కుటుంబం కోసం | వివాహం
ఓర్పును ఎలా పెంచుకోవచ్చు?
“ప్రతీరోజు ఓర్పు చూపించడం భార్యాభర్తలకు ఒక పరీక్ష. పెళ్లి కాకముందు ఒంటరిగా ఉన్నప్పుడు ఓర్పు చూపించడం పెద్ద విషయం కాదనిపిస్తుంది, కానీ వివాహ జీవితంలో సంతోషం ఉండాలంటే ఆ గుణం చాలా ముఖ్యం.”—జాన్.
ఓర్పు ఎందుకు చూపించాలి?
పెళ్లి తర్వాత మీకు, మీ భర్త లేదా భార్యలో ఉన్న లోపాలే ఎక్కువగా కనిపిస్తాయి.
“పెళ్లైన కొత్తలో అన్నీ బాగుంటాయి, కానీ ఆ తర్వాత, మీ భర్త లేదా భార్యలో ఉన్న లోపాలు మీదే మనసుపెట్టడం మొదలుపెడతారు. అదే అలవాటు అయిపోతే, త్వరగా మీ ఓర్పు నశిస్తుంది.”—జెసీన.
ఓర్పు లేకపోతే మీరు ఆలోచించకుండానే మాట్లాడతారు.
“నాకెలానిపిస్తుందో వెంటనే చెప్పేస్తాను. ఆ తొందరలో అనకూడనివి కూడా అనేస్తాను. కానీ నాకు ఎక్కువ ఓర్పు ఉంటే బాగుండు, అప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది నిజంగా అంత అవసరమా కాదా అని ఆలోచించుకోగలుగుతాను, దాన్నిబట్టి అవసరమైతే మాట్లాడతాను.”—కార్మెన్.
“ప్రేమ ఓర్పు కనబరుస్తుంది” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 13:4) ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్లు ఖచ్చితంగా ఓర్పు చూపించుకుంటారని మనకు అనిపించవచ్చు. కానీ, ప్రతీసారి అలా జరగదు. పైన ప్రస్తావించబడిన జాన్ ఇలా అంటున్నాడు: “అన్ని మంచి గుణాల్లానే, కాలం గడిచే కొద్దీ ఓర్పు కూడా త్వరగా తగ్గిపోతుంది. మనలో ఓర్పు పెరగలాంటే కృషి అవసరం.”
మనం ఓర్పు ఎలా చూపించవచ్చు?
అనుకోకుండా ఏదైన జరిగి, ఓర్పు చూపించడం కష్టమైనప్పుడు ...
ఉదాహరణకు: మీ భర్త లేదా భార్య మిమ్మల్ని బాధపెట్టే ఒక మాట అన్నారు. అప్పుడు వెంటనే వాళ్లను బాధపెట్టేలా మీకు కూడా ఏదోకటి అనాలని అనిపించవచ్చు.
బైబిలు సూత్రం: “త్వరగా కోపం తెచ్చుకోకు, ఎందుకంటే అది తెలివితక్కువవాళ్లకు గుర్తు.”—ప్రసంగ 7:9, NW, అధస్సూచి.
ఓర్పు ఎలా చూపించాలి: కాస్త ఆగండి. మీరు తిరిగి ఏదైనా అనే ముందు, మీ భర్త లేదా భార్య మిమ్మల్ని బాధపెట్టాలనో, అవమానించాలనో ఆ మాటలు అనలేదని అర్థం చేసుకోండి. ఫైటింగ్ ఫర్ యూవర్ మారెజ్ అనే పుస్తకంలో ఇలా ఉంది: “మన వివాహజత చెప్పాలనుకుంటున్నది ఒకటై ఉండవచ్చు, కానీ వాళ్లు చెప్పింది ఇంకొకటై ఉండవచ్చు, దాన్ని పట్టించుకోకుండా మనం వాళ్ల మాటల్ని ఎలా అర్థం చేసుకున్నామనే దానిబట్టే తరచూ జవాబిస్తుంటాం.”
మీ భర్త లేదా భార్య నిజంగానే మిమ్మల్ని బాధపెట్టాలని మాట్లాడినా, ఓర్పు చూపిస్తూ మాటకు మాట చెప్పకుండా ఉండండి. అప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవ్వకుండా ఉంటుంది. “కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును” అని బైబిలు చెప్తుంది.—సామెతలు 26:20.
“మీ భార్య మీకు ఒక శత్రువులా కనిపిస్తుంటే, క్షణమాగి మీరు ఆమెను ఎందుకు ప్రేమిస్తున్నారో గుర్తుచేసుకోండి. వెంటనే ఆమెకు సంతోషం కలిగించే ఏదైనా పని చేయండి.”—ఈతన్.
ఒకసారి ఆలోచించండి:
మీ వివాహజత మిమ్మల్ని బాధపెట్టేలా ఏదైనా అన్నా, చేసినా మీరేం చేస్తారు?
మళ్లీ అలా జరిగినప్పుడు మీరు ఇంకా ఓర్పుగా ఉండడానికి ఏం చేయవచ్చు?
చిరాకు తెప్పించే పనిని పదేపదే చేసినప్పుడు ...
ఉదాహరణకు: మీ భర్త లేదా భార్య ఎప్పుడూ ఆలస్యం చేస్తుంటే, వాళ్లకోసం వేయిట్ చేసినప్పుడల్లా, మీ కోపం అంతకంతకూ పెరిగిపోతుంది.
బైబిలు సూత్రం: “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి.”—కొలొస్సయులు 3:13.
ఓర్పు ఎలా చూపించాలి: మీ అవసరాల కన్నా మీ ఇద్దరి మధ్యున్న బంధానికే ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘జరిగినదాని గురించి నేను నా భర్తతో లేదా భార్యతో గొడవపడితే మా ఇద్దరి బంధం బలపడుతుందా, లేదా బలహీనపడుతుందా?’ అలాగే, “మనమందరం ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తాం” అని కూడా మర్చిపోకండి. (యాకోబు 3:2) నిజానికి, మీరు కూడా కొన్ని విషయాలు మార్చుకోవాలి.
“నేను నా ఫ్రెండ్‌తో కొన్నిసార్లు చాలా ఓర్పుగా ఉంటాను కానీ నా భర్తతో ఉండలేకపోతాను. దానికి కారణం, ఆయనతో ఎక్కువ సమయం గడుపుతూ ఆయనలో ఉన్న లోపాలు చూడడమే అనుకుంటా. కానీ, నేను ఓర్పుగా ఉంటే ఆయన్ని ప్రేమిస్తున్నానని, గౌరవిస్తున్నానని చూపిస్తాను. కాబట్టి ఓర్పు నా వివాహంలో చాలా ముఖ్యం.”—నీయ.
ఒకసారి ఆలోచించండి:
మీ భర్త లేదా భార్య ఏదైనా తప్పు చేస్తే మీరు ఓర్పు చూపిస్తారా?
ముందుముందు మీరు ఇంకా ఓర్పుగా ఉండడానికి ఏం చేయవచ్చు?