కంటెంట్‌కు వెళ్లు

మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?

మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?

రాజ్యవార్త నం. 37

ప్రపంచవ్యాప్త సందేశం

మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?

▪ మతం పేరిట దుష్క్రియలు ఎందుకు జరుగుతున్నాయి?

▪ అవెలా అంతమౌతాయి?

▪ అవి అంతమైనప్పుడు మీరు తప్పించుకోగలరా?

మతం పేరిట దుష్క్రియలు ఎందుకు జరుగుతున్నాయి?

మతం పేరిట జరుగుతున్న నేరాలను చూసి మీరు కలవరపడుతున్నారా? దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకునేవారే యుద్ధానికి, ఉగ్రవాదానికి, అవినీతికి పాల్పడడం చూసి మీరు వ్యాకులపడుతున్నారా? మతమే అనేక సమస్యలకు మూలకారణంగా ఉన్నట్లు ఎందుకనిపిస్తోంది?

మతాలన్నీ కాదుగానీ దుష్క్రియలను ప్రోత్సహించే మతాలే సమస్యలకు మూలకారణం. అందరూ గౌరవించే భక్తిపరుడైన యేసుక్రీస్తు, “పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించు[నట్లు]” అలాంటి మతాలు చెడు కార్యాలను ఉత్పన్నం చేస్తాయని సూచించాడు. (మత్తయి 7:​15-17) అలాంటి మతాలు ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నాయి?

మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు . . .

యుద్ధాల్లో, రాజకీయాల్లో తలదూర్చడం: “ఆసియాలోనూ, మరితర ప్రాంతాల్లోనూ అధికార దాహంగల నాయకులు స్వార్థంతో తమ స్వలాభం కోసం ప్రజల మతసంబంధ మనోభావాలను వాడుకుంటున్నారు” అని ఏషియావీక్‌ అనే పత్రిక చెబుతోంది. తత్ఫలితంగా, “లోకం వెఱ్ఱిదైపోయే ప్రమాదం కనిపిస్తోంది” అని ఆ పత్రిక హెచ్చరిస్తోంది. అమెరికాలోని ఒక ప్రముఖ మతనాయకుడు ఇలా అన్నాడు: “ఉగ్రవాదుల మారణకాండ ఆగాలంటే ముందుగా వారిని హతమార్చాలి.” ఆయన చెబుతున్న పరిష్కారమేమిటి? “ప్రభువు పేరిట ఆ ఉగ్రవాదులందరినీ సర్వనాశనం చేయండి.” అయితే దానికి భిన్నంగా బైబిలు ఇలా చెబుతోంది: “ఎవడైనను​—⁠నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడు.” (1 యోహాను 4:​20) యేసు, “మీ శత్రువులను ప్రేమించుడి” అని కూడా చెప్పాడు. (మత్తయి 5:​44) ఎన్ని మతాలు యుద్ధంలో పాల్గొంటున్నాయో మీకు తెలుసా?

అబద్ధ సిద్ధాంతాన్ని బోధించడం: ఆత్మ అనేది భౌతిక శరీరం మరణించిన తర్వాత కూడా సజీవంగావుండే, మానవునిలోని ఒక అదృశ్య భాగమని చాలా మతాలు బోధిస్తాయి. ఈ బోధను ఉపయోగిస్తూ, ఇలాంటి అనేక మతాలు, మరణించినవారి కోసం ప్రార్థించేందుకు డబ్బు వసూలుచేస్తూ తమ సభ్యులను దోచుకుంటున్నాయి. అయితే, బైబిలు దానికి భిన్నమైన సిద్ధాంతాన్ని బోధిస్తోంది. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:⁠5) మృతులు పునరుత్థానం చేయబడతారని యేసు బోధించాడు, ఒకవేళ మానవులకు అమర్త్యమైన ఆత్మ అనేదే ఉంటే అలా పునరుత్థానం చేయడం అనవసరం. (యోహాను 11:​11-25) మీ మతం, ఆత్మ మరణించదని బోధిస్తోందా?

లైంగిక దుర్నీతిని సహించడం: పాశ్చాత్య దేశాల్లో, చర్చీలు సలింగసంయోగులను మతనాయకులుగా నియమిస్తూ, సలింగసంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునివ్వాలని ప్రభుత్వాలను తొందరపెడుతున్నాయి. లైంగిక దుర్నీతిని ఖండించే చర్చీలు సహితం, పిల్లలపై లైంగిక అత్యాచారం చేసిన మతనాయకులకు కొమ్ముకాస్తున్నాయి. అయితే లైంగిక దుర్నీతి విషయంలో బైబిలు ఏమి బోధిస్తోంది? అది స్పష్టంగా ఇలా చెబుతోంది: “మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను . . . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:​9, 10) లైంగిక దుర్నీతిని మన్నించే మతాల గురించి మీకు తెలుసా?

కానిఫలములు ఫలించే మతాలకు భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? యేసు ఇలా హెచ్చరించాడు: “మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.” (మత్తయి 7:​19) అవును, అలాంటి మతాలు నరికివేయబడి, నాశనం చేయబడతాయి! అయితే ఇది ఎప్పుడు, ఎలా జరుగుతుంది? బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథం 17, 18 అధ్యాయాల్లో వ్రాయబడివున్న ప్రవచనార్థక దర్శనం దీనికి సమాధానమిస్తుంది.

దుష్క్రియల్ని ప్రోత్సహించే మతాలు ఎలా అంతమౌతాయి?

ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక వేశ్య క్రూరమృగం మీద కూర్చొని ఉంది. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. (ప్రకటన 17:​1-4) ఆ వేశ్య ఎవరికి ప్రతీకగా ఉంది? అది “భూరాజుల”పై తన ప్రభావం చూపిస్తోంది. అది ధూమ్రరక్తవర్ణముగల వస్త్రాలు ధరించి, సుగంధ ద్రవ్యాలు వాడుతున్న సంపన్నురాలు. పైగా, దాని మాయామంత్రాలచేత ‘జనములన్నీ మోసపోయాయి.’ (ప్రకటన 17:18; 18:​12-13, 22) ఆ వేశ్య మరెవరో కాదు ప్రపంచవ్యాప్త మతసంబంధ వ్యవస్థే అని గ్రహించేందుకు బైబిలు మనకు సహాయం చేస్తుంది. అది ఏదో ఒక మతానికి కాదుగానీ, కానిఫలాలు ఫలిస్తున్న మతాలన్నిటికీ ప్రతీకగా ఉంది.

ఆ వేశ్య స్వారీచేస్తున్న మృగం ప్రపంచ రాజకీయ శక్తులను సూచిస్తోంది. * (ప్రకటన 17:​10-13) దుష్క్రియలను ప్రోత్సహిస్తున్న మతాలు ఈ రాజకీయ మృగం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసేందుకే కాక, దాని నిర్దేశాన్ని నియంత్రించేందుకు కూడా ప్రయత్నిస్తూ దానిమీద స్వారీ చేస్తున్నాయి.

అయితే త్వరలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. “నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” (ప్రకటన 17:​16) ప్రపంచ రాజకీయ శక్తులు హఠాత్తుగా అలాంటి మతాలకు ఎదురు తిరిగి, వాటిని పూర్తిగా నాశనం చేస్తాయి! ఈ చర్యను ఎవరు ప్రేరేపిస్తారు? బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథము ఇలా సమాధానమిస్తోంది: ‘తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించును.’ (ప్రకటన 17:​17) అవును, దేవుడు తన పేరిట అలాంటి మతాలు సాగించిన దురాగతాలన్నింటికీ వాటిని లెక్క అడుగుతాడు. పరిపూర్ణ న్యాయంతో వ్యవహరిస్తూ, ఆయన ఈ మతాలపై తీర్పును అమలుపరచేందుకు వాటి రాజకీయ విటులనే తన సాధనంగా ఉపయోగిస్తాడు.

ఈ మతసంబంధ వేశ్యకు పట్టే గతిని తప్పించుకోవాలంటే మీరు ఏమి చేయాలి? దేవుడు తన దూత ద్వారా ఇలా ఉద్బోధిస్తున్నాడు: “నా ప్రజలారా, . . . దానిని విడిచి రండి.” (ప్రకటన 18:⁠4) నిజానికి, అలాంటి మతాల నుండి పారిపోవలసిన సమయమిదే! కానీ, మీరు ఎక్కడికి పారిపోవచ్చు? నాస్తికత్వంవైపు పారిపోలేరు, ఎందుకంటే దాని భవిష్యత్తు కూడా ఆశాజనకంగా లేదు. (2 థెస్సలొనీకయులు 1:​6-9) మిగిలివున్న ఏకైక ఆశ్రయం నిజమైన మతమే. నిజమైన మతాన్ని మీరు ఎలా గుర్తించవచ్చు?

నిజమైన మతాన్ని ఎలా గుర్తించవచ్చు?

నిజమైన మతం ఎలాంటి మంచి ఫలాలను ఫలించాలి?​—⁠మత్తయి 7:17.

నిజమైన మతం . . .

ప్రేమను పెంపొందింపజేస్తుంది: సత్యారాధకులు “లోకసంబంధులు కారు,” జాతి లేదా సంస్కృతి వారిని విభజించవు, వారు ‘ఒకరియెడల ఒకరు ప్రేమగలవారై ఉంటారు.’ (యోహాను 13:35; 17:16; అపొస్తలుల కార్యములు 10:​34, 35) వారు ఒకరినొకరు చంపుకునే బదులు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటారు.​—⁠1 యోహాను 3:​16.

దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచుతుంది: నిజమైన మతం “పారంపర్యాచారమును,” “మనుష్యులు కల్పించిన పద్ధతులను” బోధించే బదులు, దేవుని వాక్యమైన బైబిలును తన సిద్ధాంతాలకు ఆధారంగా తీసుకుంటుంది. (మత్తయి 15:​6-9) ఎందుకు? ఎందుకంటే, “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును . . . ప్రయోజనకరమై యున్నది.”​—⁠2 తిమోతి 3:​16.

కుటుంబాలను బలపర్చి, ఉన్నత నైతిక ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది: నిజమైన మతం, భర్తలు ‘తమ భార్యలను తమ సొంతశరీరములనువలే ప్రేమించడానికి’ తర్ఫీదునిస్తుంది, భార్యలు ‘తమ భర్తలయందు భయము [“ప్రగాఢమైన గౌరవం,” NW] కలిగియుండడానికి’ సహాయం చేస్తుంది, ‘తమ తలిదండ్రులకు విధేయులైయుండాలని’ పిల్లలకు బోధిస్తుంది. (ఎఫెసీయులు 5:28, 33; 6:⁠1) అంతేగాక, బాధ్యతలు అప్పగించబడినవారు నైతికంగా మాదిరికరంగా ఉండాలి.​—⁠1 తిమోతి 3:​1-10.

ఏదైనా మతం ఈ ప్రమాణాలకు సరితూగుతుందా? 2001లో ప్రచురించబడిన హోలోకాస్ట్‌ పాలిటిక్స్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ఒకవేళ అధికసంఖ్యలో ప్రజలు యెహోవాసాక్షులు ప్రకటించిన, అనుసరించిన ప్రమాణాన్ని పాటించివుంటే, హోలోకాస్ట్‌ సంభవించి ఉండేదికాదు, జాతినిర్మూలన ఇక ప్రపంచాన్ని పట్టిపీడించడమూ ఉండదు.”

అవును, 235 దేశాల్లో, యెహోవాసాక్షులు బైబిలు నైతిక ప్రమాణాలను ప్రకటించడమే కాదు, వాటిని తమ జీవితాల్లో అన్వయించుకుంటున్నారు. దేవుణ్ణి ఆమోదయోగ్యంగా ఆరాధించగలిగేలా ఆయన ఏమి కోరుతున్నాడో తెలుసుకునేందుకు మీకు సహాయం చేయమని యెహోవాసాక్షులను అడగమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. చర్య తీసుకోవలసిన సమయమిదే. ఆలస్యం చేయకండి. దుష్క్రియలను ప్రోత్సహిస్తున్న మతాల అంతం సమీపించింది!​—⁠జెఫన్యా 2:2, 3.

యెహోవాసాక్షులు ప్రకటించే బైబిలు ఆధారిత సందేశం గురించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రింద ఇవ్వబడిన చిరునామాకు వ్రాయండి.

□ ఎలాంటి షరతులూ పెట్టకుండా, అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ గురించి మరింత సమాచారం పంపించమని కోరుతున్నాను.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.

[అధస్సూచి]

^ పేరా 17 ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టమైన వివరణ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకాన్ని చూడండి.

[3వ పేజీలోని బ్లర్బ్‌]

దుష్క్రియలను ప్రోత్సహించే మతాలు “భూరాజుల”పై తమ ప్రభావం చూపిస్తున్నాయి

[3వ పేజీలోని బ్లర్బ్‌]

“నా ప్రజలారా, . . . దానిని విడిచి రండి”