కంటెంట్‌కు వెళ్లు

శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా?

శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా?

శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా?

ఉన్నట్లైతే—

ఆయన దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడు?

జీవితం ఎన్నడైనా కష్టాలు లేకుండా ఉంటుందా?

దేవుడే ఉంటే, చరిత్రంతటిలోనూ ఇన్ని ఘోరమైన విషయాలు ప్రజలకు జరిగేలా ఎందుకు అనుమతించాడు? ఆయనకు మన ఎడల నిజంగా శ్రద్ధవుంటే, దుష్టత్వమూ బాధలూ ఇలా కొనసాగేందుకు ఎందుకు అనుమతిస్తున్నాడు?

1, 2. (ఎ) మొదటి పేరాలో ఇవ్వబడిన ప్రశ్నలు మీరు ప్రశ్నించినవేనా? (బి) ఏ పరిస్థితులు ప్రజలు అలాంటి ప్రశ్నలను అడిగేలా చేస్తాయి?

2 అన్ని ప్రాంతాల్లోని ఆలోచనాపరులైన వ్యక్తులు ఆ ప్రశ్నలను అడుగుతారు. అలా అడిగేందుకు మంచి కారణం ఉంది ఎందుకంటే దారుణమైన యుద్ధాలు, ఆహారకొరతలు, పేదరికం, నేరం, రోగంవల్ల మానవ కుటుంబం అనేక శతాబ్దాలుగా ఎంతో బాధపడుతూ వచ్చింది. అన్యాయమూ అణచివేత కూడా ఎంతో వేదనకు కారణమయ్యాయి. వరదలూ భూకంపాలు వంటి విపత్తుల విషయం కూడా అంతే. తరచూ, అమాయక ప్రజలు తామేతప్పూ చేయకుండానే బాధననుభవిస్తుంటారు. మనకేం జరిగినా దేవుడు పట్టించుకోడనేందుకు ఇదంతా ఓ రుజువేనా? మంచి లోకం, అంటే ఈ భూమ్మీద ఏ కష్టాలూ లేకుండా జీవితాన్ని మనం పూర్తిగా నిజంగా ఆనందించగల లోకం వస్తుందనేందుకు యథార్థమైన ఆశ ఏదైనా ఉందా?

3. ఈ ప్రశ్నలకు జవాబులను కనుగొనడం ఎందుకు సమంజసం?

3 అలాంటి ప్రశ్నలకు నిజమైన, సంతృప్తికరమైన జవాబులు అవసరం. “మనం బాధననుభవించాలన్నది దేవుని చిత్తం” లేక “ఇవి మనం అర్థం చేసుకోలేని విషయాలు” అని చెప్పడం మాత్రం నిజమైన సంతృప్తికరమైన సమాధానాలు కావు. ఇంతటి అత్యద్భుత క్రమంలో ఉన్న విశ్వాన్ని దేవుడు సృష్టించివుంటే, మానవులు ఇంత అస్తవ్యస్తమయ్యేలా అనుమతించడానికి కూడా కారణముండేవుంటుంది. మరి అలాంటి సృష్టికర్త తాను దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడో తన స్వంత మానవ సృష్టియైన మనకు చెప్పేంత శ్రద్ధను కల్గివుండడా? ఆయనకు శక్తివుంటే, తగిన కాలంలో ఈ చెడు పరిస్థితులను ఆయన సరిచేయడం సమంజసం కాదా? ప్రేమగల ఏ తండ్రైనా తన పిల్లలకొరకు ఏదైనా చేయగల్గితే తప్పకుండా చేస్తాడు. సర్వశక్తిగల, సర్వజ్ఞానియైన ప్రేమగల సృష్టికర్త తన స్వంత భూ సంతానానికి దానికంటే ఎక్కువే చేస్తాడన్నది నిశ్చయం.

జవాబునివ్వడానికి సరైన వ్యక్తి ఎవరు?

4. దేవుడు దుష్టత్వాన్ని అనుమతించినందుకు గల కారణాన్ని మనకు చెప్పేందుకు ఎవరు మంచి స్థానంలో ఉన్నారు?

4 దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబునివ్వడానికి సరైన వ్యక్తి ఎవరు? మీమీద ఏదో నేరం మోపబడిందనుకోండి, దాని విషయంలో ఇతరులు చెబుతున్న వాటిని మాత్రమే ప్రజలు వినాలని మీరు కోరుకుంటారా? లేక యథార్థంగా తెలుసుకోవాలనుకున్నవారి మనస్సులోని అపోహలను సరిచేసేందుకుగాను మీరే మాట్లాడాలనుకుంటారా? దుష్టత్వాన్ని అనుమతించినందుకు దేవుడే నిందించబడుతున్నాడు. ఆయన దాన్నెందుకు అనుమతిస్తున్నాడో ఆయనకే బాగా తెలుసు కనుక తన పక్షాన తననే మాట్లాడనివ్వడం న్యాయం కాదా? ఈ విషయాల్లో మానవులకు తరచూ విరుద్ధమైన ఆలోచనలున్నాయి కనుక జవాబు కొరకు వారివైపు చూడడం ఎన్నటికీ సంతృప్తికరంగా ఉండదు.

5. దేవుడు బైబిలుకు మూలం అని నమ్మడం సహేతుకమేనా? (2 పేతురు 1:21; హబక్కూకు 2:2)

5 జవాబులను దేవుడు ఎక్కడ అందిస్తున్నాడు? ఏం జరిగిందీ ఎందుకు జరిగింది అనే విషయాలను చెప్పేందుకు ఆధారంగా సృష్టికర్త కేవలం ఒక్క పుస్తకాన్నే అనుమతించాడు. ఆ ఆధారమే బైబిలు, అది ఇలా చెబుతోంది: ‘ప్రతి లేఖనమును దైవావేశమువలన కలిగెను.’ (2 తిమోతి 3:16) * ఇది ఆశ్చర్యాన్ని కల్గించకూడదు, ఎందుకంటే ఆశ్చర్యకరమైన విశ్వాన్ని సృష్టించగల శక్తి దేవునికి ఉన్నట్లైతే, ఆయన ఓ పుస్తక రచయిత తప్పక కాగలడు. మానవమాత్రులు, మీ రేడియో దూరదర్శనిలలోకి స్వరాలనూ ఆలోచనలనూ చిత్రాలను సహితం అదృశ్యమైన గాలి తరంగాల ద్వారా పంపించగలరు. కనుక, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త తన ఆలోచనలను నమ్మకమైన మానవ రచయితలకు తెలియజేసి, వారు దాన్ని సరిగ్గా వ్రాసేలా చూడడం ఆయనకు పెద్ద పనేమీ కాదు. అందుకనే అపొస్తలుడైన పౌలు, “మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి” అని నమ్మకంతో చెప్పగలిగాడు.—1 థెస్సలొనీకయులు 2:13.

6. బైబిలు చరిత్ర ఎంత వెనుకకు వెళుతుంది, కాబట్టి అది మనకు ఏ సమాచారాన్ని అందించగలదు? (లూకా 1:1-4; లూకా 3:23-38 గమనించండి.)

6 బహుశ మీరు బైబిలును ఎన్నడూ పరిశీలించివుండరు. అయినప్పటికీ, ఇప్పుడున్న వాటిలోకెల్లా అతి సంపూర్ణమైనది, కచ్చితమైన తేదిలనిచ్చే చారిత్రాత్మకమైన రికార్డు ఉన్న పుస్తకం అదే అని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు. ఓ వైద్యుడూ మొదటి శతాబ్ద చరిత్రకారుడూ అయిన లూకా, నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో అంచెలంచెలుగా పేరు పేరు వారీగా నజరేయుడైన యేసు వంశస్థుల జాడను మొదటి మానవుని వరకూ కనుగొనగలిగాడు. బైబిలు మానవ ఉనికి యొక్క ప్రారంభంవరకు వెళుతుంది కనుక, దుష్టత్వానికి ఎవరు నిందార్హులు, దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడూ అది ఎలా తీసివేయబడుతుంది అన్న విషయాలను అది మనకు చెప్పగలదు.

దేవుడు నిందార్హుడా?

7. తప్పులు జరిగినప్పుడు ఎవరిని నిందించాలి?

7 వేరెవరో చేసిన నేరానికి మిమ్మల్ని నిందిస్తే మీరెలా భావిస్తారు? అది చాలా అన్యాయమని అనుకుంటారు కదా. న్యాయంగా, తప్పిదస్తులు శిక్షించబడాలి అలాగే అమాయకులు నిందనుండి విడిపించబడాలి. చాలా రద్దీగా ఉన్న నాలుగు రోడ్డుల కూడలిలో వాహనాన్ని నడిపించే వ్యక్తి ఆగమన్న చిహ్నాన్ని అలక్ష్యం చేసి దారుణమైన ప్రమాదానికి గురౌతే, ఆ తప్పు నియమానిది కాదు. ఓ వ్యక్తి తిండిపోతై, అమితంగా తినడం వల్ల ఆరోగ్యం పాడుచేసుకుంటే, ఆహారాన్ని ఉత్పత్తి చేసిన రైతు తప్పు కాదు. పెంపకం మంచిదైనప్పటికీ, ఓ యువకుడు ఇల్లు విడిచి వాళ్ల నాన్నగారి మంచి సలహాలను అలక్ష్యం చేసి కష్టాల్లో చిక్కుకుంటే, ఆ తండ్రి నిందితుడు కాదు. అలాంటప్పుడు, మానవజాతి తప్పు చేస్తే పరలోకపు తండ్రియైన దేవునిని ఎందుకు నిందించాలి? ఎవరిని నిందించాలో వారినే, అంటే తప్పుచేసినవారినే నిందించాలి, కదా?

8. చెడు జరిగిందని దేవున్ని నిందించినట్లయితే ఏ విరుద్ధత కనిపిస్తుంది?

8 అంతేకాకుండా పరిశీలించాల్సిన విషయం మరొకటి ఉంది. ఆహార కొరతలవల్ల పస్తులుండడంవంటి వాటికి మనం దేవున్ని నిందించినట్లైతే అనేక దేశాల్లోని ఎంతో అధిక పంటలను ఉత్పత్తిచేసే సారవంతమైన పొలాలకూ ఆర్కెడ్లకూ ఎవరికి ఘనతనివ్వాలి? రోగానికి మనం దేవున్ని నిందిస్తే, శరీరంలోని అద్భుతమైన స్వస్థతనొందే వ్యవస్థకు ఘనతను ఎవరికి ఇస్తాము? పట్టణంలోని మురికివాడకు మనం దేవున్ని నిందిస్తే, మహా ఠీవియైన పర్వతాలకు, నిర్మలమైన సరస్సులకు, ఆహ్లాదకరమైన పూలు అందమైన చెట్లకు ఘనతను ఎవరికిస్తారు? ప్రపంచ కష్టాలకు మనం దేవున్ని నిందించి ఆ తర్వాత ఆయన భూమ్మీద చేసే మంచి వాటికొరకు ఆయనకు ఘనతనివ్వడం స్పష్టంగా ఒకదానికొకటి విరుద్ధమైనవే. ప్రేమగల దేవుడు ఒకేసారి మంచి చెడులను కలిగించడు.

9. మానవులు తప్పుడు పనులు చేస్తున్నారు కదాని దేవుడు లేడు అనడం సమంజసమేనా? (యెషయా 45:18)

9 దేవుడు లేడు అనడం సమస్యను మరింత జటిలపరుస్తుంది. ఈ భూమీ దానిలోని అద్భుతమైన జీవరాసులు వాటంతటవే సంభవించాయని విశ్వసించడం వాస్తవాలను అలక్ష్యం చేయడమే. వాస్తవమేంటంటే, జీవాన్ని పోషించేందుకు భూమే ఏ ఇంటికన్నా ఎంతో శ్రేష్ఠంగా సిద్ధంచేయబడి ఉంది, అయితే ప్రతి ఇంటిని నిర్మించడం వెనుకా ఓ తెలివిగల రూపనిర్ణేతా నిర్మాణకుడూ ఉన్నారు. మరి జీవాన్ని పోషించగల గాలి, నేల, నీరు వంటి ఎంతో అద్భుతమైన వ్యవస్థలున్న ఈ గ్రహం విషయమేమిటి? బైబిలు సహేతుకంగా ఇలా చెబుతోంది: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:3) నిజమే, మానవులు చెడుపనులు చేస్తున్నారు కనుక దేవుడు లేడు అని కొందరు నిర్ధారిస్తారు. అయితే, ఇది ఎలా ఉంటుందంటే, ఇళ్లలో ఉన్నవారు చెడుపనులు చేస్తున్నారు కనుక వాటికి రూపనిర్ణేతలు గానీ నిర్మాణకులు గానీ లేరని చెప్పినట్లుంటుంది. ఓ వ్యక్తి ఏదో తప్పు చేసినందుకు అతనికి తండ్రే లేడు అని కూడా చెప్పినట్లుంటుంది.

10. దుష్టత్వానికి ఎవరిపై మనం ఎక్కువ నిందను వేయవచ్చు?

10 మరి మానవ కుటుంబానికి జరిగిన ఘోరమైన విషయాలకు ఎవరిని నిందించాలి? ఎక్కువవరకు నింద ప్రజలపైనే వేయాలి. మానవ అవినీతి వైఫల్యతలు నేరాలకు కారణమౌతాయి. మానవ గర్వం, స్వార్థం, వివాహా బంధాలు తెగిపోవడాన్ని, ద్వేషం మరియు జాతి దురభిమానాన్ని కలిగిస్తాయి. మానవ పొరపాట్లు అశ్రద్ధ, మురికి, కాలుష్యాన్ని కలిగిస్తాయి. మానవ అహంకారము బుద్ధిహీనత యుద్ధాలను కలిగిస్తాయి అంతేకాకుండా దేశాలన్నీ కూడా యుద్ధాలు చేసేందుకు రాజకీయ నాయకులను గ్రుడ్డిగా అనుసరించినప్పుడు, దానివల్ల వచ్చే బాధలకు వారు కూడా నిందను భరించాల్సివుంటుంది. ఆకలి పేదరికాలు ప్రాముఖ్యంగా మానవ అశ్రద్ధ అత్యాశల ఫలితమే. దీన్ని పరిశీలించండి: ప్రపంచం ఇప్పుడు ప్రతి ఏడాదీ 200 బిలియన్‌ డాలర్లను ఆయుధాలపై ఖర్చు చేస్తోంది. దీన్నంతటినీ, ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకూ సమానంగా ఆహారాన్ని పంచేందుకూ పాడైన గృహాలను తీసివేసేందుకూ వెచ్చించినట్లైతే ఎంత సాధించవచ్చో ఊహించండి!

11. తమ రాజ్యాల సైన్యాలకొరకు మతగురువులు ప్రార్థిస్తారు కనుక ఆ సైన్యాలు చేసే యుద్ధాలకు దేవున్ని నిందించవచ్చా? (యెషయా 1:15; సామెతలు 28:9)

11 మతం పేరట జరిగే తప్పులకు దేవుడు నిందార్హుడు కాడు. ఉదాహరణకు, తమ దేశాల యుద్ధాలపై దేవుని ఆశీర్వాదం కొరకు మతగురువులు ప్రార్థిస్తారు. అయినప్పుటికీ తరచూ, ఒకరినొకరు చంపుకునే ఇరుపక్షాల సైనికులు వేర్వేరు వైపుల్లో ఉన్నప్పటికీ ఒకే మతానికి చెందినవారే! దానికి దేవున్ని నిందించడానికి వీలులేదు, ఎందుకంటే తనను యథార్థంగా సేవించేవారు ‘ఒకరి ఎడల ఒకరు ప్రేమను కల్గివుండాలి’ అని అంటూ, వారు చేసేవాటిని ఆయన ఖండిస్తున్నాడు. (యోహాను 13:34, 35) వారికి ఈ ప్రేమ లేకపోతే అప్పుడు వారు, ‘దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపిన’ కయీను వంటివారని దేవుడు చెబుతున్నాడు. (1 యోహాను 3:10-12) మతవిచారణలో గానీ యుద్ధాల్లో గానీ దేవుని పేరట ప్రజలను చంపడం అన్నది అబద్ధ దేవుళ్లకు పిల్లలను అర్పించే ప్రాచీన ఆచారానికి పోలినది. దాన్ని తాను ‘ఆజ్ఞాపించని తనకు తోచని [మనస్సునకురాని]’ ఆచారమని సర్వోన్నత దేవుడు చెబుతున్నాడు.—యిర్మీయా 7:31.

12. బైబిలులో మతగురువులు, “వేషధారులు” అని ఎందుకు పిలువబడుతున్నారు? (మత్తయి 15:7-9)

12 మతగురువులు రాజకీయాల్లో తలదూర్చడం, యుద్ధాలకు మద్దతునివ్వడం పైగా ప్రపంచ బాధలకు దేవుడు బాధ్యుడనడం లేక నిత్యం అక్షరార్థమైన నరకాగ్నిలో వారిని ఆయన కాలుస్తాడనడం వంటి అబద్ధ బోధలు, వివేకంగల వ్యక్తులకూ దేవునికీ అసహ్యమైనవి. దేవునికి వ్యతిరేకమైన విషయాలను బోధించి అనుసరించే మతగురువులు బైబిల్లో “వేషధారులు” అని చెప్పబడుతున్నారు, మరి అది వారిని గూర్చి ఇలా కూడా చెబుతోంది: “మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడునుగాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.” (మత్తయి 23:27, 28) వాస్తవానికి వేషధారులైన మతనాయకులను గూర్చి “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు” అని యేసు అన్నాడు.—యోహాను 8:44.

13. (ఎ) మానవులేకాక మతనాయకులు సహితం తప్పులు చేసినప్పుడు దేవున్ని నిందించాలా? (బి) అయినప్పటికీ ఏ ప్రశ్నలు ఇంకా అడగవచ్చు?

13 లేదు, మానవులు తాముగా చేసే తప్పులకు దేవున్ని నిందించడానికి వీలులేదు. అంతేకాక తాము దేవున్ని సేవిస్తున్నామని చెప్పుకుంటూ సత్యాన్ని మాట్లాడని లేక ఆచరించని మతగురువులు ఆశీర్వదించిన తప్పుడు విషయాలకు దేవున్ని నిందించడానికి లేదు. అయితే మరి దేవుడు మానవాళిని సృజించిన రీతిలో ఏదైనా లోపముందా? ఆయన మానవజాతికి సరైన ప్రారంభాన్నివ్వలేదా?

పరిపూర్ణ ప్రారంభం

14. దేవుడు మన మొదటి తలిదండ్రులకు ఇచ్చిన ప్రారంభాన్ని గూర్చి వర్ణించండి. (ఆదికాండము 1:26-31; 2:7-9, 15)

14 ఒక వ్యక్తి ఆదికాండము మొదటి రెండు అధ్యాయాలను చదివినప్పుడు, దేవుడు పురుషుని స్త్రీని సృజించినప్పుడు వారికి పరిపూర్ణ ప్రారంభాన్నిచ్చాడన్నది బాగా స్పష్టమౌతుంది. రోగం, మరణం వారిని ఎన్నడూ బాధించకుండేలా ఆయన వారిని పరిపూర్ణ శరీరాలతోనూ మనస్సుతోనూ సృజించాడు. వారి ఇల్లు ఆహ్లాదకరమైన పూలూ చక్కని, రుచికరమైన కూరగాయలూ పళ్లుకాసే చెట్లతో ఓ తోటవంటి ఉద్యానవనం. ఏ కొరతా లేదుగానీ అన్నీ సమృద్ధిగా ఉండేవి. అంతేకాకుండ, దేవుడు మన మొదటి తలిదండ్రుల ముందు ఆసక్తికరమైన పనినీ ప్రేరేపించే లక్ష్యాలనూ ఉంచాడు. పరదైసులోని తోటవంటి ఆ పరిస్థితులనే భూమి అంతటికీ వ్యాపింపజేయమని దేవుడు వారికి ఆదేశించాడు. కాలం గడుస్తున్నకొలదీ, వారికి జన్మించే పరిపూర్ణులైన పిల్లలు ఈ పనిలో వారికి సహాయం చేస్తారు. చివరికి ఆ విధంగా, మానవ కుటుంబం భూ పరదైసును స్వతంత్రించుకుని, నిరంతరం జీవితాన్ని ఆనందిస్తూ అంతేకాకుండా జంతువులను కూడా ప్రేమపూర్వకంగా లోబర్చుకుని పరిపూర్ణ ప్రజల గుంపుగా తయారౌతుంది.

15. మానవ పరిపూర్ణత అంటే ఏమిటి, మరి దాని భావం ఏది కాదు?

15 అయితే విషయాలు ఎందుకు అంత వినాశనకరమయ్యాయి? మొట్టమొదటిగా దేవుడు నిజంగా మానవులను పరిపూర్ణులుగా సృజించకపోవడంవల్లేనా? కాదు, అలా కాదు ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 32:4, “ఆయన కార్యము సంపూర్ణము” అని దేవున్ని గూర్చి అంటోంది. అయినప్పటికీ, మానవ దంపతులకు మానవ పరిపూర్ణత ఉంది అంటే వారికి అన్నీ తెలుసుననీ లేక అన్నీ చేయగలరని లేక ఏ తప్పు చేయలేరని కాదు. పరిపూర్ణ ప్రాణులకు కూడా పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు, భౌతిక పరిమితులున్నాయి. ఆహారం తినకుండా, నీళ్లు త్రాగకుండా, గాలి పీల్చకుండా ఉంటే వారు చనిపోయివుండేవారు. లేక దెబ్బ తగలదు అని అనుకుని ఎంతో ఎత్తుగా ఉన్న స్థలంనుండి దూకడం ద్వారా గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని భంగపర్చడం వంటివాటిని చేయలేరు. వారికి మానసిక పరిమితులు కూడా ఉన్నాయి. ఆదాము హవ్వలకు ఏ అనుభవమూ లేదు కనుక ఎంతో నేర్చుకోవాల్సివుంది అన్నది స్పష్టం. అయితే వారు ఎంత నేర్చుకున్నప్పటికీ, తమ సృష్టికర్తకు తెలిసినంతగా వారు ఎన్నడూ తెలుసుకోలేరు. కాబట్టి, వారు పరిపూర్ణులైనప్పటికీ, వారు మానవ పరిధిలో ఉన్నందువల్ల పరిమితులు కలిగి ఉన్నారు. పరిపూర్ణత అంటే వారు పూర్ణులుగా ఉన్నారన్నమాట, అంటే వారి శారీరక మానసిక తయారీలో ఏ పొరపాటూ లేదన్నమాట.

16. ఏ హద్దులుంటే మానవ స్వాతంత్ర్యం బాగా పనిచేసేలా రూపొందించబడింది? (1 పేతురు 2:16)

16 అంతేకాకుండా, దేవుడు మానవులను నైతిక స్వేచ్ఛగల వారిగా సృజించాడు, జంతువుల్లా సహజజ్ఞానం వారిని నడిపించదు. మరి మీరు అలాంటి స్వేచ్ఛను తప్పక మెచ్చుకుంటారు. ఎవరో వచ్చి ప్రతి నిమిషం మీరు చేయాల్సిన వాటన్నింటినీ చెప్పడాన్ని మీరు ఇష్టపడరు. అయితే, ఆ స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ కాదు, అంటే ఏ పరిమితులు లేనిదికాదు కాని అది పాక్షికమైనది. దాన్ని దేవుని నియమాల హద్దుల్లోనే ఉపయోగించాలి. మానవ కుటుంబపు గొప్ప ఆనందాన్ని మనస్సులో ఉంచుకుని రూపొందించబడిన ఆ చక్కని నియమాలు తక్కువగానూ సరళమైనవిగానూ ఉండాలి. తన నియమాలకు గౌరవాన్ని కనపర్చడం మానవులకు అంతులేని ప్రయోజనాలను తెస్తుంది కనుక, వారు తన నియమాలకు విధేయులు కావాలి అని దేవుడు కోరడంలో వారియెడల ఆయనకుగల ప్రేమ కనపర్చబడింది. దేవుని ఎడలా ఆయన నియమాల ఎడలా అగౌరవం వారి ఆనందాన్ని ఆటంకపరుస్తుంది. అది ఏ మంచినీ తీసుకురాదు. నిజానికి, దేవున్ని విడనాడినట్లైతే వాళ్లు ‘నిశ్చయముగా చచ్చెదరు’ అని ఆయన వారిని హెచ్చరించాడు కనుక, అది తప్పకుండా విపత్తును తీసుకొస్తుంది. (ఆదికాండము 2:17) కనుక జీవించి ఉండేందుకు, వారు ఆహారాన్ని తినడం, నీటిని త్రాగడం, గాలిని పీల్చుకోవడం మాత్రమేకాకుండా వారు దేవుని ద్వారా ఆయన నియమాల ద్వారా నడిపించబడాలి.

17. మానవులు దేవునిపై ఆధారపడేందుకుగల మరో ముఖ్యమైన కారణమేమిటి? (కీర్తన 146:3; యిర్మీయా 17:5-9)

17 మన మొదటి తలిదండ్రులు, దేవునిపై ఆధారపడుతూ ఉండేందుకు మరో ప్రాముఖ్యమైన కారణం ఉంది. దేవుడు లేకుండా మానవులు తమ వ్యవహారాలను విజయవంతంగా నడుపుకునేలా వారు సృష్టించబడలేదు. అలా చేసే హక్కును గానీ సామర్థ్యాన్నిగానీ దేవుడు వారికి ఇవ్వలేదు. బైబిలు అన్నట్లుగా, ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’ (యిర్మీయా 10:23) అందుకనే బైబిలు ఇలా ప్రకటిస్తోంది: “తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు.”—సామెతలు 28:26.

దుష్టత్వం ఎలా ప్రారంభమైంది?

18. మన మొదటి తలిదండ్రులు చేసిన పొరపాటేమిటి? (యాకోబు 1:14, 15; కీర్తన 36:9)

18 అంత చక్కగా ప్రారంభమైనప్పటికీ పొరపాటు ఎక్కడ జరిగింది? ఇదే: మన మొదటి తలిదండ్రులైన ఆదాము హవ్వలు, తమ స్వేచ్ఛా ఎంపికను దుర్వినియోగపర్చుకున్నారు. దేవుని నియమానికి విధేయులవ్వడానికి బదులుగా వారు తమ స్వంత దారిన వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. వాస్తవానికి, “మంచి చెడులను ఎరిగినవారై దేవతలవలె” అవుతామని ఆ స్త్రీ అనుకుంది. (ఆదికాండము 3:5) తమ స్వంత ఆలోచనపై ఆధారపడుతూ ఏది మంచి ఏది చెడు అన్నవాటిని తమకైతామే నిర్ణయించుకోవాలనుకున్నారు. అలాంటి ఆలోచనవల్ల వాటిల్లే గొప్ప నష్టాన్ని వారు తెలుసుకోలేకపోయారు. కానీ అదే జరిగింది ఎందుకంటే ‘దేవుడు అబద్ధమాడనేరడు.’ (తీతు 1:2) విడమర్చి చెప్పాలంటే, దేవుని పరిపాలన నుండి వారు తీసివేయబడినప్పుడు, ఓ ఎలక్ట్రిక్‌ ఫ్యాన్‌ ప్లగ్గును తీసివేస్తే ఏమి జరుగుతుందో అదే జరిగింది. ఆ ఫ్యాన్‌ తిరిగేలా చేసే శక్తి నుండి తీసివేసినందువల్ల దాని వేగం మెల్లగా తగ్గి చివరికి పూర్తిగా ఆగిపోతుంది. అలాగే, మొదటి మానవ జంట జీవానికి మూలమైన యెహోవా దేవుని నుండి వేరైన తర్వాత, వారు చివరికి దేవుడు హెచ్చరించినట్లుగానే కృశించి మరణించారు.

19. మానవజాతియంతా ఎందుకు అపరిపూర్ణతలో జన్మించింది? (రోమీయులు 5:12)

19 పిల్లలు కలగకముందే మన మొదటి తలిదండ్రులు ఎదురుతిరిగారు కనుక, మొదటి బిడ్డ పుట్టకముందే అపరిపూర్ణత ప్రవేశించింది. వారి నుండి ఉత్పత్తియైన ప్రతిదీ లోపంగలదైంది. అప్పుడు తమ వద్ద ఉన్నవాటిని మాత్రమే అంటే, అపరిపూర్ణ శరీరాలు మనస్సులను మాత్రమే వారు తమ పిల్లలకు ఇవ్వగలిగారు. పరిపూర్ణతనూ జీవాన్నీ కాపాడే ఆధారమైన యెహోవా దేవుని నుండి వారు వేరయ్యారు కనుక వారు పరిపూర్ణులు కాదు. బైబిలులోని రోమీయులు 5:12 చెప్పినదానికి అనుగుణంగా, అప్పటినుండి జన్మించిన ప్రతివారు అపరిపూర్ణతలో జన్మించి, వృద్ధాప్యానికీ మరణానికీ గురౌతారు. అయితే దీనికి దేవున్ని నిందించలేము. ద్వితీయోపదేశకాండము 32:5 ఇలా చెబుతోంది: “వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు.” ప్రసంగి 7:29 ఇలా చెబుతోంది: “దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు.”

20. కొందరి తప్పులు ఎందరికో హానిని ఎలా కలిగించగలవు?

20 అయితే, కేవలం ఇద్దరి అవిధేయత ప్రతి ఒక్కరికీ అలాంటి విషాదకరమైన పరిణామాలను తీసుకురావడం న్యాయమేనా? మరి, ఓ భవన నిర్మాణంలో కేవలం ఒక్క వ్యక్తి ఒక్క చిన్న భద్రతా విషయంలో అజాగ్రత్తగా ఉంటే, అది అనేకమంది ప్రాణాలు తీసేలా వినాశనానికి దారితీయవచ్చని మనకు తెలుసు. ఆనకట్ట విషయంలో అలాగే జాగ్రత్త తీసుకోకపోతే అది తెగి, ఎంతో వినాశనాన్ని కలిగించే వరద ముంచుకొచ్చేందుకు కారణమౌతుంది. ఓ పరిపాలకుడు ఒక అక్రమ క్రియను చేస్తే, అతని ప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒక తప్పుడు పని జరుగుతుంది. అలా అది లక్షలాదిమంది ప్రజలకు హాని కలిగిస్తుంది. ఓ కుటుంబంలో, తలిదండ్రుల ఎంపిక సరైనది కాకపోతే, పిల్లలు తీవ్రమైన పరిణామాలను అనుభవిస్తారు. మన ఆది తలిదండ్రులు సరైన ఎంపికను చేసుకోలేదు. తత్ఫలితంగా, మానవ కుటుంబమంతా అపరిపూర్ణతలోకి వినాశనంలోకి మునిగింది.

21. దేవుడు మరణశిక్షను కచ్చితంగా ఎందుకు విధించాడు, అయినప్పటికీ దయను ఆయన ఎలా కనపర్చాడు?

21 దేవుని నియమమూ ఆయన యథార్థత కూడా అందులో ఇమిడివుంది కనుక, ఆ నియమాన్ని అమలుపర్చకుండా ఆ అతిక్రమాన్ని ఆయన పట్టించుకోకుండా ఉండడు. దాని విషయంలో ఆయన ఏమీ చేయనట్లయితే ప్రజలకు ఆయన ఎడలా ఆయన నియమాల ఎడల ఏ గౌరవం ఉంటుంది? తన నియమాలకు తానే లోబడని లేక కొందరు వాటిని ఏ శిక్షాలేకుండా బుద్ధిపూర్వకంగా ఉల్లంఘించేందుకు అనుమతించే నేటి నాయకులను మనం గౌరవిస్తామా? కనుక, అవిధేయతకు దేవుడు తాను ముందుగా చెప్పిన శిక్షను విధించాడు, అదే మరణం. అయితే ఆయన దయాపూర్వకంగా మొదటి జంట పిల్లలను కల్గివుండేందుకు అనుమతించాడు. అలా కాకపోతే మనం ఎన్నడూ పుట్టేవాళ్లం కాదు కనుక దాన్ని మనం మెచ్చుకోవాలి. అంతేకాకుండా మనం ఆదాము హవ్వల వైఫల్యంవల్ల అపరిపూర్ణులమైనప్పటికీ, మరణించడం కన్నా జీవించి ఉండడాన్ని మనం ఎక్కువగా ఇష్టపడమా?

22. దుష్టత్వానికి ఇంకెవరు కూడా అధిక బాధ్యతను వహిస్తారు? (మత్తయి 4:1-11; ఎఫెసీయులు 6:12)

22 దాని భావం దుష్టత్వం పూర్తిగా మానవులనుండే వచ్చిందనా? కాదు, కేవలం మానవులనుండి మాత్రమేకాదు. దేవుడు మానవులను మాత్రమే తెలివిగల జీవులుగా సృజించలేదు. ఆయన అప్పటికే లెక్కలేనంతమంది తెలివిగల కుమారులను అంటే ఆత్మీయ ప్రాణులను పరలోకంలో సృజించాడు. వారు కూడా నైతిక స్వేచ్ఛగల ప్రాణులే, వారు కూడా దేవుడిచ్చిన మంచివైన, సహేతుకమైన నియమాలకు లోబడి జీవించాల్సివుంది. అయితే, ఈ ఆత్మీయ ప్రాణుల్లో ఒకడు తప్పుడు విషయాలను ధ్యానించాడు. మరి తప్పుడు విషయాలను గూర్చి ఓ వ్యక్తి ధ్యానించినప్పుడు, ధ్యానించే ఆ చెడు విషయాన్ని చేసే స్థితికి అతను చేరుకుంటాడు. ఆత్మీయ ప్రాణి విషయం కూడా అంతే. అతను అత్యాశను ఎంతగా పెంచుకున్నాడంటే చివరికి దేవుని చర్యలనే సవాలుచేసేందుకు అది అతన్ని నడిపింది. దేవునికి అవిధేయులైతేనేమి “మీరు చావనే చావరు” అని అతను ఆదాము భార్యైన హవ్వతో చెప్పాడు. (ఆదికాండము 3:4) జీవం, ఆనందం కల్గివుండేందుకు వారు సృష్టికర్తపై ఆధారపడాల్సిన అవసరతను అతను ప్రశ్నించాడు. వాస్తవానికి, అవిధేయతవల్ల వారు దేవుని వంటివారౌతారనీ వారి పరిస్థితులు మరింత మెరుగుపడతాయని అతను వారితో చెప్పాడు. ఆ విధంగా దేవుని సత్యసంధతను అతను ప్రశ్నించాడు. అంతేకాకుండ దేవుని నియమాలను ప్రశ్నించడం ద్వారా దేవుని పరిపాలనా విధానంపై సందేహాన్ని వ్యక్తపర్చాడు అంటే వాస్తవానికి దేవుని పరిపాలనా హక్కుపై సందేహాన్ని వ్యక్తపర్చాడు. అందుకనే అతను సాతాను అని పిలువబడ్డాడు, దాని భావం వ్యతిరేకించేవాడు మరి అపవాది అన్న పదానికి కొండెములు చెప్పేవాడు అని భావం.

అది ఇంతకాలం ఎందుకు అనుమతించబడింది?

23, 24. ఆ వివాదాంశాలు పరిష్కరించబడేందుకు సమయం ఎందుకు పడుతుంది?

23 దేవునికి అందరికంటే ఎక్కువ బలంవుంది కనుక, ఈ మానవ తిరుగుబాటుదారులనూ ఆత్మీయ తిరుగుబాటుదారులనూ ఆయన వెంటనే తుడిచిపెట్టివుండేవాడు. అయితే అది విషయాలను సంతృప్తికరమైన విధానంలో పరిష్కరించేవి కావు. ఎందుకు? ఎందుకంటే అక్కడ సవాలు చేయబడింది దేవుని శక్తికాదు. అక్కడ ఉత్పన్నమైన విషయాలు నైతిక విషయాలు. మరి వాటిలోని ప్రాముఖ్యమైన విషయం, తిరుగుబాటు విధానం జయప్రదమైనదిగా నిరూపించబడుతుందా? దేవున్ని అలక్ష్యం చేసిన పరిపాలన మానవజాతికంతటికీ నిత్య ఆశీర్వాదాలను తెస్తుందా? దేవుడు పరిపాలించడం ప్రజలకు మంచిదా లేక మానవుడు పరిపాలించడం మంచిదా? ఇదీ అలాగే ఉత్పన్నమైన ఇతర ప్రాముఖ్యమైన విషయాలు పరిష్కరించబడేందుకు సమయంపడుతుందని దేవునికి తన వివేకం ద్వారా తెలుసు. మానవులు తమ రాజకీయ, సాంఘిక, పారిశ్రామిక, వైజ్ఞానిక సాధకాల్లో అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు ఎన్నో అవకాశాలనిచ్చి ఆయన నిర్దిష్ట సమయాన్ని అనుమతించాడు.

24 ఆ కాలనిడివి కేవలం కొన్ని దినాలు లేక కొన్ని సంవత్సరాలు మాత్రమే కాదు. ఆ సహేతుకమైన సందేహం లేకుండా ఆ జవాబును ప్రదర్శించేందుకు అనేక తరాలు పడుతుంది. కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కోర్టుకేసుకు కొన్ని వారాలు లేక నెలలు పట్టవచ్చు. దేవుని పాలనకు సంబంధించిన అపాయంలో ఉన్న గొప్ప అంశాలకు ఏదో అర్థ పరిష్కారం కాదు సంపూర్ణ సమాధానం కావాలి. ప్రేమపూర్వక దేవుడు ఓ సంపూర్ణ పరిష్కారాన్నే అంగీకరిస్తాడు. అంతేకాకుండా ఈ విషయం ఇలా ఉన్నందుకు మనం ఆనందించాలి ఎందుకంటే కేవలం అలాంటి పరిష్కారమే పరలోకంలోను భూమ్మీదనూ ఉన్న దేవుని విశ్వ కుటుంబానికి నిత్య శాంతి భద్రతలకు మార్గాన్ని తెరవగలదు.

25. వస్తుపరమైన ప్రగతి ఉన్నప్పటికీ, మానవుడు దేవునినుండి వేరవ్వడం నిజమైన శాంతి సంతోషాలను తీసుకువచ్చిందా?

25 ఈ విషయాలు మొదటిసారిగా రేగినప్పటినుండి ఇప్పటికి సుమారు 6,000 సంవత్సరాలు గడిచాయి. దేవుని పరిపాలన నుండి స్వతంత్రంగా ఉన్నందువల్ల వచ్చిన ఫలితమేమిటి? అన్ని విధాల ప్రభుత్వాలూ అన్ని రకాల సాంఘిక విధానాలు, అన్ని విధాల ఆర్థిక వ్యవస్థలూ అన్ని విధాల విభాగిత మతాలను ప్రయోగించి చూడడం జరిగింది. అయితే ఏదీ నిజమైన శాంతి భద్రతలనూ శాశ్వతమైన ఆరోగ్యాన్నీ ఆనందాన్ని తీసుకురాలేదు. కేవలం రెండవ ప్రపంచ యుద్ధానికి యాభై లక్షలమంది ప్రాణాలను కోల్పోయినప్పుడు ఎవరైనా తమ వస్తుపర ప్రగతిని గూర్చి గొప్పలు చెప్పుకోగలరా? న్యూక్లియర్‌ వార్‌హెడ్లున్న రాకెట్లే మానవజాతిని నాశనం చేయగల్గినప్పుడు అవే రాకెట్లలో చంద్రుని మీదికి మనుష్యులను పంపించడం ప్రగతి ఎలా అవుతుంది? భూమ్మీది కోట్లమంది ప్రజలు ఆకలి పేదరికాలతో బాధపడుతున్నప్పుడు మనుష్యులు చంద్రునిపై నడవడం ప్రగతి ఎలా అవుతుంది? మానవ గృహానికి జీవితవిధానానికి అపాయకరమైన కుటుంబాలు వివాదాలవల్ల విడిపోతుండగా, విడాకుల సంఖ్య నిత్యం పెరుగుతుండగా, చుట్టుప్రక్కల నేరం జరుగుతుందనే భయం వ్యాపిస్తుండగా, కాలుష్యమూ మురికి వాడలు పెరుగుతుండగా, ఆర్థిక సంక్షోభాలు అనేకమందిని నిరుద్యోగులను చేస్తుండగా, అల్లరులూ అంతఃకలహాలూ ప్రభుత్వాలు మారడం వంటి మానవ గృహానికీ జీవిత విధానానికీ అపాయకరమైనవి ప్రతి సంవత్సరమూ జరుగుతుండగా అనేక సదుపాయాలున్న మంచి ఇంటిని కల్గివుంటే ఏమి లాభం?

26. దేవునినుండి మానవుడు వేరవ్వడం గూర్చి, వారికిచ్చిన సమయం ఏమి నిరూపించింది? (కీర్తన 127:1)

26 కానీ సత్యం ఎలా ఉందంటే, “వస్తుపరమైన ప్రగతి ఉన్నప్పటికీ, తమకు భద్రతలేదు అని మానవులు నేడు భావిస్తున్నంతగా ఎన్నడూ అనుభవించలేదు” అని ఐక్యరాజ్య సమితి జనరలైన కర్ట్‌ వాల్డ్‌హిమ్‌ ఒప్పుకున్నట్లుగానే ఉంది. * ఎన్విరాన్మెంటల్‌ ఎథిక్స్‌ అనే పుస్తకం కూడా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు, మంచినీటిని త్రాగి ఆనందించేందుకు, తానున్న ప్రకృతి పరిసరాలను పరిశీలించడంలో ఆనందించేందుకు సృజించబడిన మానవుడు, తన పర్యావరణాన్ని మార్చుకుని ఇప్పుడు తాను దానికి అనుగుణంగా మారలేనని కనుగొన్నాడు. అతను తన స్వయం సామూహిక హత్యలకు తయారీలు చేసుకుంటున్నాడు. * దుష్టత్వాన్ని ఎక్కువకాలం కొనసాగేందుకు అనుమతించడమన్నది, దేవుని నడిపింపులేకుండా మనుష్యులు తమ వ్యవహారాలను జరుపుకునే సామర్థ్యంతో సృజించబడలేదని సహేతుకమైన ప్రజలందరికీ ప్రదర్శించాలి. ఆరు వేల సంవత్సరాల మానవ వైఫల్యపు రుజువుతో, మానవులు ప్రయోగాలు చేసేందుకు దేవుడు తగినంత సమయాన్ని ఇవ్వలేదని ఎవరూ దేవునిని సహేతుకంగా నిందించలేరు. దేవునికి చేసిన తిరుగుబాటు మార్గం పూర్తిగా విఫలమైందని నిరూపించేందుకు అనుమతించబడిన సమయం సరిపోతుంది.

దుష్టత్వం త్వరలోనే అంతమౌతుంది

27. దేవుడు ఎంత విస్తృతమైన మార్పును చేయాలని సంకల్పించాడు? (సామెతలు 2:21, 22; రోమీయులు 16:20)

27 మానవ కుటుంబానికి ఓ మంచి మార్పు చాలా అవసరం. వాస్తవానికి, మనకు పూర్తిగా ఓ క్రొత్త విధానం కావాలి. సాంఘికవేత్తైన ఎరిచ్‌ ఫ్రమ్‌ అంగీకరించినట్లుగా, “చరిత్రలోని గత 6,000 సంవత్సరాల వ్యవస్థంతా మారితేనే” సంఘంలోని చెడు సరిచేయబడుతుంది. * దేవుని మనస్సులో కూడా సరిగ్గా అదే ఉంది! ఆయన ఇచ్చిన కాల నిడివి ముగిసిన తర్వాత, ప్రస్తుత దుష్టవిధానమంతా అలాగే అది కావాలనే వారితో సహా ఉనికిలో లేకుండా నిర్మూలిస్తానని దేవుడు హామీనిస్తున్నాడు. “భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.”—కీర్తన 145:20.

28. మనం జీవించే కాలాన్ని బైబిలు ఏమని పిలుస్తోంది మరియు ఎందుకు? (2 తిమోతి 3:1-5, 12, 13; మత్తయి 24:3-14)

28 ఇది ఎప్పుడు జరుగుతుంది? త్వరలోనే జరుగుతుంది, ఎందుకంటే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఎన్నడూలేని కష్టాలు మానవ కుటుంబాన్ని బాధిస్తున్నాయి. ఇది “అంత్యదినములు” అని బైబిలు పిలిచే కాలాన్ని సూచిస్తున్నాయని దేవుని వాక్యం చూపిస్తోంది. ఈ “అంత్యదినములలో” ప్రపంచ యుద్ధాలు, పెరిగే నేరం, ఆకలి, అంటువ్యాధులు, అధికాంశులు సుఖాన్ని ఎక్కువగా అనుభవించడం, దేవునియందు విశ్వాసం తగ్గిపోవడం, మతపరమైన వేషధారణా అలాగే క్షీణత, అంతేకాకుండా అనేక ఇతర సంఘటనలు ఉంటాయని బైబిలు ప్రవచించింది. ఇవి వేలిముద్రలో కనిపించే గీతలవలె ఉంటాయి, ఇటువంటి విపరీతమైన విషయాలను దేవుడు సహించడంలో మన తరము చివరిదిగా గుర్తించబడింది. ఇప్పుడు భూమిపై అధికారం చెలాయిస్తున్న విధానాంతాన్ని మన కాలం తప్పక చూస్తుందని యేసు ప్రవచించాడు.

29. ఈ విధానాంతం సమీపంలో ఉందని మనకెలా తెలుసు?

29 యేసు ఇలా అన్నాడు: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 24:34) అంటే ఈ సూచనను చూసిన కొందరు ప్రజలు ప్రస్తుత విధానాంతాన్ని చూసేందుకు ఇంకా జీవించే ఉంటారన్నమాట.

30. నేడు భూమిని పరిపాలిస్తున్న మానవ పాలనా విధానాలన్నింటికీ ఏమి జరుగుతుంది? (జెఫన్యా 3:8; యెషయా 1:28)

30 అంతం వచ్చినప్పుడు, దేవుడు తన అపారమైన శక్తిని ప్రదర్శించి, మానవ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటాడు. ఆయనకు వ్యతిరేకమైన మానవ విధానాలన్నీ నిర్మూలించబడతాయి. దానియేలు 2వ అధ్యాయం 44వ వచనం దీన్ని గూర్చి ఇలా చెబుతోంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” హానికరమైన అన్ని మానవ విధానాలూ తీసివేయబడిన తర్వాత, దేవుని పరిపాలన భూమిపై పూర్తి అధికారాన్ని కల్గివుంటుంది.

31. మానవజాతియంతటికీ దేవుడు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు? (మత్తయి 6:9, 10)

31 కనుక, దేవుని పరిపాలన ఓ నూతన ప్రభుత్వం, ఓ పరలోక ప్రభుత్వం, దేవుని రాజ్యం ద్వారా అమలుపర్చబడుతుంది. ఈ ప్రభుత్వమే యేసుక్రీస్తు బోధకు ముఖ్య విషయంగా ఉండింది. మరి అది మాత్రమే తగిన సమయంలో భూమినంతటినీ స్వాధీనం చేసుకుంటుందని ఆయన అన్నాడు. ఈ రాజ్యము దేవుని నడిపింపుక్రింద పరలోకంనుండి పరిపాలిస్తుంది కనుక, స్వార్థపరులైన వ్యక్తులవల్ల అది పాడయ్యే అవకాశం లేదు. అలా పరిపాలనాధికారం మొదట ఎక్కడ ఉండేదో అక్కడ ఉంటుంది, అంటే పరలోకంలో దేవుని వద్ద ఉన్నప్పుడు. దేవుని పరిపాలన భూమి మీద ఉంటుండగా, “లోకనివాసులు నీతిని నేర్చుకొందురు” అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 26:9) అబద్ధమతం ఉండదు కనుక ఎవరూ తప్పుదోవ పట్టించబడరు. “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును” అన్నది పూర్తి భావంలో నెరవేరేట్లుగా, జీవించే ప్రతి వారికి దేవుడూ ఆయన సంకల్పాలను గూర్చిన సత్యం నేర్పించబడుతుంది.—యెషయా 11:9.

నీతియుక్తమైన నూతన విధానం

32. దేవుని రాజ్య పరిపాలనలో శాంతి ఎంత విస్తృతంగా ఉంటుంది? (యెషయా 2:2-4)

32 దేవుని రాజ్య పరిపాలన క్రింద, పూర్తిగా ఓ క్రొత్త మానవ సమాజం, దైవిక ప్రజలతో తయారైన సమాజం వృద్ధి చెందుతుంది. ఈ నూతన విధానంలో, మనయెడల దేవుడు కనపర్చే శ్రద్ధ ఆయన చేసే వాటిద్వారా ప్రదర్శించబడుతుంది. ఒక విషయమేంటంటే, యుద్ధాలు ఇక ఎన్నడూ మానవుల శాంతి సంతోషాలను భంగపర్చవు. ఎందుకు? ఎందుకంటే ప్రస్తుత దుష్ట లోకం నుండి బయటపడ్డవారందరూ అప్పటికే శాంతి మార్గాలను గూర్చి తెలుసుకుని ఉంటారు, ఆ విధంగా నూతన మానవ సమాజం శాంతియుతంగా ప్రారంభమౌతుంది. ఆ తర్వాత, ఆ నూతన విధానంలో జీవించేందుకు వచ్చేవారందరూ దేవుని చిత్తాన్ని చేయడంలో అలాంటి విద్యనే పొందుతారు. అందుచేతనే, దేవుడు ‘భూదిగంతములవరకు యుద్ధములను మాన్పుతాడు’ అని బైబిలు చేసే వాగ్దానం సంపూర్ణంగా నెరవేరుతుంది. (కీర్తన 46:8, 9) ఆ శాంతి ఎంత సంపూర్ణమైనది? దేవుని ప్రవచనార్థక వాక్యం ఇలా చెబుతోంది: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”కీర్తన 37:11, ఇటాలిక్కులు మావి.

33. భూమి ఏ రూపాంతరాన్ని పొందుతుంది?

33 దానికి తోడు, ఆ నూతన విధానంలో జీవించేవారు దేవుడు మొదట సంకల్పించినట్లుగా ఈ భూమిని పరదైసుగా మారుస్తారు. మానవజాతికి అది ఎంతటి సంతృప్తికరమైన పనిగా ఉంటుందో కదా! మరి పరదైసు పునరుద్ధరించబడినప్పుడు ప్రజలు కొలనులను నదులనూ మహా సముద్రాలను; కొండలూ పర్వతాలను, మెట్టప్రదేశాలు లోయలను; చక్కని పూలనూ మొక్కలను చెట్లను అలాగే ఆసక్తికరమైన జంతువులను పూర్తిగా ఆనందించగల్గుతారు. ఆహార కొరతలు ఎన్నడూ ఏర్పడవు, ఎందుకంటే “భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.” అవును, “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 67:6; 72:16.

34. ఏ శారీరక స్వస్థత జరుగుతుంది?

34 శాశ్వతమైన శాంతి, సమృద్ధిగల ఆహారాలతో మంచి ఆరోగ్యం వస్తుంది. దేవుడు మానవున్ని సృజించాడు కనుక, కుంటివారిని బాగు చేసేందుకూ గ్రుడ్డివారు చూసేందుకు చెవిటివారు వినేందుకు ఏమి చేయాలో అన్ని రోగాలనూ వృద్ధాప్యాన్ని మరణాన్ని ఎలా తీసివేయాలో ఏ వైద్యునికన్నా ఆయనకే బాగా తెలుసు. వీటిని చేసే శక్తి దేవునికి ఉందని చూపేందుకుగానూ యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ఆ శక్తిని కొద్దిగా లేక చిన్న రూపంలో ప్రదర్శించాడు. బైబిలు మనకు ఇలా చెబుతోంది: “బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి.”—మత్తయి 15:30, 31.

35, 36. దేవుని నూతన విధానంలో జీవించేందుకు మృతులకు అవకాశం ఎలా ఇవ్వడం జరుగుతుంది? (యోహాను 5:28, 29; లూకా 7:11-15)

35 “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని” తన ప్రక్కన వ్రేలాడదీయబడిన వ్యక్తితో చెప్పినప్పుడు యేసు ఈ భూపరదైసును సూచించాడు. (లూకా 23:43) అయితే ఆ మనిషి చనిపోయాడు. కనుక అతను పరదైసులోకి ఎలా ప్రవేశిస్తాడు? దేవుడు ఎంత శ్రద్ధకల్గివున్నాడో కనపర్చే మరో అద్భుతమైన ఏర్పాటు ద్వారా—అదే, మృతులలోనుండి పునరుత్థానం. అపొస్తలుల కార్యములు 24:14, 15 నందు బైబిలు ఇలా చెబుతోంది: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.’ యేసు భూమ్మీద ఉన్నప్పుడు, మృతులను పునరుత్థానం చేయడం ద్వారా, దేవుని రాజ్య పరిపాలనలో అలా చేయగల శక్తి ఆయనకుందని ప్రదర్శించాడు.

36 పునరుత్థాన ఆలోచనను విశ్వసించడం మీకు కష్టంగా ఉందా? ఎంతో కాలం క్రితం మరణించిన వారిని టీవీ కార్యక్రమాల్లో మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు. మీరు వారి స్వరాలను వింటారు వారి కదలికలను గమనిస్తారు, వారి లక్షణాలను గమనిస్తారు. సాధారణ మానవుడు అలాంటి వాటిని టీవీ టేపుల్లో ఉంచగల్గితే, తాను తిరిగి సృజించాలనుకున్న ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్నీ లక్షణాలనూ గుర్తుంచుకోవడం సర్వజ్ఞానియైన దేవునికి కష్టమైనపనేమీ కాదు. ఆయన దాన్ని చేశాడు, అంతేకాకుండా ఆయన మరణించినవారిని సజీవులనుగా చేస్తాడు. ఆ విధంగా, దేవుని నూతన విధానంలో వారుకూడా జీవాన్ని అనుభవించే అవకాశాన్ని పొందుతారు. అంతేకాకుండా, సమాధులను ఖాళీచేయడం ద్వారా, పితరులనుండి వచ్చిన అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం నుండి ప్రజలను స్వస్థపర్చడం ద్వారా, దేవుడు “మరెన్నడును ఉండకుండ మరణమును . . . మ్రింగివేయును.” (యెషయా 25:8) ఆ విధంగా, ప్రజలు నిరంతరం జీవించగలరు.

37 తన రాజ్యం ద్వారా, ఇంతకాలం వరకు ఉన్న చెడు పరిస్థితిని దేవుడు పూర్తిగా మారుస్తాడు! గతంలో మనం అనుభవించిన ఏ బాధనైనా మరచిపోయేలా చేయగల గొప్ప ఆశీర్వాదాలను దేవుడు కుమ్మరించడం ద్వారా తనకు మన ఎడల ఉన్న అపారమైన శ్రద్ధను ఆయన నిత్యం కనపరుస్తాడు. ఈ ప్రస్తుత విధానంలో మనం అనుభవించిన మునుపటి కష్టాలను మనం అప్పుడు గుర్తుపెట్టుకోవాలనుకున్నా అవి క్రమేపీ మరుగౌతాయి. “నేను క్రొత్త ఆకాశమును [మానవజాతియంతటిపై క్రొత్త పరలోక ప్రభుత్వము] క్రొత్త భూమిని [నీతియుక్త మానవ సమాజం] సృజించుచున్నాను. మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి.” (యెషయా 65:17, 18) అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు ముందుండగా, దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును” అని బైబిలు ఎందుకు అంటుందో మీరు చూడగలరు. ఎందుకు? ఎందుకంటే, ‘మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.’—ప్రకటన 21:4.

దేవుడు శ్రద్ధ కనపరుస్తున్నాడు—మరి మనం?

38. తన నూతన విధానంలో ఎలాంటి ప్రజలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు? (కీర్తన 37:37, 38)

38 దేవుడు దుష్టత్వాన్ని త్వరలోనే అంతమొందించి, ఆనందమయమైన నూతన విధానాన్ని ప్రవేశపెడతాడన్న వాస్తవమే ఆయనకు మన విషయంలో నిజంగా శ్రద్ధ ఉందని కనపరుస్తోంది. అయితే మనం ఆయన విషయంలో శ్రద్ధ కల్గివున్నామా? ఉంటే మనం దాన్ని చూపించాలి. మనం ఏమి చేయాలి? బైబిలు ఇలా చెబుతోంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:17, ఇటాలిక్కులు మావి.) తన నూతన విధానంలో, తన నీతియుక్త పరిపాలనకు విధేయులై ఆయన చిత్తాన్ని చేసేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రజలు దేవుని నియమాలకు విధేయులౌతూ “క్రొత్త భూమిలో” జీవించేందుకు దానిని ఒక చక్కని ప్రాంతంగా తయారుచేసేందుకు దోహదపడతారు. దేవుని నియమాన్ని వ్యతిరేకించేవారు కలకలం రేపేవారే కనుక అలాంటివారు అక్కడ జీవించేందుకు అనుమతించబడరు.

39. మీకు నిత్యజీవం కావాలంటే మీరు ఏ అన్వేషణను చేయాలి? (సామెతలు 2:1-6)

39 దేవుని నీతియుక్త నూతన విధానంలో మీరు జీవించాలనుకుంటున్నారా? అలాగైనట్లైతే, జీవించేందుకుగాను దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకోవడం ప్రప్రథమం. అది మీనుండి మరీ ఎక్కువ కోరుతోందా? తోటలా ఉన్న ప్రాంతంలో ఉచితంగా ఓ అందమైన ఇంటిని ఎవరైనా మీకు ఇస్తామంటే, అందులో ఉండే అర్హతను ఎలా సంపాదించగలరో కనుక్కునేందుకు మీరు సమయం తీసుకుని ప్రయత్నించరా? మన ఎడల దేవుని చిత్తమేంటో కనుక్కుని దాన్ని చేసినట్లైతే, ఎంతో గొప్పదైన పరదైసు భూమిపై నిరంతర జీవితం లభిస్తుందని ఆయన వాక్యం చెబుతోంది. బైబిలు ఇలా చెబుతోంది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.

40. ఇప్పుడు బైబిలు మనకు ఏ అదనపు ప్రయోజనాలను ఇస్తుంది? (2 తిమోతి 3:16, 17)

40 బైబిలు నుండి నేర్చుకోవడం మీకూ మీ కుటుంబానికీ ఈ కష్టకాలాల్లో కావలసిన అనుదినావసరతలకు సంబంధించిన ఆచరణాత్మకమైన నడిపింపును కూడా ఇస్తుంది. దానికి తోడు, అది నిజమైన మనశ్శాంతినిస్తుంది, ఎందుకంటే పరిస్థితులు ఎందుకు ఇంత చెడుగా ఉన్నాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఏముంది అన్న విషయాలను అది మనకు చెబుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, దేవుడు “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడ”వుతాడని గ్రహించడంవల్ల మనం ఆయన ఎడల యథార్థమైన ప్రేమను వృద్ధిచేసుకునేందుకు అది సహాయపడుతుంది.—హెబ్రీయులు 11:6.

41. యెహోవాసాక్షులు మీకు ఏ సహాయాన్ని ఉచితంగా ఇస్తారు?

41 తన నూతన విధానంలో మనం జీవించేందుకు దేవుడు చేసిన ఏర్పాట్లను గూర్చి మీరు నేర్చుకోవడానికి యెహోవాసాక్షులు సహాయపడేందుకు తమ సమయాన్ని ఆనందంగానూ ఉచితంగాను ఇస్తారు. నిస్సందేహంగా, బైబిలను గూర్చి దేవునిని గూర్చిన మరితర ప్రశ్నల మీకుంటాయి. మీ స్వంత ఇంటిలో మీ బైబిలు నుండే మీతో ఈ విషయాలను చర్చించేందుకు యెహోవాసాక్షులు ఆనందిస్తారు. ఆ తర్వాత, స్వతంత్ర జీవన మార్గాన్ని అనుసరించే బదులు లేక అపరిపూర్ణ మానవుల ఆలోచనపై ఆధారపడే బదులు నేడు అందుబాటులో ఉన్న అతి శ్రేష్ఠమైన సమాచారం ద్వారా మీరు నడిపించబడతారు. కనుక, ఇంకా సమయం ఉండగానే, దేవుని వాక్యపు ప్రేరేపిత సలహా ప్రకారం చేయాలని మీరు ఉద్బోధించబడుతున్నారు అది ఇలా ఉంది: “ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు.”—1 పేతురు 5:6, 7.

[అధస్సూచీలు]

^ పేరా 5 ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఎత్తి వ్రాయబడ్డాయి. లేఖనం ఎత్తివ్రాయబడినచోట NW అని ఉంటే, అది ఆధునిక ఆంగ్ల భాషలోని లేఖనముల నూతనలోక అనువాదమురెఫరెన్సులతో కూడినది నుండి తర్జుమా చేయబడిందని సూచిస్తుంది.

^ పేరా 26 న్యూయార్క్‌ టైమ్స్‌, నవంబరు 6, 1972, 5వ పేజీ.

^ పేరా 26 డోనాల్డ్‌ ఆర్‌. స్కాబి సంపాదకునిగా ఉన్న ఎన్విరాన్మెంటల్‌ ఎథిక్స్‌, 1971, 17వ పేజీ.

^ పేరా 27 న్యూయార్క్‌ పోస్ట్‌ మార్చి 30, 1974, 35వ పేజీ.

[అధ్యయన ప్రశ్నలు]

37. ప్రజలు అన్యాయంగా అనుభవించిన బాధలను దేవుడు మరిపించడంకన్నా ఇంకా ఎక్కువే చేస్తాడని ఎందుకు చెప్పవచ్చు?

[33వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

 

1914

ప్రపంచ యుద్ధాలు

తీవ్రమైన కరువులు

అంటువ్యాధులు

దౌర్జన్యపూరితమైన నేరాలు

భౌగోళిక కాలుష్యం

ఈ విధానాంతము

[7వ పేజీలోని చిత్రం]

మానవ పేదరికానికీ మురికి వాడలకూ దేవున్ని నిందించినట్లైతే . . .

[8వ పేజీలోని చిత్రం]

. . . భూమి అందానికి ఫలవంతమైన దాని పొలాలకూ ఎవరికి ఘనతనివ్వాలి?

[0వ పేజీలోని చిత్రం]

ఏ ఇంటికన్నా జీవాన్ని పోషించేందుకు భూమే ఎంతో అనువైనదిగా ఉంది

[0వ పేజీలోని చిత్రం]

ప్రతి ఇంటికీ ఓ నిర్మాణకుడు ఉన్నాడు కనుక, భూమికి కూడా తప్పక ఉండాలి కదా!

[24వ పేజీలోని చిత్రం]

దేవుని ఉద్దేశ్యము భూమినంతటినీ మానవులు నిత్యం ఆనందించగల అందమైన వనంగా, ఓ పరదైసుగా చేయడమేనని బైబిలు చూపుతోంది

[25వ పేజీలోని చిత్రం]

ఓ ఫ్యాన్‌ను దాని విద్యుత్‌ సరఫరానుండి వేరుచేసినప్పుడు అది తిరుగుతూ తిరుగుతూ ఆగిపోతుంది. అదేవిధంగా, మానవజాతి దేవునినుండి వేరైనందుకు ప్రతిఫలం క్షీణత

[27వ పేజీలోని చిత్రం]

భద్రత తీసుకోవడంలో ఓ చిన్న విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు అది ఎంత పెద్ద ఆనకట్టైనా కూలిపోయే ప్రమాదముంది. మన మొదటి తలిదండ్రులు దేవుని నియమాన్ని పాటించనప్పుడు దుష్టత్వమూ బాధల వెల్లువ పెల్లుబకడం ప్రారంభమైంది

[20వ పేజీలోని చిత్రం]

ఒక కోర్టు కేసులో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నప్పటికీ, దానికి కొన్ని వారాలు పడుతుంది. దేవుని పరిపాలనకు సంబంధించిన విషయాలు పూర్తిగానూ శాశ్వతంగానూ పరిష్కరించబడాలి, మరి దీనికి తగు సమయం అవసరం

[35వ పేజీలోని చిత్రం]

దేవుడు ‘యుద్ధాలు లేకుండా చేయగా’ నూతన విధానంలో యుద్ధాలు ఉండనే ఉండవు

[36వ పేజీలోని చిత్రం]

మానవజాతి ఇక ఎన్నడూ ఆకలితో బాధపడదు

[36వ పేజీలోని చిత్రం]

దేవుని ఆశీర్వాదంతో భూమి సమృద్ధిగా పంటనిస్తుంది

[37వ పేజీలోని చిత్రం]

యౌవనం మరియు మంచి ఆరోగ్యాలతో వచ్చే బలం వృద్ధులకు తిరిగి ఇవ్వబడుతుంది

[38వ పేజీలోని చిత్రం]

దేవుని జ్ఞాపకంలో ఉంచబడిన మరణించినవారందరూ మరలా జీవాన్ని పొంది, తమ ప్రియమైన వారిని కలుస్తారు

[30వ పేజీలోని చిత్రం]

దేవుని పరిపాలనలోని జీవితం, అన్యాయంగా మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఏ బాధనైనా మరిచేంత ఆనంద దాయకంగా ఉంటుంది

[42వ పేజీలోని చిత్రం]

ఆహ్లాదకరమైన పరిసరాల్లో జీవించమని ఆహ్వానమిస్తే, అందులో ఉండేందుకు అర్హతను ఎలా పొందాలో మీరు తెలుసుకోవాలనుకోరా? దేవుని నూతన విధానం అంతకంటే ఎక్కువే ఇస్తుంది, అయితే ఆ అర్హతను గూర్చి తెలుసుకునేందుకు మనం కొంత సమయాన్ని కేటాయించాలి