దినవృత్తాంతాలు రెండో గ్రంథం 34:1-33

  • యోషీయా, యూదా రాజు (1, 2)

  • యోషీయా తెచ్చిన మార్పులు (3-13)

  • ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం (14-21)

  • విపత్తు గురించి హుల్దా ప్రవచనం (22-28)

  • యోషీయా గ్రంథాన్ని ప్రజలకు చదివి వినిపించడం (29-33)

34  యోషీయా+ రాజైనప్పుడు అతనికి ఎనిమిదేళ్లు; అతను యెరూషలేములో 31 సంవత్సరాలు పరిపాలించాడు.+  యోషీయా యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడిచాడు, అతను వాటి నుండి కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగలేదు.  యోషీయా తన పరిపాలనలోని 8వ సంవత్సరంలో, ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే తన పూర్వీకుడైన దావీదు దేవుణ్ణి వెదకడం మొదలుపెట్టాడు;+ 12వ సంవత్సరంలో ఉన్నత స్థలాల్ని,+ పూజా కర్రల్ని,* చెక్కిన విగ్రహాల్ని,+ పోత* విగ్రహాల్ని తీయించి యూదా, యెరూషలేమును శుభ్రం చేయడం ప్రారంభించాడు.+  అతని సమక్షంలో వాళ్లు బయలు బలిపీఠాల్ని పడగొట్టారు, అతను వాటి పైన ఉన్న ధూపస్తంభాల్ని పగలగొట్టాడు. అంతేకాదు పూజా కర్రల్ని,* చెక్కిన విగ్రహాల్ని, పోత విగ్రహాల్ని ముక్కలుముక్కలుగా నరికి, వాటిని పొడిగా చేసి ఆ పొడిని వాటికి బలి అర్పించినవాళ్ల సమాధుల మీద చల్లించాడు.+  అతను పూజారుల ఎముకల్ని వాళ్ల బలిపీఠాల మీదే కాల్చాడు.+ అలా అతను యూదాను, యెరూషలేమును శుభ్రం చేశాడు.  అతను మనష్షేలో, ఎఫ్రాయిములో,+ షిమ్యోనులో, నఫ్తాలి వరకు ఉన్న నగరాల్లో, అలాగే వాటి చుట్టుపక్కల శిథిలాల్లో ఉన్న  బలిపీఠాల్ని పడగొట్టాడు; పూజా కర్రల్ని,* చెక్కిన విగ్రహాల్ని+ పగలగొట్టి వాటిని పొడిగా చేశాడు. అతను ఇశ్రాయేలు దేశమంతటా ఉన్న ధూపస్తంభాలన్నిటినీ పగలగొట్టి,+ ఆ తర్వాత యెరూషలేముకు తిరిగొచ్చాడు.  యోషీయా తన పరిపాలనలోని 18వ సంవత్సరంలో దేశాన్ని, ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాత, అతను తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి అజల్యా కుమారుడైన షాఫానును,+ నగర అధిపతైన మయశేయాను, వివరాలు నమోదు చేసే యోహాహాజు కుమారుడైన యోవాహును పంపించాడు.+  వాళ్లు దేవుని మందిరానికి తీసుకురాబడిన డబ్బును ప్రధానయాజకుడైన హిల్కీయాకు అప్పగించారు. ద్వారపాలకులుగా సేవచేస్తున్న లేవీయులు ఆ డబ్బును మనష్షే, ఎఫ్రాయిమువాళ్ల నుండి, మిగతా ఇశ్రాయేలు ప్రజల+ నుండి, యూదా, బెన్యామీనువాళ్ల నుండి, యెరూషలేము నివాసుల నుండి సేకరించారు. 10  ఆ డబ్బును యెహోవా మందిరంలో జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తున్నవాళ్లకు ఇచ్చారు. యెహోవా మందిరంలోని పనివాళ్లు ఆ డబ్బును మందిరాన్ని బాగుచేయడానికి, మరమ్మతు చేయడానికి ఉపయోగించారు. 11  చెక్కిన రాళ్లను, ఆధారాలుగా ఉంచే మ్రానుల్ని కొనడానికి, యూదా రాజుల అశ్రద్ధ వల్ల పాడైపోయిన భవనాల కోసం దూలాల్ని కొనడానికి నైపుణ్యంగల పనివాళ్లకు, నిర్మాణకులకు ఆ డబ్బును ఇచ్చారు.+ 12  ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేశారు.+ వాళ్ల మీద మెరారీయులైన+ యహతు, ఓబద్యా, కహాతీయులైన+ జెకర్యా, మెషుల్లాము అనే లేవీయులు పర్యవేక్షకులుగా నియమించబడ్డారు. నైపుణ్యంగల సంగీతకారులైన లేవీయులందరూ+ 13  మామూలు పనివాళ్ల* మీద నియమించబడ్డారు, అలాగే వాళ్లు అన్నిరకాల సేవలకు సంబంధించిన పనులు చేసే వాళ్లందరి మీద పర్యవేక్షకులుగా ఉన్నారు; లేవీయుల్లో కొంతమంది కార్యదర్శులుగా, అధికారులుగా, ద్వారపాలకులుగా ఉన్నారు.+ 14  యెహోవా మందిరానికి తీసుకురాబడిన డబ్బును+ వాళ్లు బయటికి తెస్తుండగా, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం+ యాజకుడైన హిల్కీయాకు కనిపించింది.+ 15  హిల్కీయా అప్పుడు కార్యదర్శి అయిన షాఫానుతో, “యెహోవా మందిరంలో నాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది” అని చెప్పి ఆ గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు. 16  షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకొచ్చి ఇలా అన్నాడు: “నీ సేవకులు వాళ్లకు అప్పగించిన పనంతటినీ చేస్తున్నారు. 17  వాళ్లు యెహోవా మందిరంలో ఉన్న డబ్బును సేకరించి,* దాన్ని పర్యవేక్షకులకు, పనివాళ్లకు ఇచ్చారు.” 18  కార్యదర్శి అయిన షాఫాను రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చాడు.”+ తర్వాత షాఫాను ఆ గ్రంథాన్ని రాజు ముందు చదవడం మొదలుపెట్టాడు.+ 19  ధర్మశాస్త్రంలోని మాటలు వినగానే రాజు తన బట్టలు చింపుకున్నాడు.+ 20  తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు,+ మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శి అయిన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: 21  “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో రాయబడిన వాటిగురించి నా తరఫున, ఇశ్రాయేలులో, యూదాలో మిగిలివున్న ప్రజల తరఫున యెహోవా దగ్గర విచారణ చేయండి; మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటికీ లోబడలేదు. అలా వాళ్లు యెహోవా ఆజ్ఞల్ని పాటించలేదు కాబట్టి యెహోవా తీవ్రమైన కోపం మనమీద కుమ్మరించబడబోతుంది.”+ 22  అప్పుడు హిల్కీయా, అలాగే రాజు పంపించినవాళ్లు హుల్దా అనే ప్రవక్త్రి+ దగ్గరికి వెళ్లారు. ఆమె, బట్టల గది మీద అధికారైన షల్లూము భార్య. షల్లూము హర్హషు మనవడు, తిక్వా కుమారుడు. హుల్దా యెరూషలేములోని రెండో భాగంలో నివసిస్తోంది; వాళ్లు అక్కడ ఆమెతో మాట్లాడారు.+ 23  ఆమె వాళ్లతో ఇలా అంది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘మిమ్మల్ని నా దగ్గరికి పంపించిన వ్యక్తితో ఇలా చెప్పండి: 24  “యెహోవా చెప్పేదేమిటంటే, ‘నేను ఈ స్థలం మీదికి, దాని నివాసుల మీదికి విపత్తు తీసుకొస్తాను,+ వాళ్లు యూదా రాజు ముందు చదివిన ఆ గ్రంథంలో రాయబడిన శాపాలన్నీ తీసుకొస్తాను.+ 25  వాళ్లు నన్ను విడిచిపెట్టి,+ వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తూ తమ చేతి పనులన్నిటితో నాకు కోపం తెప్పించారు.+ కాబట్టి ఈ స్థలం మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను, అది ఆరిపోదు.’ ”+ 26  యెహోవా దగ్గర విచారణ చేయమని మిమ్మల్ని పంపించిన యూదా రాజుకు మీరు ఇలా చెప్పాలి, ‘నువ్వు విన్న మాటల+ గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే: 27  “ఈ స్థలం గురించి, దాని నివాసుల గురించి దేవుడు చెప్పిన మాటల్ని విన్నప్పుడు నీ హృదయం స్పందించింది, దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు; నువ్వు నా ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ బట్టల్ని చింపుకొని నా ఎదుట ఏడ్చావు కాబట్టి నేను నీ ప్రార్థన విన్నాను+ అని యెహోవా చెప్తున్నాడు. 28  అందుకే నేను నిన్ను నీ పూర్వీకుల దగ్గరికి చేరుస్తాను,* నువ్వు శాంతిగా సమాధిలోకి చేర్చబడతావు; నేను ఈ స్థలం మీదికి, దాని నివాసుల మీదికి తీసుకొచ్చే విపత్తు అంతటినీ నువ్వు చూడవు.’ ” ’ ”+ వాళ్లు రాజు దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్పారు. 29  అప్పుడు రాజు కబురు పంపించి యూదా, యెరూషలేము పెద్దలందర్నీ పిలిపించాడు.+ 30  తర్వాత రాజు యూదా వాళ్లందరితో, యెరూషలేము నివాసులతో, యాజకులతో, లేవీయులతో, తక్కువవాళ్లు-గొప్పవాళ్లు అనే తేడా లేకుండా ప్రజలందరితో కలిసి యెహోవా మందిరానికి వెళ్లాడు. అతను యెహోవా మందిరంలో దొరికిన ఒప్పంద గ్రంథంలోని మాటలన్నిటినీ వాళ్లకు చదివి వినిపించాడు.+ 31  రాజు తన స్థానంలో నిలబడి, ఆ గ్రంథంలో+ రాయబడిన ఒప్పందంలోని మాటల్ని పాటిస్తూ యెహోవాను అనుసరిస్తానని, నిండు హృదయంతో, నిండు ప్రాణంతో*+ ఆయన ఆజ్ఞల్ని, జ్ఞాపికల్ని, శాసనాల్ని పాటిస్తానని యెహోవా ఎదుట ఒప్పందం చేశాడు.*+ 32  అంతేకాదు, దానికి కట్టుబడి ఉండమని అతను యెరూషలేము, బెన్యామీను వాళ్లందర్నీ ప్రోత్సహించాడు. దాంతో యెరూషలేము నివాసులు దేవునితో, అంటే తమ పూర్వీకుల దేవునితో చేసిన ఒప్పందం ప్రకారం ప్రవర్తించారు.+ 33  తర్వాత యోషీయా ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో నుండి అసహ్యమైన వాటిని* తీయించి,+ ఇశ్రాయేలులో ప్రతీ ఒక్కరు తమ దేవుడైన యెహోవాను సేవించేలా చేశాడు. అతను బ్రతికున్నంత కాలం* ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “లోహపు.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “బరువులు మోసేవాళ్ల.”
అక్ష., “బయటికి కుమ్మరించి.”
మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.
పదకోశం చూడండి.
లేదా “ఒప్పందాన్ని పునరుద్ధరించాడు.”
లేదా “విగ్రహాల్ని.”
అక్ష., “అతని రోజులన్నిట్లో.”