కంటెంట్‌కు వెళ్లు

బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!

బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!

బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!

మీరు మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి, ‘ఇన్ని బాధలు ఎందుకున్నాయి?’ అని ప్రశ్నించుకునే ఉంటారు. వేలాది సంవత్సరాలుగా మానవులు యుద్ధాలు, పేదరికం, విపత్తులు, నేరం, అన్యాయం, అనారోగ్యం, మరణం కారణంగా ఎన్నో బాధలు అనుభవించారు. గడిచిన వంద సంవత్సరాలు మునుపటికంటే ఎక్కువ బాధలను చవిచూశాయి. ఈ బాధలన్నీ ఎప్పటికైనా అంతమవుతాయా?

తప్పకుండా! అవి త్వరలోనే కనుమరుగవుతాయి! దేవుని వాక్యమైన బైబిలు ఇలా చెబుతోంది: “భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” వారు అలా ఎంతకాలం జీవిస్తారు? “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”​—⁠కీర్తన 37:​10, 11, 29.

దేవుడు దుష్టత్వాన్ని, బాధలను తొలగించిన తర్వాత భూమి ఒక పరదైసుగా మార్చబడుతుంది. అప్పుడు ప్రజలు పరిపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా నిరంతరం జీవించగలుగుతారు. దేవుని వాక్యం ఇలా ప్రవచిస్తోంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”​—⁠ప్రకటన 21:⁠4.

ఆ నూతనలోకపు ఆశీర్వాదాలను అనుభవించేలా మరణించినవారు కూడా తిరిగి జీవానికి తీసుకురాబడతారు: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” (అపొస్తలుల కార్యములు 24:​14) అందుకే పశ్చాత్తాపపడిన ఒక నేరస్థుడు తనపై విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు యేసుక్రీస్తు అతనితో ఇలా చెప్పగలిగాడు: “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు.”​—⁠లూకా 23:​43.

అసలు బాధలు ఎందుకు ఆరంభమయ్యాయి?

మానవులకు ఇంత చక్కని భవిష్యత్తు ఉండాలని ఉద్దేశించిన దేవుడు అసలు బాధలు ఆరంభం కావడానికి ఎందుకు అనుమతించాడు? మానవులు ఇంతకాలం బాధలు అనుభవించేందుకు ఆయన ఎందుకు అనుమతించాడు?

దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు, వారిని పరిపూర్ణమైన శరీరంతో, పరిపూర్ణమైన మనస్సుతో చేశాడు. ఆయన వారిని పరదైసు తోటలో ఉంచి, వారికి సంతృప్తినిచ్చే పనిని కూడా అప్పగించాడు. బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” (ఆదికాండము 1:​31) వారు దేవునికి విధేయులుగా ఉంటే, పరిపూర్ణమైన పిల్లలను కనేవారు, భూమంతా పరదైసుగా మారేది, అందులో ప్రజలు శాంతిసంతోషాలతో నిత్యం జీవించేవారు.

దేవుడు ఆదాము హవ్వలకు వారి మానవ స్వభావములో ఒక భాగంగా స్వేచ్ఛాచిత్తం అనే అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. ఆయన వారిని ఆలోచనా సామర్థ్యంలేని మరమనుష్యుల్లా చేయలేదు. అయితే సంతోషంగా ఉండడం, వారు తమ స్వేచ్ఛాచిత్తాన్ని సరైన విధంగా ఉపయోగించడంపై అంటే దేవుని నియమాలకు విధేయత చూపించడానికి దానిని ఉపయోగించడంపై ఆధారపడి ఉంది. దేవుడు ఇలా చెప్పాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” (యెషయా 48:​17) స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగపరిస్తే దాని పరిణామాలు వినాశనకరంగా ఉంటాయి, ఎందుకంటే మానవులు దేవుని నుండి వేరై స్వతంత్రంగా జీవించేందుకు సృష్టించబడలేదు. బైబిలు ఇలా చెబుతోంది: “మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.”​—⁠యిర్మీయా 10:​23.

విచారకరంగా, మన మొదటి తల్లిదండ్రులు, తాము దేవుని నుండి స్వతంత్రంగా ఉంటూనే విజయవంతంగా జీవించవచ్చు అని భావించారు. కానీ వారు ఎప్పుడైతే దేవుని పరిపాలనను తిరస్కరించారో, అప్పుడే ఆయన మద్దతునూ అలాగే తమ పరిపూర్ణతనూ కోల్పోయారు. కాబట్టి వారు కృషించడం ఆరంభించి చివరకు వృద్ధులై మరణించారు. జన్యుశాస్త్ర నియమాల ప్రకారం మనం వారి అపరిపూర్ణతను, మరణాన్ని వారసత్వంగా పొందాము.​—⁠రోమీయులు 5:​12.

ముఖ్య వివాదం​—⁠సర్వాధిపత్యం

దేవుడు ఆదాము హవ్వలను నాశనం చేసి మరో మానవ జంటను ఎందుకు సృష్టించలేదు? ఎందుకంటే దేవుని విశ్వ సర్వాధిపత్యం, అంటే పరిపాలించడానికి ఆయనకున్న హక్కు సవాలు చేయబడింది. పరిపాలించే హక్కు ఎవరికి ఉంది, ఎవరి పరిపాలన సరైనది? అనే ప్రశ్న లేవదీయబడింది. దానితోపాటు, దేవుని పరిపాలన క్రింద లేకుండానే మానవులు సంతోషంగా ఉండగలరా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమయింది. మానవులు తన పరిపాలన నుండి పూర్తిగా స్వతంత్రంగా ఉండడానికి తగినంత సమయాన్ని అనుమతించడం ద్వారా మానవులకు తన పరిపాలన క్రింద ఉండడం ప్రయోజనకరంగా ఉంటుందా లేక తామే స్వయంగా పరిపాలించుకోవడం బాగుంటుందా అనే విషయాన్ని దేవుడు శాశ్వతంగా పరిష్కరిస్తాడు. మానవులు దేవుని మార్గనిర్దేశం లేకుండా అన్నిరకాల రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత వ్యవస్థలను ప్రయోగించి చూడడానికి సరిపడినంత కాలం ఇవ్వబడింది.

దాని ఫలితమేమిటి? వేలాది సంవత్సరాల మానవ చరిత్ర, బాధలు అంతకంతకూ ఎక్కువయ్యాయని తెలియజేస్తోంది. మానవాళి గత శతాబ్దంలో మునుపెన్నటికంటే ఎక్కువ బాధలను అనుభవించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాదిమంది హతులయ్యారు. యుద్ధాల్లో 10 కోట్లకంటే ఎక్కువమంది సంహరించబడ్డారు. నేరాలు దౌర్జన్యం విపరీతమయ్యాయి. మాదకద్రవ్యాల ఉపయోగం మహమ్మారిలా మారింది. సుఖవ్యాధులు విశృంఖలంగా వ్యాపిస్తున్నాయి. ఆకలితో, వ్యాధులతో ప్రతి సంవత్సరం కోట్లాదిలక్షలాదిమంది మరణిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ, నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. ఈ సమస్యలకు ఏ మానవ ప్రభుత్వం దగ్గరా పరిష్కారాలు లేవు. ఏ ప్రభుత్వమూ వృద్ధాప్యాన్ని, అనారోగ్యాన్ని, మరణాన్ని నిర్మూలించలేదు.

మన కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయని బైబిలు ప్రవచించిందో, మానవాళి పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. దేవుని వాక్యం మన కాలాన్ని ఈ విధానపు “అంత్యదినములుగా” గుర్తించడమే కాక, ఈ అంత్యదినాల్లో “అపాయకరమైన కాలములు” వస్తాయని కూడా తెలియజేసింది. బైబిలు చెప్పినట్లే ‘దుర్జనులు వంచకులు అంతకంతకు చెడిపోతున్నారు.’​—⁠2 తిమోతి 3:​1-5, 13.

బాధలు త్వరలోనే అంతమవుతాయి

దేవుని నుండి మానవులు స్వతంత్రంగా ఉండడంవల్ల కలిగిన విచారకరమైన పరిణామాలు అంతమయ్యే సమయం దగ్గరయిందని రుజువులు చూపిస్తున్నాయి. దేవుని నుండి వేరై స్వతంత్రంగా ఉంటూ మానవులు చేసే పరిపాలన ఎన్నటికీ విజయవంతం కాదని స్పష్టంగా రుజువయ్యింది. దేవుని పరిపాలన మాత్రమే శాంతిని, సంతోషాన్ని, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, నిత్య జీవాన్ని తీసుకురాగలదు. కాబట్టి దుష్టత్వం, బాధలకు దేవుడు అనుమతించిన కాలం అంతం కాబోతోంది. త్వరలోనే దేవుడు మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఈ అసంతృప్తికరమైన విధానాన్నంతటిని నాశనం చేస్తాడు.

బైబిలు ప్రవచనం ఇలా చెబుతోంది: “ఆ రాజుల [ఇప్పుడున్న మానవ పరిపాలనల] కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకములో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు. . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని [ఇప్పుడున్న పరిపాలనలను] పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:​44) దేవుని పరలోక రాజ్యము ద్వారా ఆయన సర్వాధిపత్యం అంటే పరిపాలించడానికి ఆయనకున్న హక్కు నిరూపించబడుతుంది అనేదే బైబిలు ప్రధానమైన బోధ. “అంత్యదినముల” సూచనలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రవచిస్తూ యేసు ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”​—⁠మత్తయి 24:​14.

అంతము వచ్చినప్పుడు ఎవరు రక్షించబడతారు? బైబిలు ఇలా సమాధానమిస్తోంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.” (సామెతలు 2:​21, 22) యెహోవా చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించేవారే ఆ యథార్థవంతులు. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) అవును, ‘లోకము గతించిపోవుచున్నది గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.’​—⁠1 యోహాను 2:⁠17.

లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి.