దినవృత్తాంతాలు రెండో గ్రంథం 10:1-19

  • రెహబాము మీద ఇశ్రాయేలు తిరుగుబాటు (1-19)

10  ఇశ్రాయేలీయులందరూ రెహబామును రాజును చేయడానికి షెకెముకు+ రావడంతో అతను షెకెముకు వచ్చాడు.+  నెబాతు కుమారుడైన యరొబాము+ ఆ సంగతి విన్నప్పుడు (అతను సొలొమోను రాజు కారణంగా ఐగుప్తుకు పారిపోయి అక్కడే నివసిస్తున్నాడు)+ ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు.  అప్పుడు ప్రజలు యరొబామును పిలిపించారు. యరొబాము, ఇశ్రాయేలీయులందరూ రెహబాము దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:  “నీ తండ్రి మా కాడిని కఠినంగా చేశాడు.+ అయితే నీ తండ్రి నియమించిన కఠినమైన సేవను నువ్వు సులువుగా మారిస్తే, అతను మా మీద పెట్టిన బరువైన* కాడిని తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.”  అందుకు అతను వాళ్లతో, “మూడు రోజుల తర్వాత నా దగ్గరికి రండి” అన్నాడు. దాంతో ప్రజలు వెళ్లిపోయారు.+  అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికున్నప్పుడు అతనికి సేవ చేసిన పెద్దల్ని* సంప్రదించి, “ఈ ప్రజలకు ఏం చెప్పాలో సలహా ఇవ్వండి” అని అడిగాడు.  వాళ్లు ఇలా చెప్పారు: “నువ్వు ఈ ప్రజలతో మంచిగా ఉంటూ, వాళ్లను సంతోషపెట్టి, వాళ్లకు అనుకూలమైన జవాబు ఇస్తే, వాళ్లు ఎప్పుడూ నీ సేవకులుగా ఉంటారు.”  అయితే, అతను పెద్దలు* ఇచ్చిన సలహాను పట్టించుకోకుండా, తనతోపాటు పెరిగి ఇప్పుడు తనకు సేవ చేస్తున్న యువకుల్ని సలహా అడిగాడు.+  అతను వాళ్లతో, “ ‘నీ తండ్రి మా మీద పెట్టిన కాడిని తేలిక చేయి’ అని నన్ను అడిగిన ఈ ప్రజలకు నేను ఏం చెప్పాలో సలహా ఇవ్వండి” అన్నాడు. 10  అతనితోపాటు పెరిగిన యువకులు అతనితో ఇలా అన్నారు: “ ‘నీ తండ్రి మా కాడిని భారంగా చేశాడు, కానీ నువ్వు దాన్ని తేలిక చేయి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘నా చిటికెన వేలు నా తండ్రి నడుము కన్నా పెద్దదిగా ఉంటుంది. 11  నా తండ్రి మీ మీద బరువైన కాడిని మోపాడు, కానీ నేను దాన్ని ఇంకా బరువైనదిగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడు, కానీ నేను ముళ్ల కొరడాలతో శిక్షిస్తాను.’ ” 12  “మూడో రోజున నా దగ్గరికి రండి” అని రెహబాము రాజు చెప్పినట్టే, యరొబామూ మిగతా ప్రజలందరూ మూడో రోజున అతని దగ్గరికి వచ్చారు.+ 13  అయితే, రెహబాము రాజు వాళ్లకు కఠినంగా జవాబిచ్చాడు. అలా అతను పెద్దలు* ఇచ్చిన సలహాను పట్టించుకోలేదు. 14  యువకులు ఇచ్చిన సలహా ప్రకారం అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీ కాడిని ఇంకా బరువుగా చేస్తాను, దాని బరువును మరింత పెంచుతాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడు, కానీ నేను ముళ్ల కొరడాలతో శిక్షిస్తాను.” 15  అలా రాజు ప్రజల మాట వినలేదు; యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి+ సత్యదేవుడే పరిస్థితుల్ని అలా మలుపు తిప్పాడు.+ 16  రాజు తమ మాట వినలేదు కాబట్టి ఇశ్రాయేలీయులందరూ రాజుతో ఇలా అన్నారు: “దావీదుతో మాకు ఏ సంబంధమూ లేదు, యెష్షయి కుమారునిలో మాకు ఏ వాటా లేదు. ఇశ్రాయేలీయులారా, ప్రతీ ఒక్కరు మీ దేవుళ్ల దగ్గరికి తిరిగెళ్లండి! దావీదూ, ఇక నీ ఇంటిని నువ్వే చూసుకో.”+ ఆ మాట అని ఇశ్రాయేలీయులందరూ తమ ఇళ్లకు* వెళ్లిపోయారు.+ 17  అయితే రెహబాము యూదా నగరాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలీయుల మీద పరిపాలన కొనసాగించాడు.+ 18  తర్వాత రెహబాము రాజు హదోరమును+ ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించాడు; అతను వెట్టిపని చేయడానికి పిలిపించబడినవాళ్ల మీద అధికారి. అయితే ఇశ్రాయేలీయులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. రెహబాము రాజు ఎలాగోలా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు.+ 19  ఇశ్రాయేలీయులు ఈ రోజు వరకు దావీదు ఇంటివాళ్ల మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

అధస్సూచీలు

లేదా “అణచివేసే.”
లేదా “వృద్ధుల్ని.”
లేదా “వృద్ధులు.”
లేదా “వృద్ధులు.”
అక్ష., “డేరాలకు.”