కుటుంబం కోసం
అభిప్రాయాలు కలవనప్పుడు
భార్యాభర్తల ఇష్టాలు, అలవాట్లు, లక్షణాలు కలవనప్పుడు వివాహ జీవితం సాఫీగా సాగకపోవచ్చు. కొన్ని సమస్యలు మరింత సున్నితంగా ఉంటాయి. వాటిలో కొన్ని ఏంటంటే:
బంధువులతో ఎంత సమయం గడపాలి
డబ్బు ఎలా ఉపయోగించాలి
పిల్లలు కనాలా వద్దా
ఈ విషయాల్లో మీ అభిప్రాయం, మీ వివాహజత అభిప్రాయం వేర్వేరుగా ఉంటే ఏం చేయవచ్చు?
మీరేం తెలుసుకోవాలి
అన్యోన్యత అంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించడం కాదు. ఎంత అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య అయినా ఏదోక విషయంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆఖరికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వాళ్ల అభిప్రాయాలు కలవకపోవచ్చు.
“మా పుట్టింటి వాళ్లందరూ కలిసి ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. శని, ఆదివారాలు మా తాతామామ్మలతో, పిన్ని, బాబాయి, అత్త, మామ, అక్కచెల్లెళ్లతో సమయం గడిపేవాళ్లం. కానీ నా భర్త తరఫు వాళ్లకు అలాంటి అలవాటు లేదు. కాబట్టి కుటుంబంతో సమయం గడిపే విషయంలో, దూరప్రాంతంలో ఉన్న బంధువులతో మాట్లాడడానికి సమయం కేటాయించే విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి.”—టమార.
“నేనూ, నా భార్య వేర్వేరు పరిస్థితుల మధ్య పెరగడం వల్ల, డబ్బును ఎలా ఉపయోగించాలనే విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉండేవి. పెళ్లయిన కొత్తలో ఈ విషయం గురించి కొన్నిసార్లు వాదించుకున్నాం కూడా. ఇద్దరం కూర్చుని చాలాసార్లు చర్చించుకున్నాకే ఒక అభిప్రాయానికి రాగలిగాం.”—టేలర్.
కొన్ని సమస్యలు రాజీపడడం వల్ల పరిష్కారం కావు. ఉదాహరణకు, అత్తామామల్లో ఒకరి ఆరోగ్యం పాడై, దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తే? లేదా భార్యాభర్తల్లో ఒకరు పిల్లలు కావాలనుకుని, మరొకరు వద్దనుకుంటే అప్పుడేంటి? a
“కొన్నిసార్లు నేనూ, నా భార్య పిల్లల్ని కనడం గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. తను పిల్లలు కావాలని బలంగా కోరుకునే కొద్దీ, మా ఇద్దరి అభిప్రాయాలు కలవడం మరింత కష్టమైంది. ఎలా రాజీపడాలో నాకు అర్థంకాలేదు.”—అలెక్స్.
అభిప్రాయాలు కలవనంత మాత్రాన వివాహ జీవితం ముగిసిపోవాల్సిన అవసరం లేదు. కొంతమంది నిపుణులు, ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మీ అభిప్రాయం, మీ వివాహజత అభిప్రాయం కలవకపోతే, అనుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా వెనకాడకండి; కావాలంటే విడాకుల దాకా వెళ్లండని చెప్తారు. కానీ అలా చేస్తే మీ భావాలకే అతిగా ప్రాముఖ్యత ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కలిసే ఉంటామని దేవుని ముందు మీరు చేసిన పెళ్లి ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది.
మీరేం చేయవచ్చు
మీ పెళ్లి ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకోండి. అలా నిర్ణయించుకుంటే, ఇద్దరూ కలిసి ఒక జట్టుగా మీ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు.
బైబిలు సూత్రం: “దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.”—మత్తయి 19:6.
ముందే జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఉదాహరణకు, భార్యాభర్తల్లో ఒకరు పిల్లలు కావాలని, మరొకరు వద్దని అనుకోవచ్చు. మీరు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే:
మీ వివాహ బంధం ఎంత బలంగా ఉందో పరిశీలించుకోండి.
బిడ్డను పెంచేటప్పుడు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునేంత బలంగా మీ వివాహబంధం ఉందా?
అమ్మానాన్నలుగా మీరు పొందే బాధ్యతలు.
పిల్లలకు ఆహారం, బట్టలు, ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేస్తే సరిపోదు; చేయాల్సినవి ఇంకా చాలా ఉంటాయి.
మీ ఆర్థిక పరిస్థితి.
ఒకవైపు మీ ఉద్యోగాన్ని, మరోవైపు కుటుంబాన్ని, ఇతర బాధ్యతల్ని చూసుకోగలరా?
బైబిలు సూత్రం: ‘మీలో ఎవరైనా ఒక భవనం కట్టాలనుకుంటే, కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో చూడడానికి ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోరా?’—లూకా 14:28.
సమస్య గురించి పూర్తిగా మాట్లాడుకోండి. అలా చేస్తే, మీ అభిప్రాయాల్లో వచ్చిన కొన్ని తేడాల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఉదాహరణకు మీ సమస్య పిల్లలు కనడం గురించైతే, పిల్లలు వద్దనుకుంటున్న వివాహజత ఇలా ప్రశ్నించుకోవాలి:
‘నేను పిల్లలు వద్దు అంటున్నప్పుడు, నా ఉద్దేశం ఎప్పటికీ వద్దనా లేదా ప్రస్తుతానికి వద్దనా?
‘నేను మంచి తల్లిగా లేదా తండ్రిగా ఉండలేనేమో అనే భయం వల్ల పిల్లలు వద్దనుకుంటున్నానా?’
‘పిల్లలు పుట్టాక నా భార్య లేదా భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తారని భయపడుతున్నానా?’
అదేవిధంగా, పిల్లలు కావాలనుకుంటున్న వివాహజత ఇలా ప్రశ్నించుకోవాలి:
‘పిల్లలు పుట్టడం వల్ల వచ్చే బాధ్యతల్ని తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నామా?’
‘పిల్లల్ని పెంచడానికి అయ్యే ఖర్చును భరించగలమా?’
బైబిలు సూత్రం: “పరలోకం నుండి వచ్చే తెలివి. . . తన మాటే నెగ్గాలనే స్వభావం లేనిది.”—యాకోబు 3:17.
మీ వివాహజత అభిప్రాయంలో ఉన్న ప్రయోజనాల్ని గుర్తించండి. ఇద్దరు వ్యక్తులు ఒకే దృశ్యాన్ని చూస్తుండవచ్చు, కానీ వేర్వేరు అభిప్రాయాలు కలిగివుండవచ్చు. అదేవిధంగా, భార్యాభర్తలు ఒకే విషయాన్ని వేర్వేరు కోణాల్లో చూసే అవకాశం ఉంది. ఉదాహరణకు, డబ్బును ఎలా ఉపయోగించాలనే విషయంలో ఇద్దరికీ వేర్వేరు ఆలోచనలు ఉండవచ్చు. కాబట్టి ఏదైనా విషయంలో మీ ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే, ముందుగా ఏ విషయాల్లో మీ అభిప్రాయాలు కలుస్తున్నాయో మాట్లాడుకోండి.
మీ ఇద్దరి లక్ష్యం ఏంటి?
మీ అభిప్రాయం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? అలాగే మీ వివాహజత అభిప్రాయం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
మీ వివాహబంధం బలంగా ఉండేలా, మీ ఇద్దరూ లేక ఎవరో ఒకరు తమ ఆలోచనను మార్చుకొని ఒకే అభిప్రాయానికి రాగలరా?
బైబిలు సూత్రం: “ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించాలి.”—1 కొరింథీయులు 10:24.
a పెద్దపెద్ద విషయాల గురించి పెళ్లికి ముందే మాట్లాడుకోవాలి. అయినప్పటికీ కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు తలెత్తవచ్చు, లేదా సమయం గడిచేకొద్దీ భార్యాభర్తల్లో ఎవరో ఒకరి ఆలోచనల్లో మార్పు రావచ్చు.—ప్రసంగి 9:11.