వాళ్లలా విశ్వాసం చూపించండి | యోబు
యెహోవా అతని గాయాన్ని మాన్పాడు
మొత్తానికి వాళ్లందరూ మాట్లాడడం ఆపేశారు. బహుశా, అరేబియా ఎడారి నుండి వీస్తున్న వేడిగాలి శబ్దం తప్ప అక్కడ ఇంకేం వినిపించట్లేదు. యోబు వాళ్లతో వాదించీ వాదించీ అలసిపోయాడు. ఇక అతని దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు. తన ముగ్గురు స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరులను ఇంకేం మాట్లాడతారో మాట్లాడండి అన్నట్టు కోపంగా చూస్తున్న యోబును ఊహించుకోండి. వాళ్లు ఎంత తెలివిగా వాదించినా వాళ్ల వ్యర్థమైన, కఠినమైన మాటలు విఫలమయ్యే సరికి వాళ్లు యోబు కళ్లల్లోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నారు. (యోబు 16:3) తన యథార్థతను నిరూపించుకోవాలని ఇప్పుడు యోబు మరింత దృఢ నిశ్చయంతో ఉన్నాడు.
ఇక తన దగ్గర ఉన్నదల్లా యథార్థత మాత్రమే అని యోబు అనుకొనివుంటాడు. అతను తన ఆస్తిని, పదిమంది పిల్లల్ని, తన స్నేహితుల మద్దతును, పొరుగువాళ్ల గౌరవాన్ని, ఆఖరికి తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. వ్యాధి వల్ల అతని చర్మం నల్లబడింది, పొక్కులుగట్టింది. అతని ఒంటి నిండా పురుగులు పాకుతున్నాయి, అతని శ్వాస కూడా దుర్వాసన వస్తోంది. (యోబు 7:5; 19:17; 30:30) అయినప్పటికీ ఆ ముగ్గురు అన్న కఠినమైన మాటల వల్ల యోబు కోపంతో రగిలిపోతున్నాడు. వాళ్లు చెప్తున్నట్టు తాను ఘోరమైన పాపిని కాదని నిరూపించుకోవడం మీదే యోబు మనసుపెట్టాడు. యోబు చివరిగా అన్న మాటలతో వాళ్ల నోటికి తాళం పడింది. వాళ్లు ఇంతసేపూ మాట్లాడిన కఠినమైన మాటలకు అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ యోబు బాధ ఇంకా అలానే ఉంది. అతను దయనీయమైన స్థితిలో ఉన్నాడు, అతనికి సహాయం చాలా అవసరం!
యోబు తన పరిస్థితి గురించి ఎందుకు సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అతనికి ఇప్పుడు నిర్దేశం కావాలి. అతన్ని సరిదిద్దాల్సివుంది. అంతేకాదు అతనికి నిజమైన ఓదార్పు, ఊరట అవసరం. అతని ముగ్గురు స్నేహితులు అవేవీ అతనికి ఇవ్వలేకపోయారు. మీకెప్పుడైనా నిర్దేశం, ఓదార్పు బాగా అవసరమని అనిపించిందా? ఆ సమయంలో మీ స్నేహితులు అనుకున్నవాళ్లే మిమ్మల్ని కృంగదీశారా? యెహోవా దేవుడు తన సేవకుడైన యోబుకు ఎలా సహాయం చేశాడో, దానికి యోబు ఎలా స్పందించాడో తెలుసుకుంటే మీకు నిరీక్షణ, సహాయం దొరుకుతాయి.
తెలివితో, దయతో సరిదిద్దాడు
సంతోషకరమైన విషయం ఏంటంటే, వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్లకు దగ్గర్లోనే ఎలీహు అనే ఒక యువకుడు కూడా ఉన్నాడు. తన కన్నా వయసులో పెద్దవాళ్లయిన ఆ నలుగురు వాదించుకుంటుంటే, అతను మౌనంగా ఆ సంభాషణంతా వింటున్నాడు. ఆ సంభాషణలో వాళ్లు అన్న మాటలు అతనికి ఏమాత్రం నచ్చలేదు.
యోబు అన్న కొన్ని మాటలు కూడా ఎలీహుకు నచ్చలేదు. నీతిమంతుడైన యోబు ఆ ముగ్గురి ఒత్తిడికి లొంగిపోయి, “దేవుణ్ణి కాకుండా తనను నీతిమంతునిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించినందుకు” ఎలీహుకు బాధనిపించింది. అయినప్పటికీ ఎలీహు సహానుభూతి చూపిస్తూ యోబు పడుతున్న బాధను, అతని నిజాయితీని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు యోబుకు దయగల నిర్దేశం, ఓదార్పు చాలా అవసరమని ఎలీహు గుర్తించాడు. యోబును ఓదార్చే బదులు ఇంకా కృంగదీసిన ఆ ముగ్గురు స్నేహితుల మీద ఎలీహుకు కోపం వచ్చింది. వాళ్లు తమ మాటలతో యోబు మీద దాడి చేయడం; అతని విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, యథార్థతను నీరుగార్చడం అతను గమనించాడు. అంతకన్నా ఘోరం ఏంటంటే, వాళ్లు దేవుడు చెడ్డవాడన్నట్టు మాట్లాడారు. అందుకే ఎలీహు మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు!—యోబు 32:2-4, 18.
ఎలీహు తన మాటల్ని ఇలా మొదలుపెట్టాడు: “నేను వయసులో చిన్నవాణ్ణి, మీరు పెద్దవాళ్లు. అందుకే మీ మీద గౌరవంతో మధ్యలో మాట్లాడలేదు, నాకు తెలిసింది మీకు చెప్పే సాహసం చేయలేదు.” అయితే వాళ్ల మాటల్ని బట్టి ఎలీహు మౌనంగా ఉండలేక ఇలా అన్నాడు: “కేవలం వయసు వల్లే ఒక వ్యక్తి తెలివిగలవాడు అవ్వడు, సరైనదేదో అర్థం చేసుకోగలిగేది వృద్ధులు మాత్రమే కాదు.” (యోబు 32:6-9) ఆ మాటలు నిజమని ఎలీహు ఆ తర్వాత చెప్పిన విషయాలు నిరూపించాయి. అతను ఎలీఫజు, బిల్దదు, జోఫరుల్లా మాట్లాడలేదు. అతన్ని తక్కువచేసి మాట్లాడనని, అతని బాధను పెంచనని ఎలీహు యోబుకు హామీ ఇచ్చాడు. అతని ముగ్గురు స్నేహితులు అతనితో అమర్యాదగా మాట్లాడారని గుర్తించి, ఎలీహు యోబు పేరును ఉపయోగిస్తూ గౌరవపూర్వకంగా మాట్లాడాడు. a అతను ఇలా అన్నాడు: “యోబూ, దయచేసి నా మాటలు ఆలకించు.”—యోబు 33:1, 7; 34:7.
ఎలీహు యోబుకు సూటైన సలహా ఇచ్చాడు. అతను ఇలా అన్నాడు: “నువ్వు ఈ మాటలు అనడం నేను విన్నాను, ... ‘నేను పవిత్రుణ్ణి, నాలో ఏ అపరాధం లేదు; నేను శుద్ధుణ్ణి, నేను ఏ తప్పూ చేయలేదు. అయినా ఎందుకో దేవుడు నన్ను వ్యతిరేకిస్తున్నాడు.’” యోబు చేసిన తప్పేంటో తెలియజేస్తూ ఎలీహు ఇలా అన్నాడు: “నువ్వు నిర్దోషివని నీకు అంత నమ్మకమా? ‘నేను దేవుని కన్నా నీతిమంతుణ్ణి’ అని అంటావా?” యోబు అదే ఆలోచనతో కొనసాగడం ఎలీహుకు ఇష్టం లేదు. అందుకే, “నువ్వలా అనడం సరికాదు” అని యువకుడైన ఎలీహు అన్నాడు. (యోబు 33:8-12; 35:2) సమస్తాన్ని కోల్పోవడం వల్ల, తనను ఓదార్చాల్సిన స్నేహితులే కఠినంగా వ్యవహరించడం వల్ల యోబు చాలా కోపంగా ఉన్నాడని ఎలీహుకు తెలుసు. కాబట్టి ఎలీహు యోబును ఇలా హెచ్చరించాడు: “జాగ్రత్త, కోపంతో నువ్వు ద్వేషం పెంచుకుని చెడుగా ప్రవర్తించకు.”—యోబు 36:18.
ఎలీహు యెహోవాకున్న దయను స్పష్టం చేశాడు
అన్నిటికన్నా ముఖ్యంగా, ఎలీహు యెహోవా దేవుణ్ణి సమర్థిస్తూ మాట్లాడాడు. అతను చాలా ప్రాముఖ్యమైన ఈ సత్యాన్ని సరళంగా, సూటిగా తెలియజేశాడు: “సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం, సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం! ... సర్వశక్తిమంతుడు న్యాయాన్ని వక్రీకరించడు.” (యోబు 34:10, 12) యెహోవా కరుణ, న్యాయం గల దేవుడని యోబు గ్రహించేలా ఎలీహు సహాయం చేశాడు. ఎందుకంటే యోబు తన గురించి మాత్రమే ఆలోచిస్తూ దేవుని గురించి అగౌరవంగా మాట్లాడాడు. కావాలనుకుంటే, అలా మాట్లాడినందుకు యెహోవా యోబును శిక్షించవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. (యోబు 35:13-15) ఎలీహు తనకు దేవుని గురించి అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడే బదులు వినయంగా ఇలా అన్నాడు: “మనం గ్రహించగలిగే దానికన్నా దేవుడు చాలా గొప్పవాడు.”—యోబు 36:26.
ఎలీహు యోబుకు సూటైన సలహా ఇస్తున్నప్పటికీ దాన్ని చాలా దయగా చెప్పాడు. యెహోవా యోబుకు మంచి ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తాడనే అద్భుతమైన నిరీక్షణ గురించి ఎలీహు చెప్పాడు. యెహోవా తన విశ్వసనీయ సేవకునితో ఇలా అంటాడు: “అతని శరీరం పిల్లల శరీరం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది; అతనికి తన యౌవన బలం తిరిగొస్తుంది.” ఎలీహు మరో విధంగా కూడా దయ చూపించాడు, అతనే మాట్లాడుకుంటూ పోయే బదులు యోబును కూడా మాట్లాడమని దయగా ప్రోత్సహించాడు. అతను ఇలా అన్నాడు: “మాట్లాడు, ఎందుకంటే నువ్వు నిర్దోషివని నేను రుజువు చేయాలనుకుంటున్నాను.” (యోబు 33:25, 32) కానీ యోబు మాట్లాడలేదు. బహుశా ఎలీహు అంత దయగా, ప్రోత్సాహకరంగా సలహా ఇచ్చేసరికి, ఇక తనను తాను సమర్థించుకోవాల్సిన అవసరం లేదని యోబుకు అనిపించివుంటుంది. ఎలీహు తన మీద అంత శ్రద్ధ చూపించినందుకు యోబు కంటతడి పెట్టుకుని ఉంటాడు.
ఈ ఇద్దరు నమ్మకమైన సేవకుల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అవసరంలో ఉన్నవాళ్లకు ఎలా సలహా ఇవ్వాలో, ఓదార్చాలో ఎలీహు నుండి నేర్చుకోవచ్చు. తన స్నేహితుడు ఏదైనా పెద్ద తప్పు చేస్తున్నప్పుడు లేదా ప్రమాదకరమైన దారిలో వెళ్తున్నప్పుడు, నిజమైన స్నేహితుడు అతన్ని సరిదిద్దకుండా ఉండడు. (సామెతలు 27:6) మనం అలాంటి స్నేహితునిలా ఉండాలనుకుంటాం. అవసరంలో ఉన్నవాళ్లు దురుసుగా మాట్లాడినా సరే మనం వాళ్లతో దయగా, ప్రోత్సాహకరంగా మాట్లాడాలనుకుంటాం. ఒకవేళ మనమే అలాంటి సలహా అవసరమైన పరిస్థితిలో ఉంటే, ఆ సలహాను కొట్టిపారేసే బదులు వినయంగా అంగీకరించాలని యోబు ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. మనందరికీ సలహా, క్రమశిక్షణ అవసరం. వాటిని అంగీకరిస్తే, అవి మన జీవాన్ని కాపాడగలవు.—సామెతలు 4:13.
“సుడిగాలిలో నుండి”
ఎలీహు తన మాటల్లో తరచూ గాలి, మేఘాలు, ఉరుములు, మెరుపుల్ని ప్రస్తావించాడు. అతను యెహోవా గురించి చెప్తూ ఇలా అన్నాడు: “ఆయన స్వర గర్జనను ... శ్రద్ధగా వినండి.” కాసేపటి తర్వాత ఎలీహు “తుఫాను గాలి” గురించి చెప్పాడు. (యోబు 37:2, 9) బహుశా ఎలీహు మాట్లాడుతుండగా, తుఫాను గాలి అంతకంతకు బలపడుతూ, తీవ్రతరమౌతూ చివరికి సుడిగాలిలా మారివుండవచ్చు. అప్పుడు ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. యెహోవా ఆ సుడిగాలిలో నుండి మాట్లాడాడు!—యోబు 38:1.
సృష్టి గురించి స్వయంగా ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తే వివరిస్తుంటే వినడం ఎంత గొప్ప అవకాశమో కదా!
యోబు పుస్తకంలో, యెహోవా యోబుతో మాట్లాడిన అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనకు చాలా ఊరటగా అనిపిస్తుంది. సుడిగాలికి తేలికపాటి చెత్త కొట్టుకుపోయినట్టు, యెహోవా మాట్లాడేసరికి ఎలీఫజు, బిల్దదు, జోఫరుల వ్యర్థమైన మాటలు, అబద్ధాలు అన్నీ కొట్టుకుపోయినట్టు అయ్యింది. యెహోవా చాలాసేపటి వరకు ఆ ముగ్గురితో మాట్లాడలేదు. ఆయన ముఖ్యంగా యోబు మీదే దృష్టి పెట్టాడు. ఒక తండ్రి తన పిల్లవాణ్ణి సరిదిద్దినట్టుగా యెహోవా తన ప్రియమైన సేవకుణ్ణి సూటిగా, దయగా సరిదిద్దాడు.
యోబు బాధను యెహోవా అర్థం చేసుకున్నాడు. అంతేకాదు అతని మీద జాలిపడ్డాడు. తన ప్రియమైన పిల్లలెవరైనా బాధపడుతుంటే ఆయన అలాగే జాలిపడతాడు. (యెషయా 63:9; జెకర్యా 2:8) అంతేకాదు యోబు “జ్ఞానం లేకుండా” మాట్లాడుతున్నాడని, దానివల్ల తన సమస్యను పెద్దదిగా చేసుకుంటున్నాడని యెహోవాకు తెలుసు. కాబట్టి, ఆలోచింపజేసే ఎన్నో ప్రశ్నలు వేసి యెహోవా యోబును సరిదిద్దాడు. ఆయన ఇలా మొదలుపెట్టాడు: “నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు అవగాహన ఉందనిపిస్తే చెప్పు.” దేవుడు చేస్తున్న అద్భుతమైన సృష్టిని చూసి “ఉదయ నక్షత్రాలు” అంటే దేవుని కుమారులైన దేవదూతలు సంతోషంతో స్తుతిగీతాలు పాడారు. (యోబు 38:2, 4, 7) కానీ యోబుకు ఇవేవీ తెలీదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయాడు.
యెహోవా తాను చేసిన సృష్టి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకవిధంగా యెహోవా యోబుకు ఖగోళ శాస్త్రం, జీవ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి అంశాల్ని క్లుప్తంగా చెప్పాడు. మరిముఖ్యంగా యెహోవా ఆ కాలంనాటి కొన్ని జంతువుల గురించి అంటే సింహం, కాకి, కొండమేక, అడవి గాడిద, అడవి ఎద్దు, నిప్పుకోడి, గుర్రం, డేగ, బహేమోత్ (బహుశా నీటి గుర్రం కావచ్చు), లివ్యాతన్ (బహుశా మొసలి కావచ్చు) గురించి యోబుకు చెప్పాడు. సృష్టి గురించి స్వయంగా ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తే వివరిస్తుంటే వినడం ఎంత గొప్ప అవకాశమో కదా! b
వినయం, ప్రేమ గురించి నేర్పించడం
యెహోవా ఏం చెప్పాలనుకుంటున్నాడు? యోబు మరింత వినయాన్ని నేర్చుకోవడం చాలా అవసరం. యెహోవా తనతో న్యాయంగా వ్యవహరించట్లేదని ఫిర్యాదు చేయడం ద్వారా యోబు నిజానికి తన బాధను పెంచుకుంటున్నాడు, తన ప్రేమగల తండ్రి నుండి తననుతాను దూరం చేసుకుంటున్నాడు. కాబట్టి సృష్టిలో ఉన్న ఈ అద్భుతాలన్నీ చేసినప్పుడు యోబు ఎక్కడున్నాడని యెహోవా పదేపదే అడిగాడు. అంతేకాదు తాను సృష్టించిన ప్రాణుల్ని పోషించడం, నియంత్రించడం, లేదా మచ్చిక చేసుకోవడం యోబు వల్ల అవుతుందా అని కూడా యెహోవా అడిగాడు. యెహోవా సృష్టించిన వాటిని నియంత్రించలేని యోబు, సృష్టికర్త ఏం చేయాలో చెప్పే హక్కు తనకుందని ఎలా అనుకోగలడు? ఏం చేయాలో, ఎలా చేయాలో యెహోవాకు తెలిసినంత బాగా యోబుకు తెలుసా?
యోబు యెహోవాతో వాదించలేదు, తనను తాను సమర్థించుకోలేదు, సాకులు చెప్పలేదు
యెహోవా చెప్పిన ప్రతీదాంట్లో ఆయనకు యోబు పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమ కనిపిస్తుంది. ఒకవిధంగా యెహోవా యోబును ఇలా అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, నేను వీటన్నిటినీ సృష్టించి, వీటి బాగోగులు చూసుకోగలిగినప్పుడు నీ బాగోగులు చూసుకోలేనా? నేను నిన్ను నిజంగా వదిలేస్తానా? నీ పిల్లల్ని, నీ ఆస్తిపాస్తుల్ని లాగేసుకుంటానా? నీ ఆరోగ్యాన్ని దూరంచేస్తానా? నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగిచ్చేది, నీ వేదనను తీసేసేది నేనే కదా?’
యోబును ఆలోచింపజేయడానికి యెహోవా వేసిన ప్రశ్నలకు అతను రెండుసార్లు మాత్రమే జవాబిచ్చాడు. అతను వాదించలేదు, తనను తాను సమర్థించుకోలేదు, సాకులు చెప్పలేదు. నిజానికి తనకు తెలిసింది కొంచెమే అని అతను వినయంగా ఒప్పుకున్నాడు, దురుసుగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడ్డాడు. (యోబు 40:4, 5; 42:1-6) ఇక్కడ యోబుకున్న విశ్వాసాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా, యోబుకు యెహోవా మీదున్న విశ్వాసం చెక్కుచెదరలేదు. యెహోవా సరిదిద్దినప్పుడు అతను దాన్ని స్వీకరించి, తన వైఖరిని మార్చుకున్నాడు. కాబట్టి మనం ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మంచిది: ‘ఎవరైనా నన్ను సరిదిద్దినప్పుడు, నాకు సలహా ఇచ్చినప్పుడు, వాటిని స్వీకరించేంత వినయం నాకుందా?’ మనందరికీ అలాంటి సహాయం అవసరం. మనం దాన్ని అంగీకరించడం ద్వారా యోబులాంటి విశ్వాసాన్ని చూపిస్తాం.
“మీరు నా గురించి నిజాలు మాట్లాడలేదు”
యోబు పడుతున్న బాధ నుండి అతనికి ఊరటనివ్వడం మీద యెహోవా ఇప్పుడు మనసుపెట్టాడు. బహుశా ఆ ముగ్గురు స్నేహితుల్లో పెద్దవాడైన ఎలీఫజుతో యెహోవా ఇలా అన్నాడు: “నీ మీద, నీ ఇద్దరు సహచరుల మీద నా కోపం మండుతోంది. ఎందుకంటే, నా సేవకుడైన యోబులా మీరు నా గురించి నిజాలు మాట్లాడలేదు.” (యోబు 42:7) ఒక్కసారి ఆలోచించండి. ఆ ముగ్గురు చెప్పిన ప్రతీ మాట అబద్ధమని, లేదా యోబు చెప్పిన ప్రతీ మాట నిజమని యెహోవా అంటున్నాడా? కాదు. c కానీ యోబుకు, అతన్ని నిందించిన ఆ ముగ్గురికి చాలా తేడా ఉంది. యోబు తీవ్రమైన వేదనలో ఉన్నాడు, వాళ్ల అబద్ధ ఆరోపణల వల్ల బాగా కృంగిపోయి ఉన్నాడు. కాబట్టి అతను కొన్నిసార్లు దురుసుగా మాట్లాడడం అర్థం చేసుకోదగినదే. కానీ ఎలీఫజుకు, అతని ఇద్దరు స్నేహితులకు అలాంటి కష్టాలేవీ లేవు. వాళ్ల విశ్వాసం బలహీనంగా ఉండబట్టే వాళ్లు ఇష్టమొచ్చినట్టు, పొగరుగా మాట్లాడారు. వాళ్లు అమాయకుడైన యోబు మీద నిందలు వేయడమే కాకుండా, అంతకన్నా ఘోరంగా యెహోవాను క్రూరుడిగా, చెడ్డవాడిగా చిత్రీకరించారు!
కాబట్టి యెహోవా ఆ ముగ్గుర్ని ఖరీదైన బలి అర్పించమని చెప్పడం న్యాయమే. వాళ్లు ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను అర్పించాలి. అదంత చిన్న విషయం కాదు. ఎందుకంటే, ఆ తర్వాతి కాలంలో ప్రధాన యాజకుడు జనాంగమంతటి మీదికి అపరాధం తీసుకొచ్చే పాపం ఏదైనా చేస్తే, అతను ఎద్దును అర్పించాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీయకాండం 4:3) ధర్మశాస్త్రం ప్రకారం బలి అర్పించే జంతువులన్నిట్లో అత్యంత ఖరీదైనది ఎద్దే. ఇంకో విషయం ఏంటంటే, యోబు తన మీద నిందలు వేసిన ఆ ముగ్గురు స్నేహితుల తరఫున ప్రార్థన చేస్తేనే యెహోవా వాళ్ల అర్పణను అంగీకరిస్తానని చెప్పాడు. d (యోబు 42:8) యెహోవా తనను నిర్దోషి అని చెప్పడం, ఆయన న్యాయం గెలవడం చూసి యోబుకు ఎంత ఊరటగా అనిపించివుంటుందో కదా!
“నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థిస్తాడు.”—యోబు 42:8
యోబు తనను ఎంతో బాధపెట్టిన ఆ ముగ్గుర్ని క్షమిస్తాడని యెహోవా నమ్మాడు. తన తండ్రి తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని యోబు వమ్ము చేయలేదు. (యోబు 42:9) యోబు మాటలకన్నా అతని విధేయతే అతను యథార్థవంతుడని నిరూపించింది. అంతేకాదు అతను దేవునికి లోబడడం వల్ల గొప్ప ఆశీర్వాదాలు పొందాడు.
“ఎంతో వాత్సల్యం గలవాడు”
యెహోవా యోబు పట్ల ‘ఎంతో వాత్సల్యం, కరుణ’ చూపించాడు. (యాకోబు 5:11) ఎలా? యెహోవా యోబుకు తిరిగి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎలీహు ముందే చెప్పినట్లు, తన శరీరం “పిల్లల శరీరం కన్నా ఆరోగ్యంగా అవ్వడం” చూసి యోబుకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి! చివరికి యోబు కుటుంబ సభ్యులు, స్నేహితులు అతనికి మద్దతిచ్చారు; అతని మీద సానుభూతి చూపిస్తూ బహుమతులు తెచ్చారు. యెహోవా యోబు ఆస్తిని రెట్టింపు చేశాడు. మరి యోబుకు జరిగిన పెద్ద విషాదం, అంటే అతని పిల్లల మరణం సంగతేంటి? యోబు, అతని భార్య మరో పదిమంది పిల్లలకు తల్లిదండ్రులైనప్పుడు కొంతమేర ఓదార్పు పొందారు. అంతేకాదు యెహోవా అద్భుత రీతిలో యోబు ఆయుష్షును పెంచాడు. యోబు మరో 140 సంవత్సరాలు బ్రతికి, తన వంశంలో నాలుగు తరాల్ని చూశాడు. “యోబు సుదీర్ఘమైన, సంతృప్తికరమైన జీవితం గడిపి చనిపోయాడు” అని బైబిలు చెప్తుంది. (యోబు 42:10-17) పరదైసులో యోబు, అతని భార్య తమ కుటుంబ సభ్యుల్ని, సాతాను దాడివల్ల చనిపోయిన తమ పదిమంది పిల్లల్ని తిరిగి కలుసుకుంటారు.—యోహాను 5:28, 29.
యెహోవా యోబును అంత మెండుగా దీవించడానికి కారణమేంటి? బైబిలు ఇలా జవాబిస్తుంది: “మీరు యోబు సహనం గురించి విన్నారు.” (యాకోబు 5:11) మనలో చాలామందిమి కనీసం ఊహించలేని ఎన్నో కష్టాల్ని యోబు సహించాడు. యోబు కేవలం ఆ కష్టాల్ని గట్టెక్కడమే కాదుగానీ యెహోవా మీద విశ్వాసంతో, ప్రేమతో వాటిని సహించాడు. తెలిసే తనను బాధపెట్టిన ఆ ముగ్గురు స్నేహితుల మీద కోపం పెంచుకుని, తన మనసును కఠినం చేసుకునే బదులు యోబు వాళ్లను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు అతను తన అమూల్యమైన నిరీక్షణను, తను ఎంతో విలువైనదిగా చూసుకున్న యథార్థతను ఎప్పుడూ విడిచిపెట్టలేదు.—యోబు 27:5.
మనలో ప్రతీఒక్కరం సహనం చూపించాలి. యోబు విషయంలో చేసినట్టే, సాతాను మనల్ని కూడా నిరుత్సాహపర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. కానీ మనం విశ్వాసంతో సహిస్తే, వినయంగా ఉంటే, ఇతరుల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటే, మన యథార్థతను కాపాడుకోవాలని నిశ్చయించుకుంటే మనం కూడా అమూల్యమైన నిరీక్షణను అంటిపెట్టుకుని ఉండవచ్చు. (హెబ్రీయులు 10:36) మనం యోబులా విశ్వాసం చూపిస్తే సాతానుకు చాలా కోపం వస్తుంది, కానీ మనల్ని ప్రేమించే యెహోవాకు ఎంతో సంతోషం కలుగుతుంది!
a ఎలీఫజు, బిల్దదు, జోఫరులు యోబుతో చాలాసేపు మాట్లాడారు. వాళ్ల మాటలన్నీ రాయడానికి బైబిల్లో దాదాపు తొమ్మిది అధ్యాయాలు అవసరమయ్యాయి. అయినప్పటికీ వాళ్లు ఒక్కసారి కూడా యోబు పేరును ఉపయోగించినట్టు బైబిల్లో లేదు.
b యెహోవా యోబుతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాల్ని అక్షరార్థంగా వివరించాడు, ఇంకొన్ని విషయాల్ని కావ్యరూపంలో వివరించాడు. ఆయన ఒక పద్ధతి నుండి ఇంకో పద్ధతికి మారడం మనం అంత త్వరగా గుర్తించలేకపోవచ్చు. (ఉదాహరణకు, యోబు 41:1, 7, 8, 19-21 చూడండి.) యెహోవా ఏ పద్ధతిని ఉపయోగించినా ఆయన ఉద్దేశం మాత్రం, యోబుకు సృష్టికర్త మీద భక్తిపూర్వక భయం కలిగించాలన్నదే.
c నిజానికి, ఆ తర్వాతి కాలంలో అపొస్తలుడైన పౌలు ఎలీఫజు చెప్పిన ఒక మాటను ఎత్తిరాశాడు, అది సత్యమని చెప్పాడు. (యోబు 5:13; 1 కొరింథీయులు 3:19) ఎలీఫజు చెప్పింది సత్యమే కానీ అతను దాన్ని యోబుకు తప్పుగా అన్వయించాడు.
d యోబు తన భార్య కోసం అలాంటి అర్పణ అర్పించాలని యెహోవా చెప్పినట్లు బైబిల్లో లేదు.