కుటుంబం కోసం | పిల్లల్ని పెంచడం
మంచి నాన్నగా ఎలా ఉండవచ్చు?
నాన్న పాత్ర ఏంటి?
బిడ్డ పుట్టబోయే ముందు. మీరు ఇప్పుడు ఎలాంటి భర్తగా ఉంటారు అనే దాన్నిబట్టే, తర్వాత ఎలాంటి తండ్రిగా ఉంటారో తెలుస్తుంది. డు ఫాదర్స్ మ్యాటర్? అనే పుస్తకం ఇలా చెప్తుంది:
“కడుపుతో ఉన్న భార్య కోసం ఏ భర్త అయితే అవసరమైనవి కొంటాడో, హాస్పిటల్‌కి తీసుకెళ్తాడో, స్కానింగ్‌లో బిడ్డ కదలికల్ని చూస్తాడో లేదా బిడ్డ గుండె చప్పుడు వింటాడో, అతను బిడ్డ పుట్టిన తర్వాత తన భార్యని, బిడ్డని బాగా చూసుకుంటాడని చెప్పవచ్చు.”
“నా భార్య కడుపుతో ఉన్నప్పుడు తను ఒక్కతే భారం మోస్తున్నట్టు, కష్టపడుతున్నట్టు అనిపించకుండా ఉండడానికి నా చేతనైన సహాయం చేశాను. మేమిద్దరం కలిసి, పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ ముందే సిద్ధంచేశాం కూడా. బిడ్డ కోసం ఎదురుచూసిన ఆ సమయమంతా మా ఇద్దరికి మధుర క్షణాలు.”—జేమ్స్.
బైబిలు సలహా: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 2:4.
బిడ్డ పుట్టిన తర్వాత. మీ బిడ్డతో కలిసి ఆడుకోండి, కాసేపు ఎత్తుకోండి. అలా చేస్తే మీకూ, మీ బిడ్డకు మధ్య ఒక మంచి బంధం ఏర్పడుతుంది. అంతేకాదు, వాళ్ల ఆలనాపాలనా చూసుకోవడంలో సహాయం చేయండి. ఒక తండ్రిగా మీరు మీ బిడ్డను ఎంత ఎక్కువ పట్టించుకుంటే, వాళ్లు అంత మంచిగా ఎదుగుతారు. మీ బిడ్డతో మీరు పెంచుకునే బంధాన్ని బట్టి, తనను మీరు ఎంత అపురూపంగా చూస్తున్నారో తెలుస్తుంది.
“మీరూ పిల్లల్లా మారిపోండి. వాళ్లతో ఆడండి. అల్లరి చేయండి. సరదాగా ఉండండి. మీ పిల్లలకు ప్రేమ పరిచయం అయ్యేదే మీ నుండి అని గుర్తుపెట్టుకోండి.”—రిచర్డ్.
బైబిలు సలహా: “పిల్లలు యెహోవా ఇచ్చే ఆస్తి; గర్భఫలం ఆయనిచ్చే బహుమతి.”—కీర్తన 127:3.
మీ బిడ్డ పెరిగి పెద్దౌతున్నప్పుడు. నాన్న చుట్టూ తిరిగే పిల్లలు స్కూల్లో బాగా చదువుతారని, మానసిక సమస్యలు తక్కువ ఉంటాయని, డ్రగ్స్ లేదా నేరాల జోలికి వెళ్లకుండా ఉంటారని పరిశోధనలో తేలింది. అందుకే, మీ పాప లేదా బాబుతో సమయం గడుపుతూ వాళ్లకు ఫ్రెండ్స్ అవ్వండి.
“మా అబ్బాయి వేరేచోట స్థిరపడిన తర్వాత, అంతకుముందు మేము సరదాగా బయటికి వెళ్లినప్పుడు లేదా కలిసి భోజనం చేస్తున్నప్పుడు చెప్పుకున్న కబుర్లను బాగా మిస్ అవుతానని నాతో చెప్పాడు. మేము అలా ఎక్కువ సమయం గడపడం వల్ల మాకు తెలీకుండానే, ముఖ్యమైన విషయాల్ని కూడా మనసువిప్పి మాట్లాడుకునేవాళ్లం.”—డెన్నిస్.
బైబిలు సలహా: “మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివితక్కువవాళ్లలా కాకుండా తెలివిగలవాళ్లలా నడుచుకోండి, మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.”—ఎఫెసీయులు 5:15, 16.
నాన్నకున్న ప్రత్యేకత
సాధారణంగా నాన్న కుటుంబాన్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అమ్మ అయితే కుటుంబానికి ప్రేమను పంచుతుంది, వాళ్ల అవసరాల్ని పట్టించుకుంటుంది. (ద్వితీయోపదేశకాండం 1:31; యెషయా 49:15) కొన్ని కుటుంబాల్లో అమ్మే నాన్న పాత్ర కూడా పోషించవచ్చు, లేదా నాన్నే అమ్మ పాత్ర కూడా పోషించవచ్చు. అయితే కొంతమంది పరిశోధకులు ఏమంటున్నారంటే అమ్మ పాత్ర, నాన్న పాత్ర దేనికదే ప్రత్యేకమైనది; ఆ రెండూ ఒక కమ్మని వంటకంలో ఉండే రెండు ప్రత్యేకమైన దినుసుల లాంటివి. a
ఈ విషయం గురించే చెప్తూ, కుటుంబాల మీద అధ్యయనం చేసే జుడిత్ వాలర్స్టిన్ అనే నిపుణురాలు తన సొంత అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఆమె తన పుస్తకంలో ఇలా రాసింది: “మా పన్నెండు సంవత్సరాల అమ్మాయిని కార్ గుద్దినప్పుడు, ఆంబులెన్స్‌లో తనతోపాటు వాళ్ల నాన్న రావాలని కోరుకుంది. ఎందుకంటే, వాళ్ల నాన్న వస్తే తనకు ధైర్యంగా ఉంటుంది. తర్వాత హాస్పిటల్లో, రోజంతా నేను తన పక్కనే ఉండి, తనను చూసుకోవాలని కోరుకుంది.” b
‘అమ్మ ఒంటరిగా చేయలేని పనిని నాన్న చేస్తాడు. అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ల జీవితాల్లో ఏ అలజడి లేకుండా నడిపిస్తాడు. మరోవైపు అమ్మ, పిల్లల మీద ప్రేమ చూపిస్తూ, వాళ్లని అర్థం చేసుకుంటూ, వాళ్లు చెప్పేదంతా వింటుంది. నిజానికి కుటుంబాన్ని నడిపించాలంటే అమ్మానాన్న ఇద్దరూ కలిసి ఒక జట్టులా పనిచేయాలి.’—డానియెల్.
బైబిలు సలహా: “నా కుమారుడా, మీ నాన్న క్రమశిక్షణను స్వీకరించు, మీ అమ్మ ఉపదేశాన్ని విడిచిపెట్టకు.”—సామెతలు 1:8.
తండ్రీ కూతుళ్ల అనుబంధం
భవిష్యత్తులో తన జీవితంలోకి రాబోయే అబ్బాయి నుండిగానీ, సమాజంలోని ఇతర పురుషుల నుండిగానీ తాను ఎలాంటి గౌరవాన్ని-అభిమానాన్ని సంపాదించుకోవాలో, తండ్రిగా మీరు మీ అమ్మాయికి నేర్పిస్తారు. దాన్ని ఆమె రెండు విధాలుగా నేర్చుకుంటుంది:
మీరు మీ భార్యతో ఎలా ఉంటున్నారో గమనిస్తుంది. మీరు మీ భార్యను ప్రేమించడం, గౌరవించడం మీ అమ్మాయి గమనించినప్పుడు, భవిష్యత్తులో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఎలాంటి లక్షణాల్ని చూడాలో ఆమెకు అర్థమౌతుంది.—1 పేతురు 3:7.
మీరు తనతో ఎలా ఉంటున్నారో గమనిస్తుంది. మీరు మీ అమ్మాయిని గౌరవిస్తే, ఆమె కూడా తనను తాను గౌరవించుకోవడం నేర్చుకుంటుంది. అలాగే ఇతరుల దగ్గర, భవిష్యత్తులో తనకు పెళ్లైనప్పుడు తన భర్త దగ్గర ఎలాంటి గౌరవం సంపాదించుకోవాలో కూడా తెలుసుకుంటుంది.
మరోవైపు, నాన్న తన కూతుర్ని ఎప్పుడూ బాధపెట్టేలా మాట్లాడుతుంటే ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటుంది. దాంతో నెమ్మదిగా ఆమె బయట ఎవరైనా అబ్బాయికి దగ్గరవ్వవచ్చు. కానీ ప్రమాదం ఏంటంటే, ఆ అబ్బాయికి మంచి ఉద్దేశాలు ఉండకపోవచ్చు.
“నాన్న ప్రేమ, అండదండలు ఉన్న కూతురు మంచి లక్షణాలు లేని వ్యక్తి మాయలో అంత తేలిగ్గా పడిపోదు.”—వేన్.