శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
మీరు ఈ కరపత్రముపైనున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, మీలో ఎలాంటి భావనలు చోటుచేసుకున్నాయి? అక్కడ కనబడుతున్న సమాధానము, సంతోషము, సౌభాగ్యాలను మీ హృదయము ఆశించదా? నిశ్చయంగా ఆశిస్తుంది. అయితే ఈ పరిస్థితులు ఎప్పటికైనా భూమిపై ఉంటాయని నమ్మటం కేవలం కల లేక భ్రమయేనా?
బహుశా అనేకమంది అలాగే అనుకుంటారు. నేడు పేర్కొనడానికి ఉన్న కొన్ని వాస్తవాలేమనగా యుద్ధము, నేరము, ఆకలి, వ్యాధి, వృద్ధాప్యము. అయినా నిరీక్షించటానికి కారణమున్నది. భవిష్యత్తునుగూర్చి బైబిలు ఇలా చెబుతుంది: “అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము. వాటియందు నీతినివసించును.”—2 పేతురు 3:13; యెషయా 65:17.
బైబిలు ప్రకారము ఈ “క్రొత్త ఆకాశము” “క్రొత్త భూమి” అంటే క్రొత్త భౌతిక ఆకాశము, అక్షరార్థమైన క్రొత్త భూమి కాదు. భౌతికమైన భూమి, ఆకాశములు పరిపూర్ణముగా సృష్టించబడ్డాయి, అవి నిరంతరము నిలుచునని కూడా బైబిలు చూపుతుంది. (కీర్తన 89:36, 37; 104:5) “క్రొత్త భూమి” అనేది భూమిపై జీవించే నీతియుక్త ప్రజానీకము. “క్రొత్త ఆకాశములు”, ఈ భూసమాజ ప్రజలపై పాలించే పరిపూర్ణమైన పరలోక రాజ్యము, లేక ప్రభుత్వము. అయితే ఈ “క్రొత్త భూమి,” లేక మహిమాయుక్తమైన నూతన లోకము సాధ్యమని నమ్ముట వాస్తవికతతో కూడినదా?
సరే, అటువంటి కోరదగిన పరిస్థితులు ఈ భూమియెడల దేవునియొక్క ఆదిసంకల్పములో భాగమైయున్నవనే వాస్తవాన్ని పరిశీలించండి. మొదటి మానవ దంపతులను ఆయన ఏదెను అను భూపరదైసులో ఉంచి, “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అనే అద్భుతకరమైన పనిని వారికి అప్పగించాడు. (ఆదికాండము 1:28) అవును, వారు పిల్లలను కని, చివరకు వారి పరదైసును భూమంతటికి వ్యాపింపజేయటం వారియెడల దేవుని సంకల్పం. అయితే తదుపరి వారు దేవునికి అవిధేయులగుటకై ఎంచుకొని, తద్వారా నిరంతరము జీవించుటకు అనర్హులైనను, దేవుని ఆదిసంకల్పం మారలేదు. అది నూతన లోకములో నిశ్చయంగా నెరవేరవలసి ఉంది!—యెషయా 55:11.
నిజానికి మీరు ప్రభువు ప్రార్థనను చేసేటప్పుడు, లేదా మా తండ్రీ అని దేవుని రాజ్యముకొరకు ప్రార్థించేటప్పుడు, ఆయన పరలోక ప్రభుత్వము భూమిమీదనున్న దుష్టత్వమును తీసివేసి ఈ నూతన లోకమును పరిపాలించనీయమని మీరు ప్రార్థిస్తున్నారు. (మత్తయి 6:9, 10) “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు,” అని ఆయన వాక్యము వాగ్దానము చేస్తున్నందున ఆ ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని మనము నమ్మకముంచగలము.—కీర్తన 37:29.
దేవుని నూతన లోకములో జీవితము
దేవుని రాజ్యము దేవుడు మొదట తన ప్రజలు భూమిపై అనుభవించడానికి సంకల్పించిన దానినంతటిని నెరవేర్చి, సాటిలేని భూదీవెనలను అనుగ్రహించును. ద్వేషము, దురభిమానములు సమసిపోవును. చివరకు భూమిపైనున్న ప్రతిఒక్కరు అందరికి నిజమైన స్నేహితులగుదురు. బైబిలులో దేవుడు ‘తాను భూదిగంతములవరకు యుద్ధములను మాన్పుతానని’ వాగ్దానము చేస్తున్నాడు. “జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—కీర్తన 46:9; యెషయా 2:4.
క్రమేణ భూమి యావత్తు వనమువంటి పరదైసుగా మార్చబడుతుంది. బైబిలు ఇలా చెబుతుంది: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును . . . అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును.”—యెషయా 35:1, 6, 7.
పరదైసు భూమిపై సంతోషించుటకు ప్రతివిధమైన కారణముండును. ఆహారం లేనందువలన ప్రజలిక ఎన్నటికి ఆకలిగొనరు. “అప్పుడు భూమి దాని ఫలములిచ్చును” అని బైబిలు చెబుతుంది. (కీర్తన 67:6; 72:16) మన సృష్టికర్త ప్రమాణము చేస్తున్నట్లు, ప్రతిఒక్కరు వారి వారి ప్రయాసమునకు తగిన ఫలమును అనుభవిస్తారు: “ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. . . . వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు.”—యెషయా 65:21, 22.
దేవుని నూతన లోకములో ఇక ఎంత మాత్రము ప్రజలు పెద్ద పెద్ద అపార్టుమెంటు బిల్డింగులలో లేక దురావస్థలోనున్న మురికివాడలలో క్రిక్కిరిసి ఉండరు. ఎందుకనగా దేవుని సంకల్పము ఇలా ఉన్నది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. . . . వారు కట్టుకొన్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు.” బైబిలు ఇంకా ఇలా వాగ్దానం చేస్తుంది: “వారు వృథాగా ప్రయాసపడరు.” (యెషయా 65:21-23) అలా ప్రజలు ఫలభరితమైన, తృప్తికరమైన పనిని కలిగి ఉంటారు. జీవితం విసుకుగా ఉండదు.
సకాలంలో, దేవుని రాజ్యము ఏదెను వనములో ఉన్నట్లు జంతువుల మధ్యనూ, జంతువులు మరియు మనుష్యులకు మధ్యనూ సమాధానకర సంబంధాలను తిరిగి నెలకొల్పును. బైబిలు ఇలా చెబుతుంది: “తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.”—యెషయా 11:6-9; హూషేయ 2:18.
ఒక్కసారి, పరదైసు భూమిలో సమస్త వ్యాధులు, భౌతిక వైకల్యత కూడ స్వస్థపరచబడుటను ఊహించండి! దేవుని వాక్యము ఇలా అభయమిస్తుంది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) “ఆయన [దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”—ప్రకటన 21:4.
అది మీకు ఎలా లభ్యమగును
నిశ్చయంగా నీతియుక్తమైన నూతన లోకంలో జీవితాన్ని గూర్చి దేవుడిచ్చే వాగ్దానములనుబట్టి నీ హృదయము కదలింపబడాలి. అలాంటి ఆశీర్వాదముల నెరవేర్పు నమ్మశక్యముగాని విపరీతమైన మంచి అని కొందరు పరిగణించినను, మన ప్రేమగల సృష్టికర్త హస్తమునుండి వచ్చుటకు అవి మహోన్నతమైనవేమీ కాదు.—కీర్తన 145:16; మీకా 4:4.
నిజమే, భూమిమీదికి రానైయున్న ఆ పరదైసులో మనం జీవించాలంటే మనము గైకొనవలసిన కొన్ని విధులున్నవి. దేవునికి తాను చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రధానమైనదానిని యేసు చూపించాడు. అదేమనగా: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.
కాబట్టి మనము నిజంగా దేవుని నూతన లోకములో జీవించాలనుకుంటే, మొదట మనము దేవుని చిత్తాన్ని తప్పక నేర్చుకొని, దాన్ని చెయ్యాలి. ఎందుకంటే: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని,” మన ప్రేమగల సృష్టికర్త కుమ్మరించే ఆశీర్వాదములను అనుభవించడానికి “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అనునది మాత్రము వాస్తవము.—1 యోహాను 2:17.
ప్రత్యేకముగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి.