కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 7

దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు

దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు

యెహోవా ఐగుప్తుపైకి తెగుళ్ళు రప్పించాడు, మోషే ఇశ్రాయేలీయులను ఆ దేశంలో నుండి బయటికి నడిపించాడు. దేవుడు మోషేను మధ్యవర్తిగా ఉపయోగించి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు

ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలపాటు ఐగుప్తులో నివసించి ధనసంపదలు సమకూర్చుకున్నారు, వాళ్ల జనాభా అంతకంతకూ పెరిగింది. కొంతకాలానికి యోసేపు గురించి తెలియని ఒక కొత్త వ్యక్తి రాజయ్యాడు. అంతకంతకూ పెరుగుతున్న వాళ్ల జనాభా చూసి భయపడిన ఆ క్రూర పరిపాలకుడు వాళ్లను బానిసల్ని చేశాడు. వాళ్లకు పుట్టిన మగపిల్లలందరినీ నైలు నదిలో పడేయమని ఆజ్ఞాపించాడు. కానీ ధైర్యవంతురాలైన ఒక తల్లి మాత్రం తన మగశిశువును ఒక బుట్టలో పెట్టి దాన్ని నది ఒడ్డున జమ్ములో దాచింది. ఫరో కుమార్తె ఆ శిశువును చూసి పెంచుకోవాలనుకుంది. అతడికి మోషే అని పేరు పెట్టి, ఐగుప్తు రాజకుటుంబంలో పెంచింది.

మోషేకు 40 ఏళ్లు వచ్చినప్పుడు, ఆయన ఒక ఇశ్రాయేలు దాసుణ్ణి ఐగుప్తీయుని చేతుల్లో నుండి కాపాడడానికి ప్రయత్నిస్తూ సమస్యలో చిక్కుకున్నాడు. ఆయన ప్రాణానికి ముప్పు రావడంతో దూరదేశానికి పారిపోయి, అక్కడే నివసించాడు. మోషేకు 80 ఏళ్లున్నప్పుడు, యెహోవా ఆయనకు ఒక పని అప్పగించాడు. తిరిగి ఐగుప్తుకు వెళ్లి దేవుని ప్రజలను విడిచిపెట్టమని ఫరోతో చెప్పమన్నాడు.

దానికి ఫరో అస్సలు ఒప్పుకోలేదు. దానితో దేవుడు ఐగుప్తుపైకి పది తెగుళ్లు రప్పించాడు. తెగులు రప్పించబోయే ప్రతీసారి మోషే ఫరోను హెచ్చరించాడు. ఫరో ఆయన మాట వినివుంటే దేవుడు ఆ తెగులు తీసుకొచ్చి ఉండేవాడుకాదు. కానీ, ప్రతీసారి ఫరో మోషే మాటను, మోషే దేవుడైన యెహోవా మాటను మొండిగా నిరాకరించాడు. చివరకు దేవుడు పదవ తెగులు రప్పించినప్పుడు, ఆ దేశంలోని మొదటి సంతానమంతా చనిపోయారు, జంతువుల తొలిచూలు కూడా చనిపోయింది. కానీ యెహోవా చెప్పింది విని బలి అర్పించిన గొఱ్ఱెపిల్ల రక్తాన్ని తమ ద్వారబంధాలకు రాసిన కుటుంబాల్లో మాత్రం ఎవ్వరూ చనిపోలేదు. సంహరించడానికి వచ్చిన దేవదూత వాళ్ల ఇళ్లను దాటి వెళ్లాడు. అలా దేవుడు తమను అద్భుతంగా కాపాడినందుకు గుర్తుగా ఇశ్రాయేలీయులు ప్రతీ సంవత్సరం పస్కా పండుగ చేసుకునేవారు.

తన కుమారుడు చనిపోవడంతో ఫరో మోషేను, ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు విడిచి వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించాడు. మోషే నాయకత్వంలో వాళ్లంతా వెంటనే బయల్దేరారు. కానీ, ఫరో మనసు మళ్లీ మారింది. ఆయన తన సైన్యాన్ని, రథాలను తీసుకుని వాళ్లను తరుముకుంటూ వెళ్లాడు. అప్పటికల్లా ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రం దగ్గరికి చేరుకున్నారు. వెనక సైన్యం, మూడు పక్కలా నీళ్లతో ఇశ్రాయేలీయులకు చిక్కుకుపోయినట్టు అనిపించింది. కానీ యెహోవా ఎఱ్ఱ సముద్రాన్ని రెండుపాయలుగా చేసినప్పుడు నీళ్లు ఇరువైపులా గోడలా నిలిచాయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఎండిన నేలమీద నడిచివెళ్లారు. ఐగుప్తీయులు వాళ్లను తరుముకుంటూ సముద్రం మధ్యలోకి వెళ్లాక దేవుడు సముద్రాన్ని తిరిగి కలిపేశాడు. దాంతో ఫరో, అతని సైన్యం నీళ్లలో మునిగి చనిపోయారు.

ఆ తర్వాత, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర ఆగినప్పుడు, యెహోవా వారితో ఒక నిబంధన చేశాడు. మోషేను మధ్యవర్తిగా ఉపయోగించి దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని నియమాలిచ్చాడు. అవి జీవితంలోని ప్రతి విషయంలో వారికి కావలసిన నడిపింపునిచ్చాయి, రక్షణగా పనిచేశాయి. ఇశ్రాయేలీయులు నమ్మకంగా దేవుని పరిపాలనకు లోబడినంతకాలం యెహోవా వాళ్లకు తోడైవుంటూ ఆ జనాంగంవల్ల ఇతరులు కూడా ప్రయోజనం పొందేలా చేశాడు.

అయితే, వారిలో చాలామంది దేవునిపై విశ్వాసం ఉంచకుండా ఆయనకు బాధ కలిగించారు. అందుకే యెహోవా వాళ్లు 40 సంవత్సరాలపాటు అరణ్యంలో సంచరించేలా చేశాడు. ఆ తర్వాత, మోషే నీతిమంతుడైన యెహోషువను తన తర్వాతి నాయకునిగా నియమించాడు. చివరకు ఇశ్రాయేలీయులు, దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశ సరిహద్దులకు చేరుకున్నారు.

నిర్గమకాండము; లేవీయకాండము; సంఖ్యాకాండము; ద్వితీయోపదేశకాండము; కీర్తన 136:10-15; అపొస్తలుల కార్యములు 7:17-36.