కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ఎక్సర్‌సైజ్‌ చేయాలనే కోరికను ఎలా పెంచుకోవాలి?

ఎక్సర్‌సైజ్‌ చేయాలనే కోరికను ఎలా పెంచుకోవాలి?

 నేను ఎందుకు ఎక్సర్‌సైజ్‌ చేయాలి?

 కొన్ని దేశాల్లో యౌవనస్థులు ఎక్సర్‌సైజ్‌ లేదా వ్యాయామం చేయడానికి చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. దానివల్ల వాళ్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ‘శారీరక వ్యాయామం ప్రయోజనకరం’ అని బైబిలు చెప్పడానికి సరైన కారణాలే ఉన్నాయి. (1 తిమోతి 4:8) అవేంటంటే:

  •   ఎక్సర్‌సైజ్‌ చేస్తే మీ మూడ్‌ బాగుంటుంది. ఎక్సర్‌సైజ్‌ చేసినప్పుడు మెదడుకు సంబంధించిన ఎండార్ఫిన్స్‌ అనే రసాయనాలు విడుదలౌతాయి. వాటివల్ల మీకు ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఎక్సర్‌సైజ్‌ అనేది కృంగుదలకు (డిప్రెషన్‌కు) సహజ సిద్ధమైన విరుగుడు (మెడిసిన్‌) అని కొందరు అంటారు.

     “ఉదయాన్నే లేచి రన్నింగ్‌కు వెళ్తే రోజంతా హుషారుగా, ఆనందంగా పనిచేస్తాను. రన్నింగ్‌ చేయడం వల్ల నేను సంతోషంగా ఉంటాను.”—రెజీనా

  •   ఎక్సర్‌సైజ్‌ వల్ల మీ శరీరాకృతి చక్కగా తయారౌతుంది. తగినంత ఎక్సర్‌సైజ్‌ చేస్తే మీరు బలంగా, దృఢంగా తయారౌతారు. దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

     “సంవత్సరం క్రితం నేను కనీసం ఒక్క పుల్‌ అప్‌ కూడా చేయలేకపోయేవాన్ని, ఇప్పుడు పది పుల్‌ అప్స్‌ చేస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా, నేను నా శరీరాన్ని ఇప్పుడు బాగా చూసుకుంటున్నాని నాకనిపిస్తుంది.”—ఒలీవియ.

  •   ఎక్సర్‌సైజ్‌ చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం వల్ల గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌ వల్ల కరోనరీ ఆర్టరీ డిసీస్‌ (గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి) వచ్చే అవకాశాలు తక్కువ. ఆ వ్యాధి వల్ల చాలామంది స్త్రీపురుషులు చనిపోతున్నారు.

     “మనం రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌ చేస్తే, సృష్టికర్త మనకు ఇచ్చిన శరీరానికి విలువిచ్చిన వాళ్లమౌతాం.”—జెస్సిక.

 ఒక్కమాటలో: ఎక్సర్‌సైజ్‌ వల్ల ఇప్పుడు, భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. టోన్యా అనే అమ్మాయి ఇలా అంటోంది: “‘ఆరోజు కొండ ఎక్కడానికి వెళ్లకపోయుంటే బావుండు’ అని మీకెప్పుడూ అనిపించదు. కొన్నిసార్లు సాకులు చెప్పి ఎక్సర్‌సైజ్‌ మానేయాలి అనిపిస్తుంది. కానీ సాకులు పక్కనపెట్టి ఎక్సర్‌సైజ్‌ చేసినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు.”

ఒక కారుని పట్టించుకోకపోతే అది పనిచేయడం ఆగిపోతుంది; ఎక్సర్‌సైజ్‌ని నిర్లక్ష్యం చేస్తే మీ శరీరం కూడా సరిగ్గా పనిచేయదు

 నేను ఎందుకు ఎక్సర్‌సైజ్‌ చేయలేకపోతున్నాను?

 అందుకు రకరకాల కారణాలు ఉండవచ్చు.

  •   ఈ వయసులో అవసరం లేదు అనుకోవడం. “యౌవనంలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలమని కొందరు అనుకుంటారు. ఎందుకంటే ఆ వయసులో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. ముసలివాళ్లకే అనారోగ్య సమస్యలు వస్తాయని మీరు అనుకుంటారు.”—సోఫియ.

  •   సమయం లేకపోవడం. “బిజీ జీవితం వల్ల సరిగా తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం ఉండట్లేదు, ఇంక ఎక్సర్‌సైజ్‌ చేయడానికి సమయం దొరకడం చాలా కష్టం.”—క్లారిస్స.

  •   జిమ్‌ ఫీజులు ఎక్కువగా ఉండడం. “ఫిట్‌గా ఉండడం అనేది ఖర్చుతో కూడిన పని. జిమ్‌కు వెళ్లాలంటే డబ్బు కావాలి.”—జీన.

 ఆలోచించండి:

 ముఖ్యంగా ఏ కారణం వల్ల మీరు ఎక్సర్‌సైజ్‌ చేయలేకపోతున్నారు? ఆ కారణాన్ని దాటి ముందుకు వెళ్లాలంటే కష్టపడాలి, కానీ దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి.

 నాకు అవసరమైన ఎక్సర్‌సైజ్‌ చేయడం ఎలా?

 ఈ సలహాలు పరిశీలించండి:

  •   మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.—గలతీయులు 6:5.

  •   సాకులు చెప్పడం మానేయండి. (ప్రసంగి 11:4) ఉదాహరణకు, ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టాలంటే, డబ్బులు కట్టి జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు బాగా నచ్చిన ఎక్సర్‌సైజ్‌ ఏంటో గుర్తించి, రోజూ దాన్ని చేయడం అలవాటు చేసుకోండి.

  •   వేరేవాళ్లను అడిగి, వాళ్లు ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారో తెలుసుకోండి.—సామెతలు 20:18.

  •   ఒక షెడ్యూల్‌ వేసుకుని, దాన్ని ఖచ్చితంగా పాటించండి. కొన్ని లక్ష్యాలు పెట్టుకుని, మీరు ఏమేం సాధించారో రాసుకుంటూ ఉండండి.—సామెతలు 21:5.

  •   మీతో కలిసి ఎక్సర్‌సైజ్‌ చేసే స్నేహితుడిని సంపాదించుకోండి. అతను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మీరు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌ చేసేలా సహాయం చేస్తాడు.—ప్రసంగి 4:9, 10.

  •   అప్పుడప్పుడు ఆటంకాలు వస్తాయి, కానీ మానకుండా ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఉండండి.—సామెతలు 24:10.

 మరీ అతిగా చేయకండి

 ఆడవాళ్లయినా, మగవాళ్లయినా “అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి” అని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 3:2, 11) కాబట్టి ఎక్సర్‌సైజ్‌ కూడా మితంగా చేయండి. మరీ అతిగా ఎక్సర్‌సైజ్‌ చేసేవాళ్లు సాధించేది ఏమీ ఉండదు. “ఒకబ్బాయికి కండలు తిరిగిన శరీరం ఉండి, తెలివితేటలు అంతగా లేకపోతే, అతను ఆకర్షణీయంగా కనిపించడు” అని జూలియ అనే అమ్మాయి అంటోంది.

 ఫిట్‌నెస్‌ గురించిన కొన్ని పోస్టర్‌లలో ఇలా రాస్తారు: “ఇక నావల్ల కాదు, చచ్చిపోయేలా ఉన్నాను అనిపించినప్పుడు, ఇంకో పది చేసిగానీ ఆపకండి.” అలాంటివి పాటించకండి. దానివల్ల మీ శరీరానికి నష్టం జరగవచ్చు, మీరు ఎక్కువ ప్రాముఖ్యమైన విషయాల మీద మనసు పెట్టలేకపోవచ్చు.—ఫిలిప్పీయులు 1:10.

 అంతేకాదు, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి చెప్పే కొన్ని మాటలు మిమ్మల్ని నిరుత్సాహపర్చగలవు కూడా. వెరా అనే అమ్మాయి ఈ విషయాన్ని గమనించింది: “చాలామంది అమ్మాయిలు తాము ఎవరిలా కనిపించాలని అనుకుంటారో, వాళ్ల ఫోటోల్ని సేకరిస్తారు. ఫిట్‌గా ఉండాలి అనే కోరిక తగ్గినప్పుడు వాటిని చూస్తారు. కానీ చివరికి వాళ్లతో పోల్చుకుని నిరుత్సాహంలో కృంగిపోతారు. కాబట్టి కేవలం మీరు కనిపించే తీరును కాదు, మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలనే లక్ష్యం పెట్టుకోవడం మంచిది.”