కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

స్కూలు అంటేనే నచ్చకపోతే?

స్కూలు అంటేనే నచ్చకపోతే?

 స్ట్రిక్ట్‌గా ఉండే టీచర్లు, ఏడిపించే క్లాస్‌మేట్స్‌, తల బాదుకునే పరీక్షలు, బండెడు బండెడు హోమ్‌వర్క్‌లు. వీటన్నిటిని బట్టి మీకు స్కూలంటే నచ్చకపోతే, అది మామూలే. a రేచెల్‌ b అనే టీనేజీ అమ్మాయి ఇలా అంటుంది:

 “నేను స్కూల్లో తప్పించి ఎక్కడైనా ఉంటా. బీచ్‌లో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా, ఆఖరికి అమ్మానాన్నలకు వంటలో, ఇంటి పనుల్లో సహాయం చేయమన్నా చేస్తా!”

 మీ మనసులో మాటే రేచెల్‌ నోట్లో నుండి వచ్చినట్టు అనిపిస్తుందా? స్కూల్‌ ఒక జైలు అని, అందులో నుండి విడుదలయ్యే వరకు భరించడం తప్ప ఇంక చేసేదేం లేదని మీకు అనిపించవచ్చు. కానీ స్కూల్‌ జీవితాన్ని వేరేలా ఏమైనా చూడొచ్చా?

 మీకు తెలుసా? మీరు స్కూల్‌ మీద మంచి అభిప్రాయం పెంచుకుంటే, కష్టంగా కాదు గానీ ఇష్టంగా వెళ్తారు. అప్పుడు స్కూల్‌ మీకు జైలులా కనిపించదు, మీ నైపుణ్యాల్ని సానబెట్టుకునే వేదికలా కనిపిస్తుంది. ఆ నైపుణ్యాలు పెద్దయ్యాక మీకు పనికొస్తాయి.

 స్కూల్‌ మీద ఇష్టం పెంచుకోవడానికి, ఈ విషయాలు ఆలోచించండి:

 చదువు. మీరు ఎంతెక్కువ నేర్చుకుంటే మీ పనిలో, జీవితంలో వచ్చే సమస్యల్ని అంత బాగా పరిష్కరించగలుగుతారు. పొద్దాక వేరేవాళ్ల సాయం అడగాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘స్కూల్‌ గురించి నాకు కొన్ని విషయాలు నచ్చకపోయినా, అక్కడ నేను ఏమేం మంచి విషయాలు నేర్చుకుంటున్నాను?’

 బైబిలు సలహా: “తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో.”—సామెతలు 3:21.

 ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “ఎగ్జామ్‌లో ఫెయిలైతే ఏం చేయాలి?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్‌ చూడండి.

 అలవాట్లు. స్కూల్లో ఒక రొటీన్‌కి అలవాటు పడతారు కాబట్టి దానివల్ల టైం పాటించడం, క్రమశిక్షణతో ఉండడం, కష్టపడి పనిచేయడం మీకు ఒంటపడతాయి. ఆ లక్షణాలు పెద్దయ్యాక మీకు చాలా ఉపయోగపడతాయి. ఇలా ప్రశ్నించుకోండి: ‘ముందుముందు మంచి పనిమంతుడిగా తయారవ్వడానికి, క్రమశిక్షణతో ఉండడానికి స్కూల్‌ రొటీన్‌ నాకెలా సహాయం చేస్తుంది? ఇంకా ఈ విషయంలో నేనేం మార్పులు చేసుకోవాలి?’

 బైబిలు సలహా: “ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది.”—సామెతలు 14:23.

 ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?” అనే ఆర్టికల్‌ చూడండి.

 నలుగురితో మెలగడం. స్కూల్లో తోటి పిల్లలతో కలిసి ఉన్నప్పుడు ఎదుటివాళ్లను ఎలా గౌరవించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలుస్తుంది. జాషువా అనే అబ్బాయి ఇలా అంటున్నాడు: “స్కూల్లో హిస్టరీ, సైన్స్‌ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, ఎదుటివాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ నైపుణ్యం మనకు జీవితమంతా పనికొస్తుంది.” ఇలా ప్రశ్నించుకోండి, ‘జాతి, మతం చూడకుండా అందరితో కలుపుగోలుగా ఉండడం గురించి స్కూల్‌ ఇప్పటికే నాకు ఏం నేర్పించింది?’

 బైబిలు సలహా: “అందరితో శాంతిగా ఉండడానికి … శాయశక్తులా కృషిచేయండి.”—హెబ్రీయులు 12:14.

 ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, “నలుగురితో మాట్లాడడం ఎలా?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్‌ చూడండి.

 భవిష్యత్తు. స్కూల్‌ వల్ల మీలో దాగివున్న టాలెంట్‌ ఏంటో తెలుస్తుంది, దాన్నిబట్టి మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలో డిసైడ్‌ అవ్వొచ్చు. బ్రూక్‌ అనే అమ్మాయి ఇలా అంటుంది: “స్కూళ్లలో కొన్ని విషయాల మీద స్పెషల్‌ ట్రైనింగ్‌లు ఇస్తుంటారు. దానివల్ల చదువు అయిపోగానే మీరు జాబ్‌ కొట్టడానికి రెడీగా ఉంటారు. నా విషయంలో కూడా అదే జరిగింది.” ఈ ప్రశ్న వేసుకోండి: ‘చదువు అయిపోయాక నా కాళ్లమీద నేను నిలబడడానికి ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను? ఆ ఉద్యోగానికి పనికొచ్చేలా నేను ఏం చదవాలి?’

 బైబిలు సలహా: “మీరు ఎటు వెళ్తున్నారో తెలుసుకోండి.”—సామెతలు 4:26, కాన్‌టెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌.

a ఈ ఆర్టికల్‌లో చెప్పిన చాలా సలహాలు, ఇంట్లో ఉండే చదువుకుంటున్న వాళ్లకు కూడా ఉపయోగపడతాయి.

b కొన్ని పేర్లు మార్చాం.