కంటెంట్‌కు వెళ్లు

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?

“క్రైస్తవేతరుల్లోని అనేకులు కూడా ఆయన ఒక గొప్ప జ్ఞానవంతుడైన బోధకుడు అని విశ్వసిస్తారు. జీవించినవారిలోకెల్లా, ఇతరులను అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరనడంలో సందేహం లేదు.” (ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా) ఇంతకూ “ఆయన” ఎవరు? ఆయనే క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసుక్రీస్తు. ఆయన గురించి మీకు తెలుసా? ఆయన మీ జీవితాన్ని ఏ విధంగానైనా ప్రభావితం చేస్తాడా?

యేసు పరిచర్యకు సంబంధించిన సంఘటనలు, బైబిలులో సువార్తలు అని పిలువబడే నాలుగు చారిత్రాత్మక పుస్తకాల్లో నమోదు చేయబడి ఉన్నాయి. ఆ నివేదికలు వాస్తవమైనవేనా? వాటిని విశ్లేషించిన తర్వాత, ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారుడైన విల్‌ డ్యూరాంట్‌ ఇలా వ్రాశాడు: “ఒకే తరంలోని కొద్దిమంది సామాన్యులైన మనుష్యులే అంత శక్తివంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని, అంత ఉన్నతమైన నైతిక సూత్రావళిని, అంత ప్రేరణాత్మకమైన మానవ సహోదరత్వ సిద్ధాంతాన్ని కనిపెట్టారంటే అది సువార్తల్లో వ్రాయబడివున్న అద్భుతాల కంటే నమ్మడానికి కష్టమైన అద్భుతం.”

అయితే ప్రాచ్య దేశాల్లో, మరితర దేశాల్లో కోట్లాదిమందికి యేసుక్రీస్తు అపరిచితుడు. ఆయన ఒకప్పుడు జీవించాడని వారు నమ్ముతుండవచ్చు, కానీ ఆయన వారి జీవితాలను ప్రభావితం చేయగలడని మాత్రం వారు తలంచరు. ఇతరులు, యేసు అనుచరులమని చెప్పుకునే ప్రజలు చేసిన పనుల కారణంగా ఆయన తమ అవధానాన్ని పొందడానికి అర్హుడు కాదని భావిస్తారు. ‘జపాన్‌లోని ఇతర నగరాల్లో కంటే క్రైస్తవులు ఎక్కువగా ఉన్న నగరమైన నాగసాకిపైనే వారు అణుబాంబు వేశారు’ అని జపాన్‌లోని కొందరు అంటారు.

అయితే వైద్యుడు రాసిచ్చిన మందులను ఆయన సలహామేరకు వేసుకోని రోగి అనారోగ్యానికి మీరు వైద్యుడ్ని నిందిస్తారా? ఎంతమాత్రం అలా చేయరు. క్రైస్తవమత సామ్రాజ్యంలోని ప్రజలు తమ అనుదిన సమస్యలను అధిగమించడానికి యేసు ఇచ్చిన సలహాను ఎంతోకాలంగా అలక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఆయనిచ్చిన సలహాలను అనుసరించని, క్రైస్తవులమని చెప్పుకునే ప్రజల కారణంగా యేసును తిరస్కరించే బదులు, ఆయన గురించి మీరే స్వయంగా ఎందుకు తెలుసుకోకూడదు? బైబిలు చదివి, యేసు నిజంగా ఎవరు, చివరికి ఆయన మీ జీవితాన్ని ఎలా మార్చగలడు అనే విషయాలను తెలుసుకోండి.

ప్రేమ​—⁠ఆయన సలహా

యేసుక్రీస్తు దాదాపు 2,000 సంవత్సరాల క్రితం పాలస్తీనాలో నివసించిన ఒక గొప్ప బోధకుడు. ఆయన బాల్యం గురించి ఎక్కువ వివరాలు తెలియవు. (మత్తయి 1, 2 అధ్యాయాలు; లూకా 1, 2 అధ్యాయాలు) యేసు 30 సంవత్సరాల వయస్సులో “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు” తన పరిచర్యను ప్రారంభించాడు. (యోహాను 18:​37, 38; లూకా 3:​21-23) యేసు జీవితం గురించి నివేదించిన చారిత్రాత్మక నివేదకులు నలుగురూ, ఆయన తన భూజీవితంలో చివరి మూడున్నర సంవత్సరాలలో చేసిన బహిరంగ పరిచర్యపై అవధానముంచారు.

యేసు తన పరిచర్య కాలంలో, తమ జీవితాల్లోని వివిధ సమస్యలతో వ్యవహరించేందుకు సహాయపడే కీలకమైన విషయాన్ని తన శిష్యులకు తెలియజేశాడు. ఏమిటా కీలకమైన విషయం? అదే ప్రేమ. కొండమీది ప్రసంగం అని పిలువబడే చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రసంగంలో, తోటి మానవులను ఎలా ప్రేమించాలో యేసు తన శిష్యులకు నేర్పించాడు. “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని ఆయన చెప్పాడు. (మత్తయి 7:​12) ఇది బంగారు సూత్రం అని పిలువబడుతుంది. ఇక్కడ యేసు ప్రస్తావించిన “మనుష్యుల”లో ఒకరి శత్రువులు కూడా ఉండవచ్చు. అదే ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” (మత్తయి 5:​44) అలాంటి ప్రేమ నేడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించదంటారా? హిందూ నాయకుడు మోహన్‌దాస్‌ గాంధీ అలాగే భావించాడు. “క్రీస్తు ఈ కొండమీది ప్రసంగంలో చెప్పిన బోధలను మనం కలిసి అమలు చేస్తే . . . మనం మొత్తం ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించి ఉండేవాళ్ళము” అని ఆయన అన్నట్లు నివేదించబడింది. ప్రేమ గురించి యేసు చేసిన బోధనలను గనుక అన్వయించుకుంటే, అవి మానవజాతి సమస్యలను పరిష్కరించగలవు.

ఆయన ప్రేమ ఆచరణలో

యేసు తాను బోధించినవాటిని ఆచరణలో పెట్టాడు. ఆయన తన అవసరాలకంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి, క్రియల ద్వారా ప్రేమను వ్యక్తం చేశాడు. ఒకరోజు యేసు, ఆయన శిష్యులు భోజనం కూడా చేయకుండా అనేకమంది ప్రజలకు సాక్ష్యమిస్తున్నారు. తన శిష్యులు “కొంచెముసేపు అలసట తీర్చు[కో]”వలసిన అవసరం ఉందని యేసు గమనించాడు కాబట్టి వారు ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు. కానీ ఒక గుంపు వారికంటే ముందువెళ్ళి ఆ ప్రాంతంలో వారి రాక కోసం ఎదురుచూస్తోంది. మీరు యేసు స్థానంలో ఉంటే ఈ పరిస్థితిలో ఎలా ప్రతిస్పందించేవారు? యేసు “వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.” (మార్కు 6:​30-34) ఆయనలోని గాఢమైన కనికరభావం, ఇతరులకు సహాయం చేసేలా ఆయనను కదిలించింది.

ఇతరుల ప్రయోజనార్థం యేసు చేసిన పనులు కేవలం ఆధ్యాత్మిక బోధనలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన ఆచరణాత్మకమైన సహాయాన్ని కూడా చేశాడు. ఉదాహరణకు ఒకసారి పొద్దుపోయే వరకూ తను చెప్పేవి వింటున్న (స్త్రీలు, పిల్లలు కాక) 5,000 మంది పురుషులకు ఆయన ఆహారం అందించాడు. తర్వాత వేరే సందర్భంలో ఆయన మరో 4,000 మందికి ఆహారం ఏర్పాటు చేశాడు. మొదట ప్రస్తావించబడిన సందర్భంలో ఆయన ఐదు రొట్టెలను, రెండు చేపలను ఉపయోగించాడు. ఆ తర్వాతి సందర్భంలో ఆయన ఏడు రొట్టెలను, కొన్ని చిన్న చేపలను ఉపయోగించాడు. (మత్తయి 14:14-21; 15:32-38; మార్కు 6:35-44; 8:​1-9) అవి అద్భుతాలా? అవును ఆయన అద్భుతాలు చేసేవాడు.

యేసు అనేకమంది రోగగ్రస్థులను కూడా బాగుచేశాడు. ఆయన గుడ్డివారిని, కుంటివారిని, కుష్ఠు రోగులను, చెవిటివారిని బాగుచేశాడు. అంతెందుకు, ఆయన మరణించినవారిని పునరుత్థానం కూడా చేశాడు! (లూకా 7:22; యోహాను 11:​30-45) ఒకసారి ఒక కుష్ఠు రోగి ఆయనను ఇలా వేడుకున్నాడు: “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగల[వు].” అప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు? ‘ఆయన చెయ్యిచాపి వానిని ముట్టి, నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాడు.’ (మార్కు 1:​40, 41) ప్రజలకు సహాయం చేయాలనే బలమైన కోరిక యేసును కదిలించింది. అలాంటి అద్భుతాలు చేయడం ద్వారా, ఆయన రోగుల పట్ల తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.

నమ్మశక్యంగా లేదా? కానీ యేసు తన అద్భుతాలలో అధిక శాతాన్ని బహిరంగంగానే చేశాడు. ప్రతి సందర్భంలోనూ ఆయనలో తప్పు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆయన వ్యతిరేకులు కూడా ఆయన అద్భుతాలు చేశాడనే వాస్తవాన్ని కాదనలేక పోయారు. (యోహాను 9:​1-34) అంతేకాకుండా ఆయన చేసిన అద్భుతాలకు ఒక సంకల్పం ఉంది. యేసు, దేవుడు పంపించిన వ్యక్తి అని గుర్తించడానికి అవి ప్రజలకు సహాయపడ్డాయి.​—⁠యోహాను 6:14.

యేసు బోధనలను ఆయన జీవితాన్ని క్లుప్తంగా పరిశీలించడం కూడా ఆయనను మనం ఇష్టపడేటట్లు చేసి, ఆయన ప్రేమను మనం అనుకరించేలా మనల్ని పురికొల్పుతుంది. అయితే యేసు మీ జీవితాన్ని ప్రభావితం చేసేది కేవలం ఆ ఒక్క రీతిలోనే కాదు. ఆయన కేవలం ప్రేమను నేర్పించిన ఒక మంచి బోధకుడు మాత్రమే కాదు. ఆయన తాను మానవునిగా ఈ భూమ్మీదకు రాకముందు దేవుని అద్వితీయ కుమారునిగా ఉన్నానని సూచించాడు. (యోహాను 1:14; 3:16; 8:58; 17:5; 1 యోహాను 4:⁠9) ఆయన మానవ జీవితం ముగిసిన తర్వాత కూడా ఉనికిలో ఉన్నాడు కాబట్టి ఆయన మీకు మరింత ప్రాముఖ్యమైన వ్యక్తి. యేసు పునరుత్థానం చేయబడి ఇప్పుడు దేవుని రాజ్యానికి రాజుగా సింహాసనాసీనుడై ఉన్నాడని బైబిలు చెబుతోంది. (ప్రకటన 11:​15) “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని యేసు అన్నాడు. (యోహాను 17:3; 20:​31) నిజమే, యేసుక్రీస్తు గురించిన జ్ఞానం సంపాదించుకోవడం అంటే పరదైసులో నిరంతర జీవితం! అదెలా సాధ్యం? యేసు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని ఆయనను అనుకరించడానికి ‘క్రీస్తు ప్రేమ మనలను ఎలా బలవంతము చేస్తుందో’ ఎందుకు చూడకూడదు? (2 కొరింథీయులు 5:​14) మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు.​—⁠యోహాను 13:34, 35.

ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి.