కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

సిగ్గు, మొహమాటం ఎలా తగ్గించుకోవచ్చు?

సిగ్గు, మొహమాటం ఎలా తగ్గించుకోవచ్చు?

 నష్టం: సిగ్గు, మొహమాటం వల్ల మీరు మంచి స్నేహితుల్ని, ఎన్నో మధుర క్షణాల్ని మిస్‌ అవుతారు.

 లాభం: సిగ్గు, మొహమాటం ఉండడం తప్పేమీ కాదు. ఒక విధంగా అది మీకు మంచే చేస్తుంది. ఎందుకంటే మాట్లాడే ముందు కాస్త ఆగి ఆలోచిస్తారు, అందరినీ గమనిస్తారు, ఎదుటివాళ్లు చెప్పేది వింటారు.

 మంచి విషయం ఏమిటంటే: మీకు సిగ్గు, మొహమాటం కాస్త ఎక్కువా? అయితే, వాటిని ఎలా తగ్గించుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

 ముందు మీ భయాలేంటో తెలుసుకోండి

 సిగ్గు వల్ల ఇతరుల కళ్లలోకి చూస్తూ మాట్లాడాలంటే మీ గుండె దడదడ కొట్టేసుకోవచ్చు. దానివల్ల మీరు అందరిలా లేనట్టు, ఏదో చీకట్లో ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు. దానిగురించి తలుచుకుంటేనే భయంగా అనిపిస్తుంది కదా! అయితే, మీ భయానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే వాటి నుండి బయటపడడం ఈజీ. అలాంటి మూడు కారణాల్ని ఇప్పుడు చూద్దాం.

  •   ఒక కారణం: “నాకు ఏం మాట్లాడాలో తెలీదు.”

     నిజమేంటంటే: మీరు ఏం మాట్లాడారు అనే దానికన్నా, మీతో ఉన్నప్పుడు వాళ్లకు ఎలా అనిపిస్తుంది అన్నదే ఇతరులు ఎక్కువ గుర్తుంచుకుంటారు. అందుకే ఎదుటివాళ్లు చెప్పేది ఏదో వినాలి కదా అన్నట్టు వినకుండా, శ్రద్ధగా వినండి. అలా చేస్తే, మీ భయాల్ని తగ్గించుకోవచ్చు.

     ఇలా ఆలోచించండి: మీరు ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలనుకుంటారు—వాగుడుకాయలా లొడలొడ మాట్లాడేవాళ్లతోనా లేదా మీరు మాట్లాడుతుంటే జాగ్రత్తగా వినేవాళ్లతోనా?

  •   ఇంకో కారణం: “ఇతరులు నాతో బోర్‌గా ఫీల్‌ అవుతారు.”

     నిజమేంటంటే: మీకు సిగ్గు, మొహమాటం ఉన్నా-లేకపోయినా ప్రజలు మీ గురించి ఏదో ఒకటి అనుకుంటారు. కానీ భయాన్ని తగ్గించుకొని మీరు మీలా ఉంటే, మీరు నిజంగా ఎలాంటివాళ్లో ఇతరులు తెలుసుకుంటారు, మీ మీద మంచి అభిప్రాయం కూడా రావచ్చు.

     ఇలా ఆలోచించండి: ఇతరులు మీ గురించి తప్పుగా అనుకుంటున్నారని మీకు అనిపిస్తుందా? అయితే, మీరే అలా ఊహించుకొని ఎదుటివాళ్ల గురించి తప్పుగా అనుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించండి.

  •   మరో కారణం: “సరిగ్గా మాట్లాడకపోతే అందరి ముందు అవమానంగా అనిపిస్తుంది.”

     నిజమేంటంటే: కొన్నిసార్లు, అది అందరికీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు, చిన్నచిన్న వాటిని మీరు అంత సీరియస్‌గా తీసుకోరని చూపించడానికి దాన్ని ఒక అవకాశంగా చూడండి. అప్పుడు మీ భయాన్ని తీసేసుకోగలుగుతారు.

     ఇలా ఆలోచించండి: ఇలాంటి చిన్న విషయాలను సీరియస్‌గా తీసుకోని వ్యక్తితో మీరు స్నేహం చేయాలనుకుంటారు కదా!

 మీకు తెలుసా? కొందరు మెసేజెస్‌లో బాగానే మాట్లాడతారు కాబట్టి, వాళ్లకు మరీ అంత సిగ్గు, మొహమాటం లేవని అనుకుంటారు. కానీ, ఎవరితోనైనా డైరక్ట్‌గా మాట్లాడినప్పుడే నిజమైన ఫ్రెండ్స్‌గా చేసుకోగలుగుతాం. సైకాలజిస్ట్‌ అలాగే టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌ అయిన షెర్రి టర్కల్‌ ఇలా రాశాడు: “ఒకరినొకరు డైరక్ట్‌గా చూసుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు వాళ్లకు బాగా కనెక్ట్‌ అవుతాం.” a

ఒక్కసారి మీ భయాల్ని తీసేసుకుంటే, నలుగురితో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే ఇంతకు ముందులా భయపడరు

 ఇలా చేయవచ్చు

  •   ఇతరులతో పోల్చుకోకండి. మీరు అందరితో గలగలా మాట్లాడేయాల్సిన అవసరం లేదు. జస్ట్‌ మీ సిగ్గుని, మొహమాటాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలు. దాన్ని మీరు లక్ష్యంగా పెట్టుకుంటే మంచి స్నేహాల్ని, మధుర క్షణాల్ని మిస్‌ అవ్వకుండా ఉంటారు.

     మీరు గంటలు-గంటలు మాట్లాడనక్కర్లేదు లేదా పార్టీలో సందడి అంతా మీదే అవ్వాల్సిన అవసరం లేదు. కొత్తవాళ్లను పరిచయం చేసుకోండి లేదా చిన్నచిన్న ప్రశ్నలు అడగండి.—అలిషియా.

     బైబిలు సలహా: “ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి, అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గలతీయులు 6:4.

  •   బాగా గమనించండి. కలివిడిగా ఉండేవాళ్లను, వాళ్ల మాటల్ని గమనించండి. వాళ్లు అలా ఉండడానికి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు? వాళ్లలో ఉండే ఏ నైపుణ్యాన్ని మీరు నేర్చుకోవాలని అనుకుంటున్నారు?

     “ఇట్టే ఫ్రెండ్స్‌ చేసుకునేవాళ్లను గమనించండి, వాళ్ల నుండి నేర్చుకోండి. ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు వాళ్లు ఏం మాట్లాడుతున్నారో, ఎలా ఉంటున్నారో గమనించిండి.”—ఆరోన్‌.

     బైబిలు సలహా: “ఇనుము ఇనుముకు పదునుపెట్టినట్టు ఒక వ్యక్తి తన స్నేహితునికి పదునుపెడతాడు.”—సామెతలు 27:17.

  •   ప్రశ్నలు అడగండి. సహజంగా అందరూ అభిప్రాయాల్ని చెప్పడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇతరులతో మాటలు కలపడానికి ఒక మంచి పద్ధతి ఏంటంటే, ప్రశ్నలు అడగడం. అప్పుడు అందరి ఫోకస్‌ మీమీద ఉండదు.

     ముందుగానే ప్రిపేర్‌ అయితే కాస్త టెన్షన్‌ తగ్గుతుంది. ఏదైనా ఒక పార్టీకి లేదా నలుగురూ కలిసే చోటుకి వెళ్లే ముందు కొన్ని టాపిక్‌లు, ప్రశ్నలు ఆలోచించి పెట్టుకోండి. అప్పుడు మీకు కొత్తవాళ్లతో మాట్లాడడం కష్టంగా అనిపించదు.—ఎలేనా.

     బైబిలు సలహా: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 2:4.

a రిక్లెయిమింగ్‌ కాన్వర్సేషన్‌ పుస్తకం చెప్తుంది.