలోని క్యామ్డెన్‌లో ఉన్న మా పొలం దగ్గర యెహోవాసాక్షులు మమ్మల్ని కలిశారు. మేము వాళ్లు చెప్పేది వినేవాళ్లం కానీ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ని మాత్రమే ఉపయోగించమని చెప్పాం. యెహోవాసాక్షులు యుద్ధంలో పాల్గొనకపోవడం నాకు బాగా నచ్చింది. కానీ లోకానికి దూరంగా ఉండాలంటే, సాదాసీదాగా ఉన్న బట్టలు వేసుకోవాల్సిన అవసరంలేదని వాళ్లు అనుకోవడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అందుకే వాళ్లు నిజమైన మతం కాదని నేను అనుకున్నాను. మాలా సాదాసీదాగా బట్టలు వేసుకోని వాళ్లందరికీ గర్వం ఉందని కూడా అనుకునేదాన్ని. వస్తువులు లేదా ఆస్తిని బట్టే ఒక వ్యక్తికి గర్వం వస్తుందని నమ్మేదాన్ని.
మా ఆయన మా అబ్బాయిల్లో కొంతమందిని తీసుకుని యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్లడం మొదలుపెట్టాడు. నాకు చాలా కోపం వచ్చింది. చాలాసార్లు నన్ను కూడా రమ్మని పిలిచాడు. కానీ నేను వెళ్లలేదు. ఒకరోజు ఆయన ఏం అన్నాడంటే “వాళ్ల బోధల్ని ఒప్పుకోకపోయినా పర్లేదుగానీ, వాళ్లు ఒకర్నొకరు ఎలా పట్టించుకుంటారో చూడ్డానికైనా రమ్మన్నాడు.” ఆయనకు అది బాగా నచ్చింది.
చివరికి, నా జాగ్రత్తలో నేను ఉంటూ వాళ్లతోపాటు రాజ్యమందిరానికి వెళ్లాలి అనుకున్నాను. సాదాసీదా బట్టలు వేసుకుని, టోపి పెట్టుకుని లోపలికి అడుగుపెట్టాను. మా పిల్లలు కూడా సాదాసీదా బట్టలు వేసుకున్నారు, ఒకరు ఇద్దరు చెప్పులు కూడా వేసుకోలేదు. అయినా సాక్షులు మా దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడారు. ‘మేము వాళ్లలా లేకపోయినా భలే ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నారే’ అని అనుకున్నాను.
వాళ్లు చూపించిన ప్రేమ నన్ను బాగా ఆకట్టుకున్నా, వాళ్లను ఇంకా గమనిస్తూ ఉండాలి అనుకున్నాను. వాళ్లు పాటలు పాడేటప్పుడు వాళ్లతో కలిసి పాడలేదు. కనీసం నిల్చోనూలేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత, వాళ్లు చేస్తున్నవి తప్పు అనిపించిన విషయాల గురించి లేదా లేఖనాల అర్థాల గురించి అడుగుతూ వాళ్లమీద ప్రశ్నల వర్షం కురిపించాను. నేను ఎలాంటి ప్రశ్న అడిగినా శ్రద్ధగా జవాబిచ్చేవాళ్లు. ఒక ప్రశ్నను ఎంతమందిని అడిగినా అందరూ ఒకేలా జవాబిచ్చేవాళ్లు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు వాళ్లు ఆ జవాబుల్ని నాకు రాసిచ్చేవాళ్లు. నేను దాన్ని తర్వాత చూసుకుని అధ్యయనం చేయడానికి అది చాలా సహాయపడింది.
1985 వేసవికాలంలో మేము, ఊరికే చూద్దామని యెహోవాసాక్షుల సమావేశానికి వెళ్లాం. అది అమెరికాలోని మెంఫిస్‌లో జరిగింది. మేమందరం కూడా సాదాసీదా బట్టల్లో వెళ్లాం, జేమ్స్‌కి అప్పటికింకా గడ్డం ఉంది. సమావేశంలో విరామ సమయంలో మమ్మల్ని ఎవరోఒకరు పలకరిస్తూనే ఉన్నారు. సాక్షులు మేము వేరుగా ఉన్నామని మమ్మల్ని దూరం పెట్టలేదుగానీ మాపైన ప్రేమ, శ్రద్ధ చూపించారు. అది నాకు బాగా నచ్చింది. అంతేకాదు ఏ మీటింగ్స్‌కి వెళ్లినా వాళ్ల బోధలన్నీ ఒకేలా ఉన్నాయి. ఆ ఐక్యతను చూసి మేము ఆశ్చర్యపోయాం.
యెహోవాసాక్షులు మాపైన వ్యక్తిగత శ్రద్ధ చూపించడం జేమ్స్‌కి నచ్చి ఆయన బైబిలు అధ్యయనం తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. తను నేర్చుకున్న ప్రతీది సరైనదని నమ్మకం కుదరడానికి జేమ్స్ అన్నీ కూలంకుశంగా పరిశీలించాడు. (అపొస్తలుల కార్యాలు 17:11; 1 థెస్సలొనీకయులు 5:21) కొంతకాలానికి ఆయనకు సత్యం దొరికినట్టు అనిపించింది. కానీ నాకు మాత్రం నా మనసు రెండు ముక్కలైనట్టు అనిపించింది. ఎందుకంటే నాకు సరైనది చేయాలని ఉంది, కానీ నేను నా ఆలోచన మార్చుకుని అందరిలాగే ఉంటే “లోకస్థురాలుగా” అయిపోతానేమో అని భయమేసింది. నేను బైబిలు స్టడీలో కూర్చోవడానికి ఒప్పుకున్న రోజున, ఒకపక్క కింగ్ జేమ్స్ వర్షన్ ఇంకోపక్క కొత్త లోక అనువాదం పెట్టుకుని కూర్చున్నాను. ప్రతీ లేఖనాన్ని ఆ రెండు బైబిళ్లలో పోల్చుకుని చూసేదాన్ని. ఎందుకంటే నేను ఎక్కడ మోసపోతానేమో అని నాకు భయమేసింది.
నేను ఎలా మారానంటే ...
మేము స్టడీ తీసుకుంటున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకటేంటంటే, మన పరలోక తండ్రి ఒక్కడే అనీ త్రిత్వం కాదనీ నేర్చుకున్నాం. అంతేకాదు, మనిషి చనిపోయినా ఆత్మ బ్రతికే ఉంటుందనే సిద్ధాంతం తప్పని నేర్చుకున్నాం. (ద్వితీయోపదేశకాండం 6:4; 1 కొరింథీయులు 8:5, 6) దాంతోపాటు, నరకమంటే అగ్నిలో కాల్చే స్థలం కాదుగానీ చనిపోయిన తర్వాత మనుషులందర్నీ పెట్టే ఒక సాధారణ సమాధి అని నేర్చుకున్నాం. (యోబు 14:13; కీర్తన 16:10; ప్రసంగి 9:5, 10; అపొస్తలుల కార్యాలు 2:31) ఈ సత్యం నన్ను బాగా హత్తుకుంది. ఎందుకంటే మా పాత చర్చిలో దీనిగురించి ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోయారు.
కానీ, యెహోవాసాక్షులు నేను అనుకున్నట్టుగా బట్టలు వేసుకోవట్లేదు కాబట్టి వాళ్లు లోకస్థులే కదా, అలాంటిది వాళ్లు నిజమైన మతం ఎలా అవుతారు అని నేను ఆలోచించేదాన్ని. కానీ అదే సమయంలో వాళ్లు మాత్రమే యేసుక్రీస్తు చెప్పినట్టు రాజ్యం గురించిన మంచివార్తను అందరికి ప్రకటిస్తున్నారు. నేను అయోమయంలో పడిపోయాను.—మత్తయి 24:14; 28:19, 20.
ఈ ఆలోచనలతో సతమతమౌతున్న సమయంలోనే, సాక్షులు చూపించే ప్రేమ నా అన్వేషణను కొనసాగించడానికి సహాయం చేసింది. మా కుటుంబంపై సంఘమంతా చాలా శ్రద్ధ చూపించేవాళ్లు. సంఘంలో ఉన్న వేర్వేరు బ్రదర్స్ సిస్టర్స్ కొన్నిసార్లు మేము అమ్మే పాలు, గుడ్లు కొనుక్కోవాలనే సాకుతో మమ్మల్ని చూడ్డానికి వచ్చేవాళ్లు. వాళ్లు మాపైన చూపించే శ్రద్ధను బట్టి వాళ్లు చాలా మంచోళ్లని అర్థమైంది. ఫలానా వ్యక్తి మాతో బైబిలు స్టడీ చేస్తున్నాడు కాబట్టి మమ్మల్ని కలవాల్సిన అవసరంలేదని సాక్షులు అనుకోలేదు. సంఘంలో ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ మా ఇంటివైపు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి వచ్చి వెళ్లేవాళ్లు. అలా వాళ్లు రావడంవల్ల సాక్షుల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగాను. వాళ్లు మాపైన చూపించిన నిజమైన శ్రద్ధ, ప్రేమనుబట్టి మేము ఆకర్షించబడ్డాం.
మేము వెళ్లే సంఘంవాళ్లే కాదు పక్క సంఘంవాళ్లు కూడా మాపైన చాలా శ్రద్ధ చూపించేవాళ్లు. నేను బట్టల గురించి, మేకప్ గురించి ఇంకా ఆలోచిస్తుండగానే పక్క సంఘంలో ఉండే కే బ్రిగ్స్ అనే సిస్టర్ నన్ను కలవడానికి వచ్చింది. ఆమె కావాలనే చాలా సింపుల్‌గా బట్టలు వేసుకునేది. మేకప్ కూడా వేసుకునేది కాదు. అది చూసి నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆమెకు నేను చాలా దగ్గరైనట్టు అనిపించింది. దాంతో ఆమెతో మనసువిప్పి మాట్లాడగలిగాను. ఆ తర్వాత ఒకరోజు నాలాంటి మతంలోనే పెరిగిన లూవిస్ ఫ్లోరా అనే ఒకతను నన్ను కలవడానికి వచ్చాడు. నేను రెండు అభిప్రాయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను అని ఆయన గమనించాడు. దాంతో ఆయన నన్ను ఓదార్చడానికి ఒక పది పేజీల ఉత్తరాన్ని రాశాడు. ఆయన దయతో రాసిన ఉత్తరాన్ని చదువుతుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ఆ ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదివానో నాకే తెలీదు.
ఒకరోజు ప్రాంతీయ పర్యవేక్షకుడైన బ్రదర్ ఓడెల్‌ని యెషయా 3:18-23; అలాగే 1 పేతురు 3:3, 4 వచనాల్ని వివరించమని అడిగాను. “ఈ వచనాల ప్రకారం దేవున్ని సంతోషపెట్టాలంటే ఎలాంటి అలంకరణ లేకుండా సాదాసీదాగా ఉండాలి కదా?” అని అన్నాను. దానికి ఆయన, “సరే! మరి జుట్టును కప్పుకోవడానికి ఉపయోగించే టోపి (bonnet) పెట్టుకోవడం, జడలు అల్లుకోవడం కూడా అలంకరణే కదా?” అని అన్నాడు. అప్పుడు నేను అవును కదా, మా ఓల్డ్ బ్రెత్రెన్ చర్చిలో ఆడపిల్లలకు మేము జడలు అల్లేవాళ్లం. ఆడవాళ్లేమో జుట్టును కప్పుకోవడానికి ఏదోరకమైన టోపి పెట్టుకునేవాళ్లు. దాంతో ఆ పాత చర్చిలో ఉన్న సిద్ధాంతాలు ఒకదానికొకటి పొసగట్లేదని నాకు అర్థమైంది. ప్రాంతీయ పర్యవేక్షకుడు చూపించిన సహనం, ఆయన దయగా మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చాయి.
ఒకప్పుడు మసకబారినట్టుగా కనిపించే విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. అయినప్పటికీ, ఆడవాళ్లు జట్టును కత్తిరించుకోవడం అనే విషయం నా మనసును తొలిచేస్తూ ఉండేది. సంఘంలో ఉన్న పెద్దలు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు ఏమన్నారంటే, కొంతమంది ఆడవాళ్లకు పొట్టి జుట్టు ఉండొచ్చు, ఇంకొంతమందికి పొడుగు జుట్టు ఉండొచ్చు. పొడుగు జుట్టు ఉన్నవాళ్లు, పొట్టి జుట్టు ఉన్నవాళ్ల కంటే గొప్ప అని మనం చెప్పగలమా? అని అడిగారు. ఆ ఒక్క విషయంలోనే కాదు బట్టలు, కనబడే తీరు విషయంలో మనస్సాక్షికి ఉన్న పాత్ర గురించి వాళ్లు నాకు వివరించారు. వాళ్లు దానిగురించి ఎప్పుడంటే అప్పుడు చదువుకునేలా ముద్రిత సమాచారం కూడా ఇచ్చారు.
నేర్చుకున్నవి పాటించడం
మేము ఎప్పటినుండో చెప్పింది చేసే ప్రజల కోసం వెదికాం. ఇప్పుడు వాళ్లు మాకు దొరికారు. “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది” అని యేసు అన్నాడు. (యోహాను 13:35) యెహోవాసాక్షులే నిజమైన ప్రేమ చూపిస్తారని మాకు నమ్మకం కుదిరింది. అయినప్పటికీ, మా పెద్దబ్బాయి నేతన్‌కి, మా పెద్దమ్మాయి రెబెకాకి ఇది కాస్త తికమకగా అనిపించింది. ఎందుకంటే, వాళ్లు అంతకుముందే ఓల్డ్ బ్రెత్రెన్ మతాన్ని అంగీకరించి, దాంట్లోనే బాప్తిస్మం తీసుకున్నారు. కానీ తర్వాత్తర్వాత మేము నేర్పించే బైబిలు సత్యాలు అలాగే సాక్షులు చూపించే ప్రేమ వాళ్లకు బాగా నచ్చాయి.
ఉదాహరణకు, రెబెకా ఎప్పటినుండో దేవుడిని ఒక నాన్నలాగా, ఒక ఫ్రెండ్‌లాగా చూడాలనుకునేది. ఒక వ్యక్తి ఫలానా విధంగా అవ్వాలని లేదా ఇలా ఉండాలని దేవుడు తలరాత రాయలేదని అర్థంచేసుకున్న తర్వాత ఆయనకు ప్రార్థించడం రెబెకాకు చాలా ఈజీ అయ్యింది. అసలు నిజమో కాదో తెలియని త్రిత్వ సిద్ధాంతంలో దేవుడు భాగం కాదని తెలుసుకున్న తర్వాత రెబెకా దేవున్ని ఒక నిజమైన వ్యక్తిగా చూడగలిగింది. ఆయనకున్న లక్షణాల్ని మనం కూడా చూపించవచ్చు అని అర్థంచేసుకున్నాక ఆమె దేవునికి దగ్గరైంది. (ఎఫెసీయులు 5:1) దేవునితో మాట్లాడాలంటే ఏదో గ్రాంథికమైన పదాలు ఉపయోగించి మాట్లాడాల్సిన అవసరంలేదని తెలుసుకొని సంతోషించింది. తనకు ఎలా ప్రార్థించాలని దేవుడు ఆశిస్తున్నాడో రెబెకా తెలుసుకుంది. అంతేకాదు, భూమిపైన ఒక పరదైసులాంటి పరిస్థితిలో మనుషులందరూ శాశ్వతకాలం జీవించాలనేది దేవుని కోరికని తెలుసుకున్నాక రెబెకా తన సృష్టికర్తకు ఇంకా దగ్గరైంది.—కీర్తన 37:29; ప్రకటన 21:3, 4.
యెహోవా సేవలో మేము ఆనందించిన సేవావకాశాలు
నేనూ, నా భర్త జేమ్స్, మా పిల్లల్లో ఐదుగురు నేతన్, రెబెకా, జోర్జ్, డానియేల్ అలాగే జాన్ 1987 వేసవికాలంలో యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నాం. హార్లే 1989 లో, సైమన్ 1994 లో బాప్తిస్మం తీసుకున్నారు. మేము ఒక కుటుంబంగా, యేసుక్రీస్తు తన అనుచరులకు చెప్పిన పనిని అంటే రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలని తీర్మానించుకున్నాం.
మా అబ్బాయిల్లో ఐదుగురు నేతన్, జోర్జ్, డానియేల్, జాన్, హార్లే అలాగే మా అమ్మాయి రెబెకా అమెరికాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేశారు. జోర్జ్ ఇంకా అక్కడే సేవ చేస్తున్నాడు. సైమన్ 2001 లో తన స్కూలు చదువు పూర్తయిన తర్వాత బెతెల్‌లో చేరాడు. మా అబ్బాయిలందరూ, అయితే సంఘ పెద్దలుగా లేదా సంఘ పరిచారకులుగా సేవ చేస్తున్నారు. నా భర్త మిస్సోరిలోని తేయర్ సంఘంలో సంఘపెద్దగా సేవచేస్తున్నాడు. నేను పరిచర్యలో బిజీగా ఉంటాను.
ఇప్పుడు మాకు జెస్సికా, లతీషా, కేలెబ్ అనే ముగ్గురు మనవళ్లు-మనవరాళ్లు ఉన్నారు. వాళ్ల పసి హృదయాల్లో వాళ్ల అమ్మానాన్నలు యెహోవా మీద ప్రేమను పెంచడం చూసి మేము మురిసిపోతుంటాం. యెహోవా మమ్మల్ని ఒక కుటుంబంగా తనవైపు ఆకర్షించుకుని, తనలాంటి ప్రేమను చూపించే ప్రజల్ని గుర్తుపట్టేలా సహాయం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.
ఒకవైపు దేవున్ని సంతోషపెట్టాలనే కోరిక, మరోవైపు చిన్నప్పటి నుండి బైబిలు కన్నా తమ మతంలో ఉన్న నియమ నిబంధనల్ని పాటించాలనే ఒత్తిడి ఉన్నవాళ్ల గురించి మేము ఆలోచిస్తుంటాం. వాళ్లు కూడా ఏదోకరోజు, ఇప్పుడు నేను అనుభవించేలాంటి సంతోషాన్నే అనుభవిస్తారని ఆశిస్తున్నాను. మేము ఒకప్పుడు కూరగాయలు అమ్మడానికి ఇంటింటికి వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడానికి వెళ్తున్నాం. యెహోవా పేరును పెట్టుకున్న ప్రజలు మాపట్ల చూపించిన ప్రేమను, ఓపికను గుర్తుచేసుకున్నప్పుడు నా కళ్లు చెమ్మగిల్లుతుంటాయి.
[చిత్రాలు]
నాకు ఏడేళ్లున్నప్పుడు, పెద్దయిన తర్వాత
[చిత్రం]
జేమ్స్, జోర్జ్, హార్లే, సైమన్ వీళ్లందరూ సాదాసీదా బట్టల్లో ఉన్నారు
[చిత్రం]
మేము పండించినవి మార్కెట్లో అమ్ముతున్నప్పుడు తీసిన ఫోటో పేపర్లో వచ్చింది
[క్రెడిట్ లైను]
Journal and Courier, Lafayette, Indiana
[చిత్రం]
మా ఫ్యామిలీ ఫోటో