కంటెంట్‌కు వెళ్లు

మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?

మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?

రాజ్యవార్త నం. 35

మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?

పొరుగువారి ఎడల ప్రేమ చల్లారిపోయింది

లక్షలాది మంది నిస్సహాయులుగా ఉన్నారు. వారు అనిశ్చయతను దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. రిటైరైన ఒక వ్యాపారవ్యవహర్త ఇలా పునరావలోకనం చేస్తుంది: ‘నేనుండే అంతస్తులోనే నివసించే ఒక విధవరాలు ఒక సాయంకాలం మా తలుపు తట్టి, తను ఒంటరిగా ఉందని చెప్పింది. నేను బిజీగా ఉన్నానని మర్యాదగానే నిర్మొహమాటంగా ఆమెతో చెప్పాను. నాకు ఇబ్బంది కలిగించినందుకు తను నన్ను క్షమాపణ కోరి వెళ్ళిపోయింది.’

విచారకరంగా, ఆ రాత్రే ఆ విధవరాలు ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటనతో “కఠినమైన గుణపాఠాన్ని” నేర్చుకున్నాను అని ఆ వ్యాపారవ్యవహర్త తర్వాత చెప్పింది.

పొరుగువారి ఎడల ప్రేమ లేకపోవడమనేది తరచూ విషాదకరమౌతుంది. మునుపు యుగోస్లేవియాలో భాగమై ఉండిన బోస్నియాలోను, హెర్జెగోవినాలోనూ వర్గ పోరాటాలు జరిగినప్పుడు పది లక్షలకన్నా ఎక్కువ మంది తమ ఇండ్లను వదిలిపెట్టడానికి బలవంతపెట్టబడ్డారు, పది వేల కొలది మంది చంపబడ్డారు. వారిని ఎవరు చంపారు? “మా పొరుగువాళ్ళే, మాకు తెలిసినవాళ్ళే” అని తన స్వంత ఊరునుండి తరిమివేయబడిన ఒక అమ్మాయి విలపించింది.

రువాండాలో లక్షలాది మంది ప్రజలు వధించబడ్డారు. వధించబడినది తరచూ తమ స్వంత పొరుగువారి చేతనే. “ఎవరు హుటు ఎవరు టుట్సీ అని పట్టించుకోకుండా, ఎరగకుండానే హుటూలూ టుట్సీలూ కలిసి [నివసించారు], కులాంతర వివాహాలను చేసుకున్నారు. అయితే, అకస్మాత్తుగా పరిస్థితి మారింది, హత్యలు మొదలయ్యాయి” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదించింది.

అలాగే, ఇజ్రాయేల్‌లో యూదులు అరబ్బీయులు ప్రక్కనే ప్రక్కనే నివసిస్తారు. కానీ చాలా మంది ఒకరినొకరు ద్వేషిస్తారు. ఐర్లాండ్‌లోని చాలా మంది కాథలిక్‌ల ప్రొటెస్టంట్ల పరిస్థితీ, సంఖ్యాపరంగా పెరుగుతున్న ఇతర దేశాల్లోని ప్రజల పరిస్థితీ అలాగే ఉంది. చరిత్రలో ఎన్నడూ లోకంలో ఇంత ప్రేమరాహిత్యముండేది కాదు.

పొరుగువారి ఎడల ప్రేమ ఎందుకు చల్లారిపోయింది?

మన సృష్టికర్త జవాబిస్తున్నాడు. మనం జీవిస్తున్న ఈ కాలాన్ని ఆయన వాక్యమైన బైబిలు “అంత్యదినముల”ని పిలుస్తుంది. ప్రజలు “అనురాగరహితులు”గా ఉంటారని ఏ కాలాన్ని గురించి బైబిలు ప్రవచనం చెబుతుందో ఆ కాలమిదే. “యుగసమాప్తి” అని కూడా లేఖనాల్లో పిలువబడిన ఈ ‘అపాయకరమైన కాలములను’ గురించి చెబుతూ “అనేకుల ప్రేమ చల్లారును” అని యేసుక్రీస్తు ముందే చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.)—2 తిమోతి 3:1-5; మత్తయి 24:3, 12.

కాబట్టి మనం ఈ లోకం యొక్క అంత్యదినాల్లో జీవిస్తున్నామనే దానికిగల రుజువులో నేటి ప్రేమరాహిత్యం ఓ భాగం. సంతోషకరంగా, ఈ దైవభక్తిలేని ప్రజల లోకం స్థానంలో త్వరలో ప్రేమ చేత శాసించబడే నీతియుక్తమైన క్రొత్త లోకం వస్తుందనే భావం కూడా ఈ రుజువుకు ఉంది.—మత్తయి 24:3-14; 2 పేతురు 2:5; 3:7, 13.

కానీ అలాంటి మార్పు సాధ్యమౌతుందని—మానవులందరూ ఒకరినొకరు ప్రేమించడాన్నీ, ఒకరితో ఒకరు సమాధానంతో జీవించడాన్నీ నేర్చుకొనగలరని—నమ్మేందుకు మనకు నిజంగా కారణముందా?

పొరుగువారి ఎడల ప్రేమ—ఒక వాస్తవం

‘నిజానికి నా పొరుగువారెవరు?’ అని మొదటి శతాబ్దంలోని ఒక న్యాయవాది యేసును అడిగాడు. నిస్సందేహంగా, ‘నీ తోటి యూదులే’ అని యేసు అంటాడని ఆయన నిరీక్షించాడు. కానీ, ఇతర జాతులకు చెందిన ప్రజలు కూడా మన పొరుగువారేనని మైత్రీభావంగల సమరయుని గూర్చిన కథలో యేసు సూచించాడు.—లూకా 10:29-37; యోహాను 4:7-9.

దేవుని ఎడల ఉండే ప్రేమ తర్వాత, పొరుగువారి ఎడల ఉండే ప్రేమే మన జీవితాలను శాసించాలని యేసు నొక్కిచెప్పాడు. (మత్తయి 22:34-40) కానీ, ఏ గుంపుకు చెందిన ప్రజలైనా ఎప్పుడైనా తమ పొరుగువారిని నిజంగా ప్రేమించారా? తొలి క్రైస్తవులు అలా ప్రేమించారు! ఇతరుల ఎడల వారికి గల ప్రేమనుబట్టి వారు గుర్తించబడ్డారు.—యోహాను 13:34, 35.

నేటి విషయం ఏమిటి? క్రీస్తు చూపించినటువంటి ప్రేమను ఎవరైనా చూపుతున్నారా? “యేసూ ఆయన శిష్యులూ ఆచరించిన తొలి క్రైస్తవత్వాన్ని పునరుద్ధరించి పునస్థాపించడమే యెహోవాసాక్షుల పని . . . అందరూ సహోదరులే” అని ఎన్‌సైక్లోపీడియా కెనడియానా అభిప్రాయపడుతుంది.

దానర్థం ఏమిటి? తాము తమ పొరుగువారిని ద్వేషించేందుకు కారణమవ్వడానికి యెహోవాసాక్షులు వేటినీ—వర్గీయతను గానీ, జాతీయతను గానీ, జాతి పూర్వోత్తరాలను గానీ—అనుమతించరని అర్థం. వాళ్ళు ఆలంకారికంగా తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుకున్నారు గనుక ఎవరినీ హత్య చేయరు. (యెషయా 2:4) వాస్తవానికి, తమ పొరుగువారికి సహాయం చేసేందుకు చొరవ తీసుకోవడంలో సాక్షులు పేరుగాంచారు.—గలతీయులు 6:10.

“లోకమంతటా యెహోవాసాక్షుల మతానికి చెందినవారే నివసిస్తే రక్తపాతమూ విద్వేషమూ అంతమై ప్రేమే రాజ్యమేలుతుందని చెబితే సరిపోతుంది” అని కాలిఫోర్నియాలోని సాక్రమెంటో యూనియన్‌లో ఒక సంపాదకీయం పేర్కోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. “భూమిమీద యెహోవాసాక్షులు మాత్రమే నివసిస్తే యుద్ధాలు అంతమౌతాయనీ, ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయడమూ, పాస్‌పోర్టులను మంజూరు చేయడమూ మాత్రమే పోలీసుల పనౌతుందనే నిర్ధారణకు వచ్చాను” అని హంగేరీలోని రింగ్‌ పత్రికలో ఒక విలేఖరి పేర్కొన్నాడు.

అయితే, మానవులందరూ ఒకరినొకరు ప్రేమించాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మార్పు రావలసిన అవసరం ఉందని ఒప్పుకోవలసిందే. ఆ మార్పు ఎలా వస్తుంది? (దయచేసి వెనుక పేజీ చూడండి.)

మానవులందరూ ఒకరినొకరు ప్రేమించేటప్పుడు

ఓ నాటకీయమైన మార్పు త్వరలో రానున్నదని యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన చూపిస్తుంది. “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని ప్రార్థించాలని కొండమీద తనిచ్చిన ప్రఖ్యాత ప్రసంగంలో యేసు మనకు నేర్పించాడు.—మత్తయి 6:10.

దేవుని రాజ్యమంటే ఏమిటి? అది పరలోకమునుండి పరిపాలించే నిజమైన ప్రభుత్వం. అందుకే అది “పరలోక రాజ్యము” అని పిలువబడింది. “సమాధానకర్తయగు అధిపతి”యైన యేసును ఆయన తండ్రే దాని పరిపాలకునిగా నియమించాడు.—మత్తయి 10:7; యెషయా 9:6, 7; కీర్తన 72:1-8.

దేవుని రాజ్యం వచ్చినప్పుడు ద్వేషభరితమైన ఈ లోకానికి ఏమి సంభవిస్తుంది? “ఆ రాజ్యము” ఈ లోకంలోని అనైతిక ప్రభుత్వాలన్నింటినీ “పగులగొట్టి నిర్మూలము చేయును.” (దానియేలు 2:44) ‘లోకము . . . గతించిపోవుచున్నది గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును’ అని బైబిలు వివరిస్తుంది.—1 యోహాను 2:17.

దేవుని క్రొత్త లోకాన్ని గురించి బైబిలు ఇలా చెబుతుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:9-11, 29; సామెతలు 2:21, 22) అది ఎంత సంతోషకరమైన సమయమై ఉంటుందో! “మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రకటన 21:4) చనిపోయినవాళ్ళు కూడా మళ్ళీ జీవిస్తారు. భూమ్యంతా అక్షరార్థంగానే పరదైసుగా రూపాంతరం చెందుతుంది.—యెషయా 11:6-9; 35:1, 2; లూకా 23:43; అపొస్తలుల కార్యములు 24:15.

దేవుని క్రొత్త లోకంలో మనం జీవించాలంటే, దేవుడు మనకు బోధిస్తున్నట్లుగానే మనం ఒకరినొకరు ప్రేమించాలి. (1 థెస్సలొనీకయులు 4:9) “బైబిలు వాగ్దానం చేస్తున్నట్లు, మానవులందరూ ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకుని ఉండే సమయం కోసం ఎదురు చూస్తున్నాను” అని ఒక ప్రాచ్య దేశంలోని ఒక బైబిలు విద్యార్థి అన్నాడు. దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడనే నిశ్చయతను మనం కలిగి ఉండవచ్చు! “నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను” అని ఆయన అంటున్నాడు.—యెషయా 46:11.

అయితే, దేవుని రాజ్యం క్రింద ఆశీర్వాదాలను అనుభవించాలంటే, ప్రపంచవ్యాప్తంగానున్న యథార్థహృదయులైన లక్షలాది మంది ప్రజల్లాగే మీరూ బైబిలు జ్ఞానాన్ని తప్పనిసరిగా సంపాదించుకోవాలి. (యోహాను 17:3) దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల బ్రోషూర్‌ మీకు సహాయపడుతుంది. దీని ముందటి పేజీలో ఇవ్వబడిన కూపన్‌ను పూరించి మీకు సమీపంలో ఉండే చిరునామాకు పంపించి ఆ బ్రోషూర్‌ ప్రతిని పొందండి.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

Sniper and funeral in Bosnia: Reuters/Corbis-Bettmann