నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?
రాజ్యవార్త నం. 36
నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?
నూతన సహస్రాబ్ది—నవ యుగ ఉషోదయమా?
* అది ఎన్నో సంక్షోభాలతో గడిచిన శతాబ్దం. అయితే ఆ వంద సంవత్సరాల్లోనే నవీన సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లింది, వైద్యరంగంలో గమనార్హమైన పురోభివృద్ధులూ జరిగాయి. సమాచారం విస్ఫోటనం చెందింది, అంతర్జాతీయ ఆర్థికరంగం తీవ్రగతిన అభివృద్ధి అయ్యింది. అందు కారణంగానే నూతన సహస్రాబ్ది, ఆశలకూ మార్పులకూ ప్రతీకయని భావిస్తూ అనేకమంది దానికి ఆనందంతో ఆహ్వానం పలికారు. ఏమో, ఈ సహస్రాబ్దిలో యుద్ధాలు, వ్యాధులు, పర్యావరణ కాలుష్యము, బీదరికము పరిసమాప్తమౌతాయేమో!
ఇరవయ్యవ శతాబ్దం, 1999 డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రితో సమాప్తమైంది.అలాంటి ఆశాభావం చాలామందిలో ఉంది. కానీ, నూతన సహస్రాబ్ది మీకు ప్రయోజనకరమైన మార్పుల్ని తెచ్చే సాధ్యత ఎంత మేరకు ఉంది? మీకూ మీ కుటుంబానికీ సురక్షితమైన, సుభద్రమైన జీవితాల్ని అందించగల మార్పుల్ని అది నిజంగా తెస్తుందా? భవిష్యత్తులో విశ్వరూపం దాల్చనున్న నేటి సమస్యల్లో కేవలం కొన్నింటిని ముందు పరిశీలిద్దాం.
కాలుష్యం
పారిశ్రామిక దేశాలు “భూవ్యాప్తంగా పర్యావరణానికి తీరని నష్టాన్ని కలుగజేస్తున్నాయి, అంతేగాక కాలుష్యాన్నీ ఆవరణవ్యవస్థల్లో అస్థిరతనూ సృష్టిస్తున్నాయి.” ఒకవేళ భవిష్యత్తులో కూడా ఈ విధంగానే కొనసాగితే, “పర్యావరణం పూర్తిగా కుప్పకూలిపోతుంది.”—“గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ అవుట్‌లుక్—2000,” ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం.
వ్యాధులు
“2020వ సంవత్సరానికల్లా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రతి పది మరణాల్లో ఏడు మరణాలు వ్యాధుల మూలంగానే సంభవిస్తాయి. అయితే ఇప్పటి లెక్కల ప్రకారం, ప్రస్తుతం కేవలం సగం మంది మాత్రమే వ్యాధుల మూలంగా చనిపోతున్నారు.”—“ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్,” హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1996.
కొందరు నిపుణుల ప్రకారం, “2010వ సంవత్సరానికల్లా, [ఎయిడ్స్] తాకిడి అతితీవ్రంగా ఉన్న 23 దేశాల్లో ఆ వ్యాధి మూలంగా 6 కోట్ల 60 లక్షలమంది చనిపోతారు.”—“ఎయిడ్స్‌పై యుద్ధం: అభివృద్ధిచెందుతున్న దేశాలనుండి సాక్ష్యాధారాలు,” యూరోపియన్ కమిషన్ మరియు వరల్డ్ బ్యాంక్ సమర్పించిన ఒక నివేదిక.
బీదరికం
“దాదాపు 130 కోట్లమంది రోజుకి ఒక్క డాలరు [దాదాపు 40 రూపాయలు] కన్నా తక్కువ సంపాదనతో జీవిస్తున్నారు. ఇంకా దాదాపు 100 కోట్లమంది ప్రాథమిక ఆహార అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు.”—“హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 1999,” ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం.
యుద్ధాలు
“[అనేక దేశాల్లో] హింసాజ్వాలలు మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరుకోవచ్చు. జాతి, తెగ, మత విబేధాల మూలంగా చెలరేగే . . . అటువంటి హింసాకాండలు . . . రాబోయే 25 సంవత్సరాల్లో అతిసాధారణమౌతాయి . . . , అటువంటి సంఘర్షణల్లో ప్రతి సంవత్సరం వందల వేల మంది హతమౌతారు.”—“న్యూ వరల్డ్ కమింగ్: అమెరికన్ సెక్యూరిటీ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచురీ,” యు.ఎస్. కమిషన్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ/ట్వంటీ ఫస్ట్ సెంచురీ.
వీటన్నింటిని బట్టి చూస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా కాలుష్యము, బీదరికము, వ్యాధులు, యుద్ధాలు మునుపెన్నటికన్నా విపరీతంగా పెరిగిపోతాయన్న వాస్తవాన్ని, నూతన సహస్రాబ్ది రాకతో మొదలైన సందడి, పెల్లుబికిన ఉత్సాహం విస్మరించేలా చేస్తున్నాయని స్పష్టమౌతుంది. ఈ సమస్యలన్నింటికీ ప్రజల మనస్సుల్లో పాతుకుపోయి ఉన్న దురాశ, స్వార్థము, వారి మధ్య ఉన్న అపనమ్మకాలే మూలకారణం. ఈ దుర్లక్షణాల్ని కూకటివేళ్లతో పెకిలించాలంటే అందుకు శాస్త్రవిజ్ఞానమూ, సాంకేతిక పరిజ్ఞానమూ, మానవ రాజకీయ ప్రయత్నాలూ సరిపోవు.
మానవాళికి ఆశీర్వాదాలను తెచ్చే సహస్రాబ్ది ఏది మరి?
ఒక ప్రాచీన రచయిత ఇలా అన్నాడు: ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’ (యిర్మీయా 10:23) ఇది నిజం, మానవుడికి భూమిని పరిపాలించటానికి తగిన సామర్థ్యమే కాదు, అందుకు హక్కు కూడా లేదు. ఆ హక్కూ, మానవజాతి ఎదుర్కుంటున్న సమస్యల్ని పరిష్కరించగల జ్ఞానమూ మన సృష్టికర్తయైన యెహోవా దేవునికి మాత్రమే ఉన్నాయి.—రోమీయులు 11:33-36; ప్రకటన 4:10, 11.
మరైతే పరిష్కారం ఎప్పుడు? ఎలా? మనం ప్రస్తుతం, ‘అంత్యదినాలకే’ చివరి దినాల్లో ఉన్నామనడానికి రుజువులు పుష్కలంగా ఉన్నాయి. దయచేసి మీ బైబిలు తెరిచి 2 తిమోతి 3:1-5 వచనాల్ని చదవండి. నేటి ‘అపాయకరమైన కాలాల్లో’ ప్రజలు ఎలాంటి లక్షణాల్ని ప్రదర్శిస్తారో ఆ వచనాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. మత్తయి 24:3-14 వచనాలు, లూకా 21:10, 11 వచనాలు కూడా ‘అంత్య దినాలనే’ వర్ణిస్తున్నాయి. ఈ వచనాలు ప్రాముఖ్యంగా 1914 నుంచి జరిగిన సంఘటనల్ని, అంటే భౌగోళిక యుద్ధం, వ్యాధులు, కరవులు వంటివాటి గురించి చెబుతున్నాయి.
త్వరలోనే ఈ ‘అంత్య దినాలు’ అంతమౌతాయి. దానియేలు 2:44 ఇలా చెబుతుంది: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” అలా, ఈ భూమిని పరిపాలించేందుకు దేవుడు ఒక రాజ్యాన్ని అంటే, ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తాడని బైబిలు ముందే చెప్పింది. ప్రకటన 20:4వ వచనం ప్రకారం ఈ ప్రభుత్వం వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తుంది—అంటే ఒక సహస్రాబ్ది అన్నమాట! ఆ మహిమాన్వితమైన సహస్రాబ్దిలో మానవజాతికంతటికీ జీవన పరిస్థితులు ఎలా మెరుగౌతాయో అర్థం చేసుకోవడానికి, కేవలం కొన్ని ఉదాహరణలను చూడండి:
ఆర్థికస్థితి. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు; ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు.”—యెషయా 65:21, 22.
ఆరోగ్యం. “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులువేయును. మూగవాని నాలుక పాడును.” “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు.”—యెషయా 33:24; 35:5, 6.
పర్యావరణం. “భూమిని నశింపజేయువారిని” దేవుడు ‘నశింపజేస్తాడు.’—ప్రకటన 11:18.
మానవ సంబంధాలు. ‘నా పరిశుద్ధ పర్వతమందంతటా ఎవరూ హాని చేయరు నాశము చేయరు; . . . లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండివుంటుంది.’—యెషయా 11:9.
ఈ బైబిలు వాగ్దానాలపై లక్షలాదిమందికి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఆధారంగా వారు భవిష్యత్తు కోసం ఎంతో ఆశావాదంతోనూ, నమ్మకంతోనూ ఎదురు చూస్తున్నారు. దాని ఫలితంగానే వారు జీవిత ఒత్తిళ్ళనీ సమస్యల్నీ మరింత బాగా ఎదుర్కోగల్గుతున్నారు. వారి జీవితాల్లోలానే మీ జీవితంలో కూడా బైబిలు ఎలా ఒక మంచి మార్గనిర్దేశకం కాగలదు?
జీవానికి నడిపించే జ్ఞానం!
సైన్సు టెక్నాలజీలు సాధిస్తున్న వాటిని చూస్తుంటే కొన్నిసార్లు కళ్ళు బైర్లుకమ్ముతుంటాయి! అయినా, మానవుడు సంపాదించిన ఈ జ్ఞానమంతా కూడా వాని జీవితాన్ని భద్రతతో సంతోషానందాలతో నింపలేదు. దీన్ని సాధించగల ఒకే ఒక జ్ఞానం గురించి, బైబిల్లో యోహాను 17:3వ వచనంలో ఉంది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”
అటువంటి ఎరుక లేదా జ్ఞానం బైబిల్లో మాత్రమే ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథం విషయమై చాలామంది బలమైన అభిప్రాయాల్ని ఎన్నింటినో వెలిబుచ్చుతారు, కానీ దాన్ని తాముగా పరిశీలించింది నిజానికి చాలా కొద్దిమంది మాత్రమే. మీ విషయం ఏమిటి? నిజమే, బైబిలును చదవటానికి గట్టి ప్రయత్నం అవసరమే. కానీ ఆ కృషికి తగ్గ ఫలితం తప్పక దక్కుతుంది. కేవలం బైబిలు మాత్రమే “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్న” పుస్తకం.—2 తిమోతి 3:16.
మరైతే, బైబిలుతో మీరెలా పరిచయం ఏర్పర్చుకోగలరు? మీరు ఈ విషయంలో యెహోవాసాక్షుల సహాయాన్ని ఎందుకు తీసుకోకూడదు? వారు లక్షలాదిమందికి, వాళ్ళ ఇండ్లకే వెళ్ళి ఉచితంగా బోధిస్తారు. వారు అనేకమైన బైబిలు ఆధారిత ప్రచురణల్ని ఉపయోగిస్తూ మీకు సహాయం చేస్తారు. దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు వాటిలో ఒకటి. అందులో, మీకు బైబిలు గురించి ఉండే సందేహాలకు జవాబులున్నాయి. ఉదాహరణకు: దేవుడెవరు? భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి? దేవుని రాజ్యమంటే ఏమిటి? బైబిలు మీ కుటుంబ జీవితాన్ని ఎలా మెరుగుపర్చగలదు? వంటి అనేక ప్రశ్నలకు సంక్షిప్తమైన జవాబులున్నాయి.
యెహోవాసాక్షులు మీ ఇంటికి రావాలని మీరు ఇష్టపడితే, దయచేసి ఈ క్రింద ఉన్న కూపన్‌ను నింపండి. మహిమాన్వితమైన దేవుని రాజ్యం ఒక సహస్రాబ్ది, అంటే వెయ్యేండ్లు పరిపాలించటం గురించి మీకు మరింత సమాచారాన్ని అందించటానికి వారు ఎంతో సంతోషిస్తారు!
□ దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు గురించి నేను మరింత సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను.
□ నాతో ఉచిత గృహ బైబిలు పఠనం చేయటానికి దయచేసి నన్ను కలవండి
[అధస్సూచి]
^ పేరా 4 మేమిక్కడ సహస్రాబ్దిని గురించిన పాశ్చాత్య దేశాల దృక్పథాలను సూచిస్తున్నాము. నిర్దిష్టంగా చెప్పాలంటే నూతన సహస్రాబ్ది 2001, జనవరి 1న ప్రారంభమౌతుంది.