కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏడవ అధ్యాయం

చనిపోయిన మీ ప్రియమైనవారి కోసం నిజమైన నిరీక్షణ

చనిపోయిన మీ ప్రియమైనవారి కోసం నిజమైన నిరీక్షణ
  • పునరుత్థానం నిజంగా జరుగుతుందని మనకెలా తెలుసు?

  • చనిపోయినవారిని పునరుత్థానం చేసే విషయంలో యెహోవాకు ఎలాంటి భావాలు ఉన్నాయి?

  • ఎవరు పునరుత్థానం చేయబడతారు?

1-3. మనల్నందరినీ ఏ శత్రువు వెంబడిస్తున్నాడు, బైబిలు బోధిస్తున్న అంశాన్ని పరిశీలించడం మనకెందుకు ఉపశమనం కలిగిస్తుంది?

 మీరు దుష్టుడైన ఒక శత్రువు నుండి దూరంగా పారిపోతున్నారనుకోండి. అతడు మీకన్నా బలంగా, వేగంగా పరుగెత్తుతున్నాడు. అతను మీ స్నేహితుల్లో కొందరిని చంపడం మీరు కళ్లారా చూశారు కాబట్టి, అతను జాలిలేనివాడని మీకు అర్థమయ్యింది. మీరు అతనికన్నా ఎంత వేగంగా పరుగెత్తడానికి ప్రయత్నించినా, అతడు అంతకంతకు మీకు చేరువవుతున్నాడు. ఇక ప్రాణాలమీద ఆశ వదులుకోవలసిందే అనిపిస్తోంది. అయితే, ఊహించని రీతిలో మిమ్మల్ని కాపాడేందుకు ఒక వ్యక్తి ప్రత్యక్ష్యమయ్యాడు. ఆయన మీ శత్రువును మించిన బలశాలి, పైగా ఆయన మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు మీరెంత హాయిగా గాలి పీల్చుకుంటారో కదా!

2 ఒక విధంగా చెప్పాలంటే, మిమ్మల్ని అలాంటి శత్రువే వెంబడిస్తున్నాడు. నిజానికి అతడు మనందరినీ వెంబడిస్తున్నాడు. మనం ముందరి అధ్యాయంలో తెలుసుకున్నట్లుగా, మరణాన్ని శత్రువు అని బైబిలు పిలుస్తోంది. దానికి అందకుండా మనలో ఎవ్వరమూ పరుగెత్తలేం, దానిని జయించలేం. మన ప్రియమైనవారిని ఈ శత్రువు కబళించడాన్ని మనలో అనేకులం చూశాం. అయితే యెహోవా మరణాన్ని మించిన బలశాలి. ఈ శత్రువును తాను జయించగలనని ఆ ప్రేమగల రక్షకుడు ఇదివరకే చూపించాడు. మరణం అనే ఈ శత్రువును శాశ్వతంగా నాశనం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. బైబిలు ఇలా బోధిస్తోంది: “కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” (1 కొరింథీయులు 15:26) అది నిజంగా ఒక శుభవార్తే!

3 మరణం అనే ఆ శత్రువు దాడి చేసినప్పుడు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనమిప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం. అలా పరిశీలించినప్పుడు మనలను సంతోషపరిచే ఒక అంశాన్ని మనం అర్థం చేసుకుంటాము. చనిపోయినవారు మళ్లీ బ్రతుకుతారని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 26:19) వారు తిరిగి జీవానికి వస్తారు. అదే పునరుత్థాన నిరీక్షణ.

ప్రియమైనవారు చనిపోయినప్పుడు . . .

4. (ఎ) చనిపోయినవారి విషయంలో యేసు ప్రతిస్పందన, యెహోవా భావాల గురించి ఎందుకు బోధిస్తుంది? (బి) యేసు ఎలాంటి ప్రత్యేక స్నేహాన్ని వృద్ధి చేసుకున్నాడు?

4 మీ ప్రియమైనవారు ఎవరైనా చనిపోయారా? అప్పుడు కలిగే బాధను, వేదనను, నిరాశాపూరిత భావాలను భరించడం కష్టమనిపించవచ్చు. అలాంటి సమయాల్లో, ఓదార్పు కోసం మనం దేవుని వాక్యాన్ని సంప్రదించాలి. (2 కొరింథీయులు 1:3, 4 చదవండి.) మరణం గురించి యెహోవా, యేసుక్రీస్తు ఎలా భావిస్తున్నారో అర్థం చేసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. తన తండ్రిని పరిపూర్ణంగా ప్రతిబింబించిన యేసుకు, ఎవరైనా చనిపోయినప్పుడు ఎంత బాధ కలుగుతుందో తెలుసు. (యోహాను 14:9) యేసు యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడికి దగ్గరలోనే ఉన్న బేతనియ అనే గ్రామంలో నివసించిన లాజరును, ఆయన సహోదరీలైన మరియ, మార్తలను సందర్శిస్తూ ఉండేవాడు. వారు సన్నిహిత స్నేహితులయ్యారు. బైబిలు ఇలా చెబుతోంది: “యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.” (యోహాను 11:5) అయితే మనం దీని ముందరి అధ్యాయంలో చూసినట్లుగా, లాజరు చనిపోయాడు.

5, 6. (ఎ) దుఃఖిస్తున్న లాజరు కుటుంబ సభ్యులను, స్నేహితులను కలిసినప్పుడు యేసు ఎలా స్పందించాడు? (బి) యేసు దుఃఖం మనకెందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది?

5 యేసు తన స్నేహితుడు చనిపోయినప్పుడు ఎలా భావించాడు? లాజరు మరణించినందుకు దుఃఖిస్తున్న ఆయన బంధువులను, స్నేహితులను యేసు కలుసుకున్నాడని ఆ వృత్తాంతం మనకు చెబుతోంది. వారిని చూసినప్పుడు యేసు బహుగా చలించిపోయాడు. ఆయన ‘కలవరపడి ఆత్మలో మూలిగాడు.’ ఆ తర్వాత “యేసు కన్నీళ్లు విడిచెను” అని ఆ వృత్తాంతం చెబుతోంది. (యోహాను 11:33, 35) యేసు దుఃఖించాడంటే అసలు ఆయనకు ఎలాంటి నిరీక్షణా లేదని దాని అర్థమా? ఎంతమాత్రం కాదు. వాస్తవానికి, ఒక అద్భుతం జరగబోతోందన్న విషయం యేసుకు తెలుసు. (యోహాను 11:3, 4) అయినప్పటికీ, ఆయన ప్రియమైనవారి మరణంవల్ల కలిగే బాధను, దుఃఖాన్ని అనుభవించాడు.

6 ఒక విధంగా యేసు దుఃఖం మనకు ప్రోత్సాహకరంగా ఉంది. ఎందుకంటే అది మనకు యేసు, ఆయన తండ్రియైన యెహోవా మరణాన్ని ఇష్టపడడం లేదని బోధిస్తోంది. అయితే యెహోవా దేవుడు ఆ శత్రువును తిప్పికొట్టి విజయం సాధించగలడు! దేవుడు యేసును ఎంతటి శక్తిమంతుణ్ణి చేశాడో మనం పరిశీలిద్దాం.

“లాజరూ, బయటకు రమ్ము!”

7, 8. మానవ ప్రేక్షకులకు లాజరు విషయంలో ఇంకా ఆశించడానికి ఏమీలేనట్లుగా ఎందుకు అనిపించవచ్చు, అయితే యేసు ఏమి చేశాడు?

7 లాజరు సమాధి ఒక గుహలో ఉంది, యేసు ఆ సమాధిని మూసి ఉంచిన రాయిని తొలగించమని అడిగాడు. లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి కాబట్టి ఆయన శరీరం కుళ్లిపోవడం ఆరంభించి ఉంటుందని మార్త అభ్యంతరం చెప్పింది. (యోహాను 11:39) మానవ దృక్కోణం నుండి చూస్తే అక్కడ ఇక ఆశించడానికి ఏమీలేదు అని అనిపించవచ్చు.

లాజరు పునరుత్థానం అమితానందాన్నిచ్చింది.—యోహాను 11:38-44.

8 ఆ రాయిని తొలగించినప్పుడు యేసు, “లాజరూ, బయటికి రమ్ము” అని బిగ్గరగా పిలిచాడు. అప్పుడు ఏమి జరిగింది? ‘చనిపోయినవాడు వెలుపలికి వచ్చాడు.’ (యోహాను 11:43, 44) అప్పుడు అక్కడున్న ప్రజల ఆనందాన్ని మీరు ఊహించగలరా? లాజరు వారి సహోదరుడైనా, బంధువైనా, స్నేహితుడైనా లేదా పొరుగువాడైనా ఆయన చనిపోయాడని వారికి తెలుసు. అయినప్పటికీ, తమకు ప్రియమైన ఆ మనిషి ఇప్పుడు మళ్ళీ వారి మధ్య జీవంతో నిలుచున్నాడు. వారు బహుశా తమ కళ్లను తామే నమ్మలేకపోయి ఉండవచ్చు. నిస్సందేహంగా అక్కడున్న వారిలో చాలామంది ఆనందంతో లాజరును కౌగలించుకొని ఉంటారు. అది మరణం మీద ఎంతటి ఘన విజయమో కదా!

ఏలీయా ఒక విధవరాలి కుమారుణ్ణి పునరుత్థానం చేశాడు.—1 రాజులు 17:17-24.

9, 10. (ఎ) లాజరును పునరుత్థానం చేయడంలో తన శక్తికి మూలం ఎవరో అనేది యేసు ఎలా వెల్లడి చేశాడు? (బి) బైబిల్లోని పునరుత్థాన వృత్తాంతాలను చదవడం ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

9 యేసు ఈ అద్భుతాన్ని తానే స్వయంగా చేశానని చెప్పుకోలేదు. లాజరును పిలవడానికి ముందు ఆయన చేసిన ప్రార్థనలో, ఆ పునరుత్థానానికి మూలం యెహోవాయే అని ఆయన స్పష్టం చేశాడు. (యోహాను 11:41, 42 చదవండి.) యేసు తన శక్తిని ఆ విధంగా ఉపయోగించిన సందర్భం ఇదొక్కటి మాత్రమే కాదు. దేవుని వాక్యంలో నమోదైన ఇలాంటి తొమ్మిది అద్భుతాల్లో లాజరు పునరుత్థానం కేవలం ఒకటి మాత్రమే. a ఈ వృత్తాంతాలను చదవడం, అధ్యయనం చేయడం ఆనందాన్నిస్తుంది. అవి దేవుడు పక్షపాతి కాడని మనకు బోధిస్తాయి, ఎందుకంటే అలా పునరుత్థానం చేయబడిన వారిలో పిల్లలు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు కానివారు ఉన్నారు. వారు పొందిన ఆనందం ఈ వృత్తాంతాల్లో ఎంత చక్కగా వర్ణించబడిందో కదా! ఉదాహరణకు, యేసు ఒక అమ్మాయిని పునరుత్థానం చేసినప్పుడు, ఆమె తల్లిదండ్రులు “బహుగా విస్మయ మొందిరి.” (మార్కు 5:42) అవును, వారు ఎన్నటికీ మరచిపోలేని ఆనందాన్ని అనుభవించేందుకు ఆధారాన్ని యెహోవా వారికి ఇచ్చాడు.

అపొస్తలుడైన పేతురు దొర్కా అనే పేరుగల క్రైస్తవ స్త్రీని పునరుత్థానం చేశాడు.—అపొస్తలుల కార్యములు 9:36-42.

10 నిజమే, యేసు పునరుత్థానం చేసినవారు చివరకు మరణించారు. అంటే వారిని పునరుత్థానం చేయడం అర్థరహితమని దాని భావమా? ఎంతమాత్రం కాదు. ఈ బైబిలు వృత్తాంతాలు ప్రాముఖ్యమైన సత్యాలను ధృవీకరిస్తూ మనకు నిరీక్షణనిస్తాయి.

పునరుత్థాన వృత్తాంతాల నుండి నేర్చుకోవడం

11. లాజరు పునరుత్థాన వృత్తాంతం ప్రసంగి 9:5⁠లో ఉన్న సత్యాన్ని ధృవీకరించడానికి ఎలా సహాయం చేస్తోంది?

11 చనిపోయినవారు “ఏమియు ఎరుగరు” అని బైబిలు బోధిస్తోంది. (ప్రసంగి 9:5) వారు సజీవులుగా, స్పృహతో ఇంకెక్కడా ఉనికిలో ఉండరు. లాజరు వృత్తాంతం ఈ సత్యాన్ని ధృవీకరిస్తోంది. ఆయన తిరిగి బ్రతికిన తర్వాత, ప్రజలను పులకరింపజేసే పరలోకపు సంగతులేమైనా వివరించాడా? లేక అగ్నిమయమైన నరకం గురించిన భయోత్పాదకమైన కథనాలతో వారిని భయపెట్టాడా? లేదు. లాజరు అలాంటి విషయాలు మాట్లాడినట్లు బైబిలు చెప్పడం లేదు. ఆయన మరణ స్థితిలోవున్న నాలుగు రోజులు ‘ఏమియు ఎరుగని’ స్థితిలో ఉన్నాడు. లాజరు కేవలం మరణం అనే దీర్ఘనిద్రలో ఉన్నాడు.—యోహాను 11:11.

12. లాజరు పునరుత్థానం జరిగిందని మనం ఖచ్చితంగా ఎందుకు నమ్మవచ్చు?

12 పునరుత్థానం పుక్కిటి పురాణం కాదు, అదొక వాస్తవమని కూడా లాజరు వృత్తాంతం మనకు బోధిస్తోంది. అనేకమంది ప్రత్యక్షసాక్షుల సమక్షంలో యేసు లాజరును పునరుత్థానం చేశాడు. యేసును ద్వేషించిన మతనాయకులు కూడా ఈ అద్భుతాన్ని నిరాకరించలేదు. బదులుగా, వారు “మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే” అని అన్నారు. (యోహాను 11:47) పునరుత్థానం చేయబడిన లాజరును చూడడానికి అనేకమంది వెళ్లారు. తత్ఫలితంగా ఇంకా అనేకులు యేసును విశ్వసించారు. యేసును దేవుడు పంపించాడనేందుకు సజీవ సాక్ష్యాన్ని వారు లాజరులో చూశారు. ఈ సాక్ష్యం ఎంత బలంగా ఉందంటే, కఠిన మనస్సుగల యూదా మతనాయకులు కొందరు యేసును, లాజరును చంపడానికి కూడా పథకం వేశారు.—యోహాను 11:53; 12:9-11.

13. యెహోవా చనిపోయినవారిని నిజంగా పునరుత్థానం చేయగలడని నమ్మడానికి మనకు ఎలాంటి ఆధారముంది?

13 పునరుత్థానాన్ని ఒక యథార్థ సంఘటనగా అంగీకరించడం అవాస్తవికమా? కాదు, ఎందుకంటే “సమాధులలో నున్నవారందరు” ఏదోకరోజు పునరుత్థానం చేయబడతారని యేసు బోధించాడు. (యోహాను 5:28) సమస్త జీవానికి యెహోవాయే సృష్టికర్త. ఆయన జీవాన్ని పునఃసృష్టించగలడని నమ్మడం కష్టమనిపిస్తోందా? నిజానికి, ఆయన జ్ఞాపకశక్తి మీదే అది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మరి ఆయన మరణించిన మన ప్రియమైనవారిని జ్ఞాపకం ఉంచుకోగలడా? ఈ మహా విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి, అయినా దేవుడు వాటన్నిటికీ పేర్లు పెట్టాడు! (యెషయా 40:26) కాబట్టి యెహోవా దేవుడు చనిపోయిన మన ప్రియమైనవారి వివరాలన్నింటినీ జ్ఞాపకముంచుకోవడమే కాక, వారికి తిరిగి జీవాన్నివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.

14, 15. యోబు చెప్పిన మాటలు ఉదాహరిస్తున్నట్లుగా, చనిపోయినవారిని పునరుత్థానం చేసే విషయంలో యెహోవాకు ఎలాంటి భావాలు ఉన్నాయి?

14 అయితే, చనిపోయినవారిని పునరుత్థానం చేసే విషయంలో యెహోవాకు ఎలాంటి భావాలు ఉన్నాయి? ఆయన చనిపోయినవారిని పునరుత్థానం చేయాలని ఎంతగానో కోరుకుంటున్నట్లు బైబిలు బోధిస్తోంది. నమ్మకస్థుడైన యోబు ఇలా ప్రశ్నించాడు: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” తనను దేవుడు జ్ఞాపకం చేసుకునే సమయం వచ్చేవరకు సమాధిలో వేచివుండడం గురించి యోబు మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.”—యోబు 14:13-15.

15 ఒక్కసారి ఊహించండి! చనిపోయినవాళ్లను తాను బ్రతికించే రోజు కోసం యెహోవా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. యెహోవాకు అలాంటి భావాలు ఉన్నాయని తెలుసుకోవడం సంతోషం కలిగించడం లేదా? అయితే భవిష్యత్తులో జరిగే ఈ పునరుత్థానం విషయమేమిటి? ఎవరు పునరుత్థానం చేయబడతారు, ఎక్కడ చేయబడతారు?

“సమాధులలో నున్నవారందరు”

16. చనిపోయినవారు ఎలాంటి పరిస్థితుల్లో జీవించడానికి పునరుత్థానం చేయబడతారు?

16 రాబోయే పునరుత్థానం గురించి బైబిల్లోని పునరుత్థాన వృత్తాంతాలు మనకెంతో బోధిస్తాయి. ఈ భూమ్మీద పునరుత్థానం చేయబడినవారు తమ ప్రియమైనవారిని తిరిగి కలుసుకున్నారు. భవిష్యత్తులో జరిగే పునరుత్థానం కూడా అలాగే ఉంటుంది, నిజానికి అది ఇంకా బాగుంటుంది. మనం 3వ అధ్యాయంలో తెలుసుకున్నట్లుగా, ఈ భూమంతా పరదైసుగా మారాలనేది దేవుని సంకల్పం. కాబట్టి చనిపోయినవారు యుద్ధం, నేరం, రోగంతో నిండిన లోకంలో జీవించడానికి పునరుత్థానం చేయబడరు. శాంతిభరితమైన, సంతోషభరితమైన పరిస్థితుల్లో ఈ భూమ్మీద నిరంతరం జీవించే అవకాశం వారికి ఉంటుంది.

17. పునరుత్థానం ఎంత విస్తృతంగా ఉంటుంది?

17 ఎవరు పునరుత్థానం చేయబడతారు? “సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు” అని యేసు చెప్పాడు. (యోహాను 5:28, 29) అదేవిధంగా, ప్రకటన 20:13 ఇలా చెబుతోంది: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను.” (అనుబంధంలోని 212-213 పేజీలు చూడండి.) ఈ సమాధులన్నీ ఖాళీ చేయబడతాయి. అక్కడ విశ్రాంతిలోవున్న వందల కోట్లమంది తిరిగి జీవిస్తారు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” (అపొస్తలుల కార్యములు 24:14-15) దాని భావమేమిటి?

చనిపోయినవారు పరదైసులో పునరుత్థానం చేయబడి తమ ప్రియమైనవారిని తిరిగి కలుసుకుంటారు

18. పునరుత్థానం చేయబడే ‘నీతిమంతుల్లో’ ఎవరుంటారు, ఈ నిరీక్షణ వ్యక్తిగతంగా మీపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

18 యేసు భూమ్మీదకు రాకముందు నివసించారని బైబిల్లో మనం చదివే అనేకులు ఆ ‘నీతిమంతుల్లో’ ఉంటారు. నోవహు, అబ్రాహాము, శారా, మోషే, రూతు, ఎస్తేరు, ఇంకా అనేకుల గురించి మీరు ఆలోచించవచ్చు. హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఈ విశ్వాస స్త్రీపురుషుల్లో కొందరి గురించిన చర్చ ఉంది. అయితే ఆ ‘నీతిమంతుల్లో’ మనకాలంలో చనిపోయే యెహోవా సేవకులు కూడా ఉంటారు. పునరుత్థాన నిరీక్షణ కారణంగా, చనిపోతామనే భయం మనకిక అవసరం లేదు.—హెబ్రీయులు 2:14-15.

19. “అనీతిమంతులు” ఎవరు, యెహోవా దయతో వారికి ఎలాంటి అవకాశం ఇస్తాడు?

19 అయితే యెహోవా ఎవరో తెలియని కారణంగా ఆయనను సేవించనివారు లేదా ఆయనకు లోబడనివారందరి విషయం ఏమిటి? ఈ వందల కోట్ల ‘అనీతిమంతులు’ కూడా మరువబడరు. వారు కూడా పునరుత్థానం చేయబడతారు, సత్య దేవుని గురించి తెలుసుకొని ఆయనను సేవించేందుకు వారికి సమయం ఇవ్వబడుతుంది. చనిపోయినవారు వెయ్యేండ్ల కాలంలో పునరుత్థానం చేయబడి, భూమ్మీది నమ్మకమైన మానవులతోపాటు యెహోవాను సేవించే అవకాశం వారికి ఇవ్వబడుతుంది. అదొక అద్భుతమైన కాలంగా ఉంటుంది. ఈ కాలాన్నే బైబిలు తీర్పుదినం అని సూచిస్తోంది. b

20. గెహెన్నా అంటే ఏమిటి, అక్కడికి ఎవరు వెళ్తారు?

20 అంటే భూమ్మీద జీవించిన ప్రతీ ఒక్కరూ పునరుత్థానం చేయబడతారని దీనర్థమా? కాదు. చనిపోయిన కొందరు, పరిశుద్ధ గ్రంథము “నరకము” అని అనువదించిన గెహెన్నాలో ఉన్నారని బైబిలు చెబుతోంది. (లూకా 12:5) ప్రాచీన యెరూషలేముకు వెలుపల ఉన్న, చెత్తా చెదారం పడేసే స్థలం నుండి గెహెన్నా అనే పేరు వచ్చింది. మృత కళేబరాలను, చెత్తను అక్కడ తగలబెట్టేవారు. సమాధి చేయబడడానికీ, పునరుత్థానానికీ అనర్హులైనవారి మృతకళేబరాలను యూదులు ఆ స్థలంలో పడేసేవారు. కాబట్టి, గెహెన్నా నిత్య నాశనానికి సరైన చిహ్నంగా ఉంది. సజీవులకు, మృతులకు తీర్పుతీర్చడంలో యేసుకు పాత్ర ఉన్నప్పటికీ, యెహోవాయే అంతిమ న్యాయాధిపతి. (అపొస్తలుల కార్యములు 10:42) ఆయన దుష్టులుగా, మారడానికి ఇష్టపడని వారిగా తీర్పు తీర్చేవారిని ఎన్నటికీ పునరుత్థానం చేయడు.

పరలోక పునరుత్థానం

21, 22. (ఎ) ఇంకా ఏ రకమైన పునరుత్థానం ఉంది? (బి) ఆత్మ సంబంధ పునరుత్థానం పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?

21 బైబిలు మరో రకమైన పునరుత్థానం గురించి అంటే పరలోకంలో ఆత్మ ప్రాణిగా జీవించేలా పునరుత్థానం చేయబడడం గురించి కూడా తెలియజేస్తోంది. బైబిల్లో ఈ తరహా పునరుత్థానానికి సంబంధించిన ఒకే ఒక ఉదాహరణ ఉంది, అది యేసుక్రీస్తుకు సంబంధించినది.

22 మానవునిగా యేసు చంపబడిన తర్వాత, యెహోవా తన నమ్మకమైన కుమారుణ్ణి సమాధిలోనే విడిచిపెట్టలేదు. (కీర్తన 16:10; అపొస్తలుల కార్యములు 13:34, 35) యేసును దేవుడు పునరుత్థానం చేశాడు, అయితే మానవునిగా కాదు. క్రీస్తు ‘శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రదికింపబడ్డాడని’ అపొస్తలుడైన పేతురు వివరిస్తున్నాడు. (1 పేతురు 3:18) అది నిజంగా ఒక అద్భుతం. యేసు మళ్లీ బలమైన ఆత్మ సంబంధ వ్యక్తిగా సజీవుడయ్యాడు! (1 కొరింథీయులు 15:3-6 చదవండి.) ఈ విధమైన మహిమాన్విత పునరుత్థానం పొందిన యేసు మొట్టమొదటి వాడయ్యాడు. అయితే ఆయనే చివరి వ్యక్తికాదు—యోహాను 3:13.

23, 24. యేసు ‘చిన్న మందగా’ ఎవరు తయారవుతారు, వారు ఎంతమంది?

23 త్వరలోనే పరలోకానికి తిరిగి వెళ్తానని తెలిసిన యేసు, తన నమ్మకమైన శిష్యులతో అక్కడ ‘స్థలము సిద్ధపరుస్తాను’ అని చెప్పాడు. (యోహాను 14:2) అలా పరలోకానికి వెళ్లేవారిని యేసు “చిన్న మంద” అని పిలిచాడు. (లూకా 12:32) ఈ నమ్మకమైన క్రైస్తవుల చిన్న గుంపులో ఎంతమంది ఉంటారు? ప్రకటన 14:1 ప్రకారం అపొస్తలుడైన యోహాను ఇలా చెబుతున్నాడు: “నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల [యేసుక్రీస్తు] సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి.”

24 యేసు నమ్మకమైన అపొస్తలులు కూడా ఉన్న ఈ 1,44,000 మంది పరలోక జీవానికి ఎత్తబడతారు. వారి పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? అది యేసు వచ్చినప్పుడు లేదా యేసు ప్రత్యక్షతా కాలంలో జరుగుతుందని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 15:23) 9వ అధ్యాయంలో మీరు తెలుసుకొనే ప్రకారం, మనమిప్పుడు ఆ కాలంలోనే జీవిస్తున్నాం. కాబట్టి మనకాలంలో ఆ 1,44,000 గుంపులో శేషించిన కొద్దిమందిలో ఎవరైనా చనిపోతే, వారు వెనువెంటనే పరలోక జీవానికి పునరుత్థానం చేయబడతారు. (1 కొరింథీయులు 15:51-55) అయితే మానవాళిలో అధికశాతం మందికి భవిష్యత్తులో పరదైసు భూమిపై జీవించేలా పునరుత్థానం చేయబడే నిరీక్షణ ఉంది.

25. తర్వాతి అధ్యాయంలో మనం ఏమి పరిశీలిస్తాం?

25 అవును, యెహోవా మన శత్రువైన మరణాన్ని నిజంగా జయిస్తాడు, అప్పుడు మరణం శాశ్వతంగా అంతరించి పోతుంది. (యెషయా 25:8 చదవండి.) అయితే, ‘పరలోకానికి పునరుత్థానం చేయబడేవారు అక్కడేమి చేస్తారు’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు. వారు పరలోకంలో అద్భుతమైన రాజ్య ప్రభుత్వంలో ఒక భాగమవుతారు. తర్వాతి అధ్యాయంలో ఆ ప్రభుత్వం గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం.

b తీర్పుదినానికి, తీర్పుకున్న ఆధారానికి సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి అనుబంధంలోని 213-215 పేజీలు చూడండి.