యువత అడిగే ప్రశ్నలు
ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి?
“ఊరికే ఏమున్నాయో చూద్దామని నేను ఈ మధ్యే ఒక షాపుకి వెళ్లాను. అక్కడ ఒక ఖరీదైన వస్తువు కొన్నాను. నిజానికి ఆ వస్తువు కొనాలనే ఉద్దేశమే నాకు లేదు!”—కాలన్.
తక్కువ ఖర్చుపెట్టడం తనకు రాదని కాలన్ చెప్తున్నాడు. మీకూ అలాంటి సమస్య ఉందా? అలాగైతే, ఈ ఆర్టికల్ మీకు సహాయం చేస్తుంది.
ఖర్చులు ఎందుకు తగ్గించుకోవాలి?
అపోహ: మీరు డబ్బును ఎలా ఖర్చుపెడుతున్నారనే దానిగురించి ఆలోచిస్తే మీ స్వేచ్ఛ తగ్గిపోతుంది.
నిజం: ఖర్చులను తగ్గించుకోవడం వల్ల మీ స్వేచ్ఛ తగ్గదుగానీ పెరుగుతుంది. “డబ్బు విలువ గురించి మీకెంత ఎక్కువ తెలిస్తే, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో మీకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బు ఉంటుంది” అని ఐయమ్ బ్రోక్! ద మనీ హాండ్‌బుక్ అనే పుస్తకం చెప్తుంది.
ఆలోచించండి: మీ ఖర్చులను తగ్గించుకోవడం వల్ల . . .
మీకు అవసరమైనప్పుడు ఎక్కువ డబ్బు ఉంటుంది. “భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు నేను దక్షిణ అమెరికా వెళ్లాలనుకుంటున్నాను. కాబట్టి నేను కొంత డబ్బు పక్కనపెట్టినప్పుడల్లా, ఆ లక్ష్యాన్ని మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను” అని ఈనెజ్ అనే టీనేజ్ అమ్మాయి అంటోంది.
ఎక్కువ అప్పులు ఉండవు (లేదా అస్సలు అప్పులు ఉండవు). బైబిలు ఇలా చెప్తుంది: “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” (సామెతలు 22:7) ఆన అనే ఒక యువతి ఆ మాటలతో ఏకీభవిస్తోంది. ఆమె ఇలా అంటోంది, “మీకు అప్పు ఉంటే వేరేవాటి మీద మనసుపెట్టలేరు. అప్పులు లేకపోతే ప్రశాంతంగా మీ లక్ష్యాల మీద మనసుపెట్టగలుగుతారు.”
మీరు పరిణతి చెందారని చూపిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్లు పెద్దవాళ్లయ్యాక మంచి నిర్ణయాలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ‘భవిష్యత్తులో నేను నా కాళ్లమీద నిలబడడానికి ఇది నాకొక మంచి శిక్షణ. ఇప్పటినుండే డబ్బు విషయంలో బాధ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అలా ఉంటేనే భవిష్యత్తులో కూడా ఉండగలుగుతాను’ అని 20 ఏళ్ల జీన్ అనే అమ్మాయి చెప్తోంది.
ఒక్కమాటలో: “మీ కాళ్లమీద మీరు నిలబడాలంటే మీరు వేయాల్సిన మొదటి అడుగు డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం. డబ్బును జాగ్రత్తగా వాడడం ఒక కళ, దానివల్ల మీకు జీవితాంతం మేలు జరుగుతుంది” అని ద కంప్లీట్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్: ఫర్ టీనేజర్స్ అండ్ కాలెజ్ స్టూడెంట్స్ పుస్తకం చెప్తోంది.
ఎలా చేయవచ్చు?
మీ బలహీనతలను తెలుసుకోండి. మీ దగ్గర తరచూ డబ్బు ఉండట్లేదంటే, ముందు ఆ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసుకోండి. కొంతమంది ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు వాళ్ల డబ్బు ఇట్టే ఖర్చు అయిపోతుంది. ఇంకొంతమంది, అప్పుడు కొంత అప్పుడు కొంత ఖర్చు చేయడంవల్ల నెల ఆఖరు వచ్చేసరికి వాళ్ల పర్సులు ఖాళీ అయిపోతాయి.
“మనం రోజూ చేసే చిన్నచిన్న ఖర్చులన్నిటినీ కలిపితే అది పెద్ద మొత్తం అవుతుంది. వీళ్లకొక గిఫ్ట్, వాళ్లకొక గిఫ్ట్ కొనడం, రెస్టారెంట్‌కు వెళ్లడం, సరుకులకు వెళ్లినప్పుడు ఏదోకటి అదనంగా కొనడం లాంటివి జరుగుతుంటాయి. నెల చివరికి వచ్చేసరికి, అప్పుడే వంద డాలర్లు అయిపోయాయా అనుకుంటాం!”—హేలీ.
బడ్జెట్ వేసుకోండి. బైబిలు ఇలా చెప్తోంది: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” (సామెతలు 21:5) బడ్జెట్ వేసుకోవడం వల్ల, మీ ఆదాయానికి మించిన ఖర్చులు చేయకుండా ఉంటారు.
“ఒకవేళ మీరు ఆదాయానికి మించి ఖర్చుపెడితే, మీ డబ్బు ఎక్కడ వృథా అవుతుందో చూసుకొని, అవసరంలేని వాటిని తగ్గించుకోండి. ఖర్చులకు మించిన ఆదాయాన్ని మీరు సంపాదించేవరకు, మీ ఖర్చులను తగ్గించుకుంటూ ఉండండి.”—డాన్యెల్.
నిర్ణయించుకున్న విధంగా చేయండి. మీ డబ్బు ఎలా ఖర్చు అవుతుందో తెలుసుకోవడానికి, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ కిందున్న కొన్ని పద్ధతుల్ని పాటించడంవల్ల తాము ప్రయోజనం పొందామని కొంతమంది యౌవనస్థులు చెప్తున్నారు:
“నాకు డబ్బులు రాగానే వాటిని తీసుకెళ్లి బ్యాంక్‌లో వేస్తాను. ఎందుకంటే డబ్బులు అక్కడుంటే పద్దాక తీయాలనిపించదు.”—డేవిడ్.
“నేను షాప్‌కి వెళ్లినప్పుడు అవసరమైనంత డబ్బే తీసుకెళ్తాను. దానివల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చుపెట్టను.”—ఎలన్.
“ఏదైనా కొనేముందు సమయం తీసుకోవడంవల్ల, అది నాకు నిజంగా అవసరమో కాదో సరిగ్గా ఆలోచించుకోగలుగుతాను.”—జెసయ.
“ప్రతీ పార్టీకి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా దగ్గర డబ్బు లేకపోతే నేను రానని చెప్పడంలో తప్పు లేదు.”—జెనిఫర్.
ఒక్కమాటలో: డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం ఒక పెద్ద బాధ్యత. మనం మొదట్లో చూసిన కాలన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఇలా అంటున్నాడు, “భవిష్యత్తులో నేనొక కుటుంబానికి యజమాని అయినప్పుడు, డబ్బును ఇలా వేస్ట్ చేస్తే కుదరదు. నాకు పెళ్లి అవ్వకముందే డబ్బును సరిగ్గా ఉపయోగించలేకపోతే, పెళ్లి అయ్యాక చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.”
టిప్: “మీ బడ్జెట్ ప్లాన్ గురించి ఎవరికైనా చెప్పండి. మీరు దాన్ని ఎలా పాటిస్తున్నారనే దానిగురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అడగమని ఆ వ్యక్తికి చెప్పండి. లెక్క అప్పజెప్పడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.”—వనెస.