యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?
యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?
“నాజీవితం నుండి పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటున్నాను” అంటోంది ఒక అమ్మాయి. నిస్సందేహంగా మీరూ అలాగే అనుకుంటుండవచ్చు. కానీ మీరు మీ జీవితం నుండి “పూర్తి ప్రయోజనం” ఎలా పొందగలుగుతారు? డబ్బు బాగా ఆర్జించి, ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగం కలిగివుండడం ద్వారా అంటే జీవితంలో విజయాన్ని సాధించడం ద్వారా జీవితం నుండి పూర్తి ప్రయోజనం పొందడం సాధ్యమని సమాచార మాధ్యమాలు, మీ తోటివారు, బహుశా మీ టీచర్లు కూడా చెబుతుండవచ్చు!
అయితే, డబ్బుపరంగా విజయం సాధించేందుకు పాటుపడడం కేవలం “గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము” లాంటిదేనని బైబిలు యౌవనస్థులను హెచ్చరిస్తోంది. (ప్రసంగి 4:4) ఒక కారణం ఏమిటంటే, చాలా తక్కువమంది యౌవనస్థులు సంపద, పేరుప్రతిష్ఠలు వంటివాటిని సంపాదించుకోగల్గుతారు. అలా సంపాదించుకున్న వారు కూడా తరచూ ఎంతో నిరాశకు గురవుతుంటారు. “అది ఒక ఖాళీ డబ్బా లాంటిదే, లోపలికి చూస్తే అక్కడేమీ కనిపించదు” అని ప్రతిష్ఠాత్మకమైన ఉన్నత విద్యను పొందడానికి కృషి చేసిన బ్రిటీష్ దేశస్థుడైన ఒక యువకుడు అంటున్నాడు. నిజమే ఉద్యోగం కొన్నిసార్లు సంపదను, గుర్తింపును తీసుకురాగలదు. కాని అది మీ “ఆధ్యాత్మిక అవసరతను” తీర్చలేదు. (మత్తయి 5:3, NW) అంతేగాక, ‘లోకము గతించిపోవుచున్నది’ అని 1 యోహాను 2:17 హెచ్చరిస్తోంది. కాబట్టి, ఈ లోకంలో మీరు ఎలాంటి విజయాన్ని పొందగలిగినా అది క్షణికమే.
అందుకే ప్రసంగి 12:2 యౌవనస్థులను ఇలా పురికొల్పుతోంది: “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.” అవును, మీ జీవితంలో యెహోవా దేవుని సేవ చేయడమే శ్రేష్ఠమైన జీవన విధానం. అయితే ముందుగా, దేవుని సేవ చేయడానికి మీరు అర్హులు కావాలి. ఎలా అర్హులు కావచ్చు? దేవుని సేవ చేయడంలో ఏమి ఇమిడి ఉంది?
యెహోవాసాక్షి అయ్యేందుకు అర్హులు కావడం
మొదటిగా, మీరు దేవుని సేవ చేయాలనే కోరికను ఏర్పరచుకోవాలి, మీ తల్లిదండ్రులు క్రైస్తవులే అయినా మీకు ఆ కోరిక దానంతటదే రాదు. మీ అంతట మీరే యెహోవాతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. “యెహోవాతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రార్థన మీకు సహాయం చేస్తుంది” అని ఒక అమ్మాయి చెబుతోంది.—కీర్తన 62:8; యాకోబు 4:8.
మీరు తీసుకోవలసిన మరో చర్యను రోమీయులు 12:2 ఉన్నతపరుస్తోంది. అదిలా అంటోంది: ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి.’ మీకు బోధించబడిన కొన్నింటిని మీరెప్పుడైనా సందేహించారా? అలాగైతే బైబిలు ఇస్తున్న ఈ పురికొల్పును అనుసరించి, ఆ విషయాలు సత్యమేనని మీకై మీరు ‘పరీక్షించి తెలుసుకోండి!’ మీరే స్వయంగా పరిశోధన చేయండి. బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదవండి. అయితే దేవుని గురించి తెలుసుకోవడమనేది కేవలం మెదడును ఉపయోగించవలసిన ప్రక్రియ మాత్రమే కాదు. మీరు చదువుతున్నది మీ అలంకారిక హృదయంలోకి ఇంకేలా దాన్ని ధ్యానించడానికి సమయం వెచ్చించండి. ఇది, దేవుని పట్ల మీ ప్రేమ అధికమయ్యేలా చేస్తుంది.—కీర్తన 1:2, 3.
తర్వాత, మీరు తెలుసుకుంటున్నదాన్ని అనియతంగా ఇతరులతో, బహుశా మీ తోటి విద్యార్థులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. తర్వాతి మెట్టు, ఇంటింటి ప్రకటనాపనిలో పాల్గొనడం. మీరు ప్రకటనా పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ తోటి విద్యార్థి ఎదురుపడవచ్చు, దానివల్ల మొదట్లో మీరు చాలా గాభరా పడవచ్చు. కానీ ‘సువార్తను గూర్చి సిగ్గుపడవద్దని’ బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (రోమీయులు 1:16) మీరు జీవాన్ని, నిరీక్షణను ఇచ్చే సందేశాన్ని తీసుకువెళ్తున్నారు! సిగ్గుపడడం దేనికి?
ఆపై, మీ తల్లిదండ్రులు గనుక క్రైస్తవులైతే ఈ పనిలో మీరు ఇప్పటికే వాళ్ళ వెంట వెళ్తుండవచ్చు. మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా నిలబడడం కన్నా పత్రికలు, కరపత్రాలు ఇవ్వడం కన్నా ఎక్కువేమైనా చేయగలుగుతున్నారా? గృహస్థులకు ఉపదేశించడానికి బైబిలు ఉపయోగిస్తూ మీరే స్వయంగా మాట్లాడగలుగుతున్నారా? అలా చేయలేకపోతుంటే, మీ తల్లిదండ్రుల నుండి గానీ సంఘంలోని పరిణతి చెందిన సభ్యుల నుండి గానీ సహాయం తీసుకోండి. బాప్తిస్మం పొందని సువార్త ప్రచారకులుగా అర్హులు కావడాన్ని మీ లక్ష్యంగా పెట్టుకోండి!
కొంతకాలానికి మీరు సమర్పించుకోవడానికి అంటే ఇప్పటి నుండి దేవుని సేవ చేస్తానని ఆయనకు ప్రమాణం చేయడానికి కదిలించబడతారు. (రోమీయులు 12:1) అయితే, సమర్పణ ఎవరికీ తెలియకుండా ముగించుకునే వ్యక్తిగత వ్యవహారం కాదు. ప్రతి ఒక్కరూ ‘రక్షణ కలుగునట్లు నోటితో [“బహిరంగంగా,” NW] ఒప్పుకోవాలని’ దేవుడు కోరుతున్నాడు. (రోమీయులు 10:10) బాప్తిస్మం సమయంలో, మొదట మీరు మీ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకుంటారు. తర్వాతి చర్య నీటి బాప్తిస్మం. (మత్తయి 28:19, 20) బాప్తిస్మమనేది చాలా గంభీరమైన చర్య అని అంగీకరించవలసిందే. అయితే, దానికి అనుగుణంగా జీవించడానికి నేను విఫలమవుతానేమో అనుకుంటూ వెనుకంజ వేయకండి. శక్తి కోసం మీరు దేవునిపై ఆధారపడితే, మీరు స్థిరంగా నిలబడడానికి సహాయపడే “బలాధిక్యము”ను ఆయన మీకిస్తాడు.—2 కొరింథీయులు 4:7; 1 పేతురు 5:10.
బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు యెహోవాసాక్షుల్లో ఒకరవుతారు. (యెషయా 43:10) మీ జీవితంలో మీరేమి చేస్తారనే దాని మీద ఇది శక్తివంతమైన ప్రభావాన్ని చూపించాలి. సమర్పణలో ‘మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం’ ఇమిడివుంటుంది. (మత్తయి 16:24) మీరు కొన్ని వ్యక్తిగత లక్ష్యాలను, ఆశయాలను వదులుకుని, ‘దేవుని రాజ్యమును మొదట వెదకవచ్చు.’ (మత్తయి 6:33) కాబట్టి సమర్పణ, బాప్తిస్మం దేవుని రాజ్యాన్ని వెదికేందుకు అనేక అవకాశాలను ఇస్తాయి. వాటిలో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.
పూర్తికాలం దేవుని సేవ చేయడానికి అవకాశాలు
● పయినీరు సేవ పూర్తికాలం దేవుని సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. పయినీరు ప్రచారకుడు/రాలు అంటే, సువార్త ప్రకటించడానికి ప్రతి నెల కనీసం 70 గంటలు వెచ్చించడానికి ఏర్పాట్లు చేసుకున్న మాదిరికరమైన, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు/రాలు. క్షేత్రంలో ఎక్కువ సమయం గడపడం మీ ప్రకటనా, బోధనా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. చాలామంది పయినీర్లు, తమ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం పొందిన సాక్షులయ్యేందుకు వారికి సహాయం చేయడంలోని ఆనందాన్ని అనుభవించారు. ఏ లౌకిక ఉద్యోగం మాత్రం దీనంత ఉత్తేజకరంగా సంతృప్తికరంగా ఉండగలదు?
చాలామంది పయినీర్లు తమ జీవనం కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తారు. మరనేకులు వృత్తి విద్యను తమ తల్లిదండ్రుల నుండి గానీ స్కూల్లోగానీ నేర్చుకోవడం ద్వారా ఈ బాధ్యతను చేపట్టడానికి ముందుగా పథకం వేసుకుంటారు. ఉన్నత పాఠశాల విద్య తర్వాత ఏదైనా అనుబంధ శిక్షణ పొందడం ప్రయోజనకరంగా ఉంటుందని మీరూ మీ తల్లిదండ్రులూ భావిస్తే, ధనార్జన కాదు గానీ మీ పరిచర్యకు మద్దతునిచ్చుకుంటూ వీలైతే పూర్తికాల పరిచారకులుగా సేవచేయడం మీ లక్ష్యమై ఉండేలా చూసుకోండి.
అయితే, ఒక పయినీరు జీవితంలో, లౌకిక ఉద్యోగం కాదు గానీ పరిచర్య, అంటే జీవాన్ని పొందడానికి ఇతరులకు సహాయం చేయడం ప్రధాన విషయమై ఉండాలి! పయినీరు సేవ చేయడాన్ని మీ లక్ష్యంగా ఎందుకు చేసుకోకూడదు? పయినీరు సేవ తరచూ ఇతర ఆధిక్యతలకు నడిపిస్తుంది. ఉదాహరణకు, కొంతమంది పయినీర్లు రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలి వెళతారు. మరితరులు వేరే
భాష నేర్చుకుని, స్థానికంగా ఉన్న ఆ భాషా సంఘంలోనైనా లేదా వేరే దేశంలోనైనా సేవచేస్తారు. అవును, పయినీరు సేవ ప్రతిఫలదాయకమైన జీవన విధానం!● క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల దేవుని సేవ చేయడానికి మరో మార్గం. ఈ పాఠశాల యెహోవాకు, ఆయన సంస్థకు మరింత ఎక్కువ ఉపయోగపడేలా క్రైస్తవ దంపతులకు ప్రత్యేక శిక్షణనిస్తుంది. పట్టభద్రులైన వారిలో చాలామందిని తమ దేశంలోనే అవసరం ఎక్కువున్న చోట సేవ చేయడానికి నియమిస్తారు. విదేశాల్లో సేవ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు గలవాళ్లను వేరే దేశంలో సేవ చేయడానికి నియమిస్తారు. పట్టభద్రులు తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తూ మారుమూల ప్రాంతాల్లో పరిచర్యను ప్రారంభించి, దానిని విస్తృతపరుస్తారు.
● ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల అర్హులైన అవివాహితులైన పెద్దలకు, పరిచర్య సేవకులకు తర్ఫీదునిచ్చేందుకు స్థాపించబడింది. ఎంతో ఏకాగ్రత అవసరమైన, ఎనిమిది వారాలపాటు సాగే ఈ కోర్సులో పెద్దల, పరిచర్య సేవకుల బాధ్యతలకూ సంస్థకూ బహిరంగంగా ప్రసంగించడానికీ సంబంధించిన విషయాలు ఉంటాయి. కొందరు తమ స్వదేశంలోనే సేవ చేయడానికి నియమించబడతారు, ఇతరులకు విదేశీ సేవా నియామకాలు ఇవ్వబడతాయి.
● బేతేలు సేవ చేయడంలో, యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లోని ఒకదానిలో స్వచ్ఛంద సేవకుడిగా సేవ చేయడం ఇమిడి ఉంటుంది. బేతేలు కుటుంబంలోని కొంతమంది సభ్యులు బైబిలు సాహిత్యాన్ని ఉత్పన్నం చేయడంలో ప్రత్యక్షంగా భాగం వహిస్తారు. మరితరులకు భవనాలూ పరికరాల బాగోగులను చూసుకోవడం, బేతేలు కుటుంబపు భౌతికావసరాల గురించి శ్రద్ధ వహించడం వంటి ఇతర నియామకాలు ఇవ్వబడతాయి. అన్ని నియామకాలూ యెహోవా సేవలో పరిశుద్ధమైన ఆధిక్యతలే. అంతేగాక, బేతేలులో ఉండేవారు తాము చేసేదంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సహోదరులనేకులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలుసుకొని ఆనందాన్ని పొందుతారు.
కొన్నిసార్లు ప్రత్యేక నైపుణ్యాలున్న సహోదరులు బేతేలులో సేవ చేయడానికి ఆహ్వానించబడతారు. అయితే, అత్యధికులు అక్కడికి వెళ్ళిన తర్వాతే శిక్షణను పొందుతారు. బేతేలులో ఉండేవారు వస్తుపరమైన ప్రయోజనం కోసం సేవ చేయరు గానీ తాము పొందుతున్న ఆహారం, వసతి, వ్యక్తిగత ఖర్చుల కోసం ఇవ్వబడే కొంత డబ్బు వంటివాటితో తృప్తిపొందుతారు. యౌవనస్థుడైన ఒక బేతేలు కుటుంబ సభ్యుడు తన సేవను ఈ విధంగా వర్ణిస్తున్నాడు: “బేతేలు సేవ అద్భుతంగా ఉంటుంది! దినచర్య ఎంతో సవాలుదాయకంగా ఉంటుంది, కానీ ఇక్కడ సేవ చేస్తూ నేనెన్నో ఆశీర్వాదాలు పొందాను.”
● అంతర్జాతీయ సేవ బ్రాంచి కార్యాలయాలను, రాజ్య మందిరాలను నిర్మించడంలో భాగం వహించే అవకాశాన్నిస్తుంది. అలాంటి నిర్మాణపనిలో సహాయం చేసేవారు అంతర్జాతీయ సేవకులని పిలువబడతారు, వీరు ఈ పని నిమిత్తం విదేశాలకు వెళతారు. ఇది ఒక విధమైన పరిశుద్ధ సేవ, అంటే సొలొమోను మందిరాన్ని నిర్మించినవారి పనిలాంటిదే. (1 రాజులు 8:13-18) బేతేలు కుటుంబం కోసం చేయబడే ఏర్పాట్లవంటివే అంతర్జాతీయ సేవకుల అవసరాలను చూసుకోవడానికీ చేయబడతాయి. యెహోవా స్తుతించబడేలా, ఈ విధమైన సేవ చేస్తున్న సహోదర సహోదరీలది ఎంతటి ఆధిక్యతో కదా!
పూర్ణాత్మతో యెహోవా సేవ చేయండి
మీ జీవితంలో యెహోవా సేవ చేయడమే సర్వశ్రేష్ఠమైన జీవన విధానం. దేవునికి పూర్తికాల సేవ చేయాలనే వ్యక్తిగత లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం గురించి ఎందుకు ఆలోచించకూడదు? పూర్తికాల సేవ గురించి మీ తల్లిదండ్రులతో, మీ సంఘంలోని పెద్దలతో, మీ ప్రాంతీయ పైవిచారణకర్తతో చర్చించండి. బేతేలుకు గానీ క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాలకు గానీ ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు గానీ వెళ్ళాలన్న ఆసక్తి ఉంటే ప్రాంతీయ సమావేశాల్లోనూ జిల్లా సమావేశాల్లోనూ ప్రత్యేకంగా వారి కోసం జరిగే కూటాలకు హాజరవ్వండి.
నిజమే, పూర్తికాల సేవ చేయడానికి అందరూ అర్హులు కాకపోవచ్చు లేదా చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు ఒకరు చేయగల దానిని పరిమితం చేయవచ్చు. అయినప్పటికీ, సమర్పిత క్రైస్తవులందరూ, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను” బైబిలు ఆజ్ఞను లక్ష్యపెట్టాలి. (మత్తయి 22:37) మీ పరిస్థితులు అనుమతిస్తున్నంత మేరకు మీరు చేయగలిగినంతా చేయాలని యెహోవా ఆశిస్తున్నాడు. కాబట్టి, మీ పరిస్థితి ఏదైనప్పటికీ యెహోవా సేవ చేయడాన్ని మీ జీవితంలో ప్రధాన విషయంగా చేసుకోండి. వాస్తవికమైన దైవపరిపాలనా లక్ష్యాలను పెట్టుకోండి. అవును, ‘మీ బాల్యదినములందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి.’ అలా చేసినందుకు మీరు శాశ్వత కాలం ఆశీర్వదించబడతారు!
ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుంచి ఉల్లేఖించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆధునిక ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము—రెఫరెన్సులతో కూడినది నుంచి అనువదించబడిందని సూచిస్తుంది.