వాళ్లలా విశ్వాసం చూపించండి | మిర్యాము
“యెహోవాకు పాట పాడండి“!
ఒక అమ్మాయి ఎవరి కంటా పడకుండా, జమ్ముగడ్డి చాటున నిలబడి చూస్తుంది. మెల్లగా పారుతున్న నైలు నదిలో, ఆ అమ్మాయి ఊపిరి బిగపట్టుకుని నిల్చుంది. తన చుట్టూ పురుగులు ముసురుతున్నా, చాలాసేపటి నుండి కదలకుండా అలాగే చూస్తూ ఉంది. తన కళ్లన్నీ ఒక పెట్టె మీద ఉన్నాయి. నీళ్లు వెళ్లకుండా తయారుచేసిన ఆ పెట్టెలో పసిపిల్లాడైన తన తమ్ముడు ఉన్నాడు. నీళ్లలో అలా అనాథగా ఉన్న తన తమ్ముడిని చూసి ఆ అమ్మాయి కడుపు తరుక్కుపోయి ఉంటుంది. అయినా, తన అమ్మానాన్నలు చేసిన ఈ పని సరైనదేనని ఆ అమ్మాయికి తెలుసు. ఎందుకంటే, జరుగుతున్న దారుణం నుండి తన తమ్ముడిని కాపాడాలంటే ఇది ఒక్కటే దారి.
ఈ అమ్మాయి వయసుకు మించిన ధైర్యం చూపించింది. ముందుముందు ఇంకా చూపిస్తుంది. అప్పుడప్పుడే తన లేత మనసులో విశ్వాసం అనే ఒక అందమైన లక్షణం చిగురిస్తుంది. ఇప్పుడు చేయబోయే ఒక పనిలో అలాగే తన జీవితం మొత్తంలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విశ్వాసం వల్లే వయసుపైబడ్డాక కూడా, ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాల్ని చూడగలిగింది. అంతేకాదు, తను చేసిన ఒక పెద్ద తప్పును దిద్దుకోగలిగింది. ఇంతకీ, ఆమె ఎవరు? ఆమె విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
బానిసత్వంలో పెరిగింది
బాబుకు కాపలాగా నిల్చున్న అమ్మాయి పేరు ఏంటో ఆ సందర్భంలో బైబిలు చెప్పట్లేదు. కానీ తను ఎవరో మనకు తెలుసు. తన పేరు మిర్యాము. తను ఐగుప్తులో బానిసలుగా ఉన్న అమ్రాము, యోకెబెదు అనే హెబ్రీ జంటకు పుట్టిన మొదటి సంతానం. (సంఖ్యాకాండం 26:59) ఆ పెట్టెలో ఉన్న తన తమ్ముడికి తర్వాత మోషే అని పేరు పెట్టారు. ఆ బాబుకి అహరోను అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అప్పటికి అహరోను వయసు దాదాపు మూడు ఏళ్లు. మిర్యాముకు ఎంత వయసు ఉంటుందో మనకు ఖచ్చితంగా తెలీదుగానీ, పదేళ్లు కంటే తక్కువే అని చెప్పవచ్చు.
మిర్యాము చాలా గడ్డు పరిస్థితుల మధ్య పెరిగింది. తన ప్రజలైన హెబ్రీయుల నుండి ఆపద వస్తుందని ఐగుప్తీయులు అనుకున్నారు. అందుకే, వాళ్లను బానిసలుగా చేసుకొని, అణచివేశారు. అయినా, వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోవడంతో భయపడిన ఐగుప్తీయులు దారుణమైన ఒక కుట్ర పన్నారు. హెబ్రీయులకు పుట్టిన ప్రతీ మగబిడ్డను వెంటనే చంపేయమని ఫరో ఆజ్ఞాపించాడు. కానీ షిఫ్రా, పూయా అనే ఇద్దరు మంత్రసానులు గుట్టుగా మగపిల్లల్ని బ్రతకనిచ్చారు. ఆ ఇద్దరు స్త్రీలు చూపించిన విశ్వాసం గురించి మిర్యాము ఖచ్చితంగా వినే ఉంటుంది.—నిర్గమకాండం 1:8-22.
మిర్యాము తన అమ్మానాన్నలు చూపించిన విశ్వాసాన్ని కూడా గమనించి ఉంటుంది. అందంగా ఉన్న తమ మూడో బిడ్డ పుట్టాక అమ్రాము, యోకెబెదు మూడు నెలల పాటు పిల్లాడిని దాచిపెట్టారు. ఫరో ఆజ్ఞకు భయపడి వాళ్లు ఆశలు వదిలేసుకోలేదు. (హెబ్రీయులు 11:23) అయితే, అలా ఎక్కువ రోజులు పసిపిల్లాడిని దాచి ఉంచడం అంత తేలికైన పని కాదు. అందుకే, మనసుకు కష్టంగా అనిపించినా వాళ్లు తమ బాబు విషయంలో త్వరగా ఏదో ఒకటి చేయాలి. ఆ బాబును కాపాడగలిగే, పెంచగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి కంట్లో పడేలా చేయాలని యోకెబెదు అనుకుంది. ఆమె జమ్ముగడ్డితో ఒక పెట్టెను తయారుచేసి, దాంట్లోకి నీళ్లు వెళ్లకుండా తారు, కీలు పూసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన బిడ్డను అందులో ఉంచి నైలు నదిలో వదిలింది. ఒకపక్క ఇదంతా చేస్తూనే, మరోపక్క ఆ తల్లి తీవ్రంగా ప్రార్థించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి! ఏం జరుగుతుందో గమనించమని ఆమె ఖచ్చితంగా మిర్యాముకు చెప్పి పంపించి ఉంటుంది.—నిర్గమకాండం 2:1-4.
ప్రాణాల్ని కాపాడింది
కాబట్టి మిర్యాము దగ్గర్లో నిలబడి, ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తుంది. కొంతమంది స్త్రీలు అటువైపు రావడాన్ని తను గమనించింది. అక్కడికి వచ్చింది మామూలు ఐగుప్తీయులు కాదు; ఫరో కూతురు, ఆమె చెలికత్తెలు కలిసి నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చారు. వాళ్లని చూడగానే మిర్యాము గుండె జారిపోయి ఉంటుంది. రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా అతని సొంత కూతురే ఒక హెబ్రీ పిల్లాడిని కాపాడుతుందని ఆలోచించడానికి కూడా మిర్యాము ధైర్యం చేసి ఉండదు. ఆ సమయంలో, మిర్యాము బాగా ప్రార్థించి ఉంటుందని అనడంలో ఏ సందేహం లేదు.
జమ్ముగడ్డి దగ్గరున్న పెట్టెను ఫరో కూతురు చూసింది. దాన్ని తీసుకురమ్మని ఆమె తన చెలికత్తెకు చెప్పింది. తర్వాత ఏం జరిగిందో బైబిలు ఇలా చెప్తుంది: “ఆమె ఆ పెట్టెను తెరిచి ఆ బిడ్డను చూసింది, వాడు ఏడుస్తున్నాడు.” ఒక హెబ్రీ తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తోందని ఫరో కూతురుకి అర్థమైంది. కానీ, ఆ అందమైన బిడ్డను చూసి ఆమెకు జాలేసింది. (నిర్గమకాండం 2:5, 6) మిర్యాము రెప్ప వాల్చకుండా ఇదంతా చూస్తోంది. ఫరో కూతురు ముఖ కవళికల్ని బట్టి, ఆమె ఆ బిడ్డను కాపాడాలని అనుకుంటుందని మిర్యాముకు అర్థమైంది. యెహోవా మీద తనకున్న విశ్వాసాన్ని చేతల్లో చూపించే క్షణం వచ్చిందని ఆ అమ్మాయి గుర్తించి, ధైర్యాన్ని కూడగట్టుకుని వాళ్ల దగ్గరికి వెళ్లింది.
ఆ కాలంలో, బానిసగా ఉన్న ఒక హెబ్రీ అమ్మాయి రాజు కుటుంబంలోని వాళ్లతో మాట్లాడే సాహసం చేస్తే ఏం జరుగుతుందో మనకు తెలీదు. అయినా గానీ, మిర్యాము ఫరో కూతురు దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది: “నీ కోసం ఆ పిల్లవాడికి పాలిచ్చి పెంచడానికి నేను వెళ్లి ఒక హెబ్రీ స్త్రీని తీసుకురానా?” నిజానికి, అది చాలా తెలివైన ప్రశ్న. ఆ పసిబిడ్డకు పాలిచ్చి, పెంచే పరిస్థితిలో తాను లేనని ఫరో కూతురుకి తెలుసు. బహుశా, ఆ బాబు కొంతకాలం అతని ప్రజల మధ్యే పెరగడం మంచిదని, తర్వాత దత్తత తీసుకుని తన ఇంటికి తీసుకురావచ్చని, అక్కడ మంచి చదువు చెప్పించి పెద్దవాడిని చేయొచ్చని ఆమె అనుకుని ఉంటుంది. ఫరో కూతురు “వెళ్లు!” అని అనగానే, మిర్యాము మనసు సంతోషంతో పొంగిపోయి ఉంటుంది.—నిర్గమకాండం 2:7, 8.
పిల్లాడికి ఏమౌతుందో అని కంగారుపడుతున్న తన అమ్మానాన్నల దగ్గరికి మిర్యాము ఆగమేఘాల మీద పరుగెత్తుకొని వెళ్లింది. ఆయాసపడుతూ, జరిగిన విషయాన్ని వాళ్ల అమ్మకు ఆనందంగా చెప్పడాన్ని మీరు ఊహించుకోవచ్చు. యెహోవాయే ఇదంతా చేస్తున్నాడని అర్థం చేసుకున్న యోకెబెదు మిర్యాముతో పాటు ఫరో కూతురి దగ్గరికి వెళ్లింది. ఆ యువరాణి ఆమెతో ఇలా అంది: “ఈ బిడ్డను నీతోపాటు తీసుకెళ్లి నా కోసం వాడికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను.” (నిర్గమకాండం 2:9) అది వినగానే, ఆ తల్లి ఊపిరి పీల్చుకుని, ఎంత సంతోషించి ఉంటుందో మాటల్లో చెప్పలేం. బహుశా, అవేవీ తన ముఖంలో కనిపించకుండా ఆమె జాగ్రత్తపడి ఉంటుంది.
ఆ రోజు మిర్యాము తన దేవుడైన యెహోవా గురించి ఇంకా బాగా అర్థం చేసుకుని ఉంటుంది. ఆయన తన ప్రజల్ని పట్టించుకుంటాడని, వాళ్ల ప్రార్థనల్ని వింటాడని తెలుసుకుంది. ధైర్యం, విశ్వాసం లాంటి లక్షణాల్ని కేవలం పెద్దవాళ్లు, పురుషులే కాదు అందరూ చూపించగలరని నేర్చుకుంది. అవును, తనను నమ్మకంగా ఆరాధించే వాళ్లందరి ప్రార్థనల్ని యెహోవా వింటాడు. (కీర్తన 65:2) నేడున్న కష్టమైన పరిస్థితుల్లో చిన్న-పెద్ద, ఆడ-మగ అనే తేడా లేకుండా అందరం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అక్కగా ఓర్పు చూపించింది
యోకెబెదు పిల్లాడికి పాలిచ్చి పెంచింది. మిర్యాముకు తన చిన్న తమ్ముడు అంటే ఎంత ప్రాణమో, ఆ పిల్లాడు తనకు ఎంతగా అలవాటు అయ్యుంటాడో మనం ఊహించుకోవచ్చు. తన తమ్ముడికి తనే మాటలు నేర్పించి ఉండవచ్చు. ఆ పిల్లాడు, మొదటిసారిగా యెహోవా పేరు పలికినప్పుడు మిర్యాము ఎంత సంబరపడి ఉంటుందో కదా! అయితే, ఆ పిల్లాడు కాస్త ఎదిగాక, ఫరో కూతురి దగ్గరికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. (నిర్గమకాండం 2:10) అప్పుడు, ఆ కుటుంబానికి ఖచ్చితంగా గుండె పిండేసినట్టు అనిపించింది. ఫరో కూతురు ఆ పిల్లాడికి మోషే అని పేరు పెట్టింది. వాడు పెరిగి పెద్దయ్యాక, ఎలా తయారవుతాడో చూడాలని మిర్యాము ఆశగా ఎదురుచూసి ఉంటుంది! మరి, ఐగుప్తు రాజభవనంలో పెరుగుతున్న మోషేకు యెహోవా మీద ప్రేమ తగ్గిపోకుండా అలాగే ఉంటుందా?
కాలమే ఆ ప్రశ్నకు జవాబిచ్చింది. మోషే పెద్దయ్యాక, రాజకుటుంబంలో ఉండే సుఖాల్ని, సంపదల్ని అనుభవించాలని కోరుకోలేదు గానీ, యెహోవాను ఆరాధించాలని కోరుకున్నాడు. తన తమ్ముడు తీసుకున్న ఆ నిర్ణయం గురించి విన్నప్పుడు మిర్యాము ఎంత గర్వపడి ఉంటుందో చెప్పనక్కర్లేదు! మోషేకు 40 ఏళ్లున్నప్పుడు, అతను తన ప్రజల తరఫున నిలబడ్డాడు. ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీ దాసున్ని కొడుతుండడం చూసి, మోషే ఆ ఐగుప్తీయున్ని చంపేశాడు. దాంతో మోషే ప్రమాదంలో పడ్డాడు. అతను తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఐగుప్తు నుండి పారిపోయాడు.—నిర్గమకాండం 2:11-15; అపొస్తలుల కార్యాలు 7:23-29; హెబ్రీయులు 11:24-26.
అప్పటి నుండి మరో 40 ఏళ్ల వరకూ తన తమ్ముడు గురించి మిర్యాముకు బహుశా ఎలాంటి వార్తా తెలిసి ఉండదు. మోషే మిద్యానుకు పారిపోయి, అక్కడ గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. (నిర్గమకాండం 3:1; అపొస్తలుల కార్యాలు 7:29, 30) కాలం గడుస్తుండగా, మిర్యాము వయసుతో పాటు తన ప్రజల కష్టాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
ప్రవక్త్రిగా సేవ చేసింది
దేవుడు తన ప్రజల్ని విడిపించడం కోసం మోషేను ఐగుప్తుకు పంపించాడు. అతను తిరిగి వచ్చినప్పుడు మిర్యాముకు బహుశా 80 ఏళ్లు దాటి ఉంటాయి. మోషే తరఫున అహరోను మాట్లాడేవాడు; వీళ్లిద్దరూ కలిసి దేవుని ప్రజల్ని వదిలేయమని అడగడానికి ఫరో దగ్గరకు వెళ్లారు. వాళ్లు అడిగినదానికి ఫరో ఒప్పుకోనప్పుడు, తన తమ్ముళ్లు డీలా పడిపోకుండా ఉండేలా మిర్యాము సహాయం చేసి ఉంటుంది. అంతేకాదు, ఐగుప్తీయుల మీదికి యెహోవా పది తెగుళ్లు రప్పించిన సమయంలో, మోషే అహరోనులు ఫరోను కలిసి వచ్చిన ప్రతీసారి మిర్యాము ఖచ్చితంగా వాళ్లకు ధైర్యం చెప్పి ఉంటుంది. చివరిగా పదో తెగులు వచ్చినప్పుడు, అంటే ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానం చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులకు గొప్ప విడుదల దొరికింది! ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలి వస్తున్నప్పుడు మోషే నాయకత్వం వహించాడు. అప్పుడు, మిర్యాము తన ప్రజలకు అలుపెరగకుండా సహాయం చేయడాన్ని మీరు ఊహించుకోవచ్చు!—నిర్గమకాండం 4:14-16, 27-31; 7:1–12:51.
తర్వాత, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రానికి ఐగుప్తు సైన్యానికి మధ్యలో చిక్కుకున్నప్పుడు తన తమ్ముడైన మోషే సముద్రం ముందు నిల్చుని, చేతి కర్రను ఎత్తడం మిర్యాము చూసింది. అప్పుడు సముద్రం రెండుగా చీలిపోయింది! సముద్రంలోని ఆరిన నేల మీద, మోషే ప్రజల్ని నడిపించడం గమనించిన మిర్యాముకు యెహోవా మీద ఇంతకుముందు కన్నా ఎక్కువ విశ్వాసం పెరిగి ఉంటుంది. తను ఆరాధించే దేవునికి ఏదైనా చేసే శక్తి ఉందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సామర్థ్యం ఉందని ఆమెకు తెలుసు!—నిర్గమకాండం 14:1-31.
కాసేపటికి, ఇశ్రాయేలీయులందరూ క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత రెండు పాయలుగా విడిపోయిన సముద్రం కలిసిపోయి ఫరోను, అతని సైన్యాన్ని ముంచేసింది. అది చూసినప్పుడు, ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యం కంటే యెహోవా ఇంకా శక్తిమంతుడు అని మిర్యాము అర్థంచేసుకొని ఉంటుంది. ప్రజలందరూ యెహోవాకు పాట పాడాలని అనుకున్నారు. మిర్యాము పాడుతుంటే, మిగతా స్త్రీలందరూ ఆమెను అనుసరించారు. ఆమె ఇలా పాడింది: “యెహోవాకు పాట పాడండి, ఎందుకంటే ఆయన ఘనవిజయం సాధించాడు. గుర్రాన్ని, దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశాడు.”—నిర్గమకాండం 15:20, 21; కీర్తన 136:15.
మిర్యాము జీవితంలో అది ఎంతో ప్రత్యేకమైన రోజు; అది ఆమె మనసులో చెరగని ముద్ర వేసి ఉంటుంది. ఆ సంఘటన గురించి చెప్పినప్పుడు బైబిలు ఆమెను ప్రవక్త్రి అని పిలుస్తుంది. బైబిల్లో ప్రవక్త్రిగా పిలువబడిన మొట్టమొదటి స్త్రీ మిర్యామే. యెహోవాకు ప్రవక్త్రిగా సేవ చేసే అవకాశం దొరికిన కొంతమంది స్త్రీలలో మిర్యాము ఒకరు.—న్యాయాధిపతులు 4:4; 2 రాజులు 22:14; యెషయా 8:3; లూకా 2:36.
ఇది మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, మనం వినయంగా చేసే పనుల్ని, మనం చూపించే ఓపికను, తనను స్తుతించాలనే మన కోరికను యెహోవా గమనిస్తాడు, దీవిస్తాడు. పెద్దవాళ్లైనా-చిన్నవాళ్లైనా, ఆడవాళ్లైనా-మగవాళ్లైనా అందరూ యెహోవా మీద విశ్వాసం ఉంచవచ్చు. అలా విశ్వాసం చూపిస్తే యెహోవా సంతోషిస్తాడు; ఆయన దాన్ని ఎప్పుడూ మర్చిపోడు, తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. (హెబ్రీయులు 6:10; 11:6) మరి, మిర్యాము లాంటి విశ్వాసం చూపించాలని మీకూ అనిపిస్తుందా?
గర్వం చూపించింది
ప్రత్యేక నియామకం లేదా ప్రత్యేక స్థానం పొందినప్పుడు ఆశీర్వాదాలతో పాటు ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదలయ్యే సమయానికి స్త్రీలలో మిర్యాముకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండుంటుంది. అది ఆమెలో గర్వం లేదా అహంకారం తెచ్చిపెట్టిందా? (సామెతలు 16:18) అవును, ఒక సందర్భంలో ఆమె ఆ లక్షణాల్ని చూపించింది.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కొన్ని నెలలు గడిచాయి. మోషే దగ్గరకు తన మామ యిత్రో, భార్య సిప్పోరా, ఇద్దరు కొడుకులు వచ్చారు. మోషే 40 ఏళ్ల పాటు మిద్యానులో ఉన్నప్పుడు అతను సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. సిప్పోరా కొంతకాలం ముందు, మిద్యానులో ఉన్న తన కుటుంబం దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు యిత్రో వాళ్లని తిరిగి మోషే దగ్గరకు తీసుకొచ్చాడు. (నిర్గమకాండం 18:1-5) తమను ఐగుప్తు నుండి బయటకు నడిపించిన వ్యక్తి భార్యను చూడాలని బహుశా చాలామంది ఎదురుచూశారు. ఇశ్రాయేలీయుల కళ్లన్నీ సిప్పోరా మీదే ఉండుంటాయి!
సిప్పోరాను చూసి మిర్యాముకు ఎలా అనిపించింది? మొదట్లో సంతోషించే ఉంటుంది. కానీ, రోజులు గడిచేకొద్దీ ఆమెలో గర్వం పెరిగింది. బహుశా, స్త్రీలలో తనకున్న ప్రత్యేకమైన స్థానం ఎక్కడ సిప్పోరాకు వెళ్లిపోతుందోనని ఆమె భయపడి ఉంటుంది. ఏదేమైనా మిర్యాము, అహరోను కలిసి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ల మాటలు హద్దులు దాటి, అసూయపడేలా చేశాయి. ముందు వాళ్లు సిప్పోరా గురించి మాట్లాడుతూ, ఆమె ఇశ్రాయేలీయురాలు కాదని, కూషీయురాలు అని అన్నారు. a అంతటితో ఆగకుండా వాళ్లు మోషే మీద కూడా సణుగుతూ, ఇలా అన్నారు: “యెహోవా మోషే ద్వారా మాత్రమే మాట్లాడాడా? మా ద్వారా కూడా మాట్లాడాడు కదా?”—సంఖ్యాకాండం 12:1, 2.
కుష్ఠువ్యాధి వచ్చింది
మిర్యాము అహరోనుల మనసు ఎంత విషంతో నిండిపోయిందో వాళ్ల మాటల్లో తెలుస్తుంది. యెహోవా మోషేను ఉపయోగించుకోవడం వాళ్లకు నచ్చలేదు. అధికారం-పలుకుబడి తమ చేతుల్లో ఉండాలని వాళ్లు కోరుకున్నారు. ఎందుకు? పెత్తనమంతా మోషేనే చేలాయిస్తూ, అందరికన్నా తనే గొప్ప అన్నట్టు ప్రవర్తించాడా? మోషేలో కొన్ని బలహీనతలు ఉన్నాయన్న మాట వాస్తవమే; కానీ అతను గొప్పలు చెప్పుకునే, గర్వపడే మనిషి కాదు. బైబిలు అతని గురించి ఇలా చెప్తుంది: “మోషే, భూమ్మీద ఉన్న వాళ్లందరిలోకెల్లా అత్యంత సాత్వికుడు.” ఏదేమైనా, మిర్యాము అహరోనులు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఎందుకంటే, “యెహోవా ఆ మాటల్ని వింటూ ఉన్నాడు.”—సంఖ్యాకాండం 12:2, 3.
యెహోవా ఉన్నట్టుండి ఆ ముగ్గురు తోబుట్టువుల్ని ప్రత్యక్ష గుడారం దగ్గరకు రమ్మని చెప్పాడు. ఆయన మేఘస్తంభంలో దిగివచ్చి, గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాళ్లతో మాట్లాడాడు. యెహోవా మిర్యాము అహరోనుల్ని గద్దిస్తూ, మోషేతో తనకున్న ప్రత్యేకమైన సంబంధాన్ని వాళ్లకు గుర్తుచేసి, అతని మీద తనకు ఎంత నమ్మకం ఉందో చెప్పాడు. “అలాంటిది, నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?” అని యెహోవా నిలదీశాడు. అప్పుడు మిర్యాము, అహరోను భయంతో గజగజ వణికిపోయి ఉంటారు. వాళ్లు అవమానించింది మోషేనే అయినా, తనను అవమానించినట్టుగా యెహోవా చూశాడు.—సంఖ్యాకాండం 12:4-8.
పరిస్థితి ఇంతవరకూ రావడానికి మూలకారణం మిర్యాము అనే చెప్పవచ్చు. ఆమె తప్పుగా అలోచించడంతో పాటు, అహరోను కూడా తనకే వత్తాసు పలికేలా చేసింది. అలా వాళ్లిద్దరూ కలిసి తమ మరదల్ని ఆడిపోసుకున్నారు. ఇద్దరిలో మిర్యాముకే ఎందుకు శిక్ష పడిందో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. యెహోవా ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చేలా చేశాడు. ఆ భయంకరమైన వ్యాధి వల్ల ఆమె చర్మం “మంచు అంత తెల్లగా” మారింది. వెంటనే, అహరోను తన తప్పు తెలుసుకుని, “మేము చాలా తెలివితక్కువ పని చేశాం” అని అంటూ, యెహోవా తమను క్షమించేలా వేడుకోమని మోషేను బ్రతిమాలాడు. అప్పుడు, సాత్వికుడైన మోషే యెహోవాను ఇలా వేడుకున్నాడు: “దేవా, దయచేసి ఆమెను బాగుచేయి! దయచేసి ఆమెను బాగుచేయి!” (సంఖ్యాకాండం 12:9-13) మోషే, అహరోనులు తమ అక్కకు జరిగింది చూసి చాలా బాధపడ్డారు, తను బాగవ్వాలని ఎంతో కోరుకున్నారు. దీన్నిబట్టి మిర్యాములో లోపాలు ఉన్నా, తనంటే వాళ్లకు ఎంత ఇష్టమో తెలుస్తుంది.
కుష్ఠువ్యాధి నయమైంది
యెహోవా ఆమె మీద దయ చూపించాడు. తప్పు తెలుసుకున్న మిర్యామును బాగుచేశాడు. అయితే ఆమె ఇశ్రాయేలీయుల్లో కలవకుండా, ఏడు రోజుల పాటు పాలెం బయట విడిగా ఉండాలని యెహోవా చెప్పాడు. అలా చేయడం ఆమెకు నిజంగా తలకొట్టేసినట్టు అనిపించి ఉంటుంది. ఎందుకంటే, దేవుడు ఆమెకు క్రమశిక్షణ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. కానీ, విశ్వాసం వల్ల ఆమె ఆ అవమానాన్ని తట్టుకోగలిగింది. తన తండ్రైన యెహోవా న్యాయంగల దేవుడని, తన మీదున్న ప్రేమతోనే క్రమశిక్షణ ఇస్తున్నాడని ఆమె మనసుకు తెలుసు. అందుకే యెహోవా చెప్పినట్టు చేసింది. ఆమె ఏడు రోజుల పాటు ఒక్కతే పాలెం బయట ఉంది. ఆమె తిరిగి వచ్చేంత వరకూ ఇశ్రాయేలీయులు అక్కడి నుండి బయల్దేరలేదు. తిరిగి ‘పాలెం లోపలికి తీసుకొచ్చేటప్పుడు,’ వినయంగా వెళ్లడం ద్వారా మిర్యాము మళ్లీ తన విశ్వాసాన్ని చూపించింది.—సంఖ్యాకాండం 12:14, 15.
యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు. (హెబ్రీయులు 12:5, 6) ఆయన మిర్యామును ప్రేమించాడు కాబట్టే, ఆమె గర్వం చూపించినప్పుడు సరిదిద్దాడు. దానివల్ల మొదట్లో బాధపడినా, ఆమె తన ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. మిర్యాము వినయం చూపించి, క్రమశిక్షణను తీసుకోవడం వల్ల యెహోవా ఆమె చేసిన తప్పును మర్చిపోయి, ఆమెను తిరిగి చేర్చుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఎడారిలో ప్రయాణించడం ముగిసేంత వరకు ఆమె జీవించింది. సీను ఎడారిలో, కాదేషు దగ్గర ఆమె చనిపోయింది. అప్పుడు ఆమె వయసు దాదాపు 130 ఏళ్లు. b (సంఖ్యాకాండం 20:1) మిర్యాము నమ్మకంగా చేసిన సేవను యెహోవా ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే, వందల ఏళ్ల తర్వాత ప్రవక్తయైన మీకాతో తన ప్రజలకు ఇలా గుర్తుచేశాడు: “దాస్య గృహం నుండి విడిపించాను; మోషేను, అహరోనును, మిర్యామును మీ ముందు పంపించాను.”—మీకా 6:4.
మిర్యాము జీవితం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. తమను తాము కాపాడుకోలేని వాళ్ల కోసం నిలబడాలి, సరైనదాని తరఫున ధైర్యంగా మాట్లాడాలి. చిన్నప్పుడు, మిర్యాము అదే చేసింది. (యాకోబు 1:27) ఆమెలాగే, మనం కూడా దేవుని మాటల్ని సంతోషంగా ప్రకటించాలి. (రోమీయులు 10:15) ఆమె చూపించిన ఈర్ష్య, అసూయ లాంటి ప్రమాదకరమైన లక్షణాలకు దూరంగా ఉండాలి. (సామెతలు 14:30) ఆమెలాగే, యెహోవా ఇచ్చే క్రమశిక్షణను వినయంగా తీసుకోవాలి. (హెబ్రీయులు 12:5) అలా ఇవన్నీ చేస్తే, మిర్యాము చూపించిన విశ్వాసాన్ని మనం అనుకరించిన వాళ్లమౌతాం.